ఆంధ్రప్రదేశ్‌

కొరవడిన మహా జోష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 29: తిరుపతి మహానాడు మూడు రోజుల ముచ్చట ఆదివారంతో ముగిసింది. యథావిధిగా చంద్రబాబునాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని.. దానిని మరో మార్గం పట్టించేందుకు జగన్ అవినీతిని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. టిడిపి ఎమ్మెల్యేలు, నేతల అవినీతిపై ఇటీవలి కాలంలో సొంత మీడియాలోనూ వ్యతిరేక కథనాలు రాగా, అంతకుముందు జగన్ మీడియాలో అమరావతి భూ అక్రమాలపై వెలువడిన కథనాలు టిడిపిని ఆందోళన పరిచాయి. ఇటీవలి కాలంలో జగన్, ఆయన పార్టీ నేతలు, ఆయనకు చెందిన మీడియా సంస్థలు తమ పార్టీపై చేస్తున్న అవినీతి ఆరోపణలను, దీటుగా తిప్పికొట్టడంలో విఫలమవుతున్న టిడిపి నేతల వౌనాన్ని నాయకత్వం గ్రహించింది. తమ పార్టీ నేతల వౌనం వల్ల అవినీతి ఆరోపణలు, ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉందని గ్రహించిన టిడిపి నాయకత్వం..ఈ మహానాడులో జగన్ అవినీతిని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘మన పార్టీ మీద జగన్ పార్టీ వాళ్లు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు కింది స్థాయి నుంచి తిప్పికొట్టకపోతే ప్రజలు అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంది. దానివల్ల పార్టీకి నష్టం వస్తుందని’ బాబు పదే పదే చెప్పడం బట్టి.. జగన్ చేస్తున్న అవినీతి ఆరోపణలతోపాటు, దానిని తిప్పికొట్టడంలో నేతల వైఫల్యంపై టిడిపి నాయకత్వం ఏ స్థాయిలో ఆందోళనతో ఉందో స్పష్టమవుతోంది. అటు లోకేష్ కూడా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించడం గమనార్హం. తాను జగన్ మాదిరిగా తన తండ్రికి చెడ్డపేరు తీసుకురానని, తాను పుట్టినప్పుడే తన తాత సీఎం అన్నారు. తనపై చేసిన ఆరోపణలు రుజువుచేస్తే తానే జైలుకు వెళతానని సవాల్ చేశారు. తమకు దొంగ పేపర్, దొంగ చానెల్ లేవన్నారు. జగన్ తన తండ్రిని, పార్టీని ఇబ్బందిపెట్టేందుకు టీఆర్‌ఎస్‌తో కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అటు మంత్రి యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్ వంటి ప్రముఖులంతా జగన్ అవినీతినే ఎక్కువగా ప్రస్తావించడం గమనార్హం. జగన్ మీద ప్రస్తుతం జరుగుతున్న ఎదురు దాడిపై నాయకత్వం సంతృప్తితో లేదన్న విషయం అధినేత ప్రసంగంతో స్పష్టంగా కనిపించింది.
తెలంగాణలో పార్టీ బలపడాలని, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాలని చెప్పిన చంద్రబాబు, టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కేసీఆర్‌ను పల్లెత్తు విమర్శ చేయకపోవడం విస్మయపరిచింది. శ్రేణులను యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చిన బాబు, కనీసం కేసీఆర్ ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం గమనార్హం. అదే సమయంలో తనను విమర్శిస్తున్న జగన్‌ను దునుమాడిన బాబు, అంతకంటే ఎక్కువ విమర్శలు చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రముఖులపై ఎదురుదాడి చేయకపోవడం తెలంగాణ నేతలను నిరాశకు గురిచేసింది.
ఇక అన్నగారి పేరు తెరమరుగు అవుతుందన్న విమర్శల నేపథ్యంలో, అమరావతిలో 115 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేస్తామన్నారు. అటకెక్కిన అన్న క్యాంటీన్లను ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. మూడురోజుల పాటు వరసగా అన్న నామ స్మరణ వినిపించారు. అయితే ప్రత్యేక హోదాపై మహానాడు మహా మొహమాటం ప్రదర్శించినట్లు స్పష్టంగా కనిపించింది. బిజెపి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు, తిరుగుబాటు హెచ్చరికలేవీ లేకుండా బంతిపూలతో కొట్టింది. బాబు,లోకేష్ మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చి కేంద్రం తన మాట నిలబెట్టుకోవాలని కోరగా, బుచ్చయ్య చౌదరి, అరికెల నర్సారెడ్డి వంటి నేతలు మాత్రం బిజెపిని నిందిస్తూ ప్రసంగించారు.
చాలా అంశాలపై స్పష్టత ఇవ్వని నాయకత్వం..మరో 40 ఏళ్లు తమ పార్టీనే అధికారంలో ఏవిధంగా కొనసాగాలన్న అంశంపై మాత్రం స్పష్టత ఇచ్చింది. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, స్థానిక సంస్థల నుంచి ఎలాంటి ఎన్నికల్లోనయినా మనమే గెలవాలని, ఇకపై ఏ ఎన్నికల్లో కూడా ఓడిపోకూడదని స్వయంగాబాబు పిలుపునిచ్చారు. తమిళనాడు, ఒడిషా, పశ్చిమ బెంగాల్, గుజరాత్ మాదిరిగా ఏపిలో కూడా మనమే గెలుస్తుండాలని స్పష్టం చేశారు.
అదే సమయంలో కాపులను దరిచేర్చుకునేలా నాయకుల ప్రసంగాలు సాగాయి. కాపుల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారని, కాపులకు తమ పార్టీనే న్యాయం చేసిందని చెప్పే ప్రయత్నం చేశారు. కాపులంతా పార్టీకి ఆకర్షితులయ్యేలా చూడాలన్న సందేశం వినిపించింది. వేదికపై కాపు నేతలయిన మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును ప్రత్యేకంగా పిలిపించి మరీ చర్చించారు.
టిడిపి నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అమరావతి నిర్మాణంపై జరిగిన చర్చ ప్రచారంలా కనిపించింది. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా నమ్మకంతోనే నిర్మిస్తున్నామని, రైతులు కూడా తనపై నమ్మకంతోనే భూములు ఇచ్చారని, జగన్ చివరకు దానిని కూడా అడ్డుకుంటున్నారని బాబు పదేపదే చెప్పారు. సింగపూర్ కంపెనీ కూడా తనపై నమ్మకంతో డిజైన్ చేసిందన్నారు.
ఇదిలాఉండగా, గత రెండేళ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్న వారికి ఏమి చేస్తామన్న అంశాన్ని చెప్పడంలో మహానాడు విఫలమయింది. ఆ అంశంలో బాబు నుంచి స్పష్టత కొరవడింది. కార్యకర్తలకు న్యాయం చేస్తాం. వారు నా కుటుంబసభ్యుల కంటే ఎక్కువ అని చెప్పడమే తప్ప, నిర్దిష్టంగా ఎప్పుడు పదవులిస్తామని చెప్పకపోవడం అంత దూరం నుంచి వచ్చిన కార్యకర్తలను నిరాశ పరిచింది.
అదే సమయంలో కొత్తగా వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేలు, అప్పటివరకూ ఆయా నియోజకవర్గాల్లో ఇన్చార్జులుగా కొనసాగుతున్న సీనియర్ల మధ్య జరుగుతున్న ఘర్షణలకు తెరదించే ప్రయత్నం కనిపించలేదు. ఎవరి అధికారాలు, బాధ్యతలేమిటన్నదానిపై అధినేత స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాలకు అసంతృప్తి మిగిలింది. దీనిపై అటు వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేలు కూడా పెదవి విరిచారు. ‘ఇక్కడ దానిపై క్లారిటీ ఇస్తారనుకుంటే అదేమీ జరగలేదు. మరి ఈసమస్యకు ఎలా తెరదించుతారో అర్ధంకావడం లేద’ని వాపోయారు.
మూడురోజుల పాటు జరిగిన మహానాడు ఆశించిన స్థాయిలో కార్యకర్తలకు స్ఫూర్తి ఇవ్వలేకపోయింది. బాబు ఈ మూడురోజుల సమావేశంలో చెప్పిన అంశాలనే పదేపదే పునరుక్తం చేయడం కార్యకర్తలకు విసుగుతెప్పించింది. రేవంత్‌రెడ్డి పేరు ప్రస్తావించిన సందర్భంలోనే ఈలలు వినిపించాయి. వక్తల రొటీన్ ప్రసంగాలు బోరు కొట్టించాయి. రేవంత్ ప్రసంగం ఉత్సాహం ఇవ్వగా, లోకేష్ కొద్దిసేపు మాట్లాడినా, జగన్‌పై సవాళ్లతో సభను వేడెక్కించారు. తెలంగాణ టిడిపి నేతలయిన మోత్కుపల్లి, అమర్‌నాధ్‌బాబు, శోభారాణి, అరవిందకుమార్ గౌడ్, వీరేందర్ గౌడ్ ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.
రాజకీయ తీర్మానం ఈసారి చప్పగా కనిపించింది. ప్రధానంగా ప్రత్యేక హోదాపై ప్రభుత్వ, పార్టీ పరంగా ఏమి చేస్తామో చెప్పలేకపోయింది. దానిపై మొహమాటం ప్రదర్శించింది. జాతీయ స్ధాయిలో తన భవిష్యత్తు ప్రణాళికలేమిటో, కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై పార్టీ విధానంపైనా స్పష్టత కనిపించలేదు.

chitram....
మహానాడు ముగింపు రోజైన ఆదివారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేస్తున్న చంద్రబాబు

మార్తి సుబ్రహ్మణ్యం