మెయిన్ ఫీచర్

మహాకవి శేఖరుడు చిదంబరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క సంగీతమేదో పాడునట్లు
భాషించినపుడును విన్పించు భాష
విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు
స్పష్టోచ్చారణంబున నొనరు భాష
రసభావముల సమర్ణ శక్తియందున
నమర భాషకు దీటైన భాష
జీవులలోనున్న చేవయంతయు చమ
త్కృతి పల్కులన్ సమర్పించు భాష
భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి
భాషయన నిద్దియని చెప్పబడిన భాష
తనర ఛందస్సులోని యందమ్ము నడక
తీర్చి చూపించినట్టిది తెలుగు భాష
ఇది కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి పద్యం- ఇది అక్షరాక్షర సత్యం. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ శ్రీనాథుడన్నా, శ్రీకృష్ణ దేవరాయలన్నా ఈ సూక్తి ముమ్మాటికీ నిజం.
ఈ పేరుతో 2015, మే నెలలో తొలిగా ఒక సంకలన గ్రంథం వచ్చింది. 2012-13 సంవత్సరాన్ని అనుకుంటాను- అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం- తెలుగు భాషా సంవత్సరంగా ప్రకటించింది. అది ప్రేరణగా తీసుకుని కేవలం ఒకే ఒక వ్యక్తి ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న పేరుతో ఒక సంకలన గ్రంథాన్ని తీసుకువచ్చారు.
‘‘అమ్మ భాషను బ్రతికించే నిమితంగా తెలుగుపై మమకారంతో ఒక తెలుగు భాషా బోధకునిగా కమ్మనైన అమ్మ భాష గొప్పతనాన్ని తెలుగులందరికీ తెలియజెప్పాలనే సదాశయంతో వివిధ కవులు, రచయితలు పుస్తకానుప్రసక్తంగా చెప్పిన పద్యాలు- గేయాలు మున్నగువాటిని సేకరించి ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే పేరుతో ఒక సంకలన గ్రంథాన్ని ముద్రించి తెలుగువారందరికీ అందించదలిచాను’’ అని ఈ గ్రంథం ముందుమాటలో సంకలనకర్త పేర్కొన్నారు.
ఇందులో 240 కవితా ఖండికలున్నాయి. ‘ఆంధ్రత్వ మాంధ్ర భాషాచా / ప్యాంధ్ర దేశ స్వజన్మభూః తత్రాపియాజుషీ శాఖా / నాల్పస్య తపసః ఫలమ్’ అన్న అప్పయ్య దీక్షితుల దగ్గర నుండి, పాల్కురికి సోమనాథుడు, మూలఘటిక కేతనాదుల దగ్గర నుండి- ఆధునిక కవులైన విశ్వనాథ, సినారె, ఆచార్య తిరుమల, గరికపాటి, జొన్నవిత్తుల దగ్గరనుండి జయంపుకృష్ణ, కోకా విమలకుమారి గారల వరకు ప్రముఖుల, అప్రముఖుల వర్థమానుల పద్య, గేయ, వచన కవితలను ఇందులో పేర్కొనడం జరిగింది. విశిష్టంగా తెలుగు భాషా సాహిత్యాలను ప్రశంసించిన ధోరణులు కనిపిస్తాయి. ఇందులో సేకరణ భారం వల్లనో యేమో- ఒక వరుస క్రమంలో ఇవి లేకపోయినా- విశిష్టంగానే ఉంది ఈ సంకలనం. ఒకే రచయితవి రెండు మూడు రచనలు కూడా ఇందులో కన్పిస్తాయి. శ్రీ గుర్రం జాషువా గారి వంటి కొందరు కవుల రచనలిందులో పొరపాటున చోటుచేసుకోలేకపోయాయి. ఇటువంటి లోటుపాట్లను సవరించి, మరింత స్ఫూర్తివంతంగా మళ్లీ సంకలన గ్రంథాన్ని తీసుకురావాలన్న సంకల్పాన్ని తెలియజేస్తూ ఉండేవారు- ఈ సంకలనకర్త. సాధారణ విద్యావంతులకు కూడా తెలుగు భాషా సాహిత్యాలపట్ల గౌరవాన్ని తప్పనిసరిగా పెంపొందిస్తుంది- ఈ గ్రంథం.
అంతటితో ఆగలేదు ఈ సంకలనకర్త. ఈ గ్రంథంలో చివర అనుబంధం-1గా తెలుగు భాషలో మొదటగా వచ్చిన వివిధ వాఙ్మయ ప్రక్రియల్ని ‘తొలి తెలుగు’ పేరుతో సుమారు 32 పేజీల పట్టికను ప్రకటించారు మచ్చునకు.
‘‘తొలి తెలుగు ఉదాహరణ కావ్య కవయిత్రి- బుర్రా కమలాదేవి’’- ఇత్యాదిగా.. అనుబంధం-2లో ప్రముఖ ఆధునిక కవుల జయంతి- వర్ధంతి తేదీలను సుమారుగా 9 పేజీల పట్టికగా ఇచ్చారు. ఇవి నేడు అనేక పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఒక కరదీపికగా తప్పనిసరిగా తోడ్పడతాయి. సుమారుగా 270 పేజీలు గల ఈ గ్రంథాన్ని తమ సొంత డబ్బులతో ఒక వెయ్యి కాపీలు ముద్రించి, ‘తెలుగు భాషను బ్రతికిద్దాం’ అన్న వాక్యానే్న మూల్యంగా ప్రకటించి, సాహిత్యవేత్తలకూ, కవులకూ, రచయితలకూ విశ్వవిద్యాలయాలకూ ఉచితంగా అందజేశారు ఈ సంకలకర్త. కొన్ని యూనివర్సిటీలు కలిసి చేయదగిన ఈ పనిని కేవలం ఒకే ఒక వ్యక్తి సుమారుగా రెండు మూడేండ్లలో పూర్తిచేయడం ప్రశంసావహం అని ఈ గ్రంథానికి ముందు పెద్దలు మంగళాశాసనాన్ని పలికారు.
ఇలా ఈ గ్రంథానే్న కాదు- దీనికి ముందే అంటే 2015కు పూర్వమే ‘శ్రీరామనామ ప్రభ’ మొదలైన స్వీయ గ్రంథాలనూ, 2015కు తరువాత శ్రీ గాయత్రీ ద్విశతి, ‘క్షత్ర బంధూపాఖ్యానం- ఒక పరిశీలన’ అన్న యంఫిల్‌కు చెందిన స్వీయబృహత్ గ్రంథం మున్నగు వాటిని తమ సొంత డబ్బులతోనే ముద్రించి, ఉచితంగా అర్హులైన వారందరికీ అందజేశారు- వీరు.
ఈ సంకలన గ్రంథకర్త 25-11-1957లో గుడ్లవల్లేరు- కృష్ణా జిల్లాలో బ్రహ్మశ్రీ సర్వా లక్ష్మీనారాయణ, శ్రీమతి మహంకాళమ్మ పుణ్యదంపతులకు జన్మించారు. 1974లో పడమటి గోదావరి జిల్లా భీమవరం ఓరియంటల్ కాలేజీలో భాషాప్రవీణ చదువుకున్నారు. అనంతరం ఎంఏ, యంఫిల్, పీహెచ్‌డీ పట్టాలను పొంది, 1984 నుండి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాలలో ఆంధ్రాధ్యాపకులుగా ఉద్యోగించి, ఇటీవలే పదవీ విరమణ చేశారు.
వీరు జాతీయ- అంతర్జాతీయ రాష్ట్ర స్థాయి సదస్సులో 35 పరిశోధనా పత్రాలను సమర్పించారు. కవితలు, వ్యాసాలు వ్రాయడం, పరిశోధక విద్యార్థులకు సూచనలివ్వడం, సాహిత్య, ఆధ్యాత్మిక ప్రసంగాలను చేయడం వీరి అభిరుచి- ఈయన నిత్య సాహిత్య పౌరోహిత్యమే వ్రతంగా కలిగినవారు చైతన్యవంతులు. అనేక సాహిత్యవేత్తల హృదయాలలో సుస్థిరంగా నిలిచినవారు. కీర్తికోసం ఆర్తి చెందని వ్యక్తి.
భీమవరం సంస్కృత కళాశాలాప్రాచార్యులు, శ్రీ వివేక భారతాది పద్య కవులూ, ‘మహాకవి శేఖర’ బిరుదాంకితులు, తమకు గురువులైన శ్రీ్భరతం శ్రీమన్నారాయణగారు రచించిన ‘శ్రీరమణాయనం’ (శ్రీ భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర గలిగిన పద్యకావ్యం)పై ఆచార్య జి. యోగప్రభావాతిగారి నిర్దేశకత్వంలో పరిశోధన చేసి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము నుండి పీహెచ్‌డీ పట్టాను పొందడమేకాక- శ్రీరమణాయన కావ్య రామణీయకం’ అన్న పేరుతో ఆ గ్రంథాన్ని తమ స్వంత ధనంతో ప్రచురించి, శ్రీమతి కమలాంబికా శ్రీమన్నారాయణ దంపతులకు అంకితమిచ్చిన శిష్యావతంసులు వీరు. ఇది తొలి మెరుపు.
భీమవరం సంస్కృత కళాశాలలోనే తమకు మరో గురువైన ఈ వ్యాసకర్త దంపతులకు (శ్రీమతి రామడుగు నాగమణి, రామడుగు వేంకటేశ్వర శర్మ దంపతులకు) ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అను పేరు కలిగిన ఈ తొలి తెలుగు సంకలన గ్రంథాన్ని అంకితమిచ్చి, ఈ రచయితను ధన్యునిగావించిన సచ్ఛాత్రులు వీరు. ఇది కొసమెరుపు.
ఇలా మాతృభాషకు యథోచితంగా, యథాశక్తిగా సేవ చేసిన ఈ తెలుగు వెలుగు, ఇటీవల విజయవాడలో జరిగిన నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలలో 2019 డిసెంబర్ 28వ తేదీ శనివారంనాడు ఓ కార్యక్రమంలో నిర్వహణ సహకారులుగా పాల్గొనవలసిన ఈ తెలుగు వెలుగు- చిరు అనారోగ్య కారణంగా అంతక్రితం రోజు రాత్రి అంటే డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం రాత్రి హఠాత్తుగా జగ్గయ్యపేటలో కీర్తిశేషులు కావడం ఎంతో బాధాకరమైన విషయం. ఇంతకూ అలా రాలిపోయిన తెలుగు వెలుగు పేరు డా॥ శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్ర్తీగారు. ఆయనకు ఇదే నా అక్షర నివాళి.
*చిత్రం... సర్వా సీతారామ చిదంబర శాస్ర్తీ

- రామడుగు వేంకటేశ్వర శర్మ, 9866944287