Others

జీవన దర్పణాలు (గోరాశాస్ర్తీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రాంగ్లముల్లో మేస్ర్తి అయిన గోరాశాస్ర్తీ పుట్టింది శ్రీకాకుళం సరిహద్దు అయిన ఒడిస్సాలో! గోవిందు రామశాస్ర్తీ చదువు చాలాచోట్ల సాగింది, పలు ఉద్యోగాలు చేశారు. చివరికి ఖుర్దా రోడ్డులో రైల్వేశాఖలో ఎ.ఎస్.ఎమ్.గా చేస్తున్నప్పుడు ఖాసా సుబ్బారావు కారణంగా 1945లో పత్రికారంగంలో ప్రవేశించారు. స్వతంత్ర పత్రికలో ఆంగ్ల పాత్రికేయుడుగా ప్రవేశించి, 1948 నుంచి తెలుగు స్వతంత్ర పత్రికకి నిర్వహించారు. అది ఒక దశాబ్దంపాటు మద్రాసు నుంచి సాగింది. 1957న తెలుగు స్వతంత్ర మూతపడగానే డా.పి. శ్రీదేవి ప్రోద్బలంతో సికింద్రాబాదుకు తరలివచ్చారు. జేమ్స్‌స్ట్రీట్‌లో తెలుగు స్వతంత్ర మళ్ళీ మొదలైంది. అది ఎంతోకాలం కొనసాగలేదు. 1961లో ఆంధ్రభూమి దినపత్రికలో సంపాదకులుగా చేరి కనుమూసేదాకా అంటే 1982 దాకా కొనసాగారు. ఆంధ్రభూమి సంపాదకుడుగా ఉంటూ డెక్కన్ క్రానికల్ ఆంగ్ల సంపాదకీయాలు అలవోకగా రాయడం విశేషం. ఈ సంపాదకీయాలు తరచు ఒకే అంశం మీదకాక, వేర్వేరు విషయాలపై సాగేవి. ప్రసిద్ధ సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు ఈ విషయం గురించి గోరాశాస్ర్తీ షష్టిపూర్తి సంచిక (1979)లో ఇలా అభినందించారు - ‘‘గోరాశాస్ర్తీకి ఇంగ్లీషు, తెలుగు నుడికారాలపై సమాన అధికారం ఉండటమే కాదు; ఆ రెండింటిలో సమానంగా రాణించారు.’’
గోరాశాస్ర్తీ జర్నలిజం రెండు భాషలలో, రెండు నగరాలలో సాగింది. అంతేకాదు వారి కృషి రెండు ఆకాశవాణి కేంద్రాల ద్వారా కూడా వ్యాపించింది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో వారు చర్చలలో పాల్గొనేవారు. మద్రాసు ఆకాశవాణి వారిని నాటక రచయితగా చిరంజీవిని చేసింది. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ రాసిన వచనమంతా ఆకాశవాణి రాయించిందే. ఇదేమాట గోరాశాస్ర్తీ నాటక రచనకు కూడా వర్తిస్తుంది. ఆయన కథలు పత్రికలలో వచ్చి ఉండవచ్చు. నాటికలు తెలుగు స్వతంత్రలో ప్రచురణ అయి వుండవచ్చు. అయితే నాటికా రచనకు కలం కదిలింది ఆకాశవాణి నెపం మీదనే! 1957లో సాగర్ పబ్లికేషన్స్ (11, బ్రాడ్వే, మద్రాసు-1) వారు ప్రచురించిన 108 పేజీల ‘ఆనందనిలయమ్’ హాస్యనాటకం పుస్తకంలో - ఈ నాటికకు పునాదిరాయి వేసిన మిత్రుడు ‘శ్రీవాత్సవ’ అని గోరాశాస్ర్తీ శ్లాఘిస్తారు. కొనే్నళ్ళపాటు ఏటా వార్షిక సాహిత్య సమీక్షలు రాసిన యండమూరి సత్యనారాయణ ఆకాశవాణి మద్రాసులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా చిరకాలం పనిచేశారు. వారి కలం పేరే ‘శ్రీవాత్సవ’, ‘ఆనంద నిలయమ్’ 1954లో ఒకసారి, 1957లో మరోసారి మద్రాసు, విజయవాడ కేంద్రాలలో.. ప్రసారమైంది. ఇందులో ఆరు ప్రధాన పాత్రలు - తండ్రి, తల్లి, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు. వంగర వెంకట సుబ్బయ్య, ఎన్.ఉదయలక్ష్మి, వావికొలను కృష్ణకుమారి, కాటూరి అన్నపూర్ణగార్లు రెండుసార్లు పాల్గొనడం విశేషం. 1954లో వై.జోగారావు, ఎ.ఎస్. గిరిగార్లు నటించగా 1957లో అవే పాత్రలను ఎ.పుండరీకాక్షయ్య, పేకేటి శివరామ్‌గార్లు చేశారు. వంగర, పుండరీకాక్షయ్య, పేకేటి గార్లు సినిమారంగంలో కూడా ప్రసిద్ధులని గమనించాలి.
ఇక్కడ పరిశీలిస్తున్నది ఆనందనిలయమ్, సెలవుల్లో... అనే రెండు రేడియో సీరియల్ నాటకాలు. రచనాకాలం సెలవుల్లో... 1953 కాగా, ఆనందనిలయమ్ 1954. వీటికి ఆధారం ఏమిటనే ప్రశ్న రావచ్చు. సెలవుల్లో... 1953 ఆగస్టు నెల నుంచి తెలుగు స్వతంత్రలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఆనందనిలయమ్ గురించి 1957లో ప్రచురింపబడిన పుస్తకం ఈ వివరాలను స్పష్టం చేస్తోంది. ఇంకా ఆనందనిలయమ్ ఏడు రంగాలు కాగా, సెలవుల్లో ఆరు అధ్యాయాలు. రంగాలు, అధ్యాయాలు అనే పదాలను రచయిత గోరాశాస్ర్తీ వాడారు. 1996లో జనహిత ప్రోద్బలంతో విశాలాంధ్రవారు ఆనందనిలయమ్‌కు, సెలవుల్లో... కలిపి ప్రచురించారు. ఇవి పుస్తకంలో 70 పేజీలూ, 59 పేజీలు ఆక్రమించాయి. సగటున ప్రతి సీన్ పది పేజీలు వ్యాపించి ఉంది - ఒకటి, రెండు సందర్భాలను మినహాయిస్తే.. అంటే.. ఒక్కోటి అరగంటపాటు సాగి వుండాలి. వీటికి నాటిక, నాటకం అనే మాటలు రచయితే వాడారు. 1996లో ప్రకటించినపుడు అట్టమీద హాస్యనాటికలు అని వెలువరించగా, అందులో ముందుమాట రాసిన గోపాల చక్రవర్తి ‘ఆనంద నిలయమ్’ సీరియల్ నాటకమన్నారు. చివరగా మనం వీటిని రేడియో సీరియల్ నాటకాలుగా నిర్ధారించి, అలాగే పిలువవచ్చు. రెండింటిలో హాస్యం కూడా పండింది కనుక రేడియో సీరియల్ హాస్య నాటకాలు అని కూడా చెప్పవచ్చు.
‘ఆనంద నిలయమ్’ రంగస్థలం మీద ప్రదర్శించారనే దాఖలాలు లేవుగానీ, సెలవుల్లో... మాత్రం అప్పట్లో ఒరిస్సా తెలుగువారు కుదించి ప్రదర్శించారని గోపాల చక్రవర్తి తన ముందుమాటలో పేర్కొంటారు. సెలవుల్లో... సీరియల్ మద్రాసువంటి నగరంలో మొదలై, కోనసీమకు చుట్టం చూపుగా కుటుంబం వెళ్ళి, తిరిగిరావడం ప్రధాన ఇతివృత్తం. ఇక ‘ఆనందనిలయమ్’ వస్తువు రాజమండ్రి, కాకినాడ వంటి అప్పటి పట్టణాలలో కొత్త ఇల్లు కట్టిన తర్వాత కుటుంబంలో నడిచే తంతు. రెండు సీరియల్ నాటకాలలో పాత్రలన్నీ గడుసుపిండాలే, పేలుడు గాయాలే! గోరాశాస్ర్తీ రాసిన ప్రతి సంభాషణా ఎక్కుపెట్టిన బాణమే! ఇది గోరాశాస్ర్తీ సృజన, ప్రతిభ. ఆనందనిలయమ్‌లో వెంకటరావు పాత్ర తప్ప ప్రతి ఒక్కరూ స్వార్థపరులే, పలాయనవాదులే! సెలవుల్లో పాత్రల స్వార్థ ధోరణి ఈ స్థాయిలో ఉండదు. ఆనంద నిలయం శీర్షికలో వ్యంగ్యం ఉండగా, సెలవుల్లో... శీర్షిక సీదాసాదా. అచ్చంగా రేడియో మాధ్యమం కోసం రాసిన ఈ రెండూ ఆకాశవాణి పరిభాషలో చెప్పాలంటే అవి ఫామిలీ సీరియల్స్. రెండూ గోరాశాస్ర్తీ అమోఘమైన పరిశీలనా దృష్టికి తార్కాణాలే! చిన్నచిన్న వాక్యాలూ, పదునైన వ్యక్తీకరణలు గుర్తుండిపోతాయి. ఈ రెండు సీరియల్ నాటకాలను విడిగా పరిశీలించేముందు అవి ఎప్పటి కాలం నాటివో గమనించాలి. అది రేడియో మాత్రమే వినేకాలం; 5రూ॥ ఇంటిల్లిపాదికీ హోటల్ టిఫిన్ లభించే కాలం; కాశీకి 50 రూపాయలకు టికెట్టు; 42 రూపాయలకు గృహప్రవేశానికి తగిన చీర లభించే కాలం; అంతేకాదు 30 వేలకు ఇల్లు కట్టగలిగిన కాలం; 2 వేలకు గృహప్రవేశం నిర్వహించడం సాధ్యమయ్యేకాలం! అంటే ఆరున్నర దశాబ్దం క్రితం మాట. రిక్షాలు, బస్సులు, రైళ్లు మాత్రమే నడిచే కాలమన్నమాట. సెలవుల్లో పల్లెపట్టుకు తరలివెళ్ళే కాలం!
2
దయామయి, అమృతమూర్తి, బహుముఖ ప్రజ్ఞావతి, చెల్లెమ్మ శ్రీదేవికి అంటూ సమర్పణ చేయబడిన ఈ ఏడు భాగాల సీరియల్ ‘ఆనందనిలయమ్’లో ఒక కుటుంబంలోని ఆరుగురు - ఇంటి యజమాని, ఇల్లాలు, కొడుకు, కోడలు, కూతురు, ఇల్లరికపుటల్లుడు గార్లతో పాటు ఇల్లాలి అన్నగారు వెంకటరావు ప్రధాన పాత్రధారులు. ఈ సీరియల్ నాటకం మొత్తం ఆక్రమించినా ఇల్లాలు పేరు వినబడదు. యజమాని పేరు కూడా అంతే! తప్పిపోయారని పత్రికా ప్రకటన ఇచ్చినపుడు మాత్రమే ఒకసారి యజమాని పేరు అడ్డతీగల ఆంజనేయులు అని తారసపడుతుంది. ఆయన అపర దూర్వాసుడిలా చిటపటలాడటమే కాదు, అల్లుడిని శకారుడని పదేపదే ప్రస్తావించగలిగిన గడుసరి, మహా పొదుపరి. ఇరవైనాలుగ్గంటలూ ఏడుకొండలవాడా అని కలవరించే ఇల్లాలు ఎప్పుడూ నోములు, వ్రతాలు చేస్తూ; పిండివంటలు మాత్రం కొందరికే పంచాలని అలకపాన్పు ఎక్కే నేర్పరి! పుట్టింట్లో రుబాబు చెలాయించే కూతురు హేమ. సరైన నిర్ణయాలు తీసుకోని, తీసుకోలేని కుమారుడు గోపాలం. ఈ నాటకంలో ఇద్దరు రచయితలు కనబడతారు - వారు ఒకరు కోడలు సావిత్రి, ఆమె కథలు రాసి పాతిక రూపాయలు అదేరోజు పత్రికలవారి నుంచి మనియార్డరు పొందగా; అల్లుడు శివరావు పుస్తకాల కొనుగోలు కోసం అప్పులు చేసి భార్య, అత్తగార్ల దుంపతెంచుతూ ఉంటారు. ముప్ఫయివేలు పోసి కట్టిన ఇంటికి గృహప్రవేశ కార్యక్రమం ముందు రోజు చేసే హడావుడితో ఈ నాటకం మొదలవుతుంది. ‘ఆనంద నిలయమ్’ అనే పేరును అల్లుడు శకారుడు - కాదు శివరావు ఎవరూ చెప్పకపోయినా నిర్ణయించి, శిలాఫలకం తయారు చేయిస్తాడు. తను ఇవ్వాల్సిన వారికే పిండివంటలు పంచాలని, వాటికడ్డంగా అలకపాన్పు ఎక్కుతుంది ఇల్లాలు. ఆమె చెప్పేకారణాలు ఏమిటంటే గాడిపొయ్యి దగ్గర తడిక నిప్పంటుకోవడం, తర్వాత కోడలు చీరకొంగు మీద అగ్గిపుల్ల పడటం, దీనికి నలభై రెండు రూపాయల చీరపోయిందని మామగారు ఎగరడం. ఇదిలా ఉండగా ఇలవేల్పు కామేశ్వరి విగ్రహం బావుందని అల్లుడు డ్రాయింగ్‌రూమ్‌లో అలంకరణగా పెట్టడం, అది దోషమని శాంతి హోమాన్ని యజమానికి తెలియకుండా చేయడానికి మిగతా కుటుంబ సభ్యులు పూనుకోవడం, దీనికి ఇంటి యజమాని కోప్పడి కనబడకుండా పోవడం, ఇంతలో అల్లుడు మామగారు కనబడుటలేదు - అని పత్రికా ప్రకటన ఇవ్వడం, ఇల్లంతా పెడబొబ్బలతో గోలగా ఉన్నపుడు పనసకాయలతో ఇంటిపెద్ద ప్రత్యక్షమవడం పరాకాష్టకాదు, అలిగి ఇల్లు అమ్మేశానని ప్రకటించడం కొసమెరుపు. నిజానికి చెప్పాలంటే అది ఆనందనిలయమ్ కాదు ఆరుగురు కుటుంబ సభ్యులు పదేపదే పేర్కొన్నట్టు కొంప. అల్లుడు చెప్పినట్టు మేడిపండు సంసారం లేదా అత్తగారు అన్నట్టు కుంభీపాక నరకం. మరోరకంగా చెప్పాలంటే ఆరుగురు స్వార్థపరులైన కుటుంబ సభ్యులు తమలో తాము చేసుకునే నిశ్శబ్ద యుద్ధం.
రచయిత గోరాశాస్ర్తీతో పాటు ఆకాశవాణి వారు కూడా హాస్యనాటకం అని పిలిచినా - ఇందులో పురాణం సుబ్రహ్మణ్యశర్మ చెప్పినట్టు చాలా విషయాలున్నాయి. ‘‘ఇది హాస్య నాటకమన్నారుగానీ, నిజంగా మధ్యతరగతి కుటుంబాల్లోని కల్లోలాలూ, చేజేతులా జీవితాన్ని పాడుచేసుకుంటూ, ఒకరికొకరు ఆగర్భ శత్రువుల్లా తిట్టుకుంటూ పరస్పరం పీడించుకుంటూ బ్రతికే మనుషుల జీవితాలలోని బీభత్సాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించే గంభీర విషాదాంత కావ్యం. ఈ నాటకం వింటున్నపుడు కలిగే నవ్వుల్లో చార్లీచాప్లిన్ తాలూకు హ్యూమర్‌లాంటిది పలుకుతుంది. కుటుంబాల్లోని అవకతవకలు, అసందర్భాలు, మూర్ఖత్వాలూ, మొండిపట్టుదలల విషాదాన్నుంచి అమృతం పిండి మనకు ఆనందించమని శాస్ర్తీగారు అందించారు. ఈ నాటకంలోని పాత్రచిత్రణ, సంభాషణల సన్నివేశ కల్పన మృచ్ఛకటికం స్థాయిని అందుకుంటుందని చెప్పడం శాస్ర్తీగార్ని మితిమీరి పొగిడినట్లు అవుతుందని అనుకోరాదు.’’ ఈ మాటలను గోపాల చక్రవర్తి తన ముందు మాటలో ఉటంకించారు - అయితే వాటికి ప్రధాన వనరు ఏమిటో పేర్కొనకుండా.
పందికొక్కు పెసల డబ్బా పడేస్తే నానారభస జరుగుతుంది కానీ, ఎవరూ ఆ పెసలు తీయరు. ఇలాంటివి అడుగడుగునా ఆ కుటుంబంలో కనబడటం - మనకు తీవ్రవిషాదాన్ని కలిగిస్తాయి. అయితే, ప్రతిపాత్ర ఎంతో లాఘవంతో, ప్రతిమాటలో పండించే హాస్యం కారణంగా వినోదం వెల్లివిరుస్తుంది. కొనుగోలు చేసిన ఇల్లు అచ్చిరాదని తిరస్కరించడంతో కథ మొదటికొస్తుంది. యజమాని ఇంటి ధరను 30 వేల నుంచి ప్రతిసారి దాని ఖరీదు పెంచుతూ చివరకు 42 వేలు చేసి చెబుతాడు.
‘‘నాన్నగారే నయం! హాయిగా పారిపోయి సుఖపడ్డారు. ఆడదాన్ని నేనెక్కడికి పారిపోగలను?’’ - ఇది కూతురి హేమ డైలాగ్.
‘‘పుట్టెడు బెంగతో నేనేడుస్తుంటే, మధ్య నువ్వొకతివీ... తిప్పలాడి దొరసాని బొమ్మవి’’ - ఇది తల్లి - కూతురితో అనే మాట.
‘‘ద్వారపూడి పశువుల సంతైనా రుూ కొంపకంటే నయం...’’
- ఇది కోడలి ఉవాచ
‘‘మేరంగి మేళానికి పరువు, మర్యాద లోకువ’’ - ఇది అల్లుడిగారి మాట.
‘‘నేను పగిలి పిట్టయితే, నువ్వు వానపామువి’’ - మరదలితో వదిన.
‘‘ఇంకెవరు నాయనా... పందికొక్కు... ఇం-త పందికొక్కు’’ అనే అత్తమాటకు అల్లుడి రిటార్ట్ ఇలా ఉంటుంది.
‘‘పాపం, మీ గంట విని హడలి పోయుంటుంది... నేనే హడలిపోగా లేనిది...’’
* * *
ఇల్లాలి అన్నగారు పెద్ద మనసుతో చెల్లెలిని, చెల్లెలు కూతురుని కొంతకాలం యింటికి తీసికెళ్ళడం మాత్రమే కాక, బావగారితో కాశీకి పయనమవుతాడు పరిష్కారదిశగా. ఇదంతా అంతటి సత్తెకాలం. గోరాశాస్ర్తీగారు ఏడు భాగాలతో ముగించారు కానీ, మరికొన్ని భాగాలు రాసి పొడిగించి వుండవచ్చు. ఇంట్లో విగ్రహం, గది మారితే, రెండు సీన్లు సాగుతుంది నాటకం. మరి కనబడుటలేదు ఇంటియజమాని అని పత్రికా ప్రకటన ఇస్తే పర్యవసానాలతో మరో మూడు, నాలుగు వారాలు బేషుగ్గా నాటకం నడపవచ్చు. అలాంటి ప్రయత్నం చేయలేదు గోరాశాస్ర్తీ.
‘‘ఆడదాన్ని సలహా అడిగేకన్నా, సన్యాసం పుచ్చుకోవడం మేలు...’’
‘‘చదువుకున్న పెళ్ళాం హితబోధ బాగా తలకెక్కిందన్నమాట?’’ వంటి మాటలు ఇప్పటి వారికి ఇబ్బంది కల్గిస్తాయి. అయినా - ‘ఆనంద నిలయమ్’ చదివి పుస్తకం మూసి పెట్టిన తర్వాత గోరాశాస్ర్తీ సంభాషణలు మనల్ని వెంటాడుతాయి.
3
సోఫాలో పడుకుని, ఫాన్ వేసుకుని, నవల చదువుకోవడమే సుఖపడటం అనే కాలం నాటిది ఆరుభాగాల సీరియల్ నాటకం ‘సెలవుల్లో...’.
‘‘...మనగడ్డ మీదనే మనం కాందిశీకులం. దేనికీ, ఎవరికీ చెందం. ఎక్కడా కూకటి వేళ్ళు లేని వాళ్ళం, అద్దంలో మొహం చూసుకునేందుకు కూడా భయం’’ వంటి ఆలోచనాత్మకమైన ఈ నాటకం కూడా ఆరుపాత్రలతో హాయిగా, హడావిడిగా సాగుతుంది. ఇల్లాలు సుందరమ్మ, కూతుళ్ళు లలిత, కళ్యాణి, కొడుకు రత్నంతోపాటు ఇంటి యజమాని ప్లీడరు ప్రధానపాత్రలు. ఇందులో కూడా ప్లీడరుగారి పేరుండదు. నగరపు కుటుంబంలో సుందరమ్మగారికి ఇంగ్లీషు భాషేకాదు, ఆధునిక సౌకర్యాలు, హంగులంటే ఇష్టం. పెద్దమ్మాయి లలితకు ఇటీవలే పెళ్ళి అయ్యింది, బియ్యే అయ్యాక అత్తగారింటికి పంపాలనే మిషతో సుందరమ్మ ఉండటమే కాదు, వీలైతే అల్లుడుగారిని ఇల్లరికం తెచ్చుకోవాలనే ఉబలాటంతో ఉంది. రెండో కూతురు కళ్యాణి, కుమారుడు రత్నం ఎంతో చలాకీగా ఉంటుంటారు. వీరి డైలాగులో బోలెడు ఇంగ్లీషు పదాలు ఉండటమే కాదు, సుందరమ్మ ఇంగ్లీషు హాస్యాన్ని చిప్పిల్లుతుంది.
వేసవి సెలవుల్లో డాన్సుక్లాసులు ఎగ్గొట్టించి కోనసీమకు - పెద్దకూతురు అత్తగారింటికి సెలవుల్లో విహారంగా వెడతారు. సుందరమ్మకు ఇష్టం లేకపోయినా ప్లీడరుగారు లాఘవంగా సిద్ధం చేయిస్తారు - కోనసీమ ఊటీ తాతలాగ ఉందని చెప్పి. అక్కా చెల్లెళ్ళ మధ్య అల్లరి, అక్కా తమ్ముళ్ళ మధ్య పోట్లాటలతో ఈ నాటకం ఆద్యంతం హాయిగా ఉంటుంది. అల్లుడుగారి ప్రస్తావన పదే పదే వస్తుంటుంది కానీ - ఆ పాత్ర కనబడదు, వినబడదు.
‘‘రామరామ! ఈ కొంపలో ఎవరికీ తెలుగు రాదల్లే ఉంది -’’
అని అక్క అంటే...
‘‘ఇంగ్లీషు కూడా రాదులే - నీకా బెంగ అక్కర్లేదు’’ అని తమ్ముడి జవాబు!
- ‘‘ఏమండీ - అలా పోస్టుబాక్స్‌లాగా నిలబడి పోయారేం? అనే భార్య ప్రశ్నకు భర్త ప్లీడరుగారి జవాబు
‘‘మరేం చెయ్యమంటావ్? రైలు బండిలో పరిగెత్తమంటావా?’’
ఇలా సాగుతుంది ఈ సీరియల్ నాటకం. కోనసీమకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా బయలుదేరుతుంది సుందరమ్మ. అక్కడ సంత జరగడం; సంతకు వెళ్ళిన కళ్యాణి, రత్నం పోట్లాడి తప్పిపోయి ఆలస్యంగా రావడం; ఆ ఊరి మునసబు, కరణం అడిగారనే వనభోజనాలకు ఈ కుటుంబం వెళ్ళడం; అక్కడ వారు మనస్తాపం చెందడం; ప్రతీకారంగా తమ హోదాను తెలపడానికి కళ్యాణి బర్త్‌డే ఫంక్షన్ ఏర్పాటు చేయడం; చివరకు నగరానికి వెనక్కు రావడం - ఇదీ కథ.
అయితే ఇందులో పెద్ద కూతురు లలిత బియ్యే తప్పినా, జీవితంలో త్వరగా కనువిప్పుగలిగి భర్తతో ఉండాలని నిర్ణయించుకుంటుంది. దీనికి తండ్రి అండ ఉంది. కానీ తల్లి సుందరమ్మకు ఇష్టం ఉండదు. ‘‘అందరు ఆడాళ్ళలాగే మొగుడు దగ్గిర బానిస బతుకు బతుకుతానంటావు’’ అని నొచ్చుకుని బాధపడుతుంది.
‘‘వ్యామోహాలు లేనిది బతుకే లేదు. అయితే కొన్ని పెద్ద వ్యామోహాల కోసం చిన్న వాటిని ఒదులుకోవాల్సి వుంటుంది’’ అని కూతురు లలిత తల్లికి చెబుతుంది.
ఇదేపాత్ర తండ్రితో చివర్లో ఇలా అంటుంది -
‘‘ముళ్ళు లేని గడియారంలాగ ఏవిటో టిక్కుటిక్కుమంటున్నా - అర్థం లేని జీవితాలు గడిపామనిపిస్తోంది.’’
* * *
ఆనంద నిలయమ్‌కు, సెలవుల్లో... ఈ రెండు సీరియల్ నాటకాలూ చివరకు సుఖాంతాలయినా - ఆనందనిలయమ్ నడక చాలా భయాందోళనలు కల్గిస్తే, సెలవుల్లో... ముగింపు మంచి రిలీఫ్‌నిస్తుంది. గోరాశాస్ర్తీ తన నిత్యకృత్యమైన పత్రికారచన కాకుండా కథలు రాశారు, నాటికలు సృజించారు. అయితే ఆకాశవాణి శ్రవ్యనాటికలే గోరాశాస్ర్తీకి తెలుగు సాహిత్యలోకంలో పెద్ద పీటను వేశాయి.

- డా॥ నాగసూరి వేణుగోపాల్