సంపాదకీయం

పాకిస్తాన్ కుమ్ములాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లో మరోసారి సైనిక నియంతృత్వం ఏర్పడినట్టయితే ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే పాకిస్తాన్ సైనికదళాలు తమ పౌర ప్రభుత్వంపట్ల గొప్ప ఆగ్రహంతో ఉన్నాయట! జమ్మూ కాశ్మీర్‌లోని ‘అధీనరేఖ’ - లైన్ ఆఫ్ కంట్రోల్ - ఎల్‌ఓసి -కు అటువైపున పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో జిహాదీ బీభత్సపు బట్టీలు నెలకొని ఉన్నాయి. ఈ ‘బట్టీ’లలో కొన్నింటిని మన సైనికదళాలు సెప్టెంబర్ 29వ తేదీన పగులకొట్టిన తరువాత పాకిస్తాన్ సైనిక దళాల అధిపతుల దురాగ్రహం మరింత పెరిగిందట! తమ దేశంలో నుండి జిహాదీ ఉగ్రవాదులు గతంలో వలె స్వేచ్ఛగా నిర్నిరోధంగా మనదేశంలోకి దూరడం ఇక సాధ్యంకాదని పాకిస్తాన్‌లోని పౌర ప్రభుత్వానికి, సైనిక ‘ప్రభుత్వాని’కి స్పష్టమైంది! అందువల్ల ఈ ‘వైఫల్యం’ పౌర ప్రభుత్వానిదేనని సైన్యం అంటోంది... అశక్త దుర్జన స్వభావం ఆవహించి ఉన్న పాకిస్తాన్ ‘ప్రభుత్వాలు’ కలహించుకుంటున్నాయి! మన దేశాన్ని బద్దలుకొట్టాలన్న విద్వేష విషం పాకిస్తాన్ స్వభావంలో దశాబ్దులుగా నిహితమై ఉంది. బద్దలుకొట్టడం సాధ్యం కాదని పాకిస్తాన్ పాలకులకు, ఈ పాలక ప్రేరిత జిహాదీ ఉగ్రవాద మృగాలకు 1948లోనే తెలుసు... మన జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడి విఫలమై తోకముడిచినప్పుడే తెలుసు! 1965లో దురాక్రమించడానికి యత్నించి మోకరిల్లవలసి వచ్చినప్పుడే తెలుసు. 1971లో తొంబయి వేలకు పైగా దురాక్రమించిన పాకిస్తానీ సైనికులు మనకు బందీలుగా చిక్కారు. మన ప్రభుత్వం ఈ బందీలను క్షమించి వదలిపెట్టినప్పుడు కూడా పాకిస్తాన్ పాలకులకు మరోసారి తెలిసి వచ్చింది... భారత్‌ను బద్దలుకొట్టడం అసంభవమని పాకిస్తాన్ పాలకులకు స్పష్టమైపోయింది! 1999లో మన కార్గిల్‌లోకి చొరబడి చావుతప్పి కన్నులొట్టపోయినప్పుడు సైతం పాకిస్తాన్ సైన్యానికి పౌర ప్రభుత్వానికి తమ ‘లక్ష్యం’ ఎప్పటికీ నెరవేరబోదని ధ్రువపడిపోయింది! బద్దలు కొట్టడం అసాధ్యమని తెలిసినా ‘దూరడం’ మానని తోడేలువలె పాకిస్తాన్ తన స్వభావాన్ని మాత్రం మార్చుకోవడం లేదు.
మన దేశాన్ని బద్దలు కొట్టడం సాధ్యం కానప్పటికీ కనీసం బలహీనపరచాలన్నది పాకిస్తాన్ ‘పాలకుల’ పట్టుదల... అందువల్లనే నిరంతరం జిహాదీ ఉగ్రవాదులను మన దేశంలోకి ఉసిగొల్పుతోంది! ఇప్పుడు ఇలా ఉసిగొల్పడం కూడా ఇక సాధ్యం కాదని పాకిస్తాన్ పాలకులకు తెలిసిపోయింది! అందువల్ల ప్రచ్ఛన్న జిహాదీ హంతకులైన పాకిస్తాన్ సైనిక అధికారులు ‘‘ఏమీ చేయలేని’’ స్థితికి గురై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అందువల్ల వైఫల్యాన్ని పౌర ప్రభుత్వంపై నెట్టి పౌర ప్రభుత్వాన్ని తొలగించి తాము ప్రత్యక్షంగా పెత్తనం చెలాయించడానికి పాకిస్తాన్ సైనిక అధికారులు మరోసారి సమాయత్తం అవుతున్నారట... పాకిస్తాన్‌లో ప్రభుత్వానికీ, సైనిక దళాలకూ మధ్య విభేదాలు ముదిరి విద్వేషపు స్థాయికి చేరిందన్న ప్రచారం అందువల్ల ఆశ్చర్యకరం కాదు. తమ దేశపు భారత విధానంలో తమ సైనికదళాలకు ప్రముఖ భూమిక ఉందని మన దేశంలోని పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ బాసిత్ బహిరంగంగా ప్రకటించడం కూడ ఆశ్చర్యకరం కాదు. పాకిస్తాన్ రాజ్యాంగ వ్యవస్థలో నిహితమై ఉన్న అరాజక స్వభావానికి బాసిత్ ప్రకటన అనుగుణం. ఈ అరాజక స్వభావం పాకిస్తాన్‌లో దశాబ్ద్దులుగా కొనసాగుతోంది. సార్వభౌమ దేశాలలో ప్రభుత్వపు ఆజ్ఞలను పాటించే అనేక విభాగాలలో సైనికదళం ఒకటి! సైనిక దళం ప్రభుత్వం నిర్ణయించిన విధానాన్ని అమలు జరుపవలసిందే కాని విధానాన్ని నిర్ణయించజాలదు. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలలో ఈ సూత్రం మరింత స్పష్టం. సైనిక నియంతృత్వం ఉన్న దేశాలలో మాత్రం సైన్యానిదే సర్వాధికారం. కానీ పాకిస్తాన్‌లో విచిత్రమైన ‘‘ప్రజాస్వామ్యం’’ నడుస్తోంది. ప్రజాస్వామ్యానికి ఒక వౌలిక ప్రాతిపదిక సర్వమత సమభావం. ఈ ప్రాతిపదిక పాకిస్తాన్‌లో ఏర్పడనే లేదు. అలా ప్రజాస్వామ్యం నీరుకారిపోయింది! ఏకమత రాజ్యాంగ వ్యవస్థ పరిధిలోనైనా పరిమిత ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా లేదు! ఎందుకంటే పాకిస్తాన్‌లో ‘‘ప్రజాస్వామ్య ప్రభుత్వం’’గా చెలామణిలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థ నిజానికి ప్రచ్ఛన్న జిహాదీ ఉగ్రవాదులు నిండిన సైన్యం ఆధీనంలో నియంత్రణలో ఉంది! ప్రభుత్వానికి ఒక విభాగంగా పనిచేయవలసిన సైన్యం తానే ప్రభుత్వంగా వ్యవహరిస్తోంది! తోకను కుక్క ఆడించడం కాక ‘తోక’ తోడేలును ఆడిస్తోంది! పాకిస్తాన్ సైనిక దళాలకు తమ విదేశాంగ విధానంలో పాత్ర లేదను కోవడం ‘‘ఇతరుల భ్రమ’’ అని పాకిస్తాన్ రాయబారి బహిరంగ పరచడానికి ఇదే నేపథ్యం...
ఈ ప్రకటన ద్వారా మన దేశంలోని పాకిస్తాన్ రాయబారి తమ ప్రభుత్వం పట్ల కాక సైనికదళాల అధిపతి రహీల్ షరీఫ్ పట్ల విధేయతను చాటుకున్నాడు! 1950వ దశకం నుంచి కూడ పాకిస్తాన్‌లో సైన్యమే ‘‘పాలన’’ జరుపుతోంది. అయితే అంతరం ఉంది... కొనే్నళ్లపాటు సైనిక నియంత ప్రత్యక్షంగా పాలిస్తాడు! మరి కొనే్నళ్లపాటు సైనికదళం అధిపతులు పౌర ప్రభుత్వాన్ని అనుమతిస్తారు. ఇలా ‘అనుమతి’ పొంది ఏర్పడిన పౌర ప్రభుత్వం సైనిక దళాల పరమోన్నత అధికారానికి లోబడి మాత్రమే పనిచేయడం పాకిస్తాన్ చరిత్ర! అంటే పాకిస్తాన్‌లో కొన్ని రోజులు సైనిక నియంతృత్వం ప్రత్యక్షంగా పాలిస్తోంది, మరికొన్ని రోజులు పౌర ప్రభుత్వాన్ని నియంత్రించడం ద్వారా పరోక్షంగా పాలిస్తోంది! ఇదీ పాకిస్తాన్‌లోని విచిత్ర వ్యవస్థ. పౌర ప్రభుత్వం ఉన్నప్పుడల్లా పాకిస్తాన్‌లో రెండు ప్రభుత్వాలుంటున్నాయి. రెండవది పౌర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసే సైనిక ప్రభుత్వం. అబ్దుల్ బాసిత్ ఈ వాస్తవాన్ని మరోసారి ధ్రువీకరించాడు! పాకిస్తాన్ ‘పౌర’ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా పచ్చి మతోన్మాది, ప్రచ్ఛన్న జిహాదీ ఉగ్రవాది. 2013లో అతగాడు మళ్లీ ప్రధాని కావడానికి సైన్యం అనుమతిచ్చింది. జాతీయ శాసనసభ ఎన్నికలను అలా నిర్దేశించింది. కానీ భారత్‌తో మైత్రిని నెలకొల్పుకోడానికి కృషి చేస్తానని షరీఫ్ లాంఛనప్రాయమైన ప్రకటన చేశాడు. వెంటనే ‘‘అతి ఉత్సాహం ప్రదర్శించకు...’’ అని అప్పటి పాకిస్తాన్ సైనికదళాల అధిపతి ‘‘జనరల్’’ పరవేజ్ కయానీ బహిరంగంగా తమ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను మందలించాడు... ఇదీ పాకిస్తాన్ ‘‘ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ’’ తీరు. ‘‘మీరు మా పౌర ప్రభుత్వంతో చర్చలు జరపడంవల్ల ప్రయోజనం లేదు. మాతో మాట్లాడండి...’’ అని 2009లో పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ‘ఐఎస్‌ఐ’ అప్పటి అధిపతి సైనిక అధికారి షుజాపాషా మన ప్రభుత్వానికి సలహా ఇచ్చాడు! ‘ఐఎస్‌ఐ’ సైన్యానికి చెందిన ఒక విభాగం. ఇదీ పాకిస్తాన్ ప్రజాస్వామ్యం... ఈ కుహనా ప్రజాస్వామ్యం కూడా ఇప్పుడు మళ్లీ కూలిపోవడానికి రంగం సిద్ధమైంది! ఇన్నాళ్లుగా మన ప్రభుత్వం మన దేశంలోకి చొరబడిన జిహాదీలతో పోరాడింది. ఇప్పుడు మన ప్రభుత్వం ‘రేఖ’ చాటుకుండా నిరోధిస్తోంది! నిజానికి బీభత్సకారులను మన దేశంలోకి ఉసిగొల్పడంలో ప్రధానపాత్ర పాకిస్తాన్ సైన్యానిది. అందువల్ల మన ప్రభుత్వం నిరోధక చర్యలను అమలు జరిపిన వెంటనే పాకిస్తాన్ పౌర ప్రభుత్వానికి తమ ‘సైన్యం’పై కోపం రావాలి! కానీ సైన్యం ‘పౌర ప్రభుత్వం’పై ఆగ్రహం ప్రదర్శిస్తోంది! ఇలా మన దేశంతో తలపడి ఓడినప్పుడల్లా పాకిస్తాన్ సైనిక అధికారులు పౌర ప్రభుత్వాలను తొలగించి సైనిక నియంతృత్వం స్థాపించడం పాకిస్తాన్ చరిత్ర...