ఆంధ్రప్రదేశ్‌

ప్రాణం పోయినా పొలాలివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: అక్కడ సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి.. ఆ ప్రాంతంలో ఏ పొలం చూసినా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ప్రధాన పంటలతోపాటు అంతర్ పంటలను పండిస్తూ రైతులు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. పచ్చని శోభతో కళకళలాడుతున్న గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని ఈ పొలాలను రాజధాని కోసం తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకూ అనేక ప్రయత్నాలు చేసింది. సాధ్యం కాలేదు. బలవంతంగా
నైనా తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా ఎపిసిఆర్‌డిఎ అధికారులు రైతుల అనుమతి లేకుండానే, వారి పొలాల్లో కర్రలు పాతుతున్నారు. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ, పొలాలు ఇవ్వబోమని వారు తెగేసి చెపుతున్నారు.
విజయవాడను, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నివాస గృహానికి ఆనుకుని ఉన్న ఉండవల్లి గ్రామంలో సుమారు 1000 ఎకరాలను రాజధాని కోసం సేకరించడానికి ప్రభుత్వం సిద్ధపడింది. రాజధాని రాకముందు ఇక్కడ ఎకరా ఆరు నుంచి పది కోట్ల రూపాయల వరకూ పలికింది. ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్న పెనుమాకలో ఎకరా రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలు పలికింది. ఇక్కడ ఉద్యానవన పంటలు, అరటి, మొక్కజొన్న వంటి పంటలను విస్తారంగా పండిస్తున్నారు. ఎకరా పొలం ఉన్న రైతు ఏడాదికి కనీసం రెండు నుంచి మూడు లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.
ఉండవల్లి గ్రామంలో సుమారు 260 ఎకరాల భూమిని, పెనుమాకలోని 200-300 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతులనుంచి ఇప్పటికే తీసుకుంది. కానీ ప్రభుత్వం నుంచి రైతులు చెక్కులు మాత్రం తీసుకోలేదు. రాజధాని ప్రకటన రాక ముందు కోట్ల రూపాయలు పలికిన ఈ రెండు గ్రామాల్లోని పొలాల ధరలు ఇప్పుడు అమాంతంగా పడిపోయాయి. సుమారు 10 కోట్ల రూపాయల వరకూ ధర పలికిన ఉండవల్లి భూములు నాలుగు కోట్లకు పడిపోయాయి. పెనుమాకలోని ఎకరం పొలం ధర కోటిన్నరకు పడిపోయింది. ఇక్కడున్న భూములను ఏనాటికైనా తీసుకుంటామని ప్రభుత్వం పరోక్షంగా చెప్పడంతో ఎవ్వరూ ఇక్కడి భూములు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. పైగా, రైతులను బెదిరించి భూములను తీసుకోవాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరోపక్క ఈ ప్రాంతంలోని రైతులను ఇక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ఈ రెండు గ్రామాలను కలిపి ఒక జోన్‌గా ఏర్పాటు చేసి, వేస్ట్ వాటర్ ట్యాంక్‌ను ఈ రెండు గ్రామాల మధ్య నిర్మించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
మేమంతా సన్న, చిన్నకారు రైతులం. అర ఎకరం, ఎకరం ఉన్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు. అర ఎకరంపై సంవత్సరానికి రెండు లక్షలు సంపాదించుకుంటున్నాం. తుళ్లూరు, రాయపూడి రైతులు భూములు ఇచ్చారు. గతంలో ఆ ప్రాంతాల్లో ఎకరా ఐదు నుంచి పది లక్షలు ధర పలికేది. రాజధాని వచ్చిన తరువాత కోట్లలో పలుకుతోంది. అక్కడ పెద్ద పొలాలు ఉన్న రైతులు ఉన్నారు. ఇప్పుడు మా పొలాల ధరలు పడిపోయాయి. నాకున్న అర ఎకరం పొలంపై నలుగురం బతకాలి. నాకొచ్చే ఆదాయం మా అబ్బాయి చదువుకే సరిపోదు. మేం భూములు ఇవ్వడం లేదని అధికారులు బెదిరిస్తున్నారు. మీ చేలో రోడ్డు పడుతోందని భయపెడుతున్నారు. వేస్ట్ వాటర్ మీ పొలాల్లోకి వస్తుందని భయపెడుతున్నారు. దీనిపై కోర్టుకు ఎక్కాం. జడ్జిమెంట్ వచ్చింది. మూడు పంటలు పండే భూములను తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. అందువల్లే మా పొలాలు సాగు చేసుకుంటున్నాం. రుణ మాఫీ చేస్తామన్నారు. ఇక్కడ చాలా మంది రైతులకు రుణ మాఫీ అందలేదు.

మా పొలాల్ని నాశనం చేయొద్దు
* రామ్మోహనరెడ్డి, రైతు, ఉండవల్లి

ఇది మా నాన్న సంపాదించిన పొలం. 60 సంవత్సరాల కిందట ఎకరా ఆరు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. నాకు ఇద్దరు పిల్లలు. వారిని 20 లక్షలు పెట్టుబడి పెట్టి చదివించుకున్నాను. మాకు చెప్పకుండా పొలాల్లో కర్రలు పాతుతున్నారు. ఏది ఏమైనా భూములు ఇవ్వం.

-ఎదురుతిరుగుతాం!

* శివరామిరెడ్డి, రైతు, పెనుమాక

చంద్రబాబు 50 వేలు ఇస్తే ఎక్కడ సరిపోతుంది. ఐదు సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్నాను. నా యజమాని కూడా భూమి ఇవ్వనంటున్నాడు. కౌలు లక్ష రూపాయలు మిగులుతుంది. నా బిడ్డలను ఎలా చదివించుకుంటాను? పొలం ఇస్తే, ఏదో డాబా ముందు వాచ్‌మేన్‌గా పనిచేసుకోవలసిందే.

- వాచ్‌మేన్‌గా పని చేసుకోవాలా?

* సుబ్బారెడ్డి, కౌలురైతు, పెనుమాక

సిఆర్‌డిఏ కమిషనర్ వివరణ

ఉండవల్లి, పెనుమాక రైతుల అభ్యంతరాలపై ఎపిసిఆర్‌డిఏ కమిషనర్ శ్రీకాంత్ వివరణ ఇస్తూ, రాజధాని పరిధిలో బృహత్ ప్రణాళిక ప్రకారం రోడ్లను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. భూ సేకరణ చట్టం కింద భూములు సేకరించి రోడ్ల నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందని అన్నారు. రోడ్ల అవసరాలకు భూ సమీకరణ కింద వచ్చే భూములు కూడా వినియోగించుకోవచ్చని ఆయన తెలియచేశారు. ఏపిసిఆర్‌డిఏ చట్టంలోని సెక్షన్ 126 ప్రకారం అభివృద్ధి ప్రణాళికకు అవసరం ఉన్న, రిజర్వ్ చేయాల్సి ఉన్న, లేక నిర్దేశించిన ఏ భూములైనా ప్రజోపయోగం కిందకు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఆ భూములను భూ సేకరణ చట్టం 2013 కింద సేకరించవచ్చన్నారు. రాజధాని నగర భూ సమీకరణ పథకం నియమాలు-2015లోని తొమ్మిదో నియమం ప్రకారం భూ సేకరణ చట్టం కింద భూ సేకరణకు కావల్సిన భూములను కూడా భూ సమీకరణ అభివృద్ధి పథకంలో చేర్చుకోవచ్చని చెప్పారు. అందువలన రోడ్ల నిర్మాణ సర్వే పూర్తిగా మాస్టర్ ప్లాన్‌కు లోబడి చట్టపరిధిలో జరుగుతోందని శ్రీకాంత్ చెప్పారు.

చిత్రం.. పెనుమాక ప్రాంతంలో కళకళలాడుతున్న అరటి తోట