మెయిన్ ఫీచర్

దాసరి.. అమర సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ పరిశ్రమ ఒక శాసనసభ నియోజకవర్గం కాదు!
కానీ, ఆయన అక్కడ ఎమ్మెల్యే.
తెలుగు సినీ పరిశ్రమ ఒక పార్లమెంట్ నియోజకవర్గం కాదు!
కానీ ఆయన అక్కడ ఎంపీ.
సినీజనానికి ఆయన ప్రజా ప్రతినిధి.
మరోసారి కోర్టులో న్యాయమూర్తి. ఆయనే.. దాసరి నారాయణరావు!
సినీ పరిశ్రమలో చిన్న కార్మికులనుంచి బడా నిర్మాతల వరకూ.. డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎగ్జిబిటర్ల వరకూ ఎవరికి ఏ సమస్య వచ్చినా, కష్టం కలిగినా, గుండెలో గుబులు పుట్టినా, కంట కన్నీరు కారినా.. వారికి గుర్తొచ్చే పేరు ‘దాసరి’. ఆపదలోవున్న సినీ జనానికి ఆయనొక ధైర్యం. కష్టాల్లో కూరుకున్న సినిమావాళ్లకు ఆయన స్థైర్యం! ఆయన మాట ఓదార్పు! ఆయన పిలుపు ఉపశమనం. వెరసి ఆయనో పెద్దదిక్కు!
మే 30న మంగళవారం దాసరి తుదిశ్వాస విడిచారన్న మాట వినగానే ‘అయ్యో.. మాకిక దిక్కెవరు?’ అని ఉలిక్కిపడి, భయపడి, కంటతడి పెట్టుకుంది కేవలం ఆయన కుటుంబీకులు మాత్రమే కాదు.. సకల సినీ పరిశ్రమ కూడా.
*
ఇప్పుడు -తెలుగు సినీ పరిశ్రమ దిక్కులేనిదైపోయింది! న్యాయమూర్తి లేని కోర్టులా తరలిపిస్తోంది. దేవుడులేని దేవాలయమైంది. రేపటినుంచి ఏదైనా సమస్య వస్తే మేము ఎవరిదగ్గరికి వెళ్లి చెప్పుకోవాలి! ఎవరిని కలిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఎవరిని కలిస్తే మాకు న్యాయం జరుగుతుందని తమలో తాముగా ప్రశ్నలు వేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే, ఇక్కడ ఎవరి గురించి ఎవరూ పట్టించుకోరు. ఎవరెక్కడ చస్తే నాకెందుకు? నేను బాగుంటే చాలు, నా సినిమా బాగుంటే చాలు, నా జేబులు నిండితే చాలనుకునేవాళ్లే రాజ్యమేలుతున్న అనధికారిక దోపిడీ రాజ్యమిది.
అందువల్లే చిన్న సినిమాలు విడుదల చేసికొనేందుకు థియేటర్లు దొరకడంలేదు. చిన్న సినిమాలకు శాటిలైట్ వ్యాపారం జరగడంలేదు. ఆ నలుగురు అనబడే సినీ భూస్వాములు, ఫిలింనగర్ బూర్జువాల చేతుల్లోనుంచి థియేటర్ల లీజు విధానం రద్దుకావడంలేదు! ఆన్‌లైన్ టికెటింగ్ విధానం అమల్లోకి రావడంలేదు. మినీ థియేటర్ల జీవో విడుదల కావడంలేదు. సినీ కార్మికుల చిరకాల డిమాండ్ అయిన ఇఎస్‌ఐ, హెల్త్‌కార్డులు ఈరోజు వరకూ ఇవ్వలేదు. కార్మిక సంక్షేమ విధానాలు, సినీ కార్మికుల అద్దె ఇళ్ల ముంగిళ్ల వద్దకు చేరడంలేదు.
*
పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలనే ప్రయత్నాలు చేస్తూ చేస్తూ మహాప్రస్థానమైపోయారు దాసరి. సమస్యలు మళ్లీ సమస్యలుగానే ఉండిపోయి జూలు విదిల్చి కర్కశ నృత్యం చేస్తున్నాయి. మళ్లీ దాసరిలాంటి నాయకుడు పుట్టాలి. అంతవరకూ సమస్యలు పరిష్కారం కావు.
అయితే-
అలాంటి నాయకుడు మళ్లీ పుట్టుకురావడాన్ని ఊహించుకోలేం. అసలు దాసరి ఆ స్థాయికి ఎదగడమనే క్రమం అంత సులువుగా జరగలేదు. ఎవరో వచ్చి ఏదో చేసి ఆయన్ని ఇంత గొప్ప దర్శకుడిగా, ఇంత గొప్ప వ్యక్తిగా ఎదగడానికి తోడ్పడలేదు. శిల తానే.. ఉలి తానే అయి తనకు తానే చెక్కుకున్న శిల్పి ఆయన. అంతేకానీ, ఆయనె్నవరూ తయారు చేయలేదు.
నీకు నీవే సైన్యమవ్వచ్చు. నిప్పులాగా రగిలితే నింగి వొంగి నీ కాళ్లకు సలాములే చేయదా? అన్నది ఆయన సిద్ధాంతం. అందుకే శ్రమనే నమ్మాడు. శ్రమించాడు. క్రమించాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరంలా ఎదిగిపోయాడు. ఎంతోమంది గుండెల్లో ఒదిగిపోయాడు.
పుట్టుక నీది- చావు నీది- బ్రతుకంతా సమాజానిది అని ప్రజాకవి కాళోజీ అన్నట్టుగా ఎక్కడో పుట్టాడాయన. ఎక్కడో చనిపోయాడాయన. కానీ మధ్యలో తన బ్రతుకంతా సినిమాల కోసం, పరిశ్రమ కోసం అంకితం చేశాడు. అందుకే ఆయన అమరజీవి అయ్యాడు. హీరోలు స్టార్లుగా, డిక్టేటర్లుగా వెలుగొందుతున్న రోజుల్లో డైరెక్టర్‌ని స్టార్‌ని చేసిన ఘనుడాయన! సినిమా పోస్టర్‌లలో, డిజైన్‌లలో తన పేరును కుడివైపు పైభాగాన మేఘాలలో వేసుకొని దర్శకుడనే రూపకర్త కుర్చీని ఆకాశమంత ఎత్తులో సింహాసనంగా మార్చిన మార్గదర్శకుడాయన.
తన కెరీర్‌లో ఎవరి దగ్గరా చేయి చాపలేదు. ఎవరినీ కాకా పట్టలేదు. ఎవరి కాళ్లూ వొత్తలేదు. ఎవరికీ భజన చేయలేదు. ఎవరికీ భయపడలేదు. ఎవరు ఏ తప్పు చేసినా, ఎక్కడ ఏ అవినీతి జరిగినా ధైర్యంగా ఎదిరించే, నిలదీసే, ఖండించే ధీశాలి దాసరి. దానివలన కొందరికి ఆయన శత్రువు కూడా అయ్యాడు. అయినా ఆయన ‘డోంట్ కేర్’ అన్నాడు.
హీరోను చూసి కాదు, దర్శకుడి పేరును చూసి ప్రేక్షకులు సినిమాలకొచ్చే సంస్కృతిని తీసుకొచ్చింది దాసరే. ఈరోజు దర్శకుడు అనే వ్యక్తికి హీరోతో సమానమైన క్రేజ్ వచ్చి, హీరోలస్థాయిలో పారితోషికాలు అందుతున్నాయంటే- కారణం దాసరి! అందుకుగాను నేటి దర్శకులంతా ఆయనకు రుణపడి ఉంటారు.
దక్షిణ భారత సినీ దర్శకుల సంఘం స్థాపనలో తెలుగు సినీ దర్శకుల సంఘ ఆవిర్భావంలో నాటి అభ్యుదయ దర్శకుడు కెబి తిలక్‌తోపాటు దాసరిది ప్రధాన పాత్ర. ఒక దర్శకుడు రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి అవ్వడం అనే చరిత్ర ఒక్క దాసరికే దక్కింది! హీరోలకు మాత్రమే అభిమాన సంఘాలు నెలకొల్పడం జరుగుతున్న రోజుల్లో, ఒక దర్శకుడికి కూడా అభిమాన సంఘాలు ఏర్పాటుకావడం, సదరు దర్శకుడి పుట్టిన రోజున క్యాలెండర్‌లో ఒక ప్రధానమైన రోజుగా అభిమానులు టిక్ చేసి పెట్టుకుని సంబరాలు జరుపుకోవడం అనేది దాసరికి మాత్రమే జరిగింది. ఒక దర్శకుడు సినిమాలలో లెక్కలేనన్ని చిత్రాలలో నటించడం అనే రికార్డు కూడా ధరిత్రిలో ఆయనకే దక్కింది. ఒక్కమాటలో చెప్పాలంటే, దర్శకులకు ఈరోజున ఇంత గౌరవం, ఇంత గుర్తింపు, ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆయనే. అందుకే దాసరి పుట్టిన రోజును డైరెక్టర్స్ డేగా పరిగణించి ప్రతి ఏటా దర్శకుల దినోత్సవాన్ని జరపాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ సోషల్ మీడియాలో మార్మోగుతోంది. రేపో మాపో సినీ దర్శకుల సంఘం జనరల్ బాడీలో ఈ అంశాన్ని చర్చకు పెట్టాలని అభిమానులు ప్రయత్నిస్తున్నారు.
మే 31న ఆయన భౌతికకాయం స్వగృహం నుండి పితృవనానికి తరలి వెళ్తున్నపుడు ఒక జ్యోతి లాంటిది ఆయనతోపాటు అక్కడనుండి సెలవ్ అంటూ వెళ్లిపోతున్నట్టు కనిపించింది. ఈ క్షణం వరకూ ఈ గడ్డకువున్న పవర్ అదిగో ఆ పాడెను అంటిపెట్టుకుని ఆయనతోపాటే వెళ్లిపోతోంది. ఇకనుంచీ ఈ గడ్డ ఒక స్మారక కేంద్రం మాత్రమే! రేపటినుంచి ఎవరొస్తారిక్కడికి అంటూ అనుకోవడం కనిపించింది.
వెళ్లిపోతున్నావా నేస్తం సెలవ్ అంటూ నా లోకాన్ని వదిలి.. నువ్వు బ్రతికున్నప్పుడు నిన్ను కలవడానికి వచ్చిన జనాలకు నీడనిచ్చి, సేదతీర్చిన మేము, రేపటినుంచి ఎవరికి నీడనివ్వాలి? ఎవరికి సేద తీర్చాలి అంటూ ఆ ప్రాంగణంలోని చెట్లు అక్కడి అరుగులు కన్నీళ్ళతో వీడ్కోలు పలకడం కనిపించింది. ‘ఎంతోమంది కథలు, కన్నీటి వ్యథలు నీతోపాటు విని చెమ్మగిల్లాం నేస్తాం..! ఎంతోమందికి పంచాయితీలు చేసి వారి కష్టాలను తీర్చిన నిన్ను చూసి ఆనందించాం నేస్తం.. ఇక రేపటినుండి ఈ గదిలోకి ఎవరొస్తారు.. ఇక్కడి కుర్చీలలో ఎవరు కూర్చుంటారు’ అంటూ ఆయన స్వగృహంలోని సమావేశ గది భోరుమంది. ఆ గది గోడలు, అక్కడి కుర్చీలు.. అక్కడున్న వందలాది షీల్డులు, పురస్కారాలు, సన్మాన పత్రాలు గుండెలు బాదుకుంటున్నాయి. ఆయన స్వగృహ ప్రాంగణంలోని ఓ పొదలో ఎవరికంటా పడకుండా చిక్కుకొనివున్న వంద రూపాయల నోటు పాడెపై చివరి ప్రయాణం చేస్తున్న ఆయనను చూసి ‘ప్రతి జనవరి 1న నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి మీ వద్దకొచ్చే అభిమాన గణానికి కొత్త వంద నోటును ఇచ్చి ఈ వంద నోటు కోటి రూపాయలుగా మారి నిన్ను ఆనందపరచాలి. నీ ఇంట్లో ఆనందం వెల్లివిరియాలని మీరు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలుపుతుంటే నేనెంతో గర్వపడేదాన్ని. నా జన్మ ధన్యమైనదని సంతోషించేదాన్ని. ఇకనుంచీ వచ్చే నూతన సంవత్సరాలలో నన్ను అలా సంతోషపరిచేందుకు ఎవరున్నారు నేస్తం’ అంటూ వౌనంగా రోధించింది... శోకించింది!
ఆయన అంతిమయాత్ర ఫిలిం ఛాంబర్ ఆవరణ వద్ద సాగుతున్నపుడు ‘రోడ్ నెం.47’ అనే ఆ వీధి దారిపొడుగునా కన్నీటి చుక్కలను తర్పణ చేస్తూ ‘ఈ క్షణంనుంచి ఈ వీధి బోసిపోయింది పో.. ఈ వీధి వైభోగం ఆగిపోయింది పో. నిన్ను కలవడానికి ఎంతమంది సెలబ్రిటీలు, లెజండ్‌లు, దేశస్థాయి రాజకీయ నాయకులు, ఎంతమంది కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ బాటలో బారులు తీరారో నాకు తెలుసు. ఇక నుంచి ఎవరొస్తారులే’ అంటూ శోకతప్త హృదయంతో వీడ్కోలు పలికింది.
పుట్టిన నెలలోనే మరణించిన కారణజన్ముడు దాసరి. ఆయన సతీమణి దాసరి పద్మ కూడా తాను పుట్టిన నెలలోనే పరమపదించారు. ఇద్దరి పార్థివ దేహాల దహనం మొయినాబాద్ వ్యవసాయ క్షేత్రంలో ప్రక్కపక్కనే జరిగాయి.
‘నా ఆత్మకథను నేనే సినిమాగా తీస్తా. అప్పుడే ఆ కథకు న్యాయం జరుగుతుంది’ అని తన చివరి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు దాసరి. కానీ అది నెరవేరకుండానే విధి ఆయనను తీసుకెళ్లింది. ఆయనో చరిత్ర. ఆయనదో శకం. ఆయనదో అధ్యాయం. ఏదోక రోజున ఎవరో ఒకరు ఆయన జీవితగాథను సినిమాగా తీస్తారు. మనం చూస్తాం!
తెలుగు సినీ పరిశ్రమ దేదీప్యమానంగా వెలుగొందడం కోసం తెలుగు సినీ పరిశ్రమ సొంత గడ్డకు తరలివచ్చి నిలదొక్కుకోవడం కోసం ఒకరకంగా తన జీవితానే్న అంకితం చేసిన సినీకళామతల్లి ముద్దు బిడ్డడు ఆయన. మరి ఎందుకో ఏమో దాదాసాహెబ్ పాల్కే సత్కారం కానీ, పద్మభూషణ్ పురస్కారం కాని ఆయన్ని వరించలేదు. కనీసం ఇప్పుడైనా ఆ పురస్కారాలు మరణానంతర పురస్కార గౌరవాలై ఆయన చరిత్రను పునీతం చేయాలి. ఆయన పేరిట ఒక అవార్డును రెండు తెలుగు ప్రభుత్వాలు ప్రకటించాలి. ఆయన ఉన్న వీధికి దాసరి నారాయణరావు వీధి అనే పేరు పెట్టాలి. ఆయన పుట్టిన రోజుని డైరెక్టర్స్ డేగా ప్రకటించాలి.
చివరిగా ఒక మాట!
చరిత్రలో ఒక చక్రవర్తి తాను చనిపోయేటప్పుడు తన శవపేటిక నుంచి తన చేతులను బయటపెట్టి ఊరేగింపు జరపాలని, సందర్శకులు ఆ ఒట్టి చేతులను చూసి ‘మనం ఎంత సంపాదించినా చివరికి నేల తల్లి ఒడిలోకి వెళ్లేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం, ఒక్క కీర్తి తప్ప’ అని తెలుసుకుంటారని పేర్కొన్నాడట. అదే కోవలో దాసరి అంత్యక్రియలు జరిగినపుడు చితిపైనున్న ఆయన కాయం కాలుతుంటే సడెన్‌గా కుడి చేయి తనను కప్పేసిన కట్టెలను చీల్చుకుంటూ బయటకు వచ్చింది. నాలుగైదుసార్లు లోనికి నెట్టినా మరలా బయటికే వచ్చింది. దాంతో ఓ పెద్ద కర్రతో లోనికితోసి గట్టిగా నొక్కి పట్టాల్సి వచ్చింది! ఈ ఘట్టం ద్వారా సినీ పరిశ్రమలోని థియేటర్ల లీజుదారులు, పెత్తందార్లు, చిన్న సినిమాలను తమ స్వార్థంకోసం సమాధి చేస్తున్న దోపిడీదారులకు ఆయన ఓ సందేశం ఇవ్వదలచాడని అర్థమవుతోంది.
వందలాదిమంది, వేలాదిమంది చిన్న నిర్మాతలకు, చిన్న సినిమాలను సమాధి చేసి కోటానుకోట్లు సంపాదిస్తున్న మిత్రులారా.. మీరు చనిపోయినపుడు ఇదిగో ఇలా ఒట్టి చేతులతోనే వెళ్లిపోతారు తప్ప, సంపాదించిన ఆస్తిపాస్తులను వెంటబెట్టుకుని తీసుకెళ్లలేరని తెలుసుకోండి! చిన్న సినిమాలను బతకనీయండి! నిర్మాతలందరినీ సినిమాలపై ఆధారపడి జీవిస్తున్న సినీ జీవులందరినీ బ్రతికే వాతావరణం కల్పించండి! ఇకనైనా మారండి!!
ఇదే ఆ సందేశం!
దాసరి నారాయణరావు అమర సందేశం!
***
కొసమెరుపు ఏంటంటే, ఆయన మృతి తర్వాత రాష్టవ్య్రాప్తంగా అక్కడక్కడవున్న ఆయన అభిమానులు ఆయన సంతాప సభలు జరుపుతున్నారు. కానీ.. సినీ ప్రముఖులెవరూ చనిపోయిన తరువాత పరిశ్రమ తరఫున సంతాన సభ జరిపే అలవాటున్న తెలుగు సినీ పరిశ్రమ ఇంతవరకూ ఆయన సంతాప సభ జరపలేదు! ఎందుకో...??

-బాబ్జీ, సినీ దర్శకుడు