Others

ఖండ కావ్యాల సృష్టికర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు రాయప్రోలు సుబ్బారావు జయంతి
*
తెలుగులో భావ కవిత్వానికి ఆద్యులు, పూజ్యులు అయిన రాయప్రోలు సుబ్బారావుగారు రాసిన తృణ కంకణముతో తెలుగు కవిత్వానికి నూతన శకము ఆరంభమైంది. ఇందులో ఆయన అమలిన శృంగారతత్వాన్ని, ఎంతో గొప్పగా ఆవిష్కరించారు. ప్రేమకి, పెళ్ళికి దారితీయని యువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తంతో ‘ఖండకావ్య’ ప్రక్రియకు అంకురార్పణ చేశారు. కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపాలే భావుకత అంటారు రాయప్రోలువారు. ఖండకావ్యాల సృష్టికర్త, అభినవ నన్నయగా పేరుగాంచిన, రాయప్రోలు సుబ్బారావుగారు గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో 1892 మార్చి 13న జన్మించారు. కోకిల స్వామిగా ప్రసిద్ధిపొందిన రాయప్రోలు సుబ్బారావుగారు చూపరులను యిట్టే ఆకర్షించే వ్యక్తిత్వం ఆయనది. ఈయన ఆరడుగుల ఆజానుబాహుడు, అందగాడు- తన బెట్టుతో, బింకంతో, ఠీవితో, చక్కని పంచెకట్టుతో, పల్లెవాటు వయ్యారంతో నిండుగా వుండేవారు. వీరి రచనలు కూడ అంతే ఠీవిగా, చక్కని భావుకతతో అందంగా వుంటాయి.
రాయప్రోలువారు ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో భావ కవిత్వమునకు ఒక ముఖ్య లక్షణమైన ఆత్మాశయ ధోరణికి కొత్తపుంతలు వేసిన కవిశేఖరుడు. పాశ్చాత్య దేశాలలో పరిమళించిన ఈ భావ కవిత్వాన్ని వీరు తెలుగులో ఎంతో గొప్పగా పండించారు. సంస్కృత రచనలపై ఎక్కువగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించారు. అలాని సంస్కృత భాషా పటిమను ఆయన వీడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు కొత్త సొగసులు అద్దారు. ఈయన గొప్ప జాతీయవాది. తెలుగుజాతి అభిమాని. ఈయన రాసిన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజంగా వుంటాయి. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను చాటిచెప్పడమే ఈ గేయాల ప్రధాన ఉద్దేశం. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత. మన దేశ గౌరవాన్ని దశదిశలా చాటడం మన కర్తవ్యం అంటారు. అలాంటి భావాల్ని పలికించడమే వీటిల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా- ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా- పొగడరా నీ తల్లి భూమి భారతిని- నిలుపరా నీ జాతి నిండు గౌరవము’’అంటూ ప్రతి తెలుగువారి నాలుకపై నాట్యం చేసే గొప్ప దేశభక్తి గేయం ఇదీ. అలాగే ఆంధ్ర జాతి గురించి, ఆంధ్రజాతి గొప్పతనం గురించి కూడా ‘ఆంధ్రావళి’’ శీర్షికలో రాయప్రోలువారు ఎంతో గొప్పగా రాశారు. ‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’’అనే ఒక సూక్తిని ఏదైతే వేదాలలో చెప్పారో దానిని ఆంధ్రావళిలో ఎంతో వివరంగా చెప్పారు. ఈ కాల్పనిక కవితా భీష్ముడుగా పేరుగాంచిన వీరి రచనలలో రమ్యలోకం, మాధురీ దర్శనమనే విలక్షణ కావ్యాలు. లలిత, అనుమతి, భజగోవిందం, సౌందర్య లహరి, సుందరకాండ, ఊతమత్త్భేం, మధుకలశం అనే కావ్యాలు అనువాదాలు. తృణ కంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్న, కుమారం, తెలుగుతోట, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, విశ్రమంజరి, కనె్న పాటలు వీరి స్వతంత్ర రచనలు. ఈ కావ్యాలన్నింటిలోని విషయ ప్రాధాన్యతనుబట్టి ఆయన కవిత్వాన్ని మనం అధ్యయనం చేయవచ్చు. వీరి కావ్యాలలో ప్రణయ కవిత్వం ఎక్కువగా మనకి ప్రస్ఫుటిస్తుంది.అలాగే వీరు ప్రకృతి కవిత్వాన్ని కూడ ఎంతో అందంగా పండించారు. వీరిలాగే భావ కవులందరూ ప్రకృతిని ఎక్కువగా ఆరాధిస్తారు. వీరు ప్రకృతిని శక్తిస్వరూపిణిగా భావించి ‘ప్రణయ సామ్రాజ్య’ వైభవమును ప్రకృతి విలాసములో ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా మనకి దర్శింపజేశారు. ఈ ప్రకృతి ప్రేమికుడు. ఇంకా ఆధ్యాత్మిక కవిత్వం కూడ రాశారు. ఇందులో ‘లలిత గీతావళి’ ఎక్కువగా కనిపిస్తుంది. సంఘ సంస్కరణల కావ్యంలో మహిళకు సముచిత గౌరవాన్నిచ్చి మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. వీరు రాసిన ‘స్నేహలతా కావ్యము’ ఈ సంఘసంస్కరణలకు సంబంధించినదే. అలాగే మానవతావాద కవిత్వం రాయడంలో కూడ వీరు గొప్ప అందెవేసిన చేయి. స్నేహంకోసం, మరీ ముఖ్యంగా ప్రేమతత్వంతో ప్రేమ, వృత్తికి సంబంధించి అంతకుమించి కూడు, గుడ్డ అందరికి అందుబాటులో ఉండాలనే గొప్ప ఆలోచనతో ఈ మానవతావాద కవిత్వాన్ని ఎంతో అద్భుతంగా మలచి సాహితీప్రియుల మనసు దోచుకున్నారు.
ఇంకా వీరు స్తుతి కవిత్వాన్ని, స్మృతి కవిత్వాన్ని రెండింటినీ సమతూకం చేస్తూ గొప్పగొప్ప కవుల ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ చక్కని కవితల్ని సాహితీ పూతోటలో విరబూయించారు. ఈ స్తుతి కవిత్వంలో రవీంద్రుడు, సర్వేపల్లి రాధాకృష్ణన్, శివశంకరశాస్ర్తీ, సరోజనినాయుడు లాంటి ప్రముఖ కవుల గురించి కవితలల్లి వాటి పరిమళాల్ని సాహితీప్రియుల ముంగిళ్ళలో వెదజల్లారు. ఈ స్తుతి కవిత్వంతోపాటు స్మృతి కవిత్వంలో రవీంద్రనాథ్ ఠాకూర్ సాహిత్యం గురించి తేనెకన్న మధురమైన కవితల్ని విరబూయించారు.
వీరు చదివింది 10వ (మెట్రిక్యులేషన్) తరగతి అయినా తెలుగు సాహిత్యంలో అద్భుతమైన పట్టుతో దేశం గర్వించతగ్గ గొప్ప రచయితగా ఎదిగారు. ‘ఆంధ్రకేసరి’ పత్రికలో రచనలు చేయడంతోపాటు సంపాదకునిగా విధులు నిర్వహించారు. యింకా మద్రాసులో కొమర్రాజువారి దగ్గర విజ్ఞానచంద్రికా గ్రంథ మండలీ, ఆంధ్ర విజ్ఞాన సర్వసంలో లేఖకునిగా ఉద్యోగం చేశారు. ఇలా వృత్తికి ప్రవృత్తికి సమన్వయంచేస్తూ, తెలుగు సాహితీ వినీలాకాశంలో తెలుగు కవితకు అభినవ దీప్తి నొసగి క్రొత్తపుంతలు చూసిన కోవిదుడు, అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి ఉట్టిపడే విధంగా రచనలు చేసిన అభినవ కవిగా గురువు, ఈ మేటి యుగకర్త అయిన రాయప్రోలు వేంకట సుబ్బారావుగారు 1984 జూన్ 30న భువినుండి దివికేగారు. వారి రచనలని ఆదర్శంగా తీసుకొని మరిన్ని కొత్త రచనలని విరబూయించడమే మనమంతా వారికిచ్చే ఘన నివాళి.

- పింగళి భాగ్యలక్ష్మి, 9704725609