ఆంధ్రప్రదేశ్‌

లోకేష్‌కు జైకొడుతున్న పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 6: ప్రస్తుతం రాజకీయం అంతా యువరాజు లోకేష్ చుట్టూ తిరుగుతోంది. యువరాజ పట్ట్భాషేక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించకపోయినా, ఆయన పట్ట్భాషేకం కోసం పార్టీ అంతా వేచి చూస్తోంది. ఆయనను ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో గెలిపించేందుకు చాలా మంది తమతమ నియోజకవర్గాలను వదులుకోడానికి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధపడుతున్నారు. పార్టీలో ఎవరి నోట విన్నా, లోకేష్ మాటే వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తణ ఉగాది తరువాత ఉంటుందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే ఇది జూన్, జూలై వరకూ వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదని పార్టీ నేతలు అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉన్నా, లోకేష్‌ను బాబు తన క్యాబినెట్‌లోకి తీసుకోవడం ఖాయమన్నది స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతం పార్టీ బాధ్యతలు చూస్తున్న లోకేష్‌ను, మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనపై మరింత బాధ్యతలు మోపడం మంచిదా? కాదా? అని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన కుమారుడు కెటిఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన మంత్రిగా రాణిస్తున్నారు. అదే పంథాలో లోకేష్‌ను కూడా తీర్చిదిద్దాలని బాబు ఉవ్విళ్లూరుతున్నారు.
ఎమ్మెల్యేనా.. ఎమ్మెల్సీనా..
ఇక లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆరు నెలల తరువాత ఆయన ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో ఎన్నిక కావల్సి ఉంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన ఒక నియోజకవర్గా న్ని ఎంచుకోవలసి ఉంటుంది. కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం ఆయనకు బాగుటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇప్పుడు తాను ఎంపిక చేసుకున్న నియోజకవర్గం పునర్విభజన తరువాత ఏమవుతుందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం సరికాదని లోకేష్ సన్నిహిత వర్గాలు చెబుతున్నట్టు భోగట్టా. అందుకే ఈసారికి ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి పగ్గాలను చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కాగా, లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఐటి శాఖ అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణలో కెసిఆర్ కుమారుడు కెటిఆర్ కూడా ప్రస్తుతం అదే శాఖను చూస్తున్నారు. అందుకే లోకేష్‌కు కూడా ఆ శాఖ అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
యువతకు అవకాశం ఇవ్వాలి: జెసి
లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టం. దానిపై ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారు. సిఎం కుమారుడు అయినందువలన ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకూడదన్న నిబంధన ఎక్కడా లేదు! కెసిఆర్, తన కుమారుడు కెటిఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోలేదా? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాలేదా? అని ఎంపి జెసి దివాకరరరెడ్డి ప్రశ్నించారు.

తెలుగు విద్యార్థులకు
రక్షణ కల్పించండి: కంభంపాటి
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని ఎన్‌ఐటిలో తెలుగు విద్యార్థులకు భద్రత కల్పించాలని ఢిల్లీలో ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావువిజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కంభంపాటి లేఖరాశారు. శ్రీనగర్ ఎన్‌ఐటిలో చోటుచేసుకుంటున్న సంఘటనలు తమను ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఎన్‌ఐటిలో స్థానికేతరులపై జరుగుతున్న దాడులతో రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. శ్రీనగర్ ఎన్‌ఐటిలో దాదాపువంద మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. ఎన్‌ఐటిలో జరిగిన పోలీసుల లాఠీచార్జీలో తెలుగు విద్యార్థులు గాయపడినట్టు తెలిసిందని రాజ్‌నాథ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీనగర్ ఎన్‌ఐటిలోని తెలుగు విద్యార్థులను ఇతర రాష్ట్రాలలోని ఎన్‌ఐటికి బదిలీ చేయాలని కంభంపాటి డిమాండ్ చేశారు.
సింగపూర్ వెళుతున్న ఇద్దరు మంత్రులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6 : అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు అంశంపై సింగపూర్ ప్రభుత్వంతో, సంబంధిత ఇతర సంస్థలతో చర్చలు జరిపేందుకు సింగపూర్ వెళ్లేందుకు ఇద్దరు మంత్రులతో పాటు, ఉన్నతాధికార బృందానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్) శశి భూషణ్ కుమార్ పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పి. నారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు (ఇ-గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటి) జె. సత్యనారాయణ ఉన్నతాధికార బృందంలో ఉన్నారు. ఈ బృందం ఈ నెల 11 న సింగపూర్ చేరుకుని 13 వరకు అక్కడే ఉంటారు.
మున్సిపాలిటీలకు ఎన్నికలెప్పుడు?
ఎపి ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ, కర్నూలు నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయమై కోర్టుకు వివరణ ఇచ్చేందుకు పలు పర్యాయాలు వాయిదాల కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయమై ఒక రోజు లోగా ఏపి ప్రభుత్వం తన వైఖరి తెలియచేయాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ రెండు నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియచేసేందుకు కొంత గడువు కావాలని కోరారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా అడిగారని, ఇంకా ఎన్ని సార్లు వాయిదాలు అడుగుతారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు సహనాన్ని పరీక్షించకండి, ఎన్నికలు నిర్వహించలేమంటే, మేమే తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది కోర్టుకు హాజరై తాము ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రభుత్వం తన వైఖరి తెలియచేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు సమావేశమైనప్పుడు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ తరహా ధోరణి మంచిది కాదని, ప్రభుత్వం గురువారం హైకోర్టుకు తన నిర్ణయాన్ని తెలియచేయాలని, లేదంటే న్యాయస్థానం తగిన ఉత్తర్వులు జారీ చేస్తుందని ధర్మాసనం ప్రకటించింది.
భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు
* 15న నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 6: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్‌లు కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఆ ప్లాట్‌లు ఎలా ఉంటాయి? ఎక్కడి నుంచి మొదలవుతాయి? విధి విధానాలేంటి? అన్న అంశంపై రైతులతో క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఏ) బుధవారం అవగాహనా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, గుంటూరు జెడ్‌పి చైర్మన్ పూర్ణచంద్రరావు, రాజధాని ప్రాంత ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, సిఆర్‌డిఏ అదనపు కమిషనర్ సిహెచ్ శ్రీ్థర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ్థర్ మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్లాట్ల కేటాయింపు మైలురాయి వంటిదని అన్నారు. రైతులందరికీ సమానంగా ప్లాట్లు ఉండాలని ఆలోచించి డ్రాఫ్ట్ పాలసీ రూపొందించామని ఆయన తెలియచేశారు. రాజధానిలో రైతులకు కేటయించే ప్లాట్లకు కనీసం 50 అడుగుల రోడ్డు ఉంటుందని, ఆయా ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని 60, 80 అడుగుల రోడ్లు వేయాలని ప్రతిపాదించినట్టు ఆయన తెలియచేశారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో మిగిలిన ముక్కలన్ని కలిపి ఏక మొత్తంలో ప్లాట్లను సిఆర్‌డిఎ ఆయా రైతుల అంగీకారంతో వేలం వేస్తామని ఆయన తెలియచేశారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరిగి రైతులకే పంచేస్తామని శ్రీ్థర్ వివరించారు. రాజధాని గ్రామాల పరిధిలో ప్రతి కిలోమీటరుకు 165 అడుగుల రోడ్డు అందుబాటులో ఉంటుందని చెప్పారు. కుటుంబ సభ్యులు, మిత్రులు అంతా కలిసి ఒకే చోట ఉండాలనుకునేవారు 9.18 ఫారం ద్వారా అప్పీలు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. త్వరలోనే సిఆర్‌డిఏ అధికారులు రాజధానిలోని 29 గ్రామాల్లో పర్యటించి ప్లాట్ల డిజైన్లను రైతులకు చూపించి, వారి అభిప్రాయాన్ని తీసుకుంటామని శ్రీ్థర్ వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సర్వీస్ ఇనాం అసైన్డ్ భూముల విషయం త్వరగా తేల్చాలని కోరారు. రైతులు ఆప్షన్ తీసుకున్న తరువాతే ప్లాట్లును ఫైనల్ చేయాలని అన్నారు. 9.18 అప్పీలు గురించి ప్రచారం చేయాలని సూచించారు. హైటెన్షన్ టవర్లు, గుంతలు, ఇతర అవాంతరాలపై రైతులు సందేహాలు వ్యక్తం చేయగా వాటిని తొలగిస్తామని అధికారులు సమాధానం చెప్పారు.

అనంతపురంలో తాత్కాలిక పోలీస్ అకాడమి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6 : ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీని అనంతపురంలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అనంతపురంలో ఉన్న పోలీస్ ట్రైనింగ్ కాలేజీ భవనాలను ఇందుకోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. పోలీస్ అకాడమీకి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న పోలీస్ అధికారులంతా అనంతపురం రావలసి ఉంటుంది. అమరావతి పరిధిలో లేక ఇతర ప్రాంతంలో కొత్తగా ఎపి పోలీస్ అకాడమీ భవనాలను నిర్మించే వరకు అనంతపురంలోనే అకాడమీ కొనసాగుతుంది.

మధుమేహ నియంత్రణకు
పరిశోధనా ఒప్పందం
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కేంద్ర బయోటెక్నాలజి శాఖకు చెందిన డ్రగ్ డిస్కవరి రీసెర్చి సెంటర్ (డీడీఆర్‌సి), హైదరాబాద్‌కు చెందిన రెవలేషన్స్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మధ్య బుధవారం కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి సుజనా చౌదరి సమక్షంలో పరిశోధనా ఒప్పందం కుదిరింది. మధుమేహ రోగ నియంత్రణకు మందు కనిపెట్టడం, మధుమేహాన్ని ముందే గుర్తించి నియంత్రించడం ఈ పరిశోధన ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ భారతీయుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించారని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక శాఖ ద్యారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చే పరిశోధనలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

రైతాంగ దిక్సూచికి శ్రీకారం

కొత్త హైడ్రాలజీ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6:కరవుకాటకాలకు సంబంధించి ముందస్తుగానే రైతుల్ని హెచ్చరించడంతో పాటు ఏఏ పంటలు వేయాలన్నదానిపైనా సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు చేసే వ్యవస్థ దేశ రైతాంగానికి అనేక రీతుల్లో తోడ్పడుతుందని, వాతావరణ వివరాల ఆధారంగా చాలా ముందుగానే వరదలకు సంబంధించిన హెచ్చరికలనూ జారీ చేస్తుందని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాలజీ ప్రాజెక్టుతో పాటు పలు ఇతర నిర్ణయాలనూ ఆమోదించారు. దాదాపు 3,679 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని సంకల్పించారు. జల వనరులను పూర్తి స్థాయిలో నిర్వహణతో పాటు సమాన ప్రాతిపదికన నీటిని అందుబాటులోకి తెచ్చేందుకూ ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. గతంలో చేపట్టిన జల ప్రాజెక్టులు కేవలం 13 రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకునే రూపొందించారు. ఈ తాజా ప్రాజెక్టును దేశ వ్యాప్తంగా రైతుల అవసరాలను అన్ని కోణాల్లోనూ తీర్చే విధంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా భూగర్భ జలాల లభ్యత గురించి కూడా రైతులకు తగిన సమాచారం ఇచ్చేందుకు, తదనుగుణంగా వారు ఏఏ పంటలు వేయాలో నిర్ణయించుకునేందుకు ఈ తాజా ప్రాజెక్టు ఉపకరిస్తుంది.

ఎపి సరిహద్దులో
హైవేల సుందరీకరణ

18 కోట్లతో ప్రతిపాదన తొలివిడతలో 10 కోట్ల మంజూరు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుల్లో జాతీయ రహదారులను సుందరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొదటి విడత 10 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పురపాలక వ్యవహారాల ముఖ్యకార్యదర్శి ఆర్. కరికాల్ వలవన్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 18.64 కోట్ల రూపాయలు అవసరమవుతాయని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. అడవులు, ఉద్యాన, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కూడిన నిపుణుల కమిటీ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వచ్చే కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టే బృహత్ ప్రణాళికలో జాతీయ రహదారుల సుందరీకరణ ఒకటి.
మొదటి విడతలో మూడు చోట్ల సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఎపి- తెలంగాణ సరిహద్దులోని జగ్గయ్యపేట సమీపంలో 10 కిలోమీటర్ల ప్రధాన జాతీయ రహదారితో పాటు సర్వీస్ రోడ్డులో ల్యాండ్ స్కేపింగ్ కోసం 6.08 కోట్ల రూపాయలు అవసరమని నిపుణుల నివేదికలో ప్రతిపాదించారు. అలాగే ఎపి-తెలంగాణ సరిహద్దులోని కర్నూలు పట్టణం సమీపంలో కూడా 6.84 కోట్ల రూపాయల అంచనావ్యయంతో సుందరీకరణ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. అటు ఎపి-తమిళనాడు సరిహద్దులో నెల్లూరు జిల్లా తడ సమీపంలో 5.70 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం 18.64 కోట్ల రూపాయల అంచనా వ్యయంలో, ప్రభుత్వం తొలివిడతగా 10 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులు ఖర్చు కాగానే మలి దశలో నిధులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎపి అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ ఈ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

గోపోషణ బాధ్యత తితిదే, ప్రభుత్వం, దేవాలయాలదే

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 6: గోపోషణ భారాన్ని ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాలయాలు తీసుకోవాలని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ఉత్తరాంధ్రలో యధేచ్ఛగా జరుగుతున్న గోవధపై పత్రికల్లో వచ్చిన కథనాలపై స్వామీజీ తీవ్రంగా స్పందించారు. ధర్మ ప్రచార పరిషత్ పేరిట కోట్లాది రూపాయల ధనాన్ని వృథా చేస్తున్న మన ధార్మిక సంస్థలు హిందువులు దైవంగా భావించే గోవులను సంరక్షించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని స్వామీజీ ప్రశ్నించారు. హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని దేవాలయాల్లో గోకులాలు ఉండేవని, కారణాల రీత్యా నేడు అవి మూతబడ్డాయన్నారు. గోవులను సంరక్షించలేక దేవస్థానాలు సైతం వాటిని వదిలించుకునేందుకు వెనుకాడడం లేదన్నారు. పాలకులు సైతం గోసంరక్షణ పట్ల నిర్లక్ష్య ధోరణితోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవును జాతీయ జంతువుగా గుర్తించాలన్న ఆకాంక్షకు అనుగుణంగా పాలకుల తీరు లేదన్నారు. గోసంరక్షణకు పటిష్ఠమైన చట్టాలున్నప్పటికీ వాటి అమలు మాత్రం ఘోరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం వంటి సంస్థలు గోసంరక్షణకు నడుంబిగించాలన్నారు. గోవధకు పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కరవు, ఇతర కారణాల రీత్యా రైతులు ఆవులను అమ్ముకుంటున్నారన్నారు. గ్రా మాల్లోని రైతుల నుంచి గోవుల వివరాలను సేకరించి, వాటి పోషణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. రైతుల దుస్థితి రీత్యా గోవులను సంరక్షించలేక వదిలేస్తున్నారని, అటువంటి గోవులను శారదాపీఠం తరపున తాము సేకరిస్తున్నామన్నారు. సేకరించిన గోవులను గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు పంపిణీ చేస్తున్నామన్నారు. గిరిజనులు గోవును పవిత్రంగా పూజిస్తారని, గోవును పోషించలేని పరిస్థితుల్లో అడవిలో విడిచిపెడతారన్నారు. దీనివల్ల గోవులు పూర్తి జీవితకాలం స్వేచ్ఛగా బతుకుతాయన్నారు.

సిఎస్‌ఐఆర్ నెట్
జాతీయ టాపర్ ప్రసూన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: అఖిల భారత స్థాయిలో నిర్వహించే సిఎస్‌ఐఆర్ నెట్ పరీక్షలో జాతీయ టాపర్‌గా తెలుగమ్మాయి బి.ప్రసూన అగ్రస్థానాన నిలిచారు. 200 మా ర్కులకు గానూ 158 మార్కులు సా ధించిన ప్రసూన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మాథమెటిక్స్‌లో పిజి చేస్తున్నారు. తాజాగా నెట్ ర్యాంకు రావడంతో తాను టా టా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి సంస్థలో పిహెచ్‌డిలో చేరనున్నట్టు ప్రసూన తెలిపారు. విపరీతంగా పుస్తకాలు చదవడం, ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం తనకు ఇష్టమని పేర్కొన్నారు.
రేపు అడ్మిషన్ల నోటిఫికేషన్
హైదరాబాద్, ఏప్రిల్ 6: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను శుక్రవారం నాడు విడుదల చేయనున్నారు. ఈ మేరకు వర్శిటీలో జరిగిన అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులకు ఈ నెల 11 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దరఖాస్తునకు చివరి తేదీ మే 10గా నిర్ణయించారు. ఒబిసిలకు ప్రస్తుతం ఉన్న ఫీజును తగ్గించాలని తద్వారా ఎక్కువ సంఖ్యలో ఒబిసిలు చేరేలా చూడాలని కూడా నిర్ణయించారు. కాగా యూనివర్శిటీలో అంబుడ్స్‌మన్, సమాన అవకాశాల కేంద్రం, కుల వివక్ష రహిత పర్యవేక్షణ అధికారి నియామకాలకు సంబంధించి కూడా అకడమిక్ కౌన్సిల్ సుదీర్ఘంగా చర్చించింది. తొలుత అకడమిక్ కౌన్సిల్ సభ్యులు ఇటీవల మరణించిన ప్రొఫెసర్ ఎ వి రాజా, స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య పట్ల రెండు నిమిషాలు వౌనం పాటించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి 170 మంది సభ్యుల్లో 106 మంది హాజరయ్యారని విసి ప్రొఫెసర్ అప్పారావు వివరించారు.