ఆంధ్రప్రదేశ్‌

అపచారం..అపచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబరు 23: తిరుమల తిరుపతి దేవస్థానం గ్రంథ రచనకు రచయితలకు ఇచ్చే ఆర్థిక సాయంతో రూపొందించిన భక్తిగీతామృత లహరి అనే హైందవ గ్రంథంలో అన్యమత ప్రస్తావన వుండటం, దాన్ని టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచిన విషయం సోమవారం వెలుగు చూసింది. దీంతో టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందించిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘల్ టీటీడీ వెబ్‌సైట్‌లో వున్న పుస్తకాన్ని తక్షణం తొలగించారు. అంతేకాకుండా ఈ గ్రంథాన్ని రచించిన రచయిత అలా ఎందుకు రాశారు? ఈపుస్తకం పరిశీలనకు నియమించిన నిపుణుల కమిటీ దీన్ని ఎందుకు గుర్తించలేకపోయింది అన్న అంశంపై విచారణకు అదేశించినట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం సాయంత్రం టీటీడీ పరిపాలన భవనంలో వెల్లడించారు. వివరాలిలా వున్నాయి. హైందవ ప్రాశస్థ్యాన్ని గురించి రచనలు చేసే ఆర్థిక స్థోమత లేని రచయితలకు టీటీడీ ఆర్థిక సాయం అందించే ఒక పథకాన్ని 1979 మేలో టీటీడీ ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందించింది.
ఇందులో ప్రధానంగా రచయిత రాసే పుస్తకం పూర్తిగా హైందవ వ్యవస్థకు సంబంధించి ఉండాలనేది నిబంధన. అలాగే రచయితలు రాసే పుస్తకాలను పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ కూడా ఉంటుంది. ఈ కమిటీ పుస్తకాలను పరిశీలించి అన్యమత ప్రస్తావన లేకుండా చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మొదటి 16 పేజీలు పరిశీలించిన అనంతరం రచయితకు ఇచ్చే ఆర్థిక సాయంలో కొంత, ముద్రణకు ముందు మరికొంత ఇచ్చే విధానం టీటీడీలో వుంది. ఈ నేపథ్యంలో 2002లో చెన్నైకి చెందిన మెండే చిన్న సీతారామయ్య అనే రచయిత భక్తి గీతామృత లహరిని రచించారు. ఈ పుస్తకాన్ని టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ పుస్తకంలో అన్యమత ప్రస్తావన వున్న విషయం సోమవారం నాడు వెలుగుచూసింది. ఇందులో 182, 183, 184 పేజీలలో ఏసు క్రీస్తుకు సంబంధించిన ప్రస్తావన ఉండటాన్ని గమనించి వెబ్‌సైట్ నుంచి ఆ పుస్తకాన్ని తొలగించారు. పి. కృష్ణయ్య టీటీడీ కార్యనిర్వహణాధికారిగా వున్నప్పుడు ఈ పుస్తక రచయిత సీతారామయ్యకు ఆర్థిక సాయం అందించారు. ఆ సమయంలో నిపుణుల కమిటీలో సముద్రాల లక్ష్మణయ్య, రామబ్రహ్మం, సత్యవతి, లక్ష్మణమూర్తి వంటివారు వున్నారని ఈఓ తెలిపారు. అయితే అప్పట్లో ఏమి జరిగిందన్నది తాను ఇప్పుడు చెప్పలేనని, తన దృష్టికి రాగానే వెంటనే వాటిని తొలగించామన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో పూర్తిగా హైందవ ధర్మప్రచారం, స్వామివారి వైభవం వంటివి మాత్రమే ఉండాలన్నారు. తాము ఇటీవల వెబ్‌సైట్‌లో ఇ-బుక్స్‌ను భక్తులకు అందుబాటులో వుంచామన్నారు. ఇందులో వేల సంఖ్యలో వున్నాయన్నారు. ఈ సంఘటనతో టీటీడీ ఆర్థిక సాయంతో రూపొందించిన పుస్తకాలన్నీ కూడా వెబ్‌సైట్ నుంచి తొలగించామన్నారు. ఈ పుస్తకాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. రెండు మూడు నెలల వ్యవధి కాలంలో ఈ పరిశీలన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించామని ఈఓతెలిపారు. వాస్తవానికి 2009లో పుస్తక పరిశీలనకు సంబంధించి కూడా కొన్ని ప్రత్యేక నిబంధనలను తీసుకువచ్చామన్నారు. ఇలాంటి గ్రంథాలు ఒకటి రెండు రోజుల్లో పరిశీలించలేమని, కొంత వ్యవధి పడుతుందని ఆయన అన్నారు. కాగా టీటీడీలో డిమాండ్ వున్న స్వామివారి వైభవానికి సంబంధించిన 26 పుస్తకాలను గుర్తించామని, వాటిని తిరిగి ముద్రించడానికి చర్యలు తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి జే ఈఓ బసంత్‌కుమార్, పీ ఆర్వో రవికుమార్ పాల్గొన్నారు.