ఆంధ్రప్రదేశ్‌

గ్రామాభివృద్ధే మోదీ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఏప్రిల్ 24: గ్రామాభివృద్ధే దేశానికి శ్రీరామరక్ష అని, వాటి బలోపేతానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు గ్రామంలో ఆదివారం సర్పంచ్ నాగరాణి అధ్యక్షతన నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ ముగింపు సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సుదీర్ఘ ప్రసంగం చేశారు. 73, 74 రాజ్యాంగ సవరణల మేరకు గ్రామ పంచాయతీలకు 29 అంశాలను బదలాయించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరుతోందన్నారు. పంచాయతీల ఆర్థిక పరిపుష్టి కోసం కేంద్రం 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే జమ చేస్తోందన్నారు. అందుకోసం రూ. 2.292 లక్షల కోట్ల నిధులు విడుదల చేయనున్నామన్నారు.
మహిళా సాధికారత కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. దేశంలో నేడు 45.5 శాతం మహిళా ప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఎన్నికయ్యారన్నారు. ఆధార్ అనుసంధానం చేసి సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకు అందేవిధంగా చూస్తున్నామన్నారు. అవినీతికి కళ్లెం వేస్తు అనేక పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ స్వచ్ఛ్భారత్, సురక్ష యోజన, జనధన్, ఫసల్ బీమా యోజన, గ్రామీణ సడక్ యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రైతే రాజుగా పిలువబడే విధంగా వ్యవసాయ రంగానికి అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేసి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలో ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. ప్రధాని మోదీ, రాష్ట్రంలో సిఎం చంద్రబాబునాయుడు దూరదృష్టి వల్ల రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు. దేశంలో ఇంకా 18,453 విద్యుత్ లేని గ్రామాలు వున్నాయని, మూడేళ్లలో దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా వెంగళమ్మచెరువు గ్రామ సర్పంచ్ నాగరాణి అభ్యర్థన మేరకు గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరించేలా కేంద్ర, రాష్ట్ర నిధులతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాకు స్వచ్ఛ విద్యాలయ కింద ప్రధాని నుంచి అవార్డు దక్కడం పట్ల కలెక్టర్ కోన శశిధర్‌ను, జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత మాట్లాడుతూ జిల్లా ప్రజలు కరవు కాటకాలతో అల్లాడుతున్నారన్నారు. కావున హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కేంద్రం ద్వారా సహకారం అందాలని సభాముఖంగా వారు విన్నవించారు. అలాగే రాష్ట్రానికి, ప్రత్యేకించి అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ అనేకమైన విప్లవాత్మక మార్పులు చేసి సామాన్యునికి మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పార్థసారధి, గోనుగుంట్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రూ. 28.29 కోట్లతో చేపడుతున్న 1,857 అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని వారు ప్రారంభించారు. అనంతరం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు పలువురు అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులు విన్నవించారు. కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు ఎన్‌టి.చౌదరి, జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, ఎంపిపి రమాదేవి, జెడ్‌పి సిఇఓ రామచంద్ర, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా వెంగలమ్మచెరువు గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సభ లో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు