Others

తీపి గుర్తులు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమవారం మధ్యాహ్నం సి.ఎస్.రాంబాబుగారు ఫోన్ చేశారు- సాయంత్రం ఒక సభ ఏర్పాటుచేశాము. మీరు కూడా పాల్గొనాలి, ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడాలి అన్నారు. ఏమిటి విషయం? ఏం సభ? అని అడిగాను.
మహాత్మాగాంధీ 150వ జన్మదిన సందర్భంగా నేటికీ ఆచరణీయం గాంధీ మార్గం అనే అంశంమీద ఒక మీటింగ్ ఏర్పాటుచేస్తున్నాం- హైదరాబాద్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా రేడియో సంయుక్తంగా అన్నారు. సరే అన్నాను. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరి పేరు చెప్పసాగారు మహామహులు అందరూ. వారి అందరి మధ్యలో నేనేం మాట్లాడతాను అని భయం వేసింది. ఆ మాటే అంటే, ఫర్వాలేదు ఒక రచయితగా మీకు తోచింది చెప్పండి.
మంగళవారం మధ్యాహ్నం నుంచి హోరున వర్షం. నాలుగు గంటలకు సభ, ఒక పావుగంట ముందుగానే సభాస్థలికి చేరుకున్నాము.
గోల్డెన్ ట్రెషోల్డ్ సరోజినీ నాయుడుగారి ఇల్లు, దాని ప్రాంగణంలో మహాత్మాగాంధీ నాటిన మామిడిచెట్టు. ఆ చెట్టుక్రింద సభ ఏర్పాటుచేశారు. అక్కడికి చేరిన తర్వాత నాగసూరి వేణుగోపాల్, సి.ఎస్.రాంబాబు, శైలజా సుమన్ ఆదరంగా ఆహ్వానం పలికారు.
అక్కడి దృశ్యం చూడగానే మనసు పులకరించింది, కళ్ళు చెమర్చాయి. అందరూ పెద్దవాళ్ళు. 80 దాటినవారు. తెల్లటి దుస్తులు ధరించి కుర్చీలో కూర్చుని ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడో చిన్నతనంలో మా పల్లెటూర్లో రచ్చబండ గుర్తుకువచ్చింది. ఒక్కొక్కరు ఒక చరిత్ర కలిగిన వ్యక్తులు.
కాఫీ, టీ, బిస్కెట్లు అందించారు. అనుకున్న సమయానికి కార్యక్రమం ప్రారంభమైంది. నాగసూరి వేణుగోపాల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిత్య సంతోషిణి మధురంగా ప్రార్థనగీతం ఆలపించారు. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన పాట వైష్ణవ జనతో. హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి.అప్పారావు అధ్యక్షత వహించారు. వేదిక దగ్గరే ఉంచిన గాంధీ మహాత్ముని ఫోటోకు పుష్పాలు సమర్పించి ఒక్కొక్కరు క్లుప్తంగా ప్రసంగించారు.
శ్రీయుతులు పూర్ణచంద్ర గాంధీ, మోహన్ కందా, టి.పురుషోత్తమ్‌రావు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి మనవడు పసుమర్తి సత్యనారాయణ మూర్తి, పి.జనార్దన్ రెడ్డి, బొంబాయి నుంచి వచ్చిన గరిమెళ్ళ సత్యనారాయణ, భూదానం సుబ్బారావు, జితేంద్రబాబు, సలీం, జస్టిస్ చలమేశ్వర్, జయప్రకాష్ నారాయణ, పొత్తూరి వెంకటేశ్వరరావు ఒక్కొక్కరు ఒక్కో మేరుశిఖరం వంటివారు. అమృతంగా మాట్లాడారు.
నా చిన్నతనంలో ఒక మహానుభావుడు చెప్తుంటే విన్నాను- సత్పురుషుల సాంగత్యంలో సమయం గడిపితే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. వారి అనుభవాలు మనకు పాఠాలు నేర్పుతాయి. ఆవేళ్టి సభలో ఆ మాట యదార్థం అనిపించింది. జీవితాన్ని కాచి వడపోయినవారు వారి అనుభవాలని ఆలోచనలను మనతో పంచుకుంటూ ఉంటే తన్మయత్వం.
నేను కూడా నాలుగు మాటలు చెప్పాను- గాంధీజీ మార్గంలో నడవటం అసాధ్యం కాదు సుసాధ్యమే అని చెప్పాను.
హత్యలు, కుట్రలు, మోసాలు గురించే ప్రసారం చేస్తున్నారు కానీ సమాజంలో మంచి కూడా చాలా వుంది. ముఖ్యంగా యువకులు ఎంతోమంది మంచి మార్గంలో నడుస్తున్నారు అని చెప్పాను. మానవసేవే మాధవసేవ అని మహాత్ముడి ఆ రోజు సూత్రాన్ని ఆచరించేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఎవరికైనా నా సాయం కావాలన్నా ముందుకు దూకుతూ ఉన్నారు. ఒకసారి ప్రమాదంలో వున్న వ్యక్తికి రక్తం కావాల్సివస్తే వాట్సాప్ గ్రూప్ ద్వారా సంప్రదింపులు చేస్తే పదకొండవ నిమిషానికి రక్తదానం చేసే వ్యక్తి ఆ హాస్పిటల్ చేరాడు అని నా అనుభవాన్ని చెప్పాను. వినాయకచవితి నిమజ్జనానికి డప్పులు హోరెత్తిస్తుంటే పోలీసులకు ఫోన్ చేస్తే, వారు వచ్చి చర్య తీసుకున్న విషయం చెప్పాను.
అందరూ తలుచుకుని ఐకమత్యంగా ప్రయత్నిస్తే గాంధేయ మార్గంలో నడవటం సాధ్యమే అని చెప్పాను. వందమందిలో ఒక్కడు మంచివాడు వుంటే అందరూ అతన్ని వెనక్కు లాగుతారు. అట్లాకాకుండా మంచివాడిని భుజం తట్టి ప్రోత్సహించాలి. ఇప్పుడు ఒక చెడ్డవాడిని, రౌడీని చూసి భయపడిపోయి పరుగులు పెట్టే రోజులు పోయి ఒక మంచివాడిని చూసి భయపడే రోజులు రావాలి అని చెప్పాను.
సభ ప్రారంభమైన కాసేపటికే చినుకులు మొదలయ్యాయి. కార్యక్రమానికి అంతరాయం కలిగింది. కానీ వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉండటంవల్ల లోపల హాల్లోకి మారింది సభ. కొద్దిసేపటి తర్వాత మొదలై సజావుగా సాగిపోయింది. ఆ కాసేపు కూడా ఖాళీ ఉంచకుండా నిత్యసంతోషిని మధురమైన గానంతో శ్రోతలను అలరించారు. ‘రఘుపతి రాఘవ రాజారాం, అల్లా తేరే నామ్’ వంటి పాటలను వింటూ వుంటే మనసు పులకించిపోయింది.
అప్పారావు, శ్రీమతి శైలజ సుమన్ అతిథులకు మెత్తని ఖద్దరు కండువా, మహాత్ముని బొమ్మ ఇచ్చి సత్కరించారు. ఈ జ్ఞాపికలను తెలంగాణ రాష్ట్ర గాంధీ స్మారక నిధివారు అందజేశారు.
చాలారోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాము. మహాత్ముని 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటుచేసినందుకు హైదరాబాద్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా రేడియో వారిని అభినందించాలి. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

-విజయలక్ష్మి పొత్తూరి