ఆంధ్రప్రదేశ్‌

నిలిచిపోయన మీ-సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 8: రెండు సంస్థల మధ్య కాంట్రాక్టు రెన్యూవల్, డిపాజిట్ల వివాదం జఠిలం కావడంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలోని పట్టణాల్లో మీ-సేవ కేంద్రాలు మూతబడ్డాయి. ఫలితంగా పౌరసేవల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ఆలోచనలో భాగంగా మీ-సేవ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేశారు. అయితే తాజా పరిణామాల నేపధ్యంలో పట్టణ ప్రాంతాల్లోని మీ-సేవ కేంద్రాలు వారం రోజులుగా తెరచుకోలేదు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకూ పట్టణ ప్రాంతాల్లో మీ సేవలు నిలిచిపోయాయి. ఈ ఆరు జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో డేటా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ (డిఎంసి) ద్వారా మీ-సేవ కేంద్రాల్లో వినియోగదారులకు పలు సేవలందిస్తున్నారు. కాంట్రాక్టు ముగియడంతో ఆరు జిల్లాల పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో డిఎంసి అజుమాయిషీ కింద పనిచేసే మీ సేవ కేంద్రాల్లో సేవలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఎపి ఆన్‌లైన్, సిఎంఎస్, డిఎంసి సంస్థలు మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి పొందాయి. ఎపి ఆన్‌లైన్, సిఎంఎస్ సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చినప్పుడు ఎపి ఆన్‌లైన్, సిఎంఎస్ సంస్థలు పట్టణాల్లో కూడా కేంద్రాలను ఏర్పాటు చేయగా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం డిఎంసి మాత్రమే కేంద్రాల ఏర్పాటుకు అనుమతి దక్కించుకుంది. మూడేళ్ల కిందటి పట్టణ ప్రాంతాల్లో కేంద్రాల నిర్వహణ హక్కులు పొందిన డిఎంసి ప్రైవేటు వ్యక్తులకు వాటిని కేటాయించింది. కేంద్రం నిర్వహణ నిమిత్తం ప్రైవేటు వ్యక్తులకు అనుమతులు మంజూరు చేసే సందర్భంలో డిఎంసి రూ.75 వేల డిపాజిట్ తీసుకుంది. గడువు ముగియడంతో ఈ యేడాది ఫిబ్రవరి నుంచి రంగం నుంచి తప్పుకుంది.

బాబుపై దాడి కేసులో మరొకరికి విముక్తి

తిరుపతి, మార్చి 8: తిరుమలకు వెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్ 1 జరిపిన క్లెమోర్ మైన్ దాడిలో 25వ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్న మాజీ మావోయిస్టు దామోదరం అలియాస్ సాకే క్రిష్ణ నిర్దోషని తిరుపతి అదనపు న్యాయస్థానం సీనియర్ జడ్జి సదానంద మూర్తి మంగళవారం తీర్చు ఇచ్చారు. 2014లో తిరుమల 2 టౌన్ పోలీసులు దామోదరంను బెంగళూరులో అరెస్టు చేశారు. దామోదరం నిందితుడని ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఆయన నిర్దోషని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 52మంది సాక్షులను ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిగా అందులో 14వ సాక్షిగావున్న ముఖ్యమంత్రి, 13వ సాక్షిగా ఉన్న మంత్రి గోపాలకృష్ణారెడ్డి విచారణకు హాజరుకమ్మని సమన్లు పంపినా ప్రయోజనం లేకపోవడంతో వారిని సాక్షుల జాబితా నుంచి తొలగించిన విషయం పాఠకులకు విదితమే.

తెలంగాణకు అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండిల తరలింపు

ఏలూరు, మార్చి 8 : డిపాజిటర్లను మోసం చేశారన్న అభియోగాలను ఎదుర్కొంటున్న అగ్రిగోల్డ్ సంస్థ ఛైర్మన్ అవ్వా వెంకటరామారావు, ఎండి అవ్వా వెంకట నారాయణరావును తెలంగాణ సిఐడి పోలీసులు మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో నమోదైన కేసునకు సంబంధించి అక్కడి కోర్టు మంగళ, బుధ, గురు వారాల వరకు వీరిద్దరినీ సిఐడి కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ నేపధ్యంలో తెలంగాణ సిఐడి పోలీసులు ఏలూరు చేరుకుని ఇక్కడి జిల్లా జైలులోవున్న ఛైర్మన్, ఎండిలను కస్టడీలోకి తీసుకుని తరలించారు.

గుంటూరు జిల్లాలో బాలికపై అత్యాచారం

ఈపూరు, మార్చి 8: అనారోగ్యంతోవున్న అభంశుభం తెలియని బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా మహిళా దినోత్సవం నాడు వెలుగుచూసింది. బాధితురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ల ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు ముట్లూరి బంగారయ్య అదే కాలనీలో నివాసం ఉంటున్న ఆరో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు కామెర్ల వ్యాధి సోకడంతో పాఠశాలకు వెళ్ళకుండా ఇంటివద్ద ఉంటోంది. శుక్రవారం టీవీ చూసేందుకు బంగారయ్య ఇంటికి వెళ్ళింది. కాలనీలోని అందరూ మిరప కోతలకు వెళ్ళడంతో జనసంచారంలేని సమయంలో బాలికను ఇంట్లోనేవుంచి గదికి తాళం వేసి బంగారయ్య అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక అరుపులు బయటకు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించడంతో ఇంట్లో చెప్పకుండా ఊరుకుంది. ఆదివారం కడుపులో నొప్పిగా ఉందనడంతో బాలిక తల్లిదండ్రులు వినుకొండ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. తల్లి, బంధువులు అడుగగా, జరిగిన విషయాన్ని రోదిస్తూ చెప్పింది. దీంతో బాలికను ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్ళారు. మంగళవారం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఈపూరు ఎస్‌ఐ ఉజ్జ్వల్ కుమార్ తెలిపారు.

రైళ్ల రాకపోకలకు అంతరాయం

విజయవాడ, మార్చి 8: విజయవాడ రైల్వే డివిజన్‌లో విజయవాడ-గూడూరు సెక్షన్‌లో అమ్మనబ్రోలు-ఉప్పుగుండూరు రైల్వేస్టేషన్ల మధ్య ముందే సిద్ధం చేసిన ఆర్‌సిసి బాక్స్ బ్రిడ్జిలను అమర్చాల్సి వున్నందున ఈ నెల 16, 17 తేదీల్లో లైన్ బ్లాక్ జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివలన కొన్ని రైళ్లను పూర్తిగా మరికొన్నిటిని పాక్షికంగా రద్దు చేశామని వివరించారు. 16న గూడూరు-విజయవాడ, విజయవాడ-బిట్రగుంట, తెనాలి-ఒంగోలు, తెనాలి-ఒంగోలు ప్యాసింజర్ రైళ్లు పూర్తిగాను, ఒంగోలు-విజయవాడ ప్యాసింజర్ ఒంగోలు-తెనాలి మధ్య, విజయవాడ-ఒంగోలు-తెనాలి ప్యాసింజర్ చీరాల-ఒంగోలు మధ్య పాక్షికంగా రద్దవుతాయి. అలాగే 17న గూడూరు-విజయవాడ, విజయవాడ-బిట్రగుంట, తెనాలి-ఒంగోలు, విజయవాడ-ఒంగోలు, ఒంగోలు-గూడూరు, గూడూరు-ఒంగోలు, ఒంగోలు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దవుతాయి. ఒంగోలు-విజయవాడ ప్యాసింజర్ ఒంగోలు-తెనాలి మధ్య, విజయవాడ-ఒంగోలు-తెనాలి ప్యాసింజర్ చీరాల-ఒంగోలు మధ్య పాక్షికంగా రద్దవుతుంది. ఈ మార్గం గుండా దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ ఒకే ట్రాక్ మీద నడుస్తాయని వివరించారు.

19న గిరిజన మహిళా సర్పంచ్‌ల జాతీయ సదస్సు

విజయవాడ, మార్చి 8: దేశంలోని 18 రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మహిళా సర్పంచ్‌లతో ఈ నెల 19న విజయవాడలో నగర సదస్సు నిర్వహిస్తున్నట్లు భారత ప్రభుత్వం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఎకె గోయల్ వెల్లడించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో 19న నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ దేశంలోని 5వ షెడ్యూల్ పరిధిలోని ఆర్టికల్ 244/1 లోబడి ఉన్న గిరిజన ప్రాంతాల మహిళా సర్పంచ్‌లతో ఆంధ్రప్రదేశ్‌లోని రాజధాని ప్రాంతంలో సమావేశం నిర్వహించాలని భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ విభాగం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమావేశం నిర్ణయించే ప్రాంతాలను, వివిధ రాష్ట్రాల నుండి హాజరయ్యే మహిళా సర్పంచ్‌ల విడిది తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వచ్చినట్లు గోయల్ అన్నారు. 5వ షెడ్యూల్ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలకు చెందిన మహిళా సర్పంచ్‌లు వారి వారి ప్రాంతాల్లో చేపడుతున్న పనుల పురోగతి, వివిధ కార్యక్రమాల అమలులో వారి భాగస్వామ్యం, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలకు వేదికగా నిలుస్తుందన్నారు. తదనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఫలితాలు, సూచనలు, సలహాలపై సమగ్రంగా చర్చించే వేదికగా జాతీయ స్థాయి గిరిజన మహిళా గ్రామ సర్పంచ్‌ల సదస్సు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ రాష్ట్రంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి వచ్చే గిరిజన మహిళా సర్పంచ్‌ల జాతీయ స్థాయి సమావేశం నిర్వహణకు ఎ1 కనె్వన్షన్ సెంటర్ పరిశీలించామన్నారు.

పెట్టుబడుల వెల్లువ!
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 8: తూర్పు గోదావరి జిల్లా తీరం వెంబడి వివిధ పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతోంది. పలు బహుళ జాతి సంస్థలు జిల్లాలోని తీరం వెంబడి పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్నాయి. సుమారు రూ.40వేల కోట్లు వెచ్చించనున్నట్టు ఆయా సంస్థలు ప్రకటించాయి. కాకినాడ కేంద్రంగా పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాలను సిద్ధం చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాల అనంతరం ఈ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం కానున్నది. విశాఖలో ఇటీవల నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో 4 లక్షల 50వేల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అవగాహన ఒప్పందాలు కుదరగా దానిలో 40వేల కోట్ల రూపాయల విలువైనవి జిల్లా ఆకర్షించగలిగింది. పరిశ్రమల స్థాపనకు అవగాహన ఒప్పందాలు కుదిరినట్టు కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ చెప్పారు. తీర ప్రాంతం, పారిశ్రామికంగా అభివృద్ధి సాధించేందుకు అవసరమైన వనరులు, వౌళిక సదుపాయాలు ఇక్కడ ఉండటంతో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనలకు కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్టు ఆయన తెలిపారు.

ఇందుమతి
కుటుంబానికి ఆర్థికసాయం
ఏలూరు, మార్చి 8: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో శనివారం ప్రేమోనాది ఘాతుకానికి బలైన పైడాల ఇందుమతి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ రూ. 2.50 లక్షల రూపాయల చెక్కును ఇందుమతి తండ్రి సత్యనారాయణకు మంగళవారం అందజేశారు.

తక్కువ నీటితోనే రబీ

రాజమహేంద్రవరం, మార్చి 8: గోదావరిలో నీటి లభ్యత తక్కువ ఉండటంతో అసలు రబీ పంట చేతికొస్తుందా? అనే తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులు ఇప్పుడిప్పుడే తమ పంటకు ఢోకా లేదన్న ధీమాను వ్యక్తంచేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని శివారు ప్రాంతాల్లోని కొంత ఆయకట్టు రైతులు ఇప్పటికీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ అధిక శాతం ఆయకట్టు రైతులు కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు. నెలాఖరు నాటికి 80శాతం ఆయకట్టుకు డిమాండు తగ్గుతుందని, దాంతో మిగిలిన ఆయకట్టుకు నీటిని సర్దుబాటు చేయటం ద్వారా మొత్తం ఆయకట్టును రక్షించుకునేందుకు అవకాశం కలుగుతుందని ధవళేశ్వరం జలవనరుల సర్కిల్ ఎస్‌ఇ సుగుణాకరరావు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి చెప్పారు. గోదావరి డెల్టాలో రబీ సాగు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 60టిఎంసిల నీటిని వినియోగించారు. వంతుల వారీ విధానాన్ని సమర్ధవంతంగా అమలుచేయటం ద్వారా 10టిఎంసిల నీటిని పొదుపు చేశారు. సాగునీటిని పొదుపు చేసుకోవటం ద్వారా గోదావరి డెల్టాకు సాగునీటి కొరతను తమకు తాము రైతులు తీర్చుకోగలిగారు. గోదావరి డెల్టాలోని రబీ సాగుకు ఇంకా 12టిఎంసిల నీరు ఉంటే సరిపోతుందని, దీనిని ఏదో విధంగా సర్దుబాటు చేసుకోగలమన్న ధీమాను ఎస్‌ఇ వ్యక్తంచేశారు. పంట పొలాల నుండి డ్రెయిన్లలోకి వెళ్లిన నీటిని, డ్రెయిన్లకు అడ్డుకట్టలు వేయటం ద్వారా తిరిగి వెనక్కు పంపింగ్ చేసి 4టిఎంసిలను సమకూర్చుకున్నామన్నారు.

కైలాసనాథుని దర్శనం

విజయవాడ (ఇంద్రకీలాద్రి), మార్చి 8: హర హర శంభో మహాదేవ అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో కైలాసనాథుని కీర్తిస్తుండగా మంగళవారం మధ్యాహ్నం పాతబస్తీ కెనాల్ రోడ్‌లో శ్రీ స్వామి రథోత్సవ వైభవంగా జరిగింది. మహా శివరాత్రి సందర్భంగా సోమవారం వేకువజామున అభిషేకాలు, రాత్రి కల్యాణోత్సవం, మంగళవారం సాయంత్రం సర్వాభరణాలు ధరించి సతీ సమేతంగా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీ కన్యకపరమేశ్వరీ అన్న సత్రం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన స్వామి రథోత్సవం పాతబస్తీ కెనాల్ రోడ్ నుండి బయలుదేరి కెనాల్ రోడ్ వినాయకుడి గుడి వరకు సాగి తిరిగి వెళ్లిన మార్గంలోనే రథం సెంటర్‌కు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం (పాత శివాలయం) నుండి శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి, శ్రీ భద్రకాళీ వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లిఖార్జున స్వామి దేవస్థానం (బుద్దావారి గుడి) నుండి శ్రీ వసంతమల్లిఖార్జున స్వామి, మూడు ఆలయాల నుండి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి రథంలో ఉంచారు.

వైభవంగా రథోత్సవాలు

శ్రీశైలం, మార్చి 8: శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల రథోత్సవం అశేష భక్తజనసందోహం మధ్య వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో మేళతాళాలతో రథశాల వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ ఆలయ అధికారులు, పురోహితులు, పండితులు రథాంగపూజ, హోమం నిర్వహించి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై ఆశీనులను చేసి ప్రధాన వీధి గుండా వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమంలో శాస్త్రోక్తంగా రథాంగ హోమం, రథాంగ బలి ఇచ్చారు. మేళతాళాల నడుమ, మంగళవాయిద్యాలతో, డప్పులతో పలు విన్యాసాలతో స్వామి అమ్మవార్ల రథోత్సవం ఎంతో కన్నులపండువగా ముందుకు సాగింది.
శ్రీకాళహస్తిలో ..
శ్రీకాళహస్తి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన బ్రహ్మరాత్రి సందర్భంగా మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి క్షేత్రంలో రథోత్సవం జరిగింది. హాలాహలం సేవించిన శివుడు దేవతలు, రాక్షసుల జాగరణతో తిరిగి మేల్కొన్న తరువాత బ్రహ్మ తన రథంలో కైలాసవాసుడ్ని ఊరేగించడానే్న రథోత్సవంగా వ్యవహరిస్తారు. బ్రహ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం కాబట్టి బ్రహ్మరాత్రి అంటారు. భూమిని రథంగా, సూర్యచంద్రులు రథ చక్రాలుగా, 4 వేదాలు గుర్రాలుగా సాగేదే రథోత్సవమని స్థల పురాణంలో ఉంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన రథోత్సవంలో వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాత్రి పట్టణంలోని నారద పుష్కరిణిలో స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం వైభవంగా జరిగింది. విద్యుద్దీపాలతో, పూలతో అలంకరించిన తెప్పలపై ఆది దంపతులు తిరుగాడారు.