తెలంగాణ

‘డబుల్ బెడ్రూమ్’లో దళారుల చేతివాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: నిరుపేదల ఇంటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డబుల్ బెడ్‌రూం’ ఇళ్ల పథకంలో ఆదిలోనే దళారులు పుట్టుకొస్తున్నారు. ఇల్లు మంజూరైందని, పదివేలు చెల్లించాలంటూ లబ్దిదారులనుంచి వసూలు చేసేందుకు అప్పుడే దళారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎంతో కొంత చెల్లించి ఇల్లును సొంతం చేసుకుందామనే నిరుపేదల ఆశలను సొమ్ము చేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ బాగోతం మల్కాజిగిరిలో వెలుగుచూడటంతో అక్రమార్కుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మల్కాజిగిరి ప్రాంతంలోని ఓ ‘మీ సేవ’ కేంద్రం నుంచి దాఖలు చేసుకున్న 42మంది దరఖాస్తుదారులకు ఇళ్లు మంజూరయ్యాయంటూ వారి జాబితాతో కూడిన ఈ-మెయిల్ ఒకటి ‘మీ సేవ’ నిర్వాహకుడికి అందింది. అంతేకాదు, ఒక్కొక్కరినుంచి పదివేల రూపాయలు వసూలు చేయాలని కూడా ఆ మెయిల్‌లో ఉంది. ఈ సమాచారంతో సదరు నిర్వాహకుడు మరుసటి రోజు జిల్లా కలెక్టరేట్‌ను సంప్రదించడంతో ‘దళారీ’ గుట్టు రట్టయింది. ఈ-మెయిల్‌లో సమాచారం నిజం కాదని తెలుసుకున్న జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మల్కాజిగిరి ‘మీ సేవ’ కేంద్రానికి ఈ-మెయిల్ పంపిన నకిలీ అధికారిని పట్టుకునేందుకు అధికారులు ముమ్మర వేట మొదలుపెట్టారు.
గతంలో వైఎస్‌ఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ గృహకల్ప, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎన్ పథకాల్లోనూ దళారుల హవా నడిచిన విషయం విదితమే. సంక్షేమ సంఘాలు, రాజకీయ పార్టీల సిఫార్సులతో భారీ సంఖ్యలో జాబితాలను రూపొందించి పేరు ఒకరిది, ఫొటో ఒకరిది చందంగా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. లబ్దిదారుల ఇళ్లల్లోనే ‘ఐరిష్’ పద్ధతిలో దరఖాస్తుదారుల వివరాలను నమోదుచేసినప్పటికి నకిలీ పేర్లు బయటపడిన విషయం తెలిసిందే. అదే సమయంలో హయత్‌నగర్, సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ మండలాల్లో బినామీ పేర్లతో ముంబయి, చెన్నై, కర్ణాటక తదితర ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్న వలస కూలీలకు ఎరవేసి భారీ సంఖ్యలో వసూలు చేపట్టిన వైనాన్ని జిల్లా యంత్రాంగం అప్పట్లోనే పసిగట్టింది. కలెక్టర్ ప్రేమ్‌చంద్రారెడ్డి, జాయింట్ కలెక్టర్ రిజ్వీ హయాంలో భారీ సంఖ్యలో దాడులను నిర్వహించి వందలకొద్ది ఐరిష్ కార్డులను స్వాధీనం చేసుకుని పలువురు దళారులపై క్రిమినల్ కేసులను నమోదుచేసిన విషయం తెలిసిందే. తాజాగా కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పథకంలోనూ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారి సహకారంతో దళారుల దందా మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది. గతంలో దళారులుగా వ్యవహరించిన ‘నాయకుల’కు ప్రస్తుత ప్రభుత్వంలోని కొందరు అధికారులు, నాయకులు సిఫార్సులు చేస్తున్నట్లు సమాచారం. దాని ఆధారంగానే రంగారెడ్డి జిల్లా హౌసింగ్ కార్యాలయంలో సదరు దళారీ నాయకులకు రాచమర్యాదలతో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎన్ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేయించేందుకు సిఫార్సులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సంబంధిత అధికారిని ప్రశ్నించగా దళారులకు అవకాశం లేదని జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎన్ పథకం ద్వారా 11వేల మంది దరఖాస్తుదారులకు ఇళ్లు మంజూరు చేస్తూ లేఖలు పంపించామని, క్షేత్రస్థాయి (జిహెచ్‌ఎంసి పరిధి)లో విచారణ కొనసాగించినప్పుడు ఎలాంటి పొరపాట్లు జరిగినా ప్రస్తుతం సంబంధిత లబ్దిదారుడికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, పాత రేషన్ కార్డుతోపాటు ఆహార భద్రత కార్డుల ప్రతిని జత చేయాలన్న నిబంధనను విధించినట్లు ఆయన స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరీ విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి విధివిధానాలు అందలేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లాలో జిహెచ్‌ఎంసి పరిధిలోని పది మండలాల నుండి 2,26,260 దరఖాస్తులు స్వీకరించగా గ్రామీణ ప్రాంతాల్లోని 27 మండలాల్లో 24,340 డబుల్ బెడ్‌రూం దరఖాస్తులను ‘మీ సేవ’ ద్వారా జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అంతకుముందే లక్షా పదకొండువేల దరఖాస్తులను జిల్లా యంత్రాంగం స్వీకరించింది.