ఆంధ్రప్రదేశ్‌

బాబులో మార్పు రాకపోతే గోదావరిపైనా దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 18: కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో మార్పుకోసం రెండు నెలలు వేచిచూస్తానని, అప్పటికీ ఆయన తీరు అలాగే ఉంటే గోదావరి నదీ జలాలకోసం జలదీక్ష చేస్తానని వైకాపా అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు, వాటిని అడ్డుకోలేకపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుకు నిరసనగా కర్నూలులో జగన్ చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్షను బుధవారం విరమించారు. రైతుల చేతుల మీదుగా నిమ్మరసం స్వీకరించిన జగన్ తన దీక్షను విరమించి ప్రసంగించారు. గతంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తే అడ్డుకోలేకపోయిన చంద్రబాబు తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై కూడా అదే వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, కేసుల భయంతోనే ప్రజల డిమాండ్లపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించడం లేదని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే ఉంటే గోదావరి జలాలకోసం జలదీక్ష చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై తాను జలదీక్ష చేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేపట్టిన ప్రాజెక్టులకు ఏ అనుమతులు ఉన్నాయో తేల్చి చెప్పాలని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా, అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తే వౌనంగా చూస్తూ ఊరుకోవడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కృష్ణా, గోదావరి నదులపై ఎగువన కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువన, చివర ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం కావాలని జగన్ ప్రశ్నించారు. మీ అక్రమాలను ప్రశ్నిస్తే బెదిరింపు ధోరణిలో మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగాన్ని కేంద్రం నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయా రాష్ట్రాలు వినియోగించుకున్న నీరు, కేటాయించిన నీరు తదితర వివరాలు తెలుసుకుంటూ తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో జలాలకోసం ఎగువ, దిగువ రాష్ట్రాల మధ్య జలయుద్ధాలు నెలకొని శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని జగన్ హెచ్చరించారు.