ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుకు పెరిగిన భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భద్రతను పెంచారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కృష్ణా నది తీరంలో ఉండవల్లి వద్ద ఒక ప్రైవేట్ విశ్రాంతి గృహమే ప్రస్తుతం చంద్రబాబు తాత్కాలిక నివాసంగా ఉంది. గత ఏడాది 6నెలలుగా చంద్రబాబు ఆ విశ్రాంతి గృహంలో ఉంటున్నారు. దీంతో ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసు నిఘా పెరిగింది. ప్రస్తుతం చంద్రబాబుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రతను 2004 సంవత్సరం నుంచి కల్పిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఇటీవల మావోయిస్టు పార్టీకి చెందిన అరుణక్కను పోలీసులు అరెస్టు చేశారు. పైగా అమరావతి ప్రాంతం నల్లమల అడవులకు కేవలం వంద కి.మీ దూరంలో ఉంది. దీంతో రాష్ట్ర పోలీసు శాఖ చంద్రబాబుకు అత్యంత ఆధునిక టెక్నాలజీ పరికరాలతో భద్రతను పెంచారు. ఉండవల్లి బంగ్లాతో పాటు కీలకమైన ప్రదేశాల్లో అత్యధిక రెజుల్యూషన్ ఉన్న కెమెరాలను అమర్చారు. ఐదారు కి.మీ దూరంలో ఉన్న విజువల్స్‌ను ఇవి తీసి భద్రపరుస్తాయి. నదీ తీరం వెంట కూడా కెమెరాలను అమర్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సింగపూర్‌లో ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన సిసిటివి కెమెరాలను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఉండవల్లికి సమీపంలోనే ఉన్న కృష్ణా నదీ తీరంలో కూడా పగలు, రాత్రి గస్తీ తిరిగేందుకు స్పీడ్ బోట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో సాయుధ పోలీసులు ఉంటారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి వరకు అటువైపు అమరావతి నుంచి ఉండవల్లికి వచ్చే దారుల్లో పోలీసు బలగాలను నియమించారు. జాగిలాల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు.

హైదరాబాద్‌కు
మంచి నీటి కోసం
సాగర్‌ను తోడేస్తున్నారు...!

సాగర్‌లో ఎమర్జన్సీ మోటార్ల బిగింపు పనులు షురూ...
మే చివరి తర్వాత నీటికి కటకటే!

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఏప్రిల్ 17: కరవు తీవ్రతతో కృష్ణమ్మ పరవళ్లు పరుగులు కానరాక ముందెన్నడూ లేనిరీతిలో కృష్ణా నదిలో నీరు అడుగంటిపోవడం నల్లగొండ జిల్లా ప్రజలతో పాటు జంటనగరాల ప్రజలకు తాగునీటి కష్టాలను తెచ్చిపెడుతోంది. కృష్ణమ్మ ఒడిలో ఎటుచూసినా బండరాళ్లు మినహా కనుపుచూపు మేరలో నీరు కనిపించడం లేదు. నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ 510 అడుగుల దిగువ కాగా, 507.30 అడుగులకు నీటి నిల్వలు పడిపోవడంతో జంటనగరాలకు ఎఎమ్మార్పీ పుట్టంగండి సిస్టర్న్‌ల ద్వారా మే నెల చివరి నుండి నీటి సరఫరా కష్టతరంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి సిస్టర్న్ మోటార్లకు నీరందుతున్నప్పటికీ మే చివరి నాటికి మాత్రం సాగర్ నీరు మరింత దిగువకు పడిపోనుండడంతో జంట నగరవాసులకు ఇక్కడి నుండి నీటి సరఫరాకు గడ్డుకాలం రానుంది. వరుణుడు కరుణించకపోతే మే నెల తర్వాత హైదరాబాద్‌వాసులకు తాగునీరందించలేమంటూ నీటిపారుదల శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో హెచ్‌ఎండబ్ల్యుఎస్‌బి (హైద్రాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డు) అధికారులు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సాగర్ అంతర్భాగంలో అత్యవసర మోటార్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తీవ్ర కరవు పరిస్థితుల్లో సాగర్‌లో నీటిమట్టం 505 అడుగులు అంతకు తక్కువకు తగ్గిన నేపథ్యంలో ఎమర్జన్సీ మోటార్లను బిగించి పుట్టంగండి మోటార్లకు నీరందించేందుకు పనులు ప్రారంభించడం విశేషం.
ప్రారంభమైన ఎమర్జన్సీ మోటార్ల పనులు!
నల్లగొండ జిల్లాలోని పిఎపల్లి మండల పరిధిలో సాగర్ నీటిని ప్రస్తుతం పుట్టంగండి వద్ధ ఎఎమ్మార్పీ మోటార్లతో పంపింగ్ చేస్తూ జంటనగర ప్రజలకు తాగునీరందిస్తున్నారు. 510 అడుగుల సాగర్ డెడ్‌స్టోరేజీని దృష్టిలో పెట్టుకుని ఎఎమ్మార్పీ పుట్టంగండి సిస్టర్న్ మోటార్లను డిజైన్ చేశారు. గత పనే్నండేళ్ల క్రితం ఇదే రీతిలో కరవు రావడంతో సాగర్ నీటి మట్టం 505 అడుగులకు పడిపోయినప్పటికీ అప్పట్లో హైదరాబాద్ నీటి అవసరాలకు పుట్టంగండి మోటార్లు నడిపించారు. అంతేకాకుండా ఎమర్జన్సీ మోటార్ల ఏర్పాటుకు సైతం పనులు ప్రారంభించారు. అదే సమయంలో సమృద్ధిగా వర్షాలు రావడంతో నీటి కొరత సద్దుమణిగి ఎమర్జన్సీ మోటార్ల ఏర్పాటు వాయిదా పడింది. మళ్లీ ఇన్నాళ్లకు వర్షాభావంతో సాగర్‌లో నీటికొరత ఏర్పడడంతో పుట్టంగండి మోటార్లకు మే చివరి తర్వాత నీరందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ వారు పుట్టంగండి వద్ధ దాదాపు 7 కోట్ల రూపాయలతో ఎమర్జన్సీ మోటార్లకు సంబంధించిన పనులను చేపట్టారు. పనె్నండేళ్ల నాటి ఎమర్జన్సీ మోటార్ల ఆలోచన ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చుతోంది.
300 హెచ్‌పి సామర్ధ్యం గల 10 మోటార్లను సాగర్ పరిధిలోని పుట్టంగండి మోటార్ల అప్రోచ్ కెనాల్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. సాగర్‌లో మే నెల తర్వాత మరింత దిగువకు నీటి మట్టం పడిపోయిన పక్షంలో సాగర్‌లో నీరు అందుబాటులో ఉండేచోటు నుండి ఎమర్జన్సీ మోటార్ల వరకు అప్రోచ్ కెనాల్ ఏర్పాటు చేసి పది ఎమర్జన్సీ మోటార్ల ద్వారా పుట్టంగండి మోటార్ల అప్రోచ్ కెనాల్‌లోకి నీటిని పంపించనున్నారు.
దాంతో పుట్టంగండిలోని ఒక మోటార్‌తో సిస్టర్న్‌లోకి నీటిని పంపింగ్ చేయనున్నారు. పది మోటార్లు నడిస్తేనే 18 ఎంవి సామర్ధ్యం గల పుట్టంగండి సిస్టర్న్ ఒక మోటార్‌కు నీరందనుంది. ఎమర్జన్సీ మోటార్ల వద్దకు కావాల్సిన విద్యుత్, రోడ్డు నిర్మాణ పనులను కూడా వేగంగా జరిపిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 507.30 అడుగులుకాగా పుట్టంగండి వద్ధ రెండు మోటార్లతో 800 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలిస్తూ అక్కడి నుండి జంటనగరాలకు మంచినీటిని అందిస్తున్నారు.

అత్యవసర మోటార్ల ఏర్పాటు ప్రాంతం వద్దకు రోడ్ల నిర్మాణం పనుల దృశ్యం
అత్యవసర మోటార్ల వద్ద
విద్యుత్ ఏర్పాట్లు