ఆంధ్రప్రదేశ్‌

పల్లెలే ప్రగతి రథాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు. ఐదో షెడ్యూలుకు చెందిన 10 రాష్ట్రాల గిరిజన మహిళా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇక్కడి ఎ కనె్వన్షన్ హాలులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఈ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్రం చేపట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బీరేంద్ర సింగ్ మహిళా సర్పంచ్‌లకు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయం రానున్న 5 ఏళ్లలో రెట్టింపు కావాలన్న లక్ష్యంతో ఈ పథకాలను చేపట్టామన్నారు. ఇవి విజయవంతమైతే స్థూల జాతీయోత్పత్తి 3.5శాతం వరకు పెరుగుతుందన్నారు. ఈ పథకాలను అమలు చేయడానికి నిధులను నేరుగా పంచాయతీల బ్యాంక్ ఖాతాలకే జమచేస్తున్నామని, దీని వల్ల పంచాయతీ సర్పంచ్‌లకు విశేష అధికారాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కేంద్రం నిధుల్ని సద్వినియోగం చేసుకోడానికి పథకాలు అమలుచేయడానికి గ్రామ సభల ద్వారానే ఆమోదించుకునే అవకాశం ఉందని తెలిపారు.
గిరిజన మహిళలకు ఊతం:బాబు
గిరిజన మహిళలు సంక్షేమానికి, వారి ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళల అభ్యుదయమే ఎన్టీఆర్ మహిళలకు తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత తమదేనన్నారు. మహిళా సాధికారికత కోసం డ్వాక్రా సంఘాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఇద్దరు మహిళలలో ఒకరు డ్వాక్రా సభ్యులుగా నమోదయ్యారని ఆయన తెలిపారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి, విద్యాభివృద్ధికి కొన్ని బృహత్తర కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా తీర్చిదిద్ది కార్పొరేట్ పాఠశాల స్థాయిలో విద్యా సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. 3వ తరగతి నుండి గిరిజన విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా ఉన్నత విద్య అందజేస్తామని, వసతి గృహాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడానికి ఉపకార వేతనాలు ఇస్తున్నామన్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు మంచినీరు, మినరల్ నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని రైతుల ఆదాయాన్ని పెంచడానికి కాఫీ తోటల పెంపకానికి పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఆరకు గిరిజన కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి లభించిందని, ప్రస్తుతం అరకు ప్రాంతంలో 7 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కాఫీ ఉత్పత్తి అవుతోందని, దానిని 8 వేల మెట్రిక్ టన్నులకు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గిరిజనుల గృహాలకు 50 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వినియోగించుకునే సదుపాయం కల్పించామని, అంతేకాకుండా ప్రతి గిరిజన కుటుంబానికి 2 ఎల్‌ఇడి విద్యుత్ బల్బులు ఉచితంగా సరఫరా చేశామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 3,300 కిలోమీటర్ల మేర సిమెంట్ రహదారులు వేశామని, ఈ సంవత్సరం మరో 5 వేల కిలోమీటర్ల వీటిని నిర్మించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. రాబోయే 4 సంవత్సరాల్లో అన్ని గ్రామాలకు సిమెంట్ రహదారులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో 100 శాతం పారిశుద్ధ్యాన్ని అమలుచేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి పంచాయతీని డిజిటల్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. భూగర్భ జల వనరులు పెంచడానికి ఇంకుడు గుంటల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.
కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జ్యూయల్ ఒరమ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సర్పంచ్‌లకు విశేష అధికారాలను కల్పించిందని, ప్రతి మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర నిధులను గ్రామాల అభివృద్ధికే వినియోగించాలని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు 10 గిరిజన పంచాయతీలకు చెందిన ఉత్తమ సర్పంచ్‌లను తెలుగు సాంప్రదాయ రీతిలో చీర, కుంకుమ, కొండపల్లి బొమ్మలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి నిఖిల్ చంద్, కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి సుదర్శన్ భగత్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ కార్యదర్శులు ఎకె గోయల్, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... గిరిజన మహిళా సర్పంచ్‌ల సమావేశం సందర్భంగా గిరిజనులతో కలిసి
డప్పు కొడుతున్న చంద్రబాబు, కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్