మెయిన్ ఫీచర్
‘మెగా’ హీరోల బిజినెస్ రూ. 750 కోట్లు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు చలనచిత్ర సీమలో ‘మెగా’ హీరోగా చిరంజీవికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ‘ఖైదీ 150’తో రీఎంట్రీ ఇచ్చి తన స్టామినాలో ఏ మాత్రం మార్పులేదని నిరూపించారు. మెగాస్టార్‌గా ఆయనకున్న క్రేజ్ బాక్సాఫీస్‌ని షేక్చేస్తోంది. మెగా చిత్రం విడుదల సమయంలో అయితే ఈ హడావుడి మరింతగా కనిపిస్తుంది. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం చూడడానికి రెండు కళ్లు చాలవు. టాలీవుడ్లో ఇప్పుడున్న వారసత్వ హీరోల్లో మెగా కుటుంబం హీరోలదే పైచేయి. ఏకంగా ఒకే కుటుంబం నుండి ఏడుగురు హీరోలు చిరంజీవి స్ఫూర్తితో వెండితెరపై వెలుగులు విరజిమ్ముతున్నారు. ఆయన నడిచిన బాటలో నడుస్తూ, తమకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. వీరికే కాదు, చాలా మంది యువతరం హీరోలకు చిరంజీవి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన స్టార్‌డమ్‌ని పరిశీలించిన అనుభవంతో ఎందరో వెండితెరపై హీరోలుగా రాణిస్తున్నారు. స్టార్స్‌గా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. చిరంజీవికున్న మాస్ ఇమేజ్‌కు తోడు తన స్టామినా కూడా అదే స్థాయిలో ఉండడంతో కెరీర్లో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు. అదే ఆయనకున్న బలం కూడా. కొంత విరామం తీసుకున్నాక ఇదిగో.. అదిగో.. అంటూ ఎట్టకేలకు మళ్లీ వచ్చి కుర్ర హీరోలతో సైతం పోటీపడుతున్నారు. తాజాగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ‘సైరా’ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
టాలీవుడ్ వ్యాపారం దాదాపు ప్రతి ఏటా రెండు వేల కోట్లకు పైమాటే! ఈ వ్యాపారంలో మెగా వారసత్వ హీరోల వాటా దాదాపు రూ. 750 కోట్లు అంటున్నారు ట్రేడ్ విశే్లషకులు. కొత్త తరహా కథలతో మెగా ఇమేజ్ స్ఫూర్తితో బాక్సాఫీస్ వసూళ్లను తిరగరాస్తున్న మెగా హీరోలు ఎంచుకునే కథలు, చేసే క్యారెక్టర్లు కూడా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేస్తున్నాయి. చిరంజీవి నటించే ‘సైరా’తో పాటు ఆయన వారసత్వ హీరోలైన పవన్‌కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్, అల్లు శిరీష్ ఒక్కో చిత్రంలో నటిస్తూ యమబిజీగా వున్నారు. కొత్త సంవత్సరంలో వచ్చే వీరి తొలి చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
చిరంజీవి..టాలీవుడ్లో ఈ పేరుకున్న పవరే వేరు. మెగాస్టార్‌గా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవిది నేటికీ అగ్రస్థానమే. చాలా కాలం విరామం తర్వాత కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మాతగా వి.వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ నెం.150’ చిత్రం దాదాపు వంద కోట్లకు పైగానే రాబట్టింది. ముఖ్యంగా మెగా సినిమాలకు నైజాం, ఆంధ్ర, సీడెడ్‌లో ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. తాజాగా తన 151వ చిత్రంగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎంచుకున్నారు. దీనికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఈ చిత్రాన్ని కూడా కొణిదెల బ్యానర్లో రామ్‌చరణ్ నిర్మిస్తుండటం విశేషం. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని తన పుట్టిన రోజున లాంఛనంగా ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం భారీ సెట్‌ని కూడా వేశారు. ఎందరో విదేశీ నటులు ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. తెలుగు సినిమాకు భారతీయ భాషల్లో, విదేశాల్లో ఉన్న మార్కెట్ దృష్ట్యా ‘సైరా..’ చిత్రాన్ని భారీ ఎత్తున హై టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న లక్ష్యంతో అమితాబ్ బచ్చన్, సుదీప్, సేతుపతి, నయనతార వంటి తారలు నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు 150 కోట్లకు పైగానే బడ్జెట్ కేటాయించినట్లు తెలిసింది. అయితే చిరంజీవికున్న మార్కెట్ దృష్ట్యా అన్ని విధాలుగా కలిసి ‘సైరా..’ బిజినెస్ దాదాపు రూ.350 కోట్లు అంటూ ట్రేడ్ వర్గాలు లెక్కలు తేల్చేస్తున్నాయ. ప్రస్తుతం ఈ లెక్కలు అంచనాలు మాత్రమే. చారిత్రక నేపథ్యం కలిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కావడం వల్ల ఈ అంచనాలు మరింత పెరగవచ్చని కూడా అంటున్నారు.
పవన్‌కళ్యాణ్‌ను అభిమానులు పవర్‌స్టార్‌గా పిలుచుకుంటారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది మరి. సినిమా జయాపజయాలను ఏమాత్రం పట్టించుకోని హీరో అతడు. ఆయన కెరీర్లో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రాలున్నాయి. అంతకు రెట్టింపు క్రేజ్‌ని సొంతం చేసుకున్న హీరోయిజం ఆయన బలం. పవన్ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు రాజకీయంగాను చకచక అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ అనేది క్యాప్షన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో తెలిసిందే. ముచ్చటగా మూడోసారి వీరి కలయకలో వస్తున్న ఈ చిత్రం ద్వారా ఇద్దరికీ హ్యాట్రిక్ రావడం ఖాయం అంటున్నారు. ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ స్టయిల్ కూల్‌గా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాకుమారుడు లాంటి కథానాయకుడు కొన్ని కారణాల వల్ల ‘అజ్ఞాతవాసం’ చేయాల్సి వచ్చిందన్న పాయింట్‌తో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో క్రేజీ భామలు, అందాల తారలు కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ బయటిరావడమే ఆలస్యం.. ఈ సినిమా కథల గురించి రకరకాల కథనాలు బయటకు వచ్చాయి. ప్రవాసంలో వున్న ఓ రాకుమారుడిలా పవన్‌కళ్యాణ్ ఈ సినిమాలో వినోదాలు పంచబోతున్నారట. విదేశాల్లో సైతం పవన్‌కళ్యాణ్ సినిమాలు అత్యధికంగా కలెక్ట్ చేస్తాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి సిద్ధమవుతున్న ఈ చిత్రం కోసం భారీ వ్యయం చేస్తున్నట్లు సమాచారం. ఈ అజ్ఞాతవాసి వ్యాపారం దాదాపు రూ.130 కోట్లకు పైమాటే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇది సరికొత్త రికార్డుల్ని సృష్టించే చిత్రమవుతుందని చెబుతున్నారు. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల జోరును పెంచింది. ఫస్ట్‌లుక్, పాటలు, టీజర్ ఇప్పటికే విడుదలై విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ స్టయిలిష్ లుక్‌లో కనిపిస్తున్న ఈ చిత్రం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అమెరికాలోనూ ఈ చిత్రం అత్యధిక ధియేటర్లలో విడుదలవుతుండడం వల్ల భారీ స్థాయిలో వసూళ్లు ఖాయం అంటున్నారు.
నేటి హీరోయిజం స్టయిల్ నుంచి పుడుతుంది. హీరో ఎంత స్టయిల్‌గా వుంటే అభిమానులకు అంత పండుగ. పూల చొక్కా, ఎర్ర బనీను, గళ్ల లుంగీ, మెళ్లో తాయెత్తు, గుబురు గడ్డం.. వేసేదేమో తీన్మార్ స్టెప్పు. ‘ఊర మాస్’ అనే పదానికి ఇంతకంటే నిర్వచనం మరోటి ఉంటుందా? ‘రంగ స్థలం’లో చిట్టిబాబుగా రామ్‌చరణ్ లుక్ చూస్తే అదే అనిపిస్తోంది. రామ్‌చరణ్ సుకుమార్‌ల కలయికలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. సమంత కథానాయిక. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ‘రంగ స్థలం’ అనే పల్లెటూరులో 1985 నేపథ్యంలో సాగే కథ ఇది. చిట్టిబాబు అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్. జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలను పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. స్టార్ హీరోలు స్టయిలిష్ కనిపించడానికి చూస్తున్నారు. ఈ నేపథ్యం లో రామ్‌చరణ్ కూడా తన పంథాను మార్చి ఓ విభిన్నమైన పాత్రను చేస్తున్నారు. ‘మగధీర’ చిత్రంతో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పిన హీరో రామ్‌చరణ్. ఓ కొత్త హీరో అప్పట్లో ఆ స్థాయి రికార్డు సాధించటం మామూలు విషయం కాదు. చిరంజీవి వారసుడిగా స్టార్‌డమ్‌ని అనుభవిస్తున్న చరణ్ కమర్షియల్ మాస్ హీరోగా క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. ‘రంగస్థలం’ అతడి సినిమాల్లో అత్యధిక బడ్జెట్ చిత్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి లో ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీపడకుండా భారీగానే నిర్మిస్తున్నారు. కమర్షియల్‌గా కూడా ఈ చిత్రం పాజిటివ్‌గానే వుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం అంచనా ప్రకారం ఈ సినిమా బిజినెస్ సుమారు రూ. 95 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఏరియాలకి మాత్రమే బిజినెస్ పూర్తి చేశారు. కాబట్టి ఇది మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ చిత్రంలో అన్నీ ప్రయోగాలే కనిపిస్తున్నా, ఇది పక్కా కమర్షియల్ చిత్రం అంటున్నారు యూనిట్ వర్గాలు. ఇది ఓ సరికొత్త అనుభూతి ఇస్తుందంటున్నారు. ఈ చిత్రం కోసం కథకు అనుగుణంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఓ ప్రత్యేక సెట్‌ని రూపొందించారు. ‘రంగస్థలం’ తర్వాత కూడా చరణ్ ప్రణాళికలు భారీగానే వున్నాయి. ధృవతో రామ్ చరణ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. వరుస పరాజయాల పరంపరకు బ్రేక్ వేశాడు. అయితే ఈ విజయం గాలివాటం కాదని చెప్పాలంటే వెను వెంటనే మరో హిట్ అవసరం. అందుకోసం శ్రమిస్తున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ సుకుమార్ కూడా గాడిలో పడ్డాడు. ఆయన కూడా హిట్ కాపాడుకోవాల్సిందే. అందుకే వీరిద్దరూ జత కట్టారు ఈ ‘రంగ స్థలం’ కోసం. ఈ చిత్రానికి ‘1985’ అనేది ట్యాగ్‌లైన్. మాస్ హీరోగా పేరొందిన రామ్‌చరణ్‌కి, లాజిక్కులతో సినిమాతీసే సుకుమార్ శైలికీ ఈ టైటిల్‌కీ ఏ మాత్రం పొంతనలేదు. కాకపోతే, ఇద్దరూ కలిసి ఏదో గొప్ప ప్రయత్నం చేయబోతున్నారన్న సంగతి మాత్రం అర్థమయింది. దానికి తోడు రామ్ చరణ్ గెటప్.. అలాగే సమంత సరికొత్త కనిపించడం కూడా ఈ చిత్రంపై అంచనాలు పెంచేలా చేసింది.
అల్లు అర్జున్ సినిమా అంటేనే మాస్ మోత మోగాల్సిందే. ఎలాంటి కథలోనైన ఒదిగిపోతుంటాడు అతడు. కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో బలమైన మాస్ కథానాయకుడిగా ఎదిగాడు. వసూళ్ల విషయంలో కూడా ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డుల్ని సృష్టిస్తుంటాయి. సినిమా సినిమాకీ తన పాత్ర తీరుతెన్నుల్లో గెటప్‌లో మార్పులు చూపిస్తూ వస్తున్నాడు. ‘సరైనోడు’ కోసం కండలు పెంచిన బన్నీ.. ‘డీజే’ కోసం బ్రహ్మణ యాస నేర్చుకొన్నాడు. ఇప్పుడు కూడా తన కొత్త సినిమాకి సంబంధించిన కసరత్తులతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకుడు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మిలటరీ అధికారిగా కనిపించనున్నారు. ఆహార్యం, దేహదారుఢ్యం, నడక.. అన్నీ మిలటరీ పరిభాషలోకి మారిపోవాలి కదా. అందుకే దానికి సంబంధించిన శిక్షణ కూడా తీసుకున్నాడు. అల్లు అర్జున్ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. ఆయన నటించిన చిత్రాలన్నీ దాదాపుగా బయ్యర్లకు కాసుల పంటను పండిస్తున్నాయి. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆయన కెరీర్లో రేసుగుర్రం, జులాయి, సరైనోడు, డీజే వంటి సూపర్‌హిట్స్ వున్నాయి. వీటిలో డీజే కేవలం వారం రోజుల్లో వంద కోట్లకు పైనే వసూళు చేసింది. ఆ విధంగా చూస్తే అల్లు అర్జున్ బిజినెస్ అనూహ్యంగా పెరిగినట్టుగానే భావించాలి. ఆయన తాజా చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బిజినెస్ సుమారు రూ. 95 కోట్లకుపైనే అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయాలు ఇచ్చే కిక్కేవేరు. రేసుగుర్రం నుంచి బన్నీకి వరుసగా విజయాలే. దాంతో కొత్త సినిమాలపై ఎన్ని అంచనాలు పెరిగినా, వాటిని అలవోకగా అధిగమిస్తూ బాక్సాఫీస్‌ని కళకళలాడిస్తున్నాడు. ఇది ‘డీజే’ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు కూడా పెరిగాయి. ఈ చిత్రాన్ని శిరీషా శ్రీధర్, నాగబాబు, బన్నీవాసు నిర్మిస్తున్నారు. యాక్షన్, వినోదంతో పాటు మంచి ప్రేమకథ ఉన్న ఈ చిత్రంలో బన్నీ- అను ఇమ్మానుయేల్ జోడీ తెరపై ఆకట్టుకుంటుందంటున్నారు. అర్జున్, శరత్‌కుమార్‌లు పోషిస్తున్న పాత్రలు కూడా ఈ చిత్రానికి కీలకం కానున్నాయట.
సాయిధరమ్ కెరీర్ విచిత్రంగా మొదలైంది. తన తొలి సినిమా ‘రేయ్’ అయితే ముందు గా విడుదలైంది మాత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’. ‘రేయ్’ పరాజయం పాలైనా ఆ ప్రభావం తన కెరీర్‌పై పడకుండా ‘పిల్లా నువ్వులేని జీవితం’ కాపాడింది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ‘సుప్రీమ్’ చిత్రాలు మాస్‌కి బాగా దగ్గరయ్యాయి. ఆ తర్వాత మళ్లీ గడ్డుకాలం. ‘తిక్క’, ‘నక్షత్రం’, ‘విన్నర్’ ఇలా వరుస పరాజయాలైనా అవకాశాలకు మాత్రం ఢోకా లేకుండా పోయింది. ‘జవాన్’గా జయ్ క్యారెక్టర్లో కనిపించి తొలిసారి కెరీర్లోనే బాధ్యతాయుతమైన పాత్రతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సాయిధరమ్ వినాయక్‌తో సినిమా చేస్తున్నాడు. కాంబినేషన్ క్రేజ్ ఉన్న ఈ సినిమాకు సుమారు రూ.35 కోట్ల రేంజ్లో బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు నిర్మాత సి. కళ్యాణ్ కావడం వల్ల పక్కా ప్లానింగ్‌తో నిర్మాణం జరుగుతుంది. దీంతో పాటు సాయిధరమ్ సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి దర్శకుడు ఎ.కరుణాకరన్. ఈ రెండు సినిమాలు బిజినెస్ పరంగా మంచి రేంజ్లో వున్నాయంటున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘్ఫదా’తో మరో మెగా వారసుడు వరుణ్‌తేజ్‌కు మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ చిత్రం సాధించిన విజయం అతడిలో మరింత కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. దాంతో ఎంతో హుషారుగా ఉన్నాడు. ఈ చిత్రం కంటే ముందు అతడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. నిరాశలో వున్న వరుణ్‌కు ‘్ఫదా’ ఊపునిచ్చింది. దీంతో తనకంటూ ఓ మార్కెట్ ఏర్పడింది. ఇందులో వరుణ్‌కు జోడీగా నటించిన సాయిపల్లవికి కూడా ఎనలేని క్రేజ్ ఏర్పడింది. మంచి విజయాన్ని చవిచూసిన ఈ చిత్రం దాదాపు రూ.42 కోట్లు వసూళ్లు రాబట్టిందట. తాజాగా వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. వెంకట్ అట్లూరి దర్శకుడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దర్శకుడు వెంకట్‌కి ఇది తొలి సినిమా. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం ‘తొలిప్రేమ’ చిత్రానికి సుమారు రూ. 25 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం వుందని చెబుతున్నారు.
అల్లువారి ద్వితీయ కుమారుడు అల్లు శిరీష్ నటించినవి తక్కువ చిత్రాలు. ప్రస్తుతం శిరీష్ ‘ఒక్క క్షణం’ అనే సినిమా చేస్తున్నాడు. దీనికంటే ముందు నటించిన ‘శ్రీరస్తు-శుభమస్తు’ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. వాణిజ్య లెక్కల ప్రకారం రూ. 12 కోట్లు సాధించిందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. శిరీష్ నటించిన తాజా చిత్రం ‘ఒక్క క్షణం’ చిత్రంపై మంచి అంచనాలే వున్నాయి. వి.ఐ ఆనంద్ అనే నూతన దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి దాదాపు రూ. 20 కోట్ల రేంజ్లో బిజినెస్ జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తాజాగా ‘మెగా’వారసత్వ హీరోల బిజినెస్ ఇలాంటి రేంజ్లో వుంది. ఈ ఏడు ప్రారంభంలోనే మొదలయ్యే ఈ బిజినెస్ టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఈ బిజినెస్ ఇప్పుడే ఈ స్థాయిలో వుంటే ముందు ముందు ఇంకా ఎలా ఉండబోతోందోనని కూడా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్లో మెగా హీరోల చిత్రాల వ్యాపారం ఇలా రోజు రోజుకూ పెరిగిపోతుండటం శుభ సూచకమే! *