ఆంధ్రప్రదేశ్‌

రవాణా శాఖ లక్ష్యం రూ. 2555 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఆంధ్ర రాష్ట్ర రవాణా శాఖ ద్వారా ఈ ఏడాది రూ.2555 కోట్ల ఆదాయాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రెవెన్యూ రాబడి 20 శాతం వృద్ధిరేటు ఉంటుందని ఆయన చెప్పారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది 365 కోట్ల రెవెన్యూ పెరిగిందన్నారు. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి రూ. 247.50 కోట్ల రెవెన్యూను ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ వసూలు చేసిందని చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటికి 6,38,936 వాహనాలను తనిఖీ చేశారన్నారు.
విశాఖపట్నంతో పాటు రాయలసీమలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్ ట్రైనింగ్ రీసెర్చి సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో వెంకటచలంపల్లిలో 25వ తేదీ సోమవారం ఐడిటిఆర్ కేంద్రానికి మంత్రి శంకుస్ధాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు 18.51 కోట్ల వ్యయమవుతుంది. 20 ఎకరాల్లో ఈ సంస్ధను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర రవాణా శాఖతో మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఎంఒయూ కుదుర్చుకుంది. ఏడాదికి ఐదు వందల మందికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తామన్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్‌పర్సన్‌గా ఉంటారు. రవాణా, పోలీసు, వైద్య శాఖాధికారులతో కమిటీలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.

వెనుక సీట్లలో రాయితీ
* నేటి నుంచి 20 శాతం రాయితీ అమలు
* ఆర్టీసీ ఎండి నండూరి సాంబశివరావు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులను ఆకట్టుకోవటానికి సోమవారం నుంచి వినూత్న ప్రయోగాన్ని అమలు చేయనుంది. ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు వెనుక రెండు వరుసల్లోని సీట్లలో 20శాతం చార్జీ రాయితీ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాకు నడుస్తూ వస్తోన్న ఆర్టీసీ బస్సుల దామాషా ప్రకారం ఆరింటికి ఒక బస్సు చొప్పున తెలంగాణ ఆర్టీసీ కూడా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాలకు తమ బస్సులను నడపటం ప్రారంభించింది. అయితే ఇటీవల పెరిగిన చార్జీలతో పోలిస్తే తెలంగాణ బస్సు చార్జీ కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఎపిఎస్ ఆర్టీసీ నాణ్యమైన సర్వీస్ అందిస్తోంది. పైగా కొత్త బస్సులను రోడ్డుపైకి ఎక్కిస్తోంది. దీనికి తోడు ప్రైవేటు బస్సుల నుంచి పోటీని కూడా తట్టుకుని లాభాల బాటలో పయనింపజేసేందుకై ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు తీసుకువస్తున్న సంస్కరణల్లో భాగంగానే ముందస్తు రిజర్వేషన్ కల్గిన బస్సుల్లో వెనుక రెండు వరుసల్లో 250 కి.మీ ఆపై దూరానికి ప్రయాణించే వారికి టిక్కెట్ చార్జీలో 20 శాతం రాయితీ వర్తించే విధానం అమలు చేస్తారు. తద్వారా దూర ప్రాంత సర్వీసుల్లో సీట్ల భర్తీకి ఈ ప్రయోగం ఎంతగానో దోహదపడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2600 సర్వీసుల్లోనూ ఈ రాయితీని వర్తింపజేస్తామని సాంబశివరావు తెలిపారు. అయితే ప్రయాణ తేదీకి కనీసం మూడు రోజులు ముందుగా సీట్లు రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంది.
సేవ్ డెమోక్రసీ కాదు.. షేమ్ డెమోక్రసీ!
జగన్‌పై డొక్కా ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 24: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరి సేవ్ డెమోక్రసీ కాదు, షేమ్ డెమోక్రసీగా ఉందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మాజీమంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ఎద్దేవా చేశారు. వైకాపాలో డెమోక్రసీ సూదిమొన మోపినంత కూడా లేదని చెప్పి బయటకు వస్తున్నట్లు ఆ పార్టీ నుంచి వస్తున్న నేతలు బాహాటంగానే చెబుతున్నారని తెలిపారు. నేతి బీరకాయలో నెయ్యి లేని చందంగా ప్రతిపక్షం చేస్తున్న వైకాపా సేవ్ డెమోక్రసీలో డెమోక్రసీ లేదన్నారు. ఆదివారం డొక్కా ఒక ప్రకటన విడుదల చేశారు. సొంత ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు వ్యతిరేకించి బయటకు వెళ్లినంత మాత్రాన గెలవలేరంటున్న జగన్ అండ్ కో తన ఎమ్మెల్యేలపై తనకే నమ్మకం లేదని నిరూపించుకున్నారని అన్నారు.

గణితంలో మనోజ్
అరుదైన రికార్డు
విజయనగరం(టౌన్), ఏప్రిల్ 24: గణితంలో యూనిక్ వరల్డ్ రికార్డును ధవళ మనోజ్‌కుమార్ సాధించి మేధావులను ఆశ్చర్యచకితులను చేసాడు. కంప్యూటర్‌ను మించిన మేధస్సుతో తను గతంలో నెలకొల్పిన రికార్డును తిరగరాసి సరికొత్త రికార్డును నమోదుచేసి మేధావుల ప్రశంసలు అందుకున్నాడు. విజయనగరం పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో ఆదివారం యూనిక్ వరల్డ్ రికార్డు సంస్ధప్రతినిధులు, పట్టణ పౌరవేదిక, ఇంజనీరింగ్ విద్యార్థులు, మేధావులు, జిల్లాయంత్రాంగం సమక్షంలో మనోజ్‌కుమార్ ఈ ఘనత సాధించి ఏడు రికార్డులను తన పేరిట నమోదు చేసాడు. ఏడు కేటగిరీల్లో అతని మేధస్సుకు పరీక్ష పెట్టారు. ఏడంకెల డెసిమల్‌ను బైనరీలోకి మార్చటం, పదిహేడు అంకెల డెసిమల్‌ను బైనరీలోకి మార్చడం, నాలుగు అంకెల హెక్సా డెసిమల్, ఐదు అంకెల ఆక్టిల్‌ను డెసిమల్‌గా, నాలుగు అంకెల ఆక్టిల్ స్క్వేర్‌ను డెసిమల్‌గా, ఒక సంఖ్యను 11వ వర్గంతో 1000 అంకెల వరకు మార్పు, ఒక సంఖ్యను 15వ వర్గంతో 1000 అంకెల వరకు చెప్పే అంశాల్లో మనోజ్‌కుమార్ గతంలో తాను కోరుకొండ సైనిక స్కూల్‌లో నెలకొల్పిన రికార్డును తిరగరాసాడు. అతితక్కువ సయమంలో వాటిని తన మేధస్సుతో గుణించి కొత్త రికార్డు నెలకొల్పి యూనిక్ వరల్డ్ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా యూనిక్ వరల్డ్ సంస్థ ప్రతినిధి సబాబిమంగళ్ అతనికి హ్యూమన్ కంప్యూటర్ బిరుదును అక్కడికక్కడే ప్రకటించి ఏడు రికార్డుల సర్ట్ఫికెట్లను ఆహూతుల చేతుల మీదుగా ప్రదానం చేసారు. జిల్లాయంత్రాంగం తరపున ఎజెసి నాగేశ్వరరావు, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ లింగేశ్వరెడ్డి మనోజ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, నిర్వాహకులు కోరుకొండ బుజ్జి, ఎన్‌కె బాబు, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్‌విఎస్ రావు, యూనిక్ వరల్డ్ ప్రతినిధులు రహమాన్, రింకూరాణి పాల్గొన్నారు.

సికిందరాబాద్-తిరుపతి సూపర్‌ఫాస్ట్
రైలింజన్‌లో సాంకేతిక లోపం
5 గంటల ఆలస్యంగా తిరుపతికి తిరుమల భక్తుల ఇక్కట్లు
రేణిగుంట, ఏప్రిల్ 24: సికింద్రాబాద్-తిరుపతి సూపర్‌ఫాస్ట్ రైలింజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కడప జిల్లా రాయచోటి సమీపంలో నిలిచిపోయింది. దీంతో రైలు 5 గంటలు ఆలస్యంగా తిరుపతికి చేరుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ముందస్తు ప్రణాళికలతో ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌చేసుకొని సూపర్‌ఫాస్ట్ రైలులో ప్రయాణించిన వారు లబోదిబోమని గగ్గోలు పెట్టారు. అసలే మండుటెండలతో అల్లాడుతుంటే అర్థరాత్రి వేళ నిర్మానుష ప్రాంతంలో రైలు ఆగిపోవడం, సమాధానం చెప్పే నాథుడే కరవవడంతో ప్రయాణికుల అవస్థలు చెప్పనలవి కాదు. సికింద్రాబాద్-తిరుపతి సూపర్‌పాస్ట్ రైలు శనివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రాయచోటికి 20 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న టిసిలు ఎవరిపాటికి వారు తమ స్థానాల్లో గుర్రుపెట్టి నిద్రపోయారు. అందరూ మూకుమ్మడిగా రైలు డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చేతుల్లో ఇప్పుడేమీ లేదని, ఇంజన్ వస్తేనే రైలు వెళ్తుందని డ్రైవర్లు తమదైన శైలిలో సమాధానమిచ్చారు. ఎట్టకేలకు మరో ఇంజన్ రావడంతో 5 గంటలు ఆలస్యంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతికి చేరుకుంది. రైల్వే శాఖ తీరుతో తాము శ్రీవారి దర్శనానికి నోచుకోలేకపోయామని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.