ఆంధ్రప్రదేశ్‌

తెగిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్.. ఆగిన నెట్‌వర్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, ఏప్రిల్ 26: విజయనగరం జిల్లాలో మంగళవారం ఆప్టికల్ ఫైబర్‌లైన్ తెగిపోవడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో నెట్‌సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలికంగా సేవలను పునరుద్దరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గిడిజాల జంక్షన్ వద్ద పురాతన బ్రిడ్జి పనులు చేస్తుండగా జెసిబి డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓఎఫ్‌సి లైను తెగిపోయింది. మంగళవారం ఉదయం ఈ సంఘటన జరగడంతో మొత్తం నెట్‌వర్క్ ఆగిపోయింది. ఓఎఫ్‌సి (ఆప్టిక్ ఫైబర్ కేబుల్)లైను కొత్తవలస మీదుగా ఒడిశా, కోల్‌కతా, ముంబాయి, ఢిల్లీ వెళ్తోంది. ఈ లైను ద్వారా ప్రభుత్వానికి గంటకు సుమారు రూ.ఐదు లక్షల ఆదాయం వస్తోంది. ఇక్కడ కేబుల్ తెగిపోవడంతో ఇంటర్‌నెట్ సేవలకు అంతరాయం కలిగింది. జరిగిన నష్టం గురించి తెలియగానే బిఎస్‌ఎన్‌ఎల్, ఎస్‌బిఐ అధికారులు ఓఎఫ్‌సి అధికారులకు సమాచారం చేరవేశారు.
దీంతో విశాఖపట్టణం నుండి అధికారులు హుటాహుటిన తరలివచ్చి నష్టనివారణ చర్యలు చేపట్టారు. గోపాలపట్నం జెఇ ఆధ్వర్యంలో పనులు వేగవంతం చేసి తాత్కాలికంగా పాతలైను ద్వారా కొంతమేర సేవలను పునరుద్ధరించారు. బుధవారం నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తిచేస్తామని జెఇ చెప్పారు. పనులు చేస్తున్న గుత్తేదారు కింద ఉన్న కేబుల్‌ను గుర్తించకుండా తవ్వకాలు జరపడంపై ఓఎఫ్‌సి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన లైను తెగిపోవడంతో ఎటిఎంలు, బ్యాంకింగ్ సేవలు, నెట్‌సేవలు నిలిచిపోయాయి.

విశాఖ పవర్‌గ్రిడ్
సబ్‌స్టేషన్‌లో సాంకేతికలోపం

విశాఖపట్నం, ఏప్రిల్ 26: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని పవర్‌గ్రిడ్‌కు చెందిన 400/220 విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఇంటర్ కనెక్టటెడ్ ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతింది. దీంతో మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 400 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఒక్కసారిగా అంతరాయం ఏర్పడడంతో దాని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మూడు జిల్లాల్లో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఇఎల్‌ఆర్) ప్రకటించారు.
ఒక్కో జిల్లాకు ఒక్కో సమయంలో సరఫరా నిలిపివేశారు. మంగళవారం రాత్రి ఏడు గంటలు దాటిన తరువాత విద్యుత్ సరఫరా మెరుగుపడింది. రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఆసుపత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం కలిగింది. గత మూడు రోజులుగా స్టీల్‌ప్లాంట్ పవర్‌గ్రిడ్, కలపాక 400 కెవి సబ్‌స్టేషన్లలో ఏర్పడిన సాంకేతిలోపాలతో రేయింబవళ్ళు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఉత్తరాంధ్ర జిల్లాలకు శాపంగా మారింది.

దువ్వాడ సెజ్‌లో
భారీ అగ్నిప్రమాదం
ఉవ్వెత్తున ఎగసిన మంటలు
గాజువాక, ఏప్రిల్ 26: విశాఖ జిల్లా దువ్వాడ ప్రత్యేక ఆర్థిక మండలిలోని బయోమెక్ ఫ్యూయల్ లిమిటెడ్ కంపెనీలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బయోమెక్ డీజిల్ ట్యాంకులకు నిప్పు అందుకోవడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి 600 మీటర్ల ఎత్తు అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. మంటల ఉద్ధృతికి పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నా లు చేస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం తెలిపింది. సంఘటనా స్థలానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ యువరాజ్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ చేరుకుని పరిశీలిస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా యంత్రాంగం ప్రకటించింది.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో కరవు ప్రాంతాల్లోని మండలాల్లోని విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నామని, ఇందులో భాగంగా రెండో రోజు 4.69 లక్షల మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజనానికి హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి మంగళవారం నాడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మినహా మిగిలిన 10 జిల్లాల్లో 359 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారని అందులో 1 నుండి 9 వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్ధుల సంఖ్య 17.48 లక్షలు ఉందని వారిలో తొలి రోజు 24న 3.29 లక్షల మంది హాజరై మధ్యాహ్న భోజనం స్వీకరించారని, రెండో రోజు హాజరు 6 శాతం పెరిగి 4.69 లక్షల మంది హాజరయ్యారని కమిషనర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో 34.82 శాతం, విజయనగరంలో 32.80, కృష్ణా జిల్లాలో 24.94, గుంటూరులో 26.88, ప్రకాశంలో 24.70, నెల్లూరులో 33.46 , చిత్తూరులో 33.05 , కడపలో 26.49, అనంతపురంలో 20.40 శాతం, కర్నూలులో 25.36 శాతం మంది హాజరయ్యారని కమిషనర్ చెప్పారు.

కరవు మండలాల్లోనీటి ఎద్దడి నివారణకు 158 కోట్లు
మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26: ఆంధ్రప్రదేశ్‌లో కరవును ప్రకటించిన 359 మండలాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు 158.2 కోట్ల రూపాయిలతో ప్రణాళిక రూపొందించినట్టు పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజు నీటి సరఫరా ఎలా ఉందనే అంశంపై సమీక్షిస్తామని అన్నారు. అవసరమైన చోట్ల ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా చేసేలా ఆదేశాలు ఇస్తున్నామని అన్నారు. 129 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని 114 గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. 22358 హాండ్ పంప్స్‌ను యుద్ధప్రాతిపదికపై మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. మంచినీటి సమస్యలు ఉంటే రాష్టస్థ్రాయిలో టోల్‌ఫ్రీ నెంబర్ 1800 425 1899 ఏర్పాటు చేస్తామని తెలిపారు.

జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు ఒక సెల్ గ్రామీణ నీటి సరఫరా సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు ఒక నోడల్ అధికారి నియమించామని చెప్పారు.