రివ్యూ

కన్ఫ్యూజ్డ్ గయ్యాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యకాంతం ** ఫర్వాలేదు
**
తారాగణం: నీహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లిన్ భీషాణియా, సుహాసిని, శివాజీరాజా, మధుమణి, సత్య, సమీర్, జూ.రేలంగి తదితరులు
సంగీతం: మార్క్ కె రాబిన్
నిర్మాతలు: సందీప్ ఎర్రంరెడ్డి, సృజన ఎరబోలు, రామ్‌నరేష్
సమర్పణ: వరుణ్‌తేజ్
దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి
**
ఒకామెని ప్రేమించడం.. అది ఫలవంతమయ్యేలోపు ఆ అమ్మాయి అదృశ్యమవడం.. అది మర్చిపోలేక మర్చిపోయి తిరిగి మరొకామెతో మనువయ్యే సమయంలో -్ఫస్ట్ లేడీ ప్రత్యక్షం కావడం బాపతు కథాగమనాలు లేట్ సిక్స్టీస్, అర్లీ సెవెంటీస్‌లో తెలుగు ప్రేక్షకులు అనేకం చూశారు. సరే తరాలు మారాయి కదాని ఆ థ్రెడ్‌నే తిరిగి ‘సూర్యకాంతం’ ద్వారా ఈ తరానికి చూపిద్దామని చేసిన ప్రణీత బ్రహ్మాండపల్లి (దర్శకులు) ప్రయత్నం.. పేరుకు తగినట్టు బ్రహ్మాండంగా లేదు సరికదా అక్కడక్కడ ఏమిటీ ‘నస’ అన్న భావాన్ని ఆడియెన్స్‌కు అందించింది. అసలు ప్రణీత్ ప్రయత్నాల పరంపర ఎలావుందో పరిశీలిద్దాం.
‘నేను మారను, ఎదుటివారు మారాలనీ అనుకోను’ అన్న అదోరకం లక్షణాలతో పెరిగిన సూర్యకాంతం (నీహారిక), అభిషేక్ (రాహుల్ విజయ్) ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. ఆ తర్వాతి స్టెప్‌కి వారి ప్రేమ ప్రయాణం చేరేలోగా, తిరిగి తనకంతర్నిహితంగా వున్న గందరగోళ మనస్తత్వంవల్ల ఉన్నట్లుండి సూర్యకాంతం అదృశ్యమవుతుంది. అలా అదృశ్యమైన అమ్మాయి కోసం ఎదురుచూసి అలసిపోయిన అభి, తల్లిదండ్రులు (మధుమణి, శివాజీరాజా) చూసిన పూజ (పెర్లిన్ భీషాణియా)ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఎప్పటికప్పుడు అనూహ్యంగా ప్రవర్తించే సూర్యకాంతం తిరిగి ఎంట్రీ ఇస్తుంది. మరి అభి అడ్రెస్ పూజాతోనా, సూర్యకాంతం కొంగు వైపా? అన్నది ఎలా సెటిలైంది అన్నదే మిగిలిన భాగం. ఒక్కమాటలో చెప్పాలంటే చిత్రంలో సూర్యకాంతం పాత్రకిచ్చిన క్లారిటీ లేనితనం చిత్రం మొత్తం తాండవించింది. అన్నిటినీమించి కొన్ని పాత్రలకిచ్చిన స్వభావం, దానికనుగుణంగా ఉండాల్సిన సంగతుల్ని తిరిగి అవే పట్టించుకోవు. దీన్నిబట్టి దర్శకుడిక్కూడా స్క్రిప్టు కంటిన్యుటీ, కన్‌సిస్టెన్సీ అన్నది పట్టించుకోక లఘు చిత్రాల (గతంలో షార్ట్ఫిల్మ్ చేసి ప్రశంసలు అందుకున్నాడు) మాదిరి ఏ భాగానికి ఆ భాగానికే భావాల్ని పరిమితం చేసుకున్నట్టు అనిపించింది. ఉదాహరణకు -తనకున్న ఆత్మగౌరవాన్ని, స్వతంత్ర భావాల పరిరక్షణ కోసం భర్త (సమీర్)తో విభేదాలు వచ్చినట్టు సూర్యకాంతం తల్లి (సుహాసి) పాత్రని చూపారు. సాధారణంగా అలాంటి ఉదాత్త లక్షణాలున్న సింగిల్ మదర్ వాళ్ల పిల్లల్ని ఎంతో బాధ్యతగా పెంచారు. కానీ ఇందులో సూర్యకాంతాన్ని ఆస్థాయి క్రమశిక్షణతో ఆమె తల్లి పెంచినట్టు చూపలేదు. పైగా సూర్యకాంతం మధ్యమధ్యలో మాయమైపోతుంది. తిరిగి రావాలనుకుంటే వస్తుంది అన్న మాటల్ని, అవేవో ప్రత్యేక లక్షణాలన్నట్టు ఆమె తల్లితో అనిపించడం విచిత్రం. ఇక ఒక మనిషి, అందులోనూ తాను ఎంతగానో ప్రాణ సమానంగా ప్రేమించిన పడతి అలా ఉన్నట్లుడి మాయమైతే నిర్ణీత వ్యవధి గడిచిన అనంతరం ఆమెకోసం వెదకడా? అన్నది ఏ సామాన్యుడికైనా తట్టే అంశం. అసలలా పట్టుకోదలిస్తే సూర్యకాంతం అదృశ్యమైన 344 రోజుల (లెక్క సినిమాలోనే చెప్పారు)పాటు కేవలం ఆమెంతత ఆమే వస్తుందని వెయిట్ చేశారా? అన్నది ఏరకంగా చూసినా నమ్మశక్యంగా లేదు. కనీసం సూర్యకాంతానికున్న ఒకే ఒక ఫ్రెండ్ మీరా ద్వారానైనా ఈ ప్రయత్నం చేసినట్టు సినిమాలో చూపలేదు. ఇక కథనెలా ముగించాలో అన్న దానిపైనా ప్రణీత్ పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. లెటర్ రాసిచ్చి వెళ్లిపోవడం, తిరిగి ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వంటివి సినిమాకు శోభనివ్వకపోవడం మాట అటుంచి, సూర్యకాంతం పాత్రకు మొదటినుంచీ ఇచ్చిన ఇండిపెండెంట్ నేచర్‌కే విఘాతం కలిగించింది. అంతకుముందూ ఆమె పూజ- అభిలకు బ్రేకప్ జరిగే రీతికి ప్రయత్నించినట్టు చూపడమూ, ఆ రోల్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసింది. ఇవన్నీ ఆవిష్కరించబోయే సన్నివేశాలపై దర్శకుడికి తగినంత పట్టు లేకపోవడంవల్ల వచ్చిన ఇబ్బందులు. పాత్రధారుల నటన విషయానికొస్తే నిస్సందేహంగా ఇది నీహారిక కోసం తీసిన చిత్రమే. సూర్యకాంతం (టైటిల్ ఉద్దేశ్యం అప్పటి సూర్యకాంతానికి తెరపైవున్న గయ్యాళితనం, తిక్క స్వభావాన్ని నాయికపై ఆవహింపచేడం) పాత్రలో రకరకాల షేడ్స్‌ని చూపడంలో నీహారిక చాలావరకూ కృతకృత్యులయ్యారు. పాత్ర చిత్రణలో కుదురుతనం ఇంకా కుదిరివుంటే సంపూర్ణంగా రాణించేది. ఆమెతో మెగా కుటుంబానికి అచ్చివచ్చిన మాస్ డ్యాన్స్‌నీ (లవ్వే దొబ్బింది..) చేయించేశారు. అభిషేక్‌గా రాహుల్ పాత్రకు తగిన కష్టంపడ్డాడు. అలాగే పూజగా షెర్లిన్ అందంగానూ, మంచి నటననీ చూపించే ప్రయత్నం చేసింది. హీరో తండ్రిగా శివాజీరాజా నటిస్తే, కొన్నిచోట్ల వేరేవారితో డబ్బింగ్ చెప్పించడం ఇబ్బంది. కథానాయకుని మామగా సత్య కామెడీ అందించడానికి తన వంతు కృషి చేశాడు. నీహారిక తల్లిగా సుహాసిని రోల్ తక్కువ. ఉన్నంతలో ఉనికిని చూపారు. సంభాషణల్లో కొన్నిచోట్ల చూపిన స్పార్కులు బావున్నాయి. ‘నీకు తెలిసినా తెలియనట్లుండు, నాకు తెలియకపోయినా తెలిసినట్లుంటా’, ‘నీ కడుపులో పుట్టబోయే బిడ్డకు తల్లిని నేను కాదు కదా?’, ‘వదిలేసి వెళ్లిపోతావో, వదిలించుకుని వచ్చేస్తావో..’ అన్నవాటిని ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్నారు. అయితే ప్రేమంటే కలిసుండడం ఎంత ముఖ్యమో, అవసరమైతే విడిపోవడమూ అంత ముఖ్యం అన్నదానికి సరైన వివరణ ఇస్తే ప్రేక్షకులకు బాగా రిజిస్టరయ్యేది. మార్క్ కె రాబిన్ అందించిన పాటలుకంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ప్రత్యేకించి పూజ- అభి -సూర్యకాంతం ఉంగరాలు వేళ్లకి పెట్టుకునే సీన్స్ అప్పుడు వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బిట్స్ మనసుని పట్టేశాయి. సినిమాల్లో ఓచోట సత్య వేసుకున్న టీషర్టుపై ఉన్న స్లోగన్ (అమీబా ఆకారం, అమ్మాయిల మనసు ఎవ్వరికీ అర్థంకావు)లోని సారాన్ని సూర్యకాంతం చిత్రం మలచిన తీరులో ఆనుసరించకపోయి ఉంటే పిక్చర్ క్లారిటీగా వచ్చేది.

-అన్వేషి