Others

ఆ ఒక్క నిమిషం నోరు మూసుకోలేరా? (వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మే 27న దీదీ మమతా బెనర్జీ కలకత్తా ‘ఎర్రవీధి’లో జనాలమధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు- సభలో హేమాహేమీ నాయకులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీరందరితోపాటే శ్రీమాన్ లల్లూ ప్రసాద్ యాదవ్ ప్రక్కనే అంతెత్తు విగ్రహం కనుక- అందరి కంటా పడుతూ కాశ్మీర్ జనాల వృద్ధ నాయకుడు, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు జనాబ్ ఫారూక్ అబ్దుల్లాగారూ కూడా కెమెరాల దృష్టిని ఆకట్టుకుంటూనే వున్నాడు.
ఐతే, ఫారూక్ అబ్దుల్లా సారు లల్లూజీతో హస్కుకొట్టడం లేదు. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూనే వున్నాడు, ఓ టీనేజ్ గాళ్ బోయ్‌ఫ్రెండ్ ఫోన్‌కాల్ ఆన్సర్ చేస్తూన్నట్లు- బిజీ బిజీ! పైగా మెసేజీలు కూడా నొక్కేస్తున్నాడు. ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రా? ఆర్మీ చీఫా? అంత యిదా? చివరికి జాతీయ గీతాలాపన కోసం ‘‘అంతా లేచి నిలబడడండహో!’’ అంటూ మైక్‌లో ప్రకటన విని, నలుగురితోపాటు తానూ యంత్రవతుగా నిలబడ్డాడేగానీ- అబ్దుల్లాసారు మొబైల్ మూతిని నొక్కలేదు. వాచాలతని ప్రదర్శిస్తూనే వున్నాడు.
దేవుడు గంపంత కన్ను పెట్టుకుని చూడకపోయినా, యిది లక్ష కెమెరా నేత్రాలున్న కాలం. చివరిగా విలేఖరులు నిలదీసినప్పుడయినా లెంపలు వేసుకున్నాడా? ‘నో కామెంట్’ అన్నాడు. రాజ్యాంగంలోని 51వ ఆర్టికల్ (ఎ) స్పష్టంగా ‘జాతీయ గీతాలాపను గౌరవించి తీరాలి’ అని ఖండితంగా చెబుతోంది.
‘‘మా రాజ్యాంగం వేరు’’ అంటాడేమో? అందరికంటే సీనియర్ నాయకుడు! కాకపోతే అంతర్జాలంలో రుూ వీడియో అంటువ్యాధి అయిపోయి జనాలు ఎడాపెడా వాయిచేస్తున్నారు. ‘‘రేపటి ఐక్యసంఘటనకి రుూయనేనా, (వి)నాయకుడు?’’ అంటున్నారు.
రోజుకో కిలో లెక్కన 371 కిలోల లడ్డూ!
బూరె (పూర్ణాలు) లేని పెళ్లి, లడ్డూలేని సంబరం- ఇండియాలో వుండదు. అటువంటిది నరేంద్ర మోదీగారి పరిపాలనా చాతుర్య ద్వితీయ వార్షికోత్సవానికి ‘లడ్డుండలు’ పంపిణీ చెయ్యరా?
ఢిల్లీలోని ప్రఖ్యాతిగాంచిన కానాట్‌ప్లేస్- భజాపా కార్యకర్తలు, వర్తకులు, వగైరా- అందరూ కలిసి ఎన్.డి.ఏ. పాలనా ద్వితీయ వార్షికోత్సవాన్ని- వినాయక చవితి స్టయిల్‌లో చేశారు. మంత్రి కల్‌రాజ్ మిశ్రా ఆధ్వర్యంలో 371 కిలోల లడ్డూని- ఇరవై మంది పాకకోవిదులు- రెండు రాత్రుళ్ళూ, రెండు పగళ్లూ కష్టపడి తయారించారు. ‘‘ఖర్జూరం చౌక్’’లో బ్రహ్మాండంగా దీన్ని ప్రదర్శించారు. 371 రోజుల పాలనకు చిహ్నంగా అన్ని కిలోల బరువుండగా- దీనికి మోదీగారి జనహిత పథకాల పేర్లు చూపించే 57 పతకాలను తయారుచేసి గ్రుచ్చారు.
ఈ సందర్భంగా ఓ రెండు కిలోమీటర్ల పరుగు కార్యక్రమం, వో ఫొటో ప్రదర్శన కూడా పెట్టారు. బ్రహ్మాండమయిన రుూ లడ్డూ అందర్నీ ఆకర్షించింది. కాకపోతే దీన్ని వేలం వేయకుండా- మోదీ అభిమానులకి కానాట్ ప్లేస్‌లోని జనాలందరికీ ప్రసాదంగా పంచిపెట్టారు. ‘‘సారులాగా మేము గ్రామాలకు మంచి పథకాలను పంచలేకపోయినా- లడ్డూని పంచుతున్నాం’’ అన్నారు కార్యకర్తలు!

పాపకోసం గొరిల్లా హతం!
‘జూ’లకు వెళ్తారా? పిల్లలు తిన్నగా వుండరు. సింహాలు, పులులు, గొరిల్లాలు, లొట్టిపిట్టలు వగైరాలు- వాళ్ళకేదో ఆటబొమ్మల్లా వుంటాయి కాబోలు- గొప్పగా ఆకర్షితులైపోతారు.
సిన్‌సినాటి (అమెరికా) జూలో గొరిల్లాలు స్పెషల్. వీటి కోసం నిత్య జలధారలతో వో కందకం వుంటుంది. అంతరించిపోతున్న ఈ జాతి రక్షణ కోసం చాలా భద్రతలుంటాయి. కానీ, నాలుగేళ్ళ ఒక పాప గొరిల్లాని చూస్తూ- కేరింతలు కొడుతూ తల్లి చేతిలోనుంచి క్రింద కందకంలో పడిపోయింది, జారి. ఆ గొరిల్లా పదిహేడు సంవత్సరాలనుంచీ ఆ జూకి ఒక జ్యూయల్‌గా వున్నది. పాపను ఎత్తుకుని నీళ్ళల్లో ముంచి, తీసి ఆడుకోడం మొదలెట్టింది.
మత్తు గోళీలు పెట్టి ఆ గొరిల్లాని కొట్టడం మొదలెట్టారు. దానికి మత్తు ఎక్కేలోగా, పాప సొమ్మసిల్లిపోయింది. దీంతో జూ అధికారులు భూతదయకు లొంగిపోయి, పాప ప్రాణం గొరిల్లా ప్రాణం కన్నా ఎక్కువగా భావించి, దాన్ని తుపాకులతో కాల్చి చంపేసి పాపను ఆసుపత్రిలో చేర్పించారు. దీనిమీద చాలా గొడవ జరుగుతోంది. పాప మాత్రం కోలుకుంటోంది. తల్లిదండ్రులు- ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా పిల్లల్ని ‘కేర్‌లెస్’గానే ఎక్కడికైనా తీసుకుపోతారన్నమాట!
జన్మమెక్కడో రాసిపెట్టి వుంటుంది!
పుట్టుక కూడా మరణంలాగే- అందరికీ రాసిపెట్టి వుంటుందేమో? శ్రీకృష్ణపరమాత్మకే జైలులో పుట్టమని బ్రహ్మదేవుడు రాసిపెట్టాడు. అలాగే, గ్వాలియర్ పిల్లవాడికి ఢిల్లీ పోలీసుల వ్యానులో పుట్టమని రాసి వుండాలి ఆ విధాత!
అత్తమామలు స్వయంగా కోడలు ఆర్తి (29)ని గ్వాలియర్ నుంచి పానిపట్‌లోని ‘సమాల్‌ఖా’ అనే గ్రామానికి తీసుకుపోతున్నారు. మధ్యలోనే ఆ వనితకి పురిటినొప్పులు ప్రారంభమైనాయి. ఢిల్లీ సబ్జీమండీ ప్లాట్‌ఫామ్‌మీదికి- నొప్పులతో మెలికలు తిరిగిపోతున్న ‘ఆర్తీ’ని రైలు దింపేసుకుని, ఆ దంపతులు, స్టేషన్ స్ట్ఫాని బ్రతిమాలుకున్నారు.
ఒక మంచి ఉద్యోగి పోలీసులకి ఫోన్ చేశారు. హెల్ప్ కేంద్రం నుంచి. పి.సి.ఆర్.46, పోలీసు శకటం హుటాహుటీ వచ్చి, చూలింతని ఆసుపత్రికి తీసుకొనిపోతూ వుండగా- మార్గమధ్యంలోనే పండంటి బిడ్డ ‘క్యార్ క్యార్’మంటూ, పోలీసు శకటం నేలమీద పడ్డాడు. తల్లినీ, బిడ్డనీ బారాహిందూరావ్ ఆసుపత్రికి చేర్చారు రక్షకభటులు. ఆ కుర్రవాడికి ‘పోలీసురావు’ అని పేరెట్టుకుంటారేమో!
ఇదిలా వుండగా మొన్న మనం తెలుసుకున్న టాయ్‌లెట్ వాటర్ టొమెటో సూప్ కథనం తర్వాత, మొన్న ఆదివారం అదే ఎక్స్‌ప్రెస్ ‘దురంతో’లో ప్యాంట్రీకారు స్ట్ఫా ‘‘ప్రయాణీకులకు ఫుడ్ ఇవ్వం’’ అన్నారు. దాంతో ప్యాసింజెర్లు మధ్యదారిలో రైలుబండిని మూడు గంటలసేపు ఆపేశారు.
అతివేగంగా పరిగెత్తే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లలో ‘దురంతో’ ముఖ్యం!
*

-వీరాజీ veeraji.pkm@gmail.com