రివ్యూ

కాలక్షేపానికీ కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీమరాజా * బాగోలేదు
*
తారాగణం: శివకార్తికేయన్, సమంత, కీర్తిసురేష్, సిమ్రాన్, నెపోలియన్, సూరి, లాల్, మనోబాల, ఇందుమతి, వైశాలి, నాదోడిగల్ గోపాల్.
సంగీతం: డి ఇమాన్
నిర్మాత: సాయికృష్ణ పెండ్యాల
దర్శకత్వం: పొన్‌రామ్
*
గతంలో ఏదోక అంశాన్ని తీసుకొని చిత్రాన్ని నడిపేవారు. దానికి పక్కన ఆకర్షణ కోసం మరికొన్ని కలిపినా కథలో కలిసేలా తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ మారిన పరిస్థితుల్లో చూపించబోయే ఒకే చిత్రంలో లెక్కలేనన్ని అంశాలు చూపించేయాలన్న ఆతృతతో అసమంజస, అసంబంధిత అంశాల్ని తెగజార్చేస్తున్నది. అలా చేయడంలో వాటిని స్టోరీకి సమన్వయపర్చే కనీస ప్రాథమిక బాధ్యతను గాలికొదిలేయడంతో చిత్రం అనాకర్షణీయంగా తయారవుతోంది. అలాంటి చిత్రాల్లో సీమరాజా ఒకటి. రాజవంశ నేపథ్యంగల రాజా (శివకార్తికేయన్) తానున్న ఊరికి, పొరుగూరికీ ఎంతోకాలంనుంచివున్న పోట్లాటలు పోగొట్టి అక్కడి రైతులకు మంచి చేకూర్చే కార్యక్రమాన్ని ఎలా నెరవేర్చారన్నది సీమరాజా ముఖ్యాంశం. ఈ అంశం చుట్టూ అనేకానేక అంశాలు పొన్‌రామ్ (దర్శకుడు) పుష్కలంగా సృష్టించారు. తొలుత ‘హ్యాపీ గో లక్కీ’ టైపు వ్యక్తిగా రాజాను చూపడం, అనంతరం అతని తండ్రి (నెపోలియన్) మరణంతో తాత ప్రేరణతో వారి వంశ చరిత్ర ముఖ్యంగా నరసింహరాయలు ఉదంతం చెప్పడంతో రాజా ఆ ప్రాత రైతుల బాగుకోసం పూనుకోవడం లాంటివి చూపారు. అయితే ఇవన్నీ రెండు గంటల ముప్ఫై నిమిషాల చిత్రంలో ఇమడలేక దేనికీ స్పష్టత రాలేదు. దీనికి కారణం చిత్ర తొలిభాగం మొత్తం కథానాయకుని రేంజ్ తెలపడానికి అతని ప్రియురాలు లక్ష్మి (సమంత)తో బంధం కలుపుకోవడానికే సమయం వెచ్చించారు. దాంతో మిగిలిన అంశాలకు సమయం సరిపోలేదు. ముఖ్యంగా ద్వితీయార్థంలో ‘బాహుబలి’ చిత్ర ప్రేరణతో చూపిన నరసింహరాయలు ఎపిసోడ్ చూడ్డానికి బానేవున్నా దానికి ప్రధాన అంశంతో అనుసంధానం చేయడంలో విఫలమైంది చిత్రబృందం. అయితే అందులో ‘శూలవ్యూహం’, ‘వలయఖడ్గం’ తీరును చూపడంలో బాలసుబ్రహ్మణ్యం (కెమెరామెన్) చక్కటి ప్రతిభ చూపారు. కానీ రైతులకు మంచి చేద్దామన్న చిత్ర కేంద్ర ఇతివృత్తాన్ని ప్రతిపాదన దశలోనే వదిలేశారు. చిత్రం చివరలో లక్ష్మి- రాజా వివాహంతోనే ముగించారు. మాటవరసకైనా రైతుల కష్టాలు తీర్చినట్టు చూపడం విస్మరించారు. శివకార్తికేయన్ పాత్రలోవున్న వివిధ షేడ్స్‌లో ఫైట్స్, డాన్స్‌లు చూపడానికి ఎక్కువ మొగ్గు చూపింది కనుక, వాటిని ప్రదర్శించడంలో మంచి ఈజ్ చూపారాయన. దానికి తగ్గట్లు శివకార్తికేయన్‌కీ సమంతకీ అందమైన కెమిస్ట్రీ కుదరడంతో ఆ సీన్లూ రాణించాయి. లక్ష్మిగా సమంత ఈ చిత్రంలో అందంగా కర్రసాము బాగా చేశారు. నరసింహరాయలు దేవేరిగా కీర్తిసురేష్ ఓ చిత్ర పాత్రలో డిగ్నిఫైడ్‌గా మెరిసింది. కాళేశ్వరిగా సిమ్రాన్, వెండితెరపై ఈమధ్య అలవాటైన అందరి ప్రతినాయికల్లాగే నటించారు. హీరో సహాయకుడు ‘లెక్కలు’ పాత్రలో సూరి నటన మొత్తం, ఆ సీన్లు అన్నీ తమిళ వాసనలో గుప్పుమంది. ఎంత అనువాద చిత్రమైనా (ఈ చిత్రం తమిళంలో ఇదే పేరుతో గత సెప్టెంబర్ 13 వినాయకచవితి సందర్భంగా విడుదలైంది) ఈ స్థాయి తమిళ హాస్యం తెలుగుకి ఒప్పదన్న సంగతిని గమనించి వాటి నిడివిని తగ్గిస్తే బాగుండేది. అలాగే హీరో తన పెంపుడి కుక్కని పులిలా తయారుచేసి వదలడం, గాండ్రింపు నేర్పడం తతంగమూ సుదీర్ఘ వ్యవధివల్ల విసిగించింది. సంభాషణల్లో- ‘రాజు ప్రజలకు కవచంలా ఉండాలి తప్ప ప్రజల్ని కవచంలా వాడుకోకూడదు’ వంటివి బాగున్నాయి. సమంతని ఎవ్వరొచ్చినా పంపొద్దని కథానాయకుడు ఆదేశిస్తే ‘నాగచైతన్య వచ్చినా పంపను’ అని అతని స్నేహితుడు చెప్పడం, ‘పెళ్లిచూపులు చూడ్డానికొచ్చావా?’ అని సమంత తండ్రి పాత్ర అడిగితే ‘లేదు, అర్జున్‌రెడ్డిని చూడ్డానికొచ్చాం’ అనడం ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ కనెక్షన్ లేకపోతే కరెంటెలా వస్తుంది? పోనీ సైడ్‌లో ఇన్వర్టర్ పెట్టమంటారా? వంటి ద్వందార్థ సంభాషణలు చిత్రానికి ఎలాంటి లాభాన్నీ చేకూర్చలేదు. ఇందులో పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సాధారణంగా అనువాద చిత్రాల్లో ఇన్ని పాటలలుండవు. కానీ ఇందులో ఉన్నాయి. అన్ని కూడా కర్ణపుటాలకు పెద్దగా ఇబ్బంది కల్పించకపోవడం విశేషం. ‘నువ్వే లేక నేనే లేదంటే ప్రేమ’ పాట మరీ బాగుంది. అలాగే ‘అనుక్షణం ప్రజాహితతం ఆయువు ఉండేవరకూ...’ అన్న పద ప్రయోగం (రాజా రాజా సీమరాజా పాటలో) బాగుంది. ఏది ఎలా వున్నా ఎంచుకొన్న అంశానికి డీవియేషన్స్ ఎక్కువై సీమరాజాలోని సారం నిస్సారమైపోయిందన్నది మాత్రం వాస్తవం.

అన్వేషి