తెలంగాణ

నల్లగొండ నుంచే కెసిఆర్‌ను గద్దె దించే పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 25: మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి శ్రీకాంత్‌చారి, వేణుగోపాల్‌రెడ్డిల బలిదానాలతో ఊపిరులూదిన నల్లగొండ గడ్డ నుండే సిఎం కెసిఆర్‌ను గద్దె దించే పోరాటాన్ని మినీ మహానాడు వేదికగా ఆరంభించామని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో జరిగిన టిడిపి జిల్లా మినీ మహానాడు సభలో ఆయన ఆవేశంగా ప్రసంగిస్తూ కెసిఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ద్రోహుల పార్టీగా టిడిపిను తిడుతూ అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ఇప్పుడు అదే టిడిపి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను టిడిపిలోకి చేర్చుకుని నిజమైన తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా ఇప్పటిదాకా 2 లక్షల 15 వేల కోట్ల బడ్జెట్ ఖర్చయిందని కెసిఆర్ చెప్పగా గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడా కూడా రెండు మూడు కోట్ల అభివృద్ధి పనులు కూడా జరగలేదన్నారు. అలాంటప్పుడు ఆ డబ్బంతా ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. టిడిపి ఎమ్మెల్యేలను కొనుక్కొని మంత్రులను చేసిన కెసిఆర్ 14 ఏళ్ల టిఆర్‌ఎస్ పార్టీలో ఒక్క మంత్రి స్థాయి పరిపాలన సామర్థ్యం ఉన్న నాయకుడిని తయారు చేయలేని సన్నాసిగా మారాడన్నారు. అదే టిడిపి పార్టీ 20 ఏళ్లకే మోత్కుపల్లి మొదలుకుని ఈరోజు కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లలో ఉన్న మంత్రులు, మాజీ మంత్రులెందరితో పాటు బడిపంతులు నుండి రోజు కూలీ దాకా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా తయారు చేసిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోటి ఏకరాలకు సాగునీరంటూ ప్రజలను కెసిఆర్ మోసగిస్తున్నారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు బీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, ఎఎల్‌బిసి వంటి వాటన్నింటినీ పూర్తి చేస్తే వాటి కింద నిర్ధేశించిన 80 లక్షల ఎకరాల ఆయకట్టు నీరందుతున్నారు. అలాంటప్పుడు లక్షన్నర కోట్లతో కెసిఆర్ చేపట్టిన కొత్త ప్రాజెక్టులతో కోటి ఎకరాలకు సాగునీరందిస్తానంటూ తప్పుడు లెక్కలతో లక్షల కోట్లు దోచుకునే పనిలో ఉన్నారన్నారు. శాసన సభలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1200మంది అమరులయ్యారని చెప్పిన కెసిఆర్ వారి కుటుంబాలకు పరిహారం, ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం వారి అడ్రస్‌లు దొరకడం లేదంటూ తన వంకర బుద్ధిని చాటుకున్నారన్నారు. సమగ్ర కుటుంబ సర్వేతో 12 గంటల్లో 4 కోట్ల మంది ప్రజల చిట్టా తన చేతుల్లో ఉందన్న కెసిఆర్‌కు 1200 మంది అమరుల అడ్రస్‌లు దొరకకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ప్రచురించిన అమరుల పుస్తకంలో వారి వివరాలున్నాయని చూసుకుని రాష్ట్ర సాధనకు బలిదానం చేసిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. కాగా, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, జిల్లా పార్టీ ఇన్‌చార్జి రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పార్టీగా నిలబడిన టిడిపి అవసరం ఇప్పుడు తెలంగాణకు ఎంతో అవసరమన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ధైర్యంగా పోరాడి రాబోయే తరాలకు పార్టీని అందించేందుకు అంతా కృషి చేయాలన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నరసింహులు, ఎ.ఉమామాధవరెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ రెండేళ్ల పరిపాలనను ప్రజలు గమనించి టిఆర్‌ఎస్ భ్రమల నుండి దూరం జరుగుతున్నారన్నారు. పార్టీలో అంతా ఐక్యంగా కలిసి పనిచేసి జిల్లాలో పార్టీని పూర్వవైభవం దిశగా తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు కె.బిల్యానాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు బొల్లం మల్లయ్య యా దవ్, చిలువేరు కాశినాథ్, వంగాల స్వామిగౌడ్, బండ్రు శోభారాణి, పటేల్ రమేష్‌రెడ్డి, కడారి అంజయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, జక్కుల ఐలయ్య, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, పాల్వాయి రజని, ఎన్. దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.

నల్లగొండ టిడిపి మినీ మహానాడులో ప్రసంగిస్తున్న రేవంత్‌రెడ్డి