ఆంధ్రప్రదేశ్‌

వడ దెబ్బ మృతుల నిర్ధారణకు.. త్రిసభ్య కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో వడ దెబ్బ మరణాలను నిర్ధారించేందుకు మండల స్థాయిలో త్రిసభ్య కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వడ దెబ్బకు గురై మృతి చెందిన వారి వివరాలను పోస్ట్‌మార్టం నివేదికతో సంబంధం లేకుండా, మృతి చెందిన 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోను మండలస్థాయిలో త్రిసభ్య కమిటీలను నియమించారు. తహసీల్దారు, పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి, మండల వైద్యాధికారులతో ఈ త్రిసభ్య కమిటీలు ఏర్పాటుచేశారు. ఫలానా గ్రామంలో వడదెబ్బకు గురై ఎవరైనా మృతి చెందినట్టు తెలిస్తే, వెనువెంటనే ఘటనాస్థలికి వెళ్ళి, పోస్ట్‌మార్టం నివేదికతో సంబంధం లేకుండా జిల్లా యంత్రాంగానికి నివేదించాల్సిందిగా త్రిసభ్య కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది. అయితే వడ దెబ్బ మృతులకు నష్ట పరిహారం విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం బాధిత వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రస్తుతం వేసవి తీవ్రత, వడ గాడ్పుల ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు పతాకస్థాయికి చేరడంతో ప్రజలు బయట తిరిగే పరిస్థితి లేక, మరోవైపు ఇంట్లో ఉక్కపోత భరించలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు విద్యుత్ కోతలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా ప్రజలు అల్లాడుతున్నారు. గత వారం రోజులుగా అర్ధరాత్రి సమయాల్లో విద్యుత్ కోత కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో వడగాడ్పుల కారణంగా సుమారు 160 మరణాలు సంభవించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వీరిలో వాస్తవంగా వడ దెబ్బకు గురై మృతి చెందిన వారి సంఖ్య 60గా ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. తాజాగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వడ దెబ్బకు గురై మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఆయా జిల్లాల్లో త్రిసభ్య కమిటీల నివేదికలు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఎప్పటికపుడు చేరవేస్తున్నాయి. ముఖ్యంగా రానున్న రెండు నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వడ దెబ్బకు గురై మరణిస్తున్న వారిలో అధిక శాతం పేద వర్గాలకు చెందిన వారే ఉండటంతో వీటిని ప్రమాదవశాత్తూ సంభవించిన మరణాల క్రిందే పరిగణించాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్ధారించిన వడ దెబ్బ మృతుల కుటుంబ సభ్యులకు పరిహారాన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్రంలో గుర్తించిన 359 కరవు మండలాల్లో యుద్ధప్రాతిపదికన కరవు సహాయక చర్యలు చేపట్టాలని, కరవు మండలాలుగా ఎంపికకు అర్హత కలిగి ఇంతవరకు ఎంపిక కాని మండలాలను గుర్తించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

ముంపు ప్రాంతాల్లో ప్లాట్ల కేటాయింపా!
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 24: 50 ఎకరాలలో నిర్మాణమవుతున్న తాత్కాలిక సచివాలయం భవనాల కోసం దాదాపు 8నుంచి పది అడుగులు పైగా భూమిని ఎత్తు లేపటంతో పరిసరాలన్నీ మరింత లోతట్టు ప్రాంతాలుగా మారాయి. అసలు రాజధానికి కొండవీటి వాగు ముంపు ప్రమాదం ఉందంటూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమవేత్తలు బొలిశెట్టి సత్యనారాయణ, పండాలనేని శ్రీమన్నారాయణ వంటి సామాజిక వేత్తలు మొదటి నుంచి నెత్తినోరు కొట్టుకుంటూ రావటమే గాక అత్యున్నత న్యాయస్థానాల్లోనూ పోరాడుతున్నారు. అసలు ముంపు అంటూ లేదంటూ వాదిస్తూ వచ్చిన సిఆర్‌డిఎ అధికారులు భూమిని 8 నుంచి 10 అడుగుల ఎత్తు లేపటంతోనే వాస్తవాలు వెలుగుచూశాయి.
బొలిశెట్టి సత్యనారాయణ ఆహ్వానంపై ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటించిన జెఎన్‌యు రిటైర్డ్ ప్రొఫెసర్ అమితాబ్ కోందు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నేడు తాత్కాలిక సచివాలయ ప్రాంతం రేపు 300 ఎకరాల్లో నిర్మితమై సీడ్ కాపిటల్‌ను ఎత్తు లేపితే పరిసరాలన్నీ కొట్టుకుపోవాయంటూ ప్రశ్నించారు. దీనికి తగ్గట్లే సిఆర్‌డిఎ అధికారులు కొండవీటి వాగు ముంపు ప్రాంతాల్లోనే రైతులకు ప్లాట్లు కేటాయిస్తారనే ప్రచారంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రేపు వర్షాకాలం వస్తే నీరు నెలల తరబడి నిలిస్తే వెంటనే ఆ స్థలాలను విక్రయించుకోటానికి కూడా వీలులేదని భయపడుతున్నారు. ఒకసారి ముంపునకు గురైన భూములకు ఆ తర్వాత విలువ ఉండదంటున్నారు. రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగును ఛానలైజ్ చేశారు. అనంతవరం కొండల్లోనుంచి నెక్కల్లు, శాఖమూరు, ఐనవోలు, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం శివారు మీదుగా కృష్ణాయపాలెం వరకు వెళుతుంది. మొత్తం ఈ వాగు వెంబడి పూర్తిగా నివాస ప్రాంతాలను కేటాయించబోతున్నారు. భవిష్యత్తులో ఎవరికి వారు తమ ఇష్టానుసారం ఎత్తు పెంచుకుంటూ పోతే కొండవీటి వాగుకు వరదలు వచ్చినపుడు ఆ వరద నీరు ఏ విధంగా కృష్ణానదిలో కలుస్తుందనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కొండవీటి వాగును బ్యారేజీ దిగువకు మళ్లించడానికి అడ్డుగా ఉన్న కొండలను తొలవాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. పైగా ఆర్భాటంగా శంకుస్థాపన జరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలందరూ కొండవీటి వాగు ముంపు ప్రమాదాన్ని తలచుకుంటూ బెంబేలెత్తుతున్నారు.

ప్రజల సహకారంతో
అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం
అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల వెల్లడి
మార్టూరు, ఏప్రిల్ 24: ప్రజల సహకారంతో అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయవచ్చని రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆదివారం ఆయన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శి గ్రామంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పౌష్టికాహారం ఏవిధంగా అందుతుందంటూ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను సంప్రదిస్తూ చిన్నపిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పిస్తే వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి పునాదిగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు జీతాలు ఏవిధంగా పెంచిందో వారు కూడా చిత్తశుద్దితో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం, గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. తదుపరి ఇసుకదర్శిలో వాటర్‌షెడ్‌ల నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేశారు. ఇంకుడు గుంతల వల్ల జలమట్టాన్ని పెంచుకోవచ్చని ఆయన అన్నారు.
హింసతో సంబంధం లేదు: ముద్రగడ
ఆకివీడు, ఏప్రిల్ 24: ఉద్యమానికి నాయకుడినిగాని హింసాత్మక ఘటనలకు కాదని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు వచ్చిన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. తుని హింసాత్మక సంఘటనకు సంబంధించి అరెస్టు చేస్తామంటూ వస్తున్న వార్తల పట్ల ఆయన ఘాటుగా స్పందించారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని, పారిపోయే ప్రసక్తేలేదన్నారు. రాష్ట్రాన్ని విడిచిపోమని, బెయిల్ కోసం ప్రయత్నించమన్నారు. తమ జాతికి జరుగుతున్న అన్యాయానికి ఉద్యమం చేపట్టామన్నారు. అయితే ప్రభుత్వం సానుకూలంగా తమ సమస్యను పరిష్కరిస్తుందనే ఆశాభావంతో ఉన్నామన్నారు. అయితే కొన్ని పత్రికల్లో బెదిరింపువార్తలు రావడం శోచనీయమన్నారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే 400 కాదు 4లక్షల మందైనా అరెస్టులకు వెనుకడమన్నారు.
నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో
వడదెబ్బకు 11 మంది మృతి
నెల్లూరు/చిత్తూరు/ఒంగోలు, ఏప్రిల్ 24: నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఆదివారం వడదెబ్బకు 11 మంది చెందారు. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజల అల్లాడిపోతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆదివారం వడదెబ్బతో ఇద్దరు, చిల్లకూరు మండలంలో ముగ్గురు వడదెబ్బకు గురై మృతి చెందారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఒకరు, తర్లుపాడులో ఒకరు వడదెబ్బతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ముగ్గురు, ఐరాల మండలంలో ఒకరు వడదెబ్బకు గురై మృతి చెందారు.
గుంటూరులో నలుగురు..
మేడికొండూరు: మండలంలోని విశదల ఎస్టీ కాలనీలో వీస్తున్న వడగాలులకు పోలంపల్లి శౌరి (73) ఆదివారం మృతిచెందాడని బంధువులు తెలిపారు.
రెంటచింతలలో..
రెంటచింతల: మండలంలోని మల్లవరం గ్రామానికి చెందిన తుమ్మల అచ్చమ్మ (52) వడదెబ్బకు గురై ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. బంధువులు తెలిపారు. ఆదివారం ఉదయం కూలీ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఎండలో ఇంటికి వస్తూ మార్గమధ్యంలో కుప్పకూలింది.
నూజెండ్ల మండలంలో ఇద్దరు..
నూజెండ్ల: మండలంలో ఆదివారం వడదెబ్బకు ఇద్దరు మృత్యవాత పడ్డారు. మండల కేంద్రమైన నూజెండ్లలోని కుందుర్తి గోవిందరాజులు (55) పొలానికి వెళ్లి ఇంటికి వచ్చి సృహతప్పి పడిపోయి మృత్యు వాత పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే కంభంపాడు గ్రామానికి చెందిన ఎండ్లూరి పాల వెంకయ్య (52) ఆసుపత్రికి వెళ్లి ఇంటికి వచ్చి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు..
దమ్మపేట/ కొత్తగూడెం రూరల్/ ములకలపల్లి: ఖమ్మం జిల్లాలో వడదెబ్బ తగిలి ఆదివారం ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దమ్మపేట మండల పరిధిలోని నాగుపల్లిలో చల్లా సూరయ్య(60) అనే వృద్ధుడు జీడిమామిడి తోటలో తోటమాలిగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం జీడితోటలోకి వెళ్లిన సూరయ్య మధ్యాహ్నం వడదెబ్బకు గురై మృతి చెందాడు. సమీప తోటల్లోని వారు గమనించి సూరయ్య మరణవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
కొత్తగూడెం రూరల్ మండలపరిధిలోని పెనగడప గ్రామానికి చెందిన మనె్న వీరమల్లయ్య (78) వ్యక్తిగత పనులతో రాంపురం గ్రామం వెళ్లాడు. తిరిగి వస్తుండగా వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.
ములకలపల్లి మండల పరిధిలోని చాపరాలపల్లి గ్రామానికి చెందిన ఈడా నాగయ్య (75) అనే వ్యక్తి వడదెబ్బ తగలడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి వీరమల్లయ్య మృతి చెందాడు.
బలిజలకు ప్రభుత్వ అండ
కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు స్పష్టం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఏప్రిల్ 24: కాపు కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కాపు, బలిజ కులాలను ఆర్థికంగా ఆదుకునేందుకు కట్టుబడి ఉందని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమాలశెట్టి రామాంజనేయులు పేర్కొన్నారు. బలిజ కులాల అభివృద్ధి మేధోమథన సదస్సు ఆదివారం నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబునాయుడు కాపులకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు. కాపు కార్పొరేషన్ ద్వారా బలిజ కులాలకు ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ కార్పొరేషన్‌కు లేని విధంగా కాపు కార్పొరేషన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిస్థాయి నిధులు, ఇతర సహాయం అందచేస్తున్నారని అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా అందించే రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు కాపు కులాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారనీ, మనమంతా ఆయన వెంట ఉందామని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం రాష్ట్రంలో గెలుపొందడం వెనుక కాపు కులాల మద్దతే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారనీ, వీరంతా తమకు ఎన్నో ప్రయోజనకర కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్న టిడిపికి మద్దతుగా నిలిచి వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపించాలని పిలుపునిచ్చారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తారని అన్నారు. ఇప్పటికే కాపు కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా కాపులకు రుణ సదుపాయం అందచేసే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు, టిడిపి నేతలు దేశాయిశెట్టి హనుమంతరావు తదితరులతో పాటు కాపు, బలిజ సంఘాల జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు.

సీమలో తగ్గని
ఎండ సెగ
ౄ అనంతపురంలో 46.2
ౄ కర్నూలులో 44.4 డిగ్రీలు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు/కడప/అనంతపురం, ఏప్రిల్ 24: రాయలసీమ వ్యాప్తంగా ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. సీమ జిల్లాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు తీసుకువస్తోంది. కర్నూలు జిల్లాలో ఆదివారం సగటున 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యధికంగా జిల్లా కేంద్రమైన కర్నూలులో 44.4 డిగ్రీల ఉష్ణోత్ర నమోదైంది. అనంతపురం జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 42.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లా కేంద్రమైన అనంతపురంలో 43.3 డిగ్రీలు నమోదైంది. జిల్లాలో అత్యధికంగా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో 46.2 డిగ్రీలు నమోదైంది. కడప జిల్లాలో కూడా 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడదెబ్బతో ముగ్గురి మృతి
కడప, అనంతపురం జిల్లాల్లో ఆదివారం వడదెబ్బకు గురై ముగ్గురు మృతి చెందారు. వారిలో కడప జిల్లా చాపాడు మండలం నెర్రవాడ గ్రామంలో పొగ్గటి నరసింహులు(57), రైల్వేకోడూరు పట్టణంలో ఉరిమెళ్ల బాబయ్య(58), అనంతపురం జిల్లా యాడికి మండలం పినే్నపల్లి గ్రామంలో ఓరుగంటి సుబ్బారెడ్డి(55) వడదెబ్బతో మృతిచెందారు.

గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల అరెస్టు

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 24: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇటీవల కేరళ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్లు ఏఎస్పీ ఆర్ గంగాధర్ వెల్లడించారు. సెంట్రల్‌జోన్ డిఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 16న రాత్రి యువతిని కిడ్నాప్ చేసి, కవలగొయ్యిలోని నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన రౌడీషీటర్లు కక్కల సతీష్, తాడేపల్లి ప్రేమ్‌కుమార్, పలివెల రాజు అలియాస్ స్టిక్, కంచి సత్యమణికంఠలను అరెస్టు చేశామన్నారు. 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతామన్నారు. ఈకేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకు విచారణ నిమిత్తం నిందితులను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరతామన్నారు. ఈ కేసును చేధించిన సిఐ, ఎస్‌ఐలకు రివార్డు కోసం సిఫార్సు చేయనున్నట్లు ఏఎస్పీ గంగాధర్ చెప్పారు. ఈకేసులో నిందితులు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఇందుకోసం నిందితులను విచారించేందుకు పోలీసుకస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తిని కోరతామన్నారు. నగరంలోని రౌడీషీటర్లను అణిచివేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జోనల్‌స్థాయిలో వారికి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. రౌడీషీటర్లయిన కక్కల సతీష్‌పై 16, తాడేపల్లి ప్రేమ్‌కుమార్‌పై 30 కేసులు ఉన్నాయని, గతంలో పలు కేసుల్లో వీరు జైలుకు కూడా వెళ్లివచ్చారని వివరించారు. విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ జె కులశేఖర్, వన్‌టౌన్ సిఐ ఎం రవీంద్ర, ఎస్‌ఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బాధితురాలు కేరళకు చెందినది కాదని, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందినదిగా పోలీసుల విచారణలో వెల్లడైంది. మరోవైపు రౌడీషీటర్లు గతంలో ఒక మహిళపై అత్యాచారం చేసి, వ్యభిచార గృహంలో విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సామూహిక అత్యాచారం కేసులో అరెస్టు చేసిన నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఎఎస్పీ గంగాధర్