తెలంగాణ

స్పీకర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగ విరుద్ధం, కోర్టుకెళతాం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తెలుగు దేశం పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో విలీనమైనట్లు అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ తరఫున గెలుపొంది టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని, వారి సభ్యత్వాలను రద్దు చేయాలని టిడిపి ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి స్పీకర్‌ను కోరారు. ఇలాఉండగా టిఆర్‌ఎస్‌లో చేరిన వారంతా తాము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారమే (మూడింట రెండో వంతు) విలీనమయ్యామని, తమ విలీనాన్ని గుర్తించి టిఆర్‌ఎస్ పక్షంగా గుర్తించాలని కోరారు. లోగడ తెలంగాణ శాసనమండలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్సీలు టిఆర్‌ఎస్‌లో చేరి తమను విలీనంగా గుర్తించాలని కోరడంతో కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ దానిని ఆమోదించారు.ఆ మేరకు శాసనమండలి కార్యదర్శి బులిటెన్ విడుదల చేశారు. ఇది చాలా తేలిగ్గా జరిగిపోయింది. ఇప్పుడు కూడా టిఆర్‌ఎస్‌లో చేరిన టిడిపి ఎమ్మెల్యేలు మూడింట రెండో వంతు సంఖ్య కూడా దాటినందున స్పీకర్ విలీనంగా గుర్తించారని టిఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అయితే అలా చేయడం ద్వారా మున్ముందు న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా? అని స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్‌తో, పలువురు న్యాయ నిపుణులతో చర్చించి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
విలీనం సాధ్యమయ్యేనా!?
మూడింట రెండో వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే విలీనంగా గుర్తించవచ్చన్న వాదన ఉంది. కానీ రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో భిన్నంగా ఉందని, 10వ షెడ్యూలు (క్లాజ్-4) ప్రకారం ‘ఒరిజినల్ పార్టీ’ విలీనమైనప్పుడే చట్ట సభల్లో ఉండే సభ్యులు విలీనానికి అంగీకరించడమో లేదా వారు తమ ఇష్టమైన పార్టీలోకి మూడింట రెండో వంతు మంది వెళ్లడమో లేదా అదే పార్టీలో కొనసాగ వచ్చని ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒరిజినల్ రాజకీయ పార్టీ విలీనం లేకుండా చట్ట సభల్లో ఉన్న సభ్యులు తమ ఇష్టానుసారం విలీనం అయ్యేందుకు అవకాశం లేదని కొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.