రివ్యూ

మహోత్సవ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** మామాంగం
**
తారాగణం: మమ్ముట్టి, ఉన్ని ముకుందన్, ప్రాచి తెహ్లాన్, అచ్చుతన్, సిద్ధిక్, తరుణ్ అరోరా, మోహన్ శర్మ, అను సితార, కనిహా తదితరులు
సంగీతం: ఎం జయచంద్రన్
బీజీఎం: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
సినిమాటోగ్రాఫర్: మనోజ్ పిళ్లై
ఎడిటర్: రాజా మొహమ్మద్
నిర్మాత: వేణు కున్నపిల్లి
దర్శకత్వం: ఎం పద్మకుమార్
**
పీరియాడిక్ సినిమాల మీద సౌత్ మేకర్లకు మోజెక్కువైంది. మరోపక్క బాహుబలి ఇచ్చిన భరోసాతో భారీ సినిమాలనూ తెరకెక్కించే సాహసం చేస్తున్నారు. అలా ‘పాన్ ఇండియా’ చిత్రాల కోవలో వచ్చిన భారీ పీడియాడిక్ సినిమా -మామాంగం. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి లీడ్‌రోల్ చేశారు.
17వ శతాబ్ధంలో జరిగినట్టుగా చారిత్రక ప్రచారంలో వున్న ఓ సాంప్రదాయ ఘట్టం చుట్టూ అల్లుకున్న కథ ఇది. మామాంగం అనే సాంప్రదాయ ఉత్సవం ప్రత్యేకతను గుర్తు చేస్తూ, ఆ కాలంనాటి రాజరికపు వ్యవస్థపై పోరాడిన ‘చావేరుకల్’ చరిత్రచుట్టూ అల్లిన యుద్ధ నేపథ్య కథగా దర్శకుడు పద్మకుమార్ తెరకెక్కించాడు. కేరళ చరిత్రలో ప్రత్యేకత సంతరించుకున్న కలరి విద్యకు పెద్దపీట వేస్తూ నిర్మితమైన సినిమాను -అన్ని ప్రధాన భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. ఇదో ప్రత్యేకమైన సినిమాగా ప్రచారానికి నోచుకున్నా -ఎంతవరకూ అంచనాలను అందుకుందో చూద్దాం.
కథ:
కేరళ ప్రాంతంలో -చావేరుకల్ అనేది ఓ వీరుల జాతి. శతాబ్దాలుగా జమోరిన్ రాజ వంశానికి చెందిన పాలకులచే అణచివేతకు గురవుతారు. రాజవంశంపై పగ పెంచుకున్న చావేరుకల్ జాతి -పుష్కరానికోసారి భరతపూజ నదీ ఒడ్డున జరిగే మామాంగం మహోత్సవం సాక్షిగా జమోరిన్ పాలకుడిని తెగనరకాలని ప్రయత్నిస్తుంటుంది. అలా చావేరుకల్ జాతిలో వీరులంతా మామాంగం వెళ్లడానికే పుట్టడం, రాజుని హతమార్చే ప్రయత్నంలో వీరమరణం పొందటం జరుగుతుంటుంది. శతాబ్ధకాలంలో అదొక యుద్ధ సంప్రదాయమైపోతుంది. ఆ ప్రయత్నంలోనే జాతి వీరులంతా అంతమవటంతో -చివరిగా మిగిలిన ఒక యోథుడు, మరో బాలుడు జమోరిన్ రాజుని హతమార్చే ప్రయత్నంలో మామాంగానికి బయలుదేరుతారు. మధ్యలో ఆపదలో పడిన వాళ్లకు మహావీరుడైన చంద్రోత్ (మమ్ముట్టి) సహాయంగా నిలుస్తాడు. అసలు -చావేరుకల్ తెగకూ, జమోరిన్ రాజ వంశానికీవున్న వైరమేమిటి? చివరి వీరుడి (బాలుడు) పగను చంద్రోత్ ఎందుకు పంచుకున్నాడు? మహావీరుడైన చంద్రోత్ నేపథ్యమేమిటి? అంతటి వీరుడైన చంద్రోత్ బృహన్నలను తలపించే కృపాచారిగా ఎందుకు మారాడు? చివరికి చావేరుకల్ తెగ వీరుడు రాజుని హతమార్చాడా? ఈ ప్రశ్నలకు తెరపై సమాధానం దొరుకుతుంది.
సినిమా మొదలైనపుడే -ఆడియన్స్‌ని 17వ శతాబ్దంలోకి తీసుకెళ్లిపోతాడు దర్శకుడు. బొమ్మలతో కథను మొదలెట్టి, కాలమానానికి తగిన భారీ సెట్స్‌మధ్యకు తీసుకెళ్లి అద్భుతమైన విజువల్స్ మధ్య కూర్చోబెట్టాడు. పాన్ ఇండియా మూవీగా దాదాపు నాలుగు భాషల్లో విడుదలైన మామాంగం సినిమా గొప్పతనం ప్రొడక్షన్ వాల్యూస్‌లోనే ఉంది. అంతకుమించి -మనం ఆ కాలంలోనే ఉండి సినిమా చూస్తున్నామన్నంత భ్రమను సినిమాటోగ్రఫీతో కల్పించారు. ఇక సినిమాలో చెప్పుకోదగ్గ మరో కీలకాంశం బీజీఎం. సన్నివేశంలోకి లీనమయ్యేలా ఆడియన్స్‌ని తెరవెనుక నుంచి నడిపించింది. నేపథ్య సంగీతం ఆడియన్స్‌కి గొప్ప అనుభూతి.
మలయాళ స్టార్ హీరో కనుక -మమ్ముట్టిని పోస్టర్లపై ప్రధానంగా చూపించినా.. పాత్ర పరిధి ఊహించినంత లేదు. అయినా -మమ్ముట్టి కనిపించే సన్నివేశాల్లోని గాంభీర్యం, పోరాట సన్నివేశాలు ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ ఇచ్చేవే. వయసు మీదపడుతున్నా -మహావీరుడు చంద్రోత్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి చూపించిన యాక్షన్ సన్నివేశాలు.. సూపర్‌స్టార్ కృషిని చెప్పకనే చెబుతాయి. ఫస్ట్ఫాను కథా పరిచయం, కాలమాన పరిస్థితుల అవగాహనకే పరిమితం చేసిన దర్శకుడు, ద్వితీయ భాగం నుంచి ప్రధాన కథలోకి తీసుకెళ్తాడు. ఇక్కడే కథ ఒకింత ముందుకు జరుగుతుంది. కథా కాలమానంనాటి సంస్కృతీ సంప్రదాయానికి తగిన కాస్ట్యూమ్స్‌లో ఆర్టిస్టుల సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కారణంగా -పరిచయంలేని కథను చూస్తున్నా చూపులు పక్కకు తిప్పాలని అనిపించదు.
అద్భుత యుద్ధ సన్నివేశాలు, రాచరికపు కాలంనాటి నృత్యరీతుల్ని సినిమాలో పొందుపర్చినా -సంభాషణలతోనే కథను నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆరంభం, ముగింపులో వచ్చే రెండు యుద్ధ సన్నివేశాలతో వాస్తవంగా యుద్ధ ఘట్టాన్ని చూస్తున్నామన్నంత భ్రమ కలిగేలా చిత్రీకరించటం గొప్ప విషయం. ఇన్ని ప్రశంసార్హమైన విషయాలున్నా -మలయాళ వాసన మోతాదు మించివుండటం మిగిలిన భాషా ప్రేక్షకులకు కొరుకుడుపడని విషయం. అసలు కథేంటో అర్థం చేసుకోవడానికి అర్థగంటపట్టే పరిస్థితి. ఫస్ట్ఫాలో భావోద్వేగ సన్నివేశాలు, చావేరుకల్ తెగ ఆవేదనకు ఎక్కువ చోటివ్వడంతో -ఆడియన్‌కు ఎలాంటి వినోదం అందదు. మూల కథ, సంవిధానం, పాత్రలతో పరిచయం, వాటి నడకను అర్థం చేసుకునేసరికే -ప్రేక్షకుల్లో ఒపిక నశిస్తుంది.
పైగా మమ్ముట్టి స్క్రీన్‌పై కనిపించేది పరిమితంగా ఉండటంతో -పరిచయంలేని మిగిలిన పాత్రధారులతో ప్రయాణం చేయడం కష్టమనిపిస్తుంది.
కథను సవివరంగా చెప్పడానికి కొన్ని వృధా సన్నివేశాల్నీ ఆశ్రయించాల్సి రావడంతో -అసలు భావం తేలికపడింది. కథా మలుపులోనూ వేగం లేకపోవడంతో -అర్థంకాని అద్భుతాన్ని చూస్తున్నట్టుగా కళ్ళప్పగించి కూర్చోవడమే ప్రేక్షకుడి వంతైంది.
పతాక సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దినా -సుదీర్ఘంగా సాగిన సినిమాను చూసి అలసిపోయిన ప్రేక్షకుడు అర్థం చేసుకోలేకపోయాడు. భారీ పీరియాడిక్ డ్రామాను చూపించేందుకు నాణ్యమైన నిర్మాణ విలువలనే అనుసరించినా -చీకట్లో సాగే సినిమా కిక్కివ్వలేకపోయింది. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పిళ్ళై -గతకాలపు సంస్కృతి, సాంప్రదాయాలను అద్భుతంగా చూపించటమే కాదు, ఆ అనుభూతికి ఆడియన్స్‌ని చేర్చగలిగాడు. సాహిత్యాత్మకంగా సాగిన తెలుగు అనువాద విధానంలో నాణ్యత కనిపించింది. కాస్ట్యూమ్ డిజైనర్, నేపథ్య సంగీతం అందించిన సంచిత్ బల్హారి, అంకిత్ బల్హారి అభినందనీయులు.
దర్శకుడు పద్మకుమార్ నిజాయితీ -స్క్రీన్‌పై కనిపిస్తుంది. అప్పటి సంస్కృతిని కమర్షియల్ కోణంకంటే సంప్రదాయబద్ధంగా చూపడానికే ఇష్టపడ్డాడు. అయితే -ప్రధానంగా మలయాళ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకోవడంతో.. ఇతర భాషా ప్రేక్షకులకు మామాంగం కాస్త దూరంగా ఉండిపోయే ప్రమాదం లేకపోలేదు. క్లిష్టమైన కథను చెప్పే క్రమంలో అక్కడక్కడా తడబాటు, స్లో నేరేషన్, సాగదీత స్క్రీన్‌ప్లే.. మలయాళీయేతర ప్రేక్షకులకు బోర్‌కొట్టే అంశాలు.
భారీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించటంలో చిత్రబృందం దాదాపుగా సఫలీకృతమైంది. కాకపోతే -ఇంతవరకూ వినని కంటెంట్ కావడం ‘పాన్ ఇండియా’ సినిమా కోణంలో మైనస్ అవుతుంది. భారీ అంచనాలతో థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకుడి -అర్థంకాని అద్భుతాన్ని చూసి మాత్రం బయటికొస్తాడు.

-విజయప్రసాద్