రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం.. 68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకో ప్రశ్న.. రామదాసు జపించిన రామమంత్రం ఏమిటి?

అన్నగారి రక్షణ కోసం మేలుకుని ఉన్న లక్ష్మణుడితో విచారంగా ఉన్న గుహుడు కపటం లేకుండా చెప్పాడు.
‘నాయనా! సుఖమైన ఈ పడకని నీ కోసం ఏర్పాటు చేశాను. ఓ రాజకుమారా! దీని మీద హాయిగా పడుకో. మేమంతా శ్రమకి అలవాటుపడ్డ వాళ్లం. నువ్వు సుఖానికి అలవాటు పడ్డవాడివి. రాముడి రక్షణ కోసం మేము రాత్రంతా మెలకువగా ఉంటాం. నాకీ లోకంలో రాముడి కంటే ఇష్టమైన వారు ఇంకొకరు లేరు. నేను సత్యం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. రాముడి అనుగ్రహం చేత లోకంలో గొప్ప కీర్తిని, ధర్మాన్ని, అధిక ధనాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. నేను, నా బంధువులు నిద్రపోయే నా ప్రియ మిత్రుడైన రాముడ్ని, సీతని బాణాలతో అందర్నించీ రక్షిస్తాం. ఎల్లప్పుడూ ఈ అడవుల్లో తిరిగే నాకు ఇక్కడ తెలియనిది ఏదీ లేదు.’
లక్ష్మణుడు గుహుడితో చెప్పాడు.
‘దోషాలు లేని ఓ గుహుడా! ధర్మం మీద మాత్రమే శ్రద్ధ గల నువ్వు రక్షిస్తూంటే ఇక్కడ మాకేం భయం లేదు. రాముడు సీతతో సహా ఇలా నేల మీద పడుకుని ఉండగా నాకు నిద్రెలా వస్తుంది? ప్రాణాలు ఎలా నిలుస్తాయి? సుఖాలు ఎలా కలుగుతాయి? యుద్ధంలో సమస్తమైన దేవతలు, రాక్షసులు కూడా ఎదిరించలేని రాముడు సీతతో కూడా గడ్డి మీద ఎలా సుఖంగా పడుకుని ఉన్నాడో చూడు. రాముడు దశరథుడికి ఇష్టమైన కొడుకు. కొడుకుల్లో ముఖ్యుడు. మంత్రాలతో, తపస్సుతో అనేక విధాలైన ప్రయాసల చేత లభించిన వాడు. అలాంటి రాముడు అడవికి వెళ్లాక రాజు ఎక్కువ కాలం జీవించడు. త్వరలో ఈ భూమి విధవ అవుతుంది. తప్పదు. స్ర్తిలంతా పెద్దగా అరుస్తూ, ఏడుస్తూ శ్రమతో ఈపాటికి ఊరుకుని ఉంటారు. అందుచేత రాజగృహంలోని శబ్దాలన్నీ ఆగిపోయి ఉంటాయని అనుకుంటున్నాను. కౌసల్య, రాజు, మా అమ్మ, వీరంతా ఈ రాత్రి జీవించే ఉంటారని నేను అనుకోను. మా అమ్మ శతృఘు్నడి కోసం ఎదురుచూస్తూ బతకచ్చు కాని వీరుడ్ని కన్న కౌసల్య పోతుందేమో అన్నదే నాకు విచారంగా ఉంది. లోకానికి ఇష్టమైన రాజు మరణంతో ప్రేమగల ప్రజలతో నిండిన, సుఖకరమైన అయోధ్య నశించి పోతుంది. మహాత్ముడు, ప్రియమైన పెద్ద కొడుకు కనపడక మహాత్ముడైన రాజు ప్రాణాలు శరీరంలో ఎలా నిలుస్తాయి? రాజు మరణించిన తర్వాత కౌసల్య మరణిస్తుంది. తర్వాత నా తల్లి కూడా మరణిస్తుంది. తను ఎంతకాలం నించో అనుకునే రాముడ్ని రాజ్యాభిషిక్తుడ్ని చేసే కోరిక తీరక మా నాన్న పోతారు. కాలం తీరి మరణించిన నా తండ్రికి ప్రేత కార్యాలని చేసిన వారు కృతార్థులు అవుతారు. నా తండ్రి రాజధాని అయోధ్యలోని ముంగిళ్లు అందంగా ఉంటాయి. విశాలమైన మార్గాలు చక్కగా విభజించబడి ఉంటాయి. ఎన్నో ధనికుల మేడలు, రాజులు నివసించే ప్రాసాదాలు నగరానికి అలంకారంగా ఉంటాయి. అవి మంచి వేశ్యలతో ప్రకాశిస్తూంటాయి. రధాలతో, గుర్రాలతో, ఏనుగులతో ఇరుకుగా ఉండి, కళకళలాడే పట్టణంలో వాద్యఘోషలు వ్యాపిస్తూంటాయి. ప్రజలంతా తృప్తిగా ఆరోగ్యవంతులై ఉంటారు. ప్రజలు విహరించే తోటలు, రాజులు విహరించే ఉద్యానవనాలు అక్కడక్కడా ఉంటాయి. ప్రజలు గుంపులుగా చేరి అనేక రకాల ఉత్సవాలు చేసుకుంటూంటారు. అలాంటి ఈ నగరంలో కొందరు భాగ్యవంతులు సుఖంగా తిరుగుతూంటారు. దశరథుడు బతికే ఉంటాడా? మేం వనవాసం నించి తిరిగి వచ్చి, వ్రతాలని పాటించే ఆ మహాత్ముడ్ని మళ్లీ చూడగలమా? రాముడు వనవాసం పూర్తి చేసుకుని, క్షేమంగా తన ప్రతిజ్ఞని నిజం చేసుకున్న దశరథుడితో మేం అంతా అయోధ్యలోకి తిరిగి ప్రవేశించగలమా?
మహాత్ముడైన ఆ లక్ష్మణుడు దుఃఖంతో ఏడుస్తూ నిలబడి ఉండగానే రాత్రి గడిచిపోయింది. పెద్దల మీది ప్రేమతో లక్ష్మణుడు చెప్పిన ఆ మాటలు విన్న గుహుడు బాధగా జ్వరంతో బాధపడే ఏనుగులా కన్నీరు కార్చాడు. (అయోధ్యకాండ సర్గ 51)
తెల్లారాక విశాలమైన ఛాతీ గల, కీర్తివంతుడైన రాముడు ఉత్తమ లక్షణాలు గల లక్ష్మణుడితో చెప్పాడు.
‘నాయనా! సూర్యోదయం అవబోతోంది. చాలా నల్లటి కోయిల కూస్తోంది. అడవిలో నెమళ్లు కూసే ధ్వని కూడా వినిపిస్తోంది. ఓ సౌమ్యుడా! వేగంగా ప్రవహిస్తూ సముద్రాన్ని చేరే గంగానదిని దాటుదాం.’
మిత్రులకి ఆనందాన్ని కలిగించే లక్ష్మణుడు రాముడు చెప్పింది విని, గుహుడ్ని, సుమంత్రుడ్ని పిలిచి వాళ్లకి అది చెప్పి రాముడి దగ్గరికి వచ్చాడు. గుహుడు ఆ ప్రకారం వెంటనే తన మంత్రులని పిలిచి చెప్పాడు.
‘సులభంగా దాటడానికి అనువైన, గట్టిదైన, సమర్థులైన నడిపేవారు, చుక్కాని పట్టుకునేవారు ఉన్న అందమైన పడవని రాముడి కోసం వెంటనే రేవులోకి తీసుకుని రండి’
గుహుడి మంత్రులు అతని ఆజ్ఞ ప్రకారం అలాంటి అందమైన పడవని తెచ్చి ఆ సంగతి గుహుడికి చెప్పారు. అతను చేతులు ఎత్తి నమస్కరిస్తూ రాముడ్ని అడిగాడు.
‘ఓ ప్రభూ! పడవ వచ్చింది. ఇంకేం చేయాలి? దేవతలతో సమానమైన, పురుషశ్రేష్ఠుడవైన ఓ రామా! సముద్రంలోకి ప్రవహించే ఈ గంగానదిని దాటడానికి నీకు నావ సిద్ధంగా ఉంది. మంచి నియమాలు గల ఓ రామా! నువీ పడవని ఎక్కు.’
మహాతేజశ్శాలైన రాముడు గుహుడితో చెప్పాడు.
‘నేను కోరినట్లే చేశావు. మమ్మల్ని పడవ ఎక్కించు.’
రామలక్ష్మణులు అంబుల పొదులు, కత్తులు పట్టుకుని సీతతో కలిసి గంగ వైపు వెళ్లారు. సుమంత్రుడు చేతులెత్తి నమస్కరించి వినయంగా రాముడి దగ్గరకి వెళ్లి అడిగాడు.
‘ఇప్పుడు నేనేం చేయాలి?’
రాముడు కుడిచేత్తో సుమంత్రుడ్ని తాకుతూ చెప్పాడు.
‘ఓ సుమంత్రా! అయోధ్యకి తిరిగి వెళ్లి ఏమరుపాటు లేకుండా రాజుని చూసుకో. నాకు ఇంత సహాయం చేసావు కదా? ఇంక రధాన్ని విడిచి కాలి నడకతో అడవిలోకి వెళ్తాను. నువ్వు వెనక్కి వెళ్లు.’
వెనక్కి వెళ్లడానికి రాముడు తనకి అనుమతించాడని గ్రహించిన సుమంత్రుడు చెప్పాడు.
‘రామా! నువ్వు తమ్ముడితో, భార్యతో కలిసి సామాన్య మనుషుల్లా అడవిలో నివసించబోతున్నావు. ఇది ఈ లోకంలో ఏ ఒక్కడూ చేయలేడు. నీకే ఇలాంటి కష్టం రావడం చూస్తూంటే బ్రహ్మచర్యానికి కాని, వేదాధ్యయనానికి కాని, మృదుత్వానికి కాని, మంచితనానికి కాని ఫలమే లేదని అనిపిస్తోంది. వీరుడైన ఓ రామా! సీతతో, తమ్ముడితో అడవిలో నివసించే నువ్వు మూడు లోకాలని జయించినట్లు సద్గతిని పొందుతావు. మేమే చాలా దురదృష్టవంతులం. ఎందుకంటే నీకు దూరమై విచారిస్తూ పాపాత్మురాలైన కైకేయి ఆధీనంలో ఉండాల్సి ఉంది.’
తనకి ప్రాణ సమానుడైన రాముడు దూరంగా వెళ్లడం చూసి దుఃఖంతో చాలాసేపు ఏడ్చాడు. కన్నీరు ఆగాక ఆచమనం చేసి, శుచిగా ఐన సుమంత్రుడితో రాముడు మధురంగా మాటిమాటికీ ఇలా చెప్పాడు.
‘ఇక్ష్వాకు వంశం వారికి నీలాంటి మిత్రుడు ఎవరూ లేరు. రాజు నా గురించి బాధపడకుండా ఉండేలా చేయి. ఆయన మనసు శోకావేశంతో పీడించబడి ఉంది. వృద్ధుడు, కామభారంతో కృంగినవాడు కాబట్టి ఇలా చెప్తున్నాను. కైకేయికి ఇష్టమైన కోరిక తీర్చడానికి మహాత్ముడైన ఆ రాజు ఏమేం ఆజ్ఞాపిస్తే దాన్ని అనుమాన పడకుండా చేస్తూండు. రాజులు రాజ్యాలని పరిపాలిస్తున్నారు అంటే అన్ని పనుల్లో వారి ఆజ్ఞలు నెరవేరాలి కదా. సుమంత్రా! ఆ మహారాజు ఆజ్ఞాపించింది వృధా అనుకోకుండా, దుఃఖంతో బాధపడకుండా చేస్తూండు. పూర్వం ఎన్నడూ ఇలాంటి విచారాన్ని అనుభవించని, వృద్ధుడు, పూజ్యుడు, జితేంద్రియుడైన రాజుకి నా తరఫున నమస్కరించి నా మాటగా ఇలా చెప్పు. ‘అయోధ్యని విడిచి అడవుల్లో ఉండాల్సి వస్తోందే అని నేను కాని, లక్ష్మణుడు కాని, సీత కాని ఏ మాత్రం బాధ పడటం లేదు. పధ్నాలుగు సంవత్సరాలు గడిచాక మేం ముగ్గురం తిరిగి వస్తాం. అప్పుడు నువ్వు మమ్మల్ని రోజూ చూస్తూండచ్చు. సుమంత్రా! రాజుతో ఇలా చెప్పి మా అమ్మని, సమస్తమైన ఇతర రాజ భార్యలని, కైకేయిని మేము మళ్లీ మళ్లీ ఆరోగ్యం గురించి అడిగినట్లు చెప్పు. మహారాజుకి కూడా మేము పాద నమస్కారం చేసామని చెప్పు. భరతుడ్ని వెంటనే తీసుకుని రా. రాజుకి ఇష్టమైన రాజ్యాధికారం అందేలా చూడు. భరతుడ్ని కౌగిలించుకుని అతనికి యవ రాజ్యాభిషేకం చేసాక నీకు మా కష్టాల వల్ల కలిగిన విచారం ఉండదు. భరతుడితో ఇలా చెప్పు. ‘రాజు విషయంలో ఎలా ప్రవర్తిస్తావో అందరు తల్లుల విషయంలో కూడా భేదబుద్ధి లేకుండా అలాగే ప్రవర్తించు. నీకు కైకేయి ఎలాగో, సుమిత్ర ఎలాగో, నా తల్లైన కౌసల్య కూడా అంతే. తండ్రి కోరిక తీర్చడానికి యవ రాజ్యాన్ని స్వీకరించి నువ్వు ఇహపరాలు రెంటిలోను సుఖాన్ని పెంచుకోవడం సాధ్యం అవుతుంది.’
(అయోధ్యకాండ సర్గ 52 36వ శ్లోకం దాకా)
ఆశే్లష హరికథ విన్నాక బస్ స్టాప్‌కి చేరుకునేసరికి అక్కడ తన తల్లి కనిపించింది. ఎప్పటిలా ఆవిడకి తను విన్న కథని చెప్పాడు. పక్కనే ఉన్న ఓ సాధువు నవ్వి చెప్పాడు.
‘ఈ వయసులో నువ్వు రామాయణ హరికథకి వెళ్లడం నీ కుటుంబ ఉత్తమ సంస్కారాన్ని తెలియజేస్తోంది. కాని బాబూ! నువ్వు చెప్పిన కథలో మూడు తప్పులు ఉన్నాయి. అవేమిటో చెప్తా విను.’
అవి ఏమిటో మీరు కనుక్కోగలరా?

క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
1.రాముడు అగస్త్యుడు నివవసించే దక్షిణ దిక్కుకి వెళ్లాడు. హరిదాసు తప్పుగా ఉత్తర దిక్కుకి అని చెప్పాడు.
2.రాముడు ముందుగా గోమతీ నదిని, తర్వాత స్యందిక నదిని దాటాడు. హరిదాసు వాటి పేర్లు ముందుది తర్వాత, తర్వాతది ముందుగా చెప్పాడు.
3.రాముడు గంగానదిని శృంగిబేరపురం దగ్గర సమీపించాడు. హరిదాసు ఆ పేరు చెప్పలేదు.
4.మూడు దారుల్లో ప్రవహించే గంగానదిని రాముడు చూసాడు. ‘మూడు దారుల్లో ప్రవహించే’ అన్నది హరిదాసు చెప్పలేదు.
5.‘విష్ణుపాదం నించి ప్రవహించే’ అని వాల్మీకి గంగ గురించి చెప్పింది హరిదాసు గంగావర్ణనలో చెప్పలేదు.

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:

జగత్ ప్రథమ మంగళం రామం..
దీన్ని ఏ సంస్కృత కవి రాశారు?
-మృతసంజీవనం రామచరితం అనే కావ్యంలో కాళిదాసు ‘జగత్ ప్రథమం మంగళం రామం’ అని రాశారు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి