ఆంధ్రప్రదేశ్‌

భూ అక్రమాలు బయటపెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఏప్రిల్ 26: నూతన రాజధాని అమరావతి భూ సేకరణలో జరిగిన అక్రమాలను త్వరలో బహిర్గతం చేస్తామని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా మడకశిరలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో రైతుల నుండి భూములు తీసుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను ఏమాత్రం పరిష్కరించలేదన్నారు. దీంతో అక్కడి రైతులు కాంగ్రెస్ నేతలను కలసి కన్నీరుమున్నీరవుతున్నారన్నారు. రాజధాని భూసేకరణలో జరిగిన అక్రమాలపై అన్ని విషయాలను త్వరలోనే బహిర్గతం చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి బలహీనతలను అడ్డం పెట్టుకుని కొంతమంది వ్యాపారం చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని, త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారన్నారు. ప్రత్యేక హోదా సహా, విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలన్నారు. నూతన రాజధానిలో జరుగుతున్న అవకతవకలు, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, కరవు నివారణ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అక్రమ ప్రాజెక్ట్‌లపై చర్చించి రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపిలు చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపారు. నమ్మిన వ్యక్తుల చేతులను నరికివేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటేనన్నారు. ఇందులో భాగంగానే పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అమలు చేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేర్లు మార్చారన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పథకం అని పేరుపెట్టి దానికి నిధులు కేటాయించకపోవడంతో ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపివేశాయన్నారు.

సొంత గ్రామంలోనే రైతులకు ప్లాట్లు
సిఆర్‌డిఏ భేటిలో సిఎం చంద్రబాబు

విజయవాడ, ఏప్రిల్ 26: భూసమీకరణలో భాగంగా రైతులకు త్వరలో ప్లాట్లు ఇవ్వనున్న ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యాపిటల్ రీజియన్ డవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఏ) అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమావేశమయ్యారు. మెట్ట భూములు ఇచ్చిన వారికి మెట్ట భూములు, జరీబు భూములు ఇచ్చిన వారికి జరీబు భూములనే కేటాయించనుంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అదనంగా మరో 50 గజాల చొప్పున వాణిజ్య స్థలాన్ని ఇస్తూ కేటాయింపులు జరపాలని సిఆర్‌డిఏ అధికారులను సిఎం ఆదేశించారు. రైతులకు ఇచ్చే లే అవుట్లలోని నివాస సముదాయంలో ప్లాట్ల విస్తీర్ణం కనీసం 120 చదరపు గజాలు, అదే వాణిజ్య అవసరాల కోసం వేసే ప్లాట్ల విస్తీర్ణం 30 చదరపు గజాలుగా నిర్ణయించారు. భూ యజమానికి దక్కాల్సిన ప్లాట్ కనీసం విస్తీర్ణం కన్నా తక్కువగాను, నిర్దేశిత విస్తీర్ణం కన్నా ఎక్కువగా ఉంటే, అలాంటి వారికి ఉమ్మడిగా ప్లాట్‌ను కేటాయించాలని సిఎం ఆదేశించారు. దీనిని వేలసుం వేసి వచ్చే మొత్తాన్ని దామాషా పద్ధతిలో తమకు వాటాలు పంపించాల్సిందిగా సిఆర్‌డిఏను భూ యజమానులు కోరవచ్చని సిఎం చెప్పారు. ఒకవేళ ఉమ్మడి ప్లాట్ వద్దనుకుంటే అభివృద్ధి హక్కు కలిగి, అమ్ముకునే వీలుండే (టిడిఆర్) బాండ్లు తీసుకోవచ్చని అన్నారు.

మహిళపై ఎమ్మార్పీఎస్ నేత దాడి
పోలీస్ స్టేషన్ ముట్టడి* చాగలమర్రిలో ఉద్రిక్తత
చాగలమర్రి, ఏప్రిల్ 26: కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఓ ముస్లిం మహిళపై ఎమ్మార్పీఎస్ నాయకుడు దాడి చేయటంతో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాకీ డబ్బులు అడిగేందుకు వెళ్లిన మహబూబ్‌బీ అనే మహిళను ఎమ్మార్పీఎస్ నాయకుడు గజ్జల బాలయ్య, అతని వర్గీయులు రోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. విషయం తెలుసుకున్న ముస్లిం నేతలు ఆగ్రహంతో రగిలిపోయి, కలసికట్టుగా వెళ్లి పోలీసు స్టేషన్ ముట్టడించారు. సుమారు మూడు గంటల పాటు ముస్లింలు ఆందోళనకు దిగటంతో చాగలమర్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసు స్టేషన్ వద్ద ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తూ బాలయ్యను ప్రజల సమక్షంలో పోలీసులు కొట్టాలని లేకుంటే తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతలో రోడ్డుపై కనబడ్డ బాలయ్యను చితకబాదటంతో, పోలీసులు వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. 31 వేల రూపాయల బాకీ డబ్బులు ఇంటివద్దకు వెళ్లి అడిగినందుకు బాలయ్య, అతని భార్య లక్ష్మీదేవి, మరికొందరు స్థానికులు కలిసి తనను రోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకు వచ్చినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆళ్ళగడ్డ డిఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, సిఐ ఓబులేసులు హుటాహుటిన చాగలమర్రి చేరుకుని, ముస్లిం పెద్దలతో చర్చించారు. బాలయ్యపై రౌడీషీట్ ఓపెన్ చేయిస్తామని, గ్రామం నుంచి ఖాళీ చేయిస్తామని డిఎస్పీ హామీనిచ్చారు. ఆందోళన చేస్తున్న ముస్లింలు దీనికి అంగీకరించకపోవడంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని, మహిళకు న్యాయం చేస్తానని చెప్పినప్పటికీ ముస్లింలు ఆందోళన విరమించలేదు. దీంతో అదనపు పోలీసు బలగాలను రప్పించారు.

28న టిడిపిలోకి శ్రీశైలం ఎమ్మెల్యే
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఏప్రిల్ 26: కర్నూలు జిల్లా శ్రీశైలం వైకాపా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఈ నెల 28న టిడిపిలో చేరనున్నట్లు ఆయన వర్గీయుల ద్వారా తెలుస్తోంది. ఆ రోజు ముందుగా చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం లాంఛనంగా కండువాలు కప్పి చంద్రబాబు పార్టీలో ఆహ్వానించనున్నట్టు సమాచారం. బుడ్డాతో పాటు ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు కూడా టిడిపిలో చేరనున్నట్టు తెలిసింది. కాగా బడ్డా రాజశేఖరరెడ్డితో మాట్లాడేందుకు జగన్ విముఖత ప్రదర్శించినట్టు వైకాపా నేతల ద్వారా తెలుస్తోంది.

వైసిపి నుంచి మరో
17 మంది: జలీల్‌ఖాన్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 26: వైఎస్సార్సీ నుంచి మరో 17 మంది శాసనసభ్యులు నేడో రేపో టిడిపిలోకి రావడం ఖాయమని విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు జలీల్‌ఖాన్ స్పష్టం చేశారు. జగన్ వెంట ఢిల్లీ యాత్రలో ఉన్న వారిలో కూడా కొందరు రాబోతున్నారన్నారు. ఇప్పుడే తాను వారి పేర్లు వెల్లడిస్తే వారిని అక్కడ నిర్బంధించవచ్చన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని మీడియా పాయింట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జగన్ వ్యవహార శైలి, పనితీరు నచ్చకే వీడి వెళుతుంటే చంద్రబాబు నుంచి రూ. 30 కోట్లు బ్లాక్ మనీ తీసుకుంటున్నారంటూ ఆరోపణలు చేయటం తగదన్నారు. గడచిన రెండేళ్లలో ఏ ఒక్క ప్రజా సమస్యపై కూడా జగన్ పోరాడలేదన్నారు. ప్రిన్సిపాల్ సరిగా లేకపోతే ఆ విద్యా సంస్థలో బోధన ఎలా ఉంటుందో జగన్ పార్టీ పరిస్ధితి కూడా అలానే ఉందన్నారు.

కొత్త సచివాలయంలో సిఎం బిజీబిజీ

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 26: అమరావతిలో రాజధాని లేకపోయినా, చెట్ల కింద కూర్చుని పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్ళవుతున్నా, శాశ్వత పాలనా భవనాలు లేవు. విజయవాడలోని ఆయా భవనాలను కార్యాలయాలుగా మార్చుకుని చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలైనా నిర్మించి పాలన సాగించాలన్న ఆయన పట్టుదలకు ఎట్టకేలకు అంకురార్పణ జరిగింది. గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాన్ని సోమవారం సిఎం ప్రారంభించారు. తొలి రోజు సుమారు రెండు గంటల పాటు కార్యాలయ ప్రాంగణంలో గడిపిన చంద్రబాబు రెండో రోజైన మంగళవారం కూడా సచివాలయానికి వెళ్లి సుమారు గంట సేపు గడిపారు. తన ఛాంబర్‌లో జైకా ప్రతినిధులతో భేటీ అయ్యారు. మెట్రో రైలుప్రాజెక్ట్‌కు సంబంధించి వివరాలను సిఎం అడిగి తెలుసుకున్నారు. మొట్టమొదటి సమీక్షా సమావేశం ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనైనా జూన్ నాటికి సెక్రటేరియట్ భవనాన్ని పూర్తి చేసి, పాలనను నుంచే ప్రారంభించాలని సిఎం నిర్ణయించారు.
జల సంరక్షణ వేగవంతం చేయాలి
గ్రామీణాభివృద్ధి శాఖకు, పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయి అవార్డులు రావడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నీరు-చెట్టు, పంట సంజీవిని అమలుపై అధికారులు, సర్పంచ్‌లతో మంగళవారం జరిగిన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎఫ్‌డిఐలో గుజరాత్ తరువాత మన రాష్టమ్రే ముందంజలో ఉందని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా జూన్ నాటికి భూగర్భ జలాలు ఎనిమిది మీటర్ల లోతున, డిసెంబర్ నాటికి మూడు మీటర్ల లోతున ఉండేలా పంట సంజీవిని, నీరు-చెట్టు, ఎన్టీఆర్ జలసిరి తదితర జల సంరక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి నిధుల సమీకరణ బాధ్యతలను కలెక్టర్లే చూసుకోవాలని అన్నారు.

సెక్రటేరియట్‌లోని ఫైళ్లను పరిశీలిస్తున్న సిఎం చంద్రబాబు * జైకా ప్రతినిధులతో చర్చిస్తున్న చంద్రబాబు