ఆంధ్రప్రదేశ్‌

పులివెందుల వైకాపా బాధ్యతలు వివేకాకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 25: కడప జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా తన బాబాయ్ వైఎస్.వివేకానందరెడ్డికి పులివెందుల నియోజకవర్గం బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ పటిష్టతకు తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంథా అవలంభించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసినా, శాసనసభకు వెళ్లినా తన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డికే జిల్లా, తన సొంత ఇలాఖా పులివెందుల బాధ్యతలు అప్పగించేవారు. వివేకానందరెడ్డి సైతం ఆ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని పార్టీ, జిల్లాలో ఎక్కడా వివాదాలు తలెత్తకుండా పులివెందులలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తానే సర్వంగా వైఎస్ రాజశేఖరరెడ్టికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. అయితే వైఎస్ హఠాన్మరణం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్ తన బాబాయ్ వివేకాకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకుండా అన్నివ్యవహారూ సొంతంగా చూసుకునేవారు. ఇదిలా ఉండగా జిల్లాలో బలం పెంచుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నాలు చేపట్టారు. వైకాపా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టిడిపిలో చేరడంతో పాటు చిన్నాచితన నేతలను సైకిలెక్కిస్తున్నారు. నాలుగురోజుల క్రితం వైఎస్ కుటుంబం కంచుకోట అయిన పులివెందులలో 30 వైకాపా కుటుంబాలను టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ పరిణామం వివేకాను తీవ్రంగా కలచివేసింది. తమ కుటుంబం కంచుకోట అయిన పులివెందులను పదిలం చేసుకోవడానికి మూడురోజుల క్రితం ఆయన వైసిపి కార్యకర్తల ర్యాలీకి నడుం బిగించారు. దివంగత నేత వైఎస్ అనుసరించిన పంథాలో బాబాయ్‌కు పులివెందుల బాధ్యతలు అప్పగిస్తే బాబాయ్‌కి ఉన్న సుధీర్ఘ రాజకీయ అనుభవం పార్టీకి కలిసొస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. తన తాత రాజారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సోమ, మంగళవారం పులివెందులలో జరిగిన కార్యక్రమాల్లో బాబాయ్‌ని వెంటబెట్టుకుని తిరగడం సరికొత్త పరిణామమని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. జిల్లాలో వైసిపిని పటిష్టం చేయడంతో పాటు, పులివెందులలో తమ కుటుంబానికి ప్రజల ఆదరణ తగ్గకుండా ఉండేందుకు వివేకాకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వివేకా 30 ఏళ్ల రాజకీయ అనుభవం పార్టీకి బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు.