రివ్యూ

సిలబస్ మరీ పాతది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *నిర్మలా కానె్వంట్
--
తారాగణం: నాగార్జున, రోషన్, శ్రీయాశర్మ, ఆదిత్యమీనన్, సూర్య, సమీర్, ఎల్‌బి శ్రీరాం,
సత్యకృష్ణ, అనితాచౌదరి,
రోషన్ కనకాల, చంద్రహాస్.
సంగీతం: రోషన్ సాలూరి,
నిర్మాతలు: ఎన్ ప్రసాద్, ఎ నాగార్జున.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి నాగకోటేశ్వరరావు.
---
హీరో హీరోయిన్లు ఫ్రెష్. దర్శకుడు ప్రెష్. సంగీత దర్శకుడూ ఫ్రెష్షే. ఇన్ని కొత్త కలయికలో తయారైన ‘నిర్మలా కానె్వంట్’ నిశ్చయంగా నవ్యత్వాన్ని అందిస్తుందన్న ఆశ వీక్షకులందరికీ ఉండటం సహజం. కానీ అంచనాలన్నింటినీ భిన్నం చేసి నిరాశ కలిగించిన చిత్రమిది. కారణం.. ‘సినిమా’ అన్న సాధనం ఆడియన్స్‌కు ఎంత పాతదో, చిత్రానికి ఎంచుకున్న కానె్సప్టూ (అన్నట్టు చిత్రం నిర్మాణ సంస్థ పేర్లలో ఒకటి ‘కానె్సప్టూ’ కావడం గమనార్హం) అంతా పాతది. పేదింటి పిల్లాడు పెద్దింటి అమ్మాయిపై మనసు పారేసుకోవడం, అలా పారేసుకున్న దాన్ని ‘పదిలం’ చేసుకోడం కోసం ఆశపడటం, అలాంటి ఆశ నిజం కావాలంటే అంతరాలు కలవాలని అమ్మాయి తండ్రి ఆంక్ష విధించడం, ఆ ఆంక్ష సాకారానికై సకల ప్రయత్నాలు చేసి విజయం పొందడం. ఈ థీమ్‌లో ఇప్పటికే చూపరుల దిమ్మ తిరిగేటన్ని చిత్రాలు వచ్చేశాయి. మరి ఇందులోంచి ఏ మాదిరి ఆకర్షణని దర్శకుడు నాగకోటేశ్వరరావు ఆశించారో మనకు అర్థం కాదు. ఇక వివరాల్లోకి వెళితే.. ‘నిర్మలా కానె్వంట్’లో ప్లస్ ఒన్ క్లాసులో విద్య అభ్యసిస్తున్న శామ్యూల్ (రోషన్), శాంతి (శ్రీయాశర్మ) ఒకర్నొకరు ప్రేమించుకుంటారు. కానీ అంతస్తుల అంతరంతో శాంతి తండ్రి అంగీకరించడు. ‘నీవు నా తాహతుకురా, అప్పుడు చూద్దాం’ అన్న సవాల్ విసురుతాడు. ఆ ఛాలెంజ్‌ను తీసుకుని ఇంటినుంచి వచ్చేసిన శామ్యూల్ ఎలా విజయం సాధించాడన్నది మిగతా కథ. ఓ పక్క బొడ్డూడని పిల్లాడి చేతిలో కూడా సెల్‌ఫోన్ కనిపిస్తుంటే.. బట్టల మధ్యన సెల్‌ఫోన్ పెట్టి కథానాయికకు పంపడంలాంటి సన్నివేశాల ఆలోచన, అందులోని గాఢత ఒకింత చిరాకు పుట్టించింది. చిత్రానికి కథనం ఎంత పాతదో చెప్పడానికే ఇది ప్రస్తావించాల్సి వచ్చింది. పోనీ నాయకీ, నాయకుల మధ్య ప్రేమ కలవడానికి బలమైన సన్నివేశాలూ కల్పించలేదు. అయితే నాయకుడు అంతా సాధించేసి చివర్లో ఒక్కసారి తన వయసు వివాహస్థాయికి రాలేదని, అదొచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని అనడం అమల్లోని చట్టాలను స్పృహతో గౌరవించడం అనుకున్నా, ఇదేమిటీ పరిస్థితి అన్న బాధ ప్రేక్షకుణ్ణి పీకుతూ ఉంటుంది. ద్వితీయార్థంలో నాగార్జున ఎంట్రీతో సినిమాకు కొంత ఉత్సాహం వచ్చినా ఆ మొత్తం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎపిసోడ్స్‌ని పెద్ద తెరపై చూస్తున్నామన్న భావన కల్గింది తప్ప ఫిలిమ్‌తో ప్రేక్షకుడికి అటాచ్‌మెంట్ కుదరలేదు. అంతకన్నా నాగార్జునను కథలో కలిసే కీలకపాత్ర (నాగార్జున ఇందులో తన నిజ జీవిత పాత్రలోనే కనిపించారు)లో ఉంచి సినిమా నడిపితే బావుండేది. అయితే నాయకుడు (రోషన్) ఆకారాన్ని అనుసరించి భీకరమైన పోరాటాలూ గట్రా పెట్టకుండా దర్శకుడు నిగ్రహాన్ని చూపడం అభినందనీయం. సరే.. అపసవ్యాల సంగతి వదిలేస్తే చిత్రంలో ముందుగా ఎన్నదగిన అంశం- హీరో హీరోయిన్ల నటన. సాధారణంగా కొత్త హీరోలు అసలుకంటే ఎక్స్‌ట్రాలు ఎక్కువ చేస్తారు. కానీ ఇందులో రోషన్ తన వయసుకి తగిన అతి సహజ నటన ప్రదర్శించి తొలి సినిమా అంటే నమ్మబుద్ధికాని రీతిలో నటించాడు. అలాగే శాంతి పాత్రధారిణి శ్రీయాశర్మ. ఈమెకున్న బాల నటి అనుభవాన్ని చక్కగా హావభావాల్లో ఉపయోగించుకుని పాత్రని ఆద్యంతం రక్తికట్టించింది. ద్వితీయార్థంలో ఈ రోల్‌ని ఇంకా ఉపయోగించుకుని వుండి వుంటే బాగుండేది. ఇక నాగార్జున తీవ్ర డీసెంట్ నటనని మరోసారి ఇందులో కనపర్చారు. ఆయన పాడిన పాటా ఏ కొత్త గాయకుడికీ తీసిపోని విధంగా ఉంది. అయితే దీన్ని చిత్రాంతంలో కాకుండా మధ్యలో ఉంచితే అందరూ సావధానం ఆస్వాదించేవారు. మిగిలిన పాత్రల్లో నాయకుడి తల్లితండ్రుల పాత్రల్లో అనితాచౌదరి, సూర్య బాగా నటించారు. ‘ఒక ఎకరం పొలం విషయంలో ఇప్పటికే తండ్రిని పోగొట్టుకున్నాను. ఇప్పుడిక ఉన్న ఒక్క కొడుకునీ పోగొట్టుకోడం ఇష్టంలేక అది రాసిచ్చేశాను’ అన్న ఆ పాత్ర మాటలు హృదయాన్ని తాకాయి. అలాగే చిత్ర ప్రారంభంలో వీరిగాడి పాత్రలో ఎల్‌బి శ్రీరాం తళుక్కున మెరిసి ఆకట్టుకున్నారు. తాగుబోతు రమేష్ తదితరుల హాస్యం పండలేదు. ఈ సినిమాకున్న విశేషం ఏమిటంటే ఇందులో రోషన్ త్రయం ఉండటం. వారందరూ వారసులు కావడం. నాయకుడు రోషన్ నటుడు శ్రీకాంత్ తనయుడు. సంగీత దర్శకుడుగా ఉన్న రోషన్ సాలూరి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు. చిత్రంలో మరో పాత్ర పోషించిన రోషన్ కనకాల ఇంకో నటుడు రాజీవ్ కనకాల పుత్రుడు. అలాగే టీవి నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ కూడా ఇందులో మరో పాత్ర పోషించారు. రోషన్ స్వరాల్లో ‘కొత్తకొత్త భాష’ బావుంది. దాంతోపాటు నేపథ్య గీతంగా వచ్చిన ‘ఎంత కష్టం.. ఎంత కష్టం’ ఇంకా బాగుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ తనయుడు ఎఆర్ అమీన్ కూడా ఇందులో తొలిసారిగా తెలుగులో పాడారు. మరి ఇన్నిన్ని విశేషాలున్న ఈ చిత్రం కథ కూడా అందరూ ఆశించే కొత్తదనంతో గుభాళించివుంటే బావుండేది. అప్పుడు ‘నిర్మలా కానె్వంట్’ సిలబస్ కూడా అందర్నీ ఆకర్షించి వుండేది.

-అనే్వషి