Others

శంకలేక పూజించు శంకరుడిని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మూర్తి త్రయమందు నొకడివై మోకరిల్లు
వారికండగ నిలుచుండి వరములమిత
ముగ నొసంగెడి లయకారి! మునిహృదయుడ!
పాహిమాం పరమేశ్వరా!! పార్వతీశ!

భావం: ఓ లయకారీ! మునిహృదయుడా! మూర్తి త్రయంలో ఒకడివైన శంకరా! నీ ముందు మోకరిల్లిన వారికి అండగా నీవు ఉండి అమితమైన వరాలను ప్రసాదిస్తావు స్వామీ!
తే.గీ. ఎట్టి యవతారములను నీవెన్నడైన
దాల్చలేదాయె ఁ గాని నాతలపుఁ గనియు
నవతరించితివే హృది నావహించి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ పార్వతీ పరమేశ్వరా! నీవెన్నడు ఎలాంటి అవతారాలను దాల్చలేదు. నా మనోభావనను గ్రహించి నా హృదయాన్ని ఆవహించి నన్ను కాపాడుటకు అవతరించావు స్వామీ.
తే.గీ. ప్రజల రక్షణభారమావశ్యకముగఁ
దలచి యా శ్మశానంబునే వలచినావు
నీకు సాటెవ్వరును లేరు నీలకంఠ!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఓ నీలకంఠా! ప్రజల రక్షణభారాన్ని నీపై వేసుకొని భూత ప్రేత పిశాచశాకినీ ఢాకినీ గాలి దయ్యాల బారినుండి మమ్మల్ని కాపాడడమే లక్ష్యంగా శ్మశాన వాటికనే నీ నివాసస్థలంగా ఇష్టపడి యెంచుకున్న నీకు సాటెవ్వరూ లేరయ్య.
తే.గీ. మనసు పుష్పంబుగాఁ జేసి మదిన శంక
రా! నినుఁబ్రతిష్ఠించియు రాగరంజి
తంబు గనుఁ గొల్చి యానంద ధారలందుఁ
దడిసి యుం దరియింతునీ ధరణియందు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ శంకరా!నిన్ను నా మనసులో ప్రతిష్ఠించుకుని నా మనోపుష్పాన్ని నీకు సమర్పించి ఆనంద ధారలలో తడిసి తరించాను స్వామీ!

తే.గీ. శివశివాఱుణాచలవాస! శివహర భవ
నిన్ను నమ్మితి నా మది నిలచి నన్ను
కరుణఁ జూపుచు కావవే కాలకంఠ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ అరుణాచల వాసా! శంకరా! నినే్న నమ్ముకున్న నా హృదయమందు నిలచి కరుణతో నన్ను కాపాడు తండ్రీ.

తే.గీ. కష్టనష్టాల కడిలో ఁగాలమంత
కొట్టుకొని పోవు చుండెనే యెట్టులైన
వాటినిందొలగింపవె మేటి దొరవు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: శంకరా! నా జీవితమంతా కష్టనష్టాల కడలిలో కొట్టుకూని పోతోంది స్వామీ!ఎలాగైనా వాటిని తొలగించి కాస్త ఉపశమనాన్ని కలిగించవయ్య.

తే.గీ. హరహరా! వెండికొండపై హాయినొంది
నీ సతీసుతులం గూడి నిత్యసుఖము
లందుచుంటివే! మాగతి? లయకరుండ!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: హరహరా! స్వామీ! కైలాస గిరి పై జనని పార్వతమ్మ. నీకుమారులైన వినాయక కుమార స్వాములతో కూడి నిత్యసుఖాలనుభవిస్తున్నావే! మరి నా గతేమిటి దేవా?

తే.గీ. ఈశ్వరా! శివా! హరహరా! యెన్ని చిక్కు
లం బడిన ఁగాని యత్యంత లాఘవముగ
వీడిపోవును నిను ఁ దల్వ వేడుకున్న
పాసిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఈశ్వరా! శివా! హరహరా! ఎన్ని చిక్కులు వచ్చిపడినా నిన్ను తలచుకున్నా, వేడుకున్నా ఎంతో తేలికగా తొలిగిపోతాయి శంకరా! జశివ అన్న నామం పలుకగనే పాపాలు తొలిగి పార్వతీశుని సన్నిధి లభ్యమవుతుందని కదా పెద్దల మాట.
తే.గీ. ఓ శివా! ఫణి భూషణా! రాశిఁ బోసి
నిన్నుఁ బూజింపఁ బెన్నిధిఁ గాననట్టి
వాడనే జలంబుల తోడఁ బల్కరింతు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ ఫణిభూషణా! శివా! ధనరాశులు పోసి పూజించడానికి నావద్ద పెన్నిధి లేదే! అందుకే జలాలతోటి నిన్ను పల్కరిస్తున్నానయ్య. అయనా జలమే నీకు ప్రియం గదా.
తే.గీ. వ్యాకులతలొక్క పెట్టున వచ్చిపడియె
తాళ లేకుంటినో హరా! తాపమడిచి
మదికి శాంతిని యొనగూర్పుమయ్య దేవ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఎన్నో వ్యాకులతలతో తాళలేకపోతున్నాను హరా! నాలోని తాపమణచి వేసి నా మనస్సుకు శాంతిని ప్రసాదించవయ్య. విభూ తి ధరించిన నేను నీకు మారురూపుగా ఉండే విధం తెలియచేయవయ్య.
తే.గీ. భక్తతతులన్న నీకు సయిరము గనుక
వారి సేమమ్ము దలచెడి వాడ వీవు
దయకు ఁబట్టమ్ము గట్టిన దైవమీవు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ శంకరా! నీ భక్తులంటే నీకెంతో సంబరం. అందుకే వారి క్షేమాన్ని గూర్చే ఆలోచించే వాడవు. దయకు పట్టం గట్టే గొప్ప దైవానికి నీవే స్వామీ.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262