ఆంధ్రప్రదేశ్‌

మహానాడులో బయోమెట్రిక్ ప్రవేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 24: తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందే తరుణంలో తిరుపతిలో నిర్వహిస్తున్న మహానాడుకు విచ్చేసే కార్యకర్తలు, నాయకులకు హైటెక్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. మరో 48 గంటల్లో (శుక్రవారం నుంచి) తిరుపతిలోని నెహ్రూమున్సిపల్ హె స్కూల్ క్రీడామైదానంలో ప్రారంభం కానున్న మహానాడుకు ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి. బుధవారం నాటికి ఏర్పాట్లు పూర్తయ్యేలా నాయకులు పనులు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 కమిటీలతో సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించి పనులు చేయిస్తున్నారు. ప్రాంగణంలో జరుగుతున్న పనులపై పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ అవసరమైన సూచనలు ఇస్తోంది. ప్రాంగణంలో జరిగే ప్రతి పని పార్టీ హైకమాండ్ కనుసన్నల్లోనే జరుగుతోంది. మహానాడు పనులను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ జనార్దనరాజు భోజన, వసతి ఇతర ఏర్పాట్లకు సంబంధించిన కమిటీలతో సుదీర్ఘంగా సమీక్షించారు. వసతి, పరిశుభ్రతకు సంబంధించి ఔట్ సోర్సింగ్‌లో ఉన్న కార్మికులను తీసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మహానాడుకు వచ్చే కార్యకర్తలు విధిగా తమ వెంట పార్టీ సభ్యత్వ కార్డును తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ప్రాంగణంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే ఏర్పాటు చేశామన్నారు. ప్రవేశ మార్గం వద్దనే కార్యకర్తలను బయోమెట్రిక్ సిస్టం ద్వారానే అనుమతిస్తామన్నారు. తిరిగి వారు వెలుపలికి వెళ్ళేటప్పుడు కూడా అదే విధానంతోనే బయటకు వెళ్ళాల్సి వుంటుందన్నారు. భోజన సౌకర్యాల కమిటీ చైర్మన్ గల్లా అరుణకుమారి మాట్లాడుతూ 27 రకాల వంటకాలను మహానాడుకు వచ్చే ప్రతినిధులకు అందించనున్నామన్నారు. ఇందులో ఒక రోజు రాయలసీమ, మరొక రోజు కోస్తా, ఇంకోరోజు సర్కార్ ప్రాంతాలకు చెందిన శాఖాహార వంటకాలను అందించనున్నామని తెలిపారు. నిరంతరం మంచినీళ్ళు, మజ్జిగను కొరత లేకుండా అందిస్తామని చెప్పారు. ఇప్పటికే మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర డిజిపి జె.వి.రాముడుతో పాటు రాయలసీమ డిఐజి ప్రభాకరరావు, చిత్తూరు, తిరుపతి ఎస్పీలు శ్రీనివాస్, జయలక్ష్మి తమ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి మూడు రోజులపాటు తిరుపతిలో బసచేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో మహానాడు ప్రాంగణంలో 40 పడకలతో రక్తదాన శిబిరానికి సంబందించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. అనుకోని విధంగా వర్షం కురిసినా దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా సుమారు 30వేల మంది మహానాడుకు హాజరవుతారని అంచనేవేస్తున్న సమయంలో వారికి వసతి కొరత లేకుండా తిరుపతిలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోని హోటళ్ళలోని గదులను టిడిపి నేతలు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యులకు ప్రధా న హోటళ్లలోని గదులను రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. మహానాడు జరుగుతున్న సమయంలో సిఎం చంద్రబాబు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నా మహానాడు ప్రాంగణంలోనే ఓ గదిని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని నాయకులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

తెలుగు భాషా
సాంస్కృతిక సమ్మేళనం
31న విజయవాడలో నిర్వహణకు ఏర్పాట్లు
నారా లోకేష్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: విజయవాడ సాహితీ సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్టు సౌజన్యంతో మే 31న తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం జరుగుతుందని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మంటపంలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ ఈ సమ్మేళనం జరుగుతుందని, తెలుగుభాష- సంస్కృతుల పరిరక్షణ, తెలుగులోనే పరిపాలన, తెలుగు బోధన, సంగీతం, నృత్యం, చిత్రకళ , శిల్పకళ ఇంకా ఇతర తెలుగు వారి సంప్రదాయక కళారీతులను నిలుపుకుంటూ వస్తున్న కళాకారులకు ప్రోత్సాహం, పరిశోధనలకు గుర్తింపు, ఆయా కళల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి, లోపాలను సవరించుకుని తీసుకోదగిన మెరుగైన చర్యల గురించి ఈ సమ్మేళనంలో విస్తృతంగా చర్చించనున్నారు. వివిధ కళారంగాలకు భాషా సాహిత్య విద్యారంగాలకు చెందిన వారి అభిప్రాయాలను క్రోడీకరించి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సాంస్కృతిక విధాన పత్రాన్ని వినతి రూపంలో అందించనున్నారు. ప్రభుత్వమూ, వివిధ ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు వ్యక్తులుగా తాము ఏం చేయాలో విస్తృతంగా చర్చించడం కోసం ఈ సమ్మేళనం ఏర్పాటు చేశామని అన్నారు. తెలుగు భాషకు ఎంతో సేవ చేస్తున్న మండలి బుద్ధప్రసాద్ షష్టిపూర్తి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు లోకేష్ చెప్పారు. ఇందుకోసం గుత్తికొండ సుబ్బారావు, గోళ్ల నారాయణరావు, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ పెద్ది రామారావు, విష్ణువర్ధన్, డాక్టర్ జి వి పూర్ణచంద్‌లతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
విద్యుత్ చౌర్య
నియంత్రణకు చర్యలు
విద్యుత్ సబ్సిడీ రూ. 3000 కోట్లు
రూ.125లకే కొత్త విద్యుత్ మీటర్
ఇంధన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: రాష్ట్రంలో విద్యుత్ చౌర్యాన్ని నిలువరించేందుకు ప్రణాళిక ఖరారు చేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. గత రెండేళ్లలో విద్యుత్ చౌర్యం వల్ల రూ. 50 కోట్ల నష్టం వచ్చిందన్నారు. విద్యుత్ శాఖలో విజిలెన్స్ విభాగం ఆకస్మిక తనిఖీలు చేసి విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మంగళవారం ఆయన విద్యుత్ పరిస్థితిని సమీక్షించారు. ప్రతి జిల్లాలో విద్యుత్ చౌర్య నిరోధక విభాగాన్ని, విద్యుత్ చౌర్య నిరోధక పోలీసు స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో డిస్కంలు వినియోగదారులకు అనుకూలంగా మెలగాలని కోరారు. సర్వీసు కనెక్షన్లను పెంచడంలో భాగంగా కొత్త మీటర్లను రూ. 125కు ఒకటి చొప్పున అమర్చనున్నట్లు చెప్పారు. విద్యుత్ ఆడిట్‌ను నిర్వహించాలన్నారు. విద్యుత్ నష్టాల తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సబ్సిడీ కింద రూ. 3000 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు 50 యూనిట్ల వరకు అయ్యే చార్జీలను ప్రభుత్వం భరిస్తోందన్నారు. దీని వ్యయం రూ. 80 కోట్ల రూపాయలని, సబ్సిడీగా ప్రభుత్వం ఈ ఖర్చును భరిస్తోందన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్, ఏపిఇపిడిసిఎల్ సిఎండి ఆర్ ముత్యాలరాజు, ఏపిఎస్‌పిడిసిఎల్ సిఎండి హెచ్‌వై దొర, విజిలెన్స్ సెక్యూరిటీ జెఎండి ఉమాపతి పాల్గొన్నారు.