మెయిన్ ఫీచర్

విశ్వనాథ నవలా కథ సమాలోచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(10-09-2019న కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 125వ జయంతి సందర్భంగా...)
*
‘‘నన్ను నెరుగరో రుూ తెల్గునాట మీరు
విశ్వనాథ కులాంబోధినిధుని బహు వి
చిత్ర చిత్ర ధ్వని బహు విచ్ఛిత్తి మన్మ
హాకృతి ప్రాణేత సత్యనారాయణ కవి’’
- అని తన గురించి చెప్పుకున్న విశ్వనాథ కావ్యాన్ని ధ్వని సిద్ధాంత మర్మజ్ఞానంతో చదివితేనే దాని లోతు తెలుస్తుందన్నారు. ఆయన ఒక్క వచన కవిత తప్ప సాహితీ ప్రక్రియలన్నింటి లోతులను బాగా తరిచి తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు.
‘‘నేను మానవ ప్రవృత్తిని అమూలాగ్రం పరిశీలించి తెలిసికొనే వ్రాసాను. నాకు గ్రంథ రచన అంటే ఏమిటో తెలుసు. సగం నిద్రలో లేపి ఒక నవల డిక్టేట్ చేయమంటే చేయగలను’’అంటారు విశ్వనాథ సత్యనారాయణ తన ‘నేను-- రచనా స్వరూపం’అనే వ్యాసంలో, ‘‘కావ్య రచనలో ఎన్ని పోకడలు పోయారో నేను అన్ని పోయాను’’అన్న ఆయన వ్యాఖ్య ఆయన నవలలకు కూడా వర్తిస్తుంది.
‘‘తన కావ్యం ప్రతివాడు గొప్పదంటాడు. ఎవరో నా ‘ఏకవీర’ ఉత్తమమని అన్నారు... నేను ఉత్తమమని ఎందుకనాలి? ఒక తరం పోయి మరొకతరం వచ్చినట్టు చెప్పిన ‘వేయి పడగలు’ గొప్పది కదా? దాని గుణగణాలు ఎవరైనా పరిశీలించారా? ఎంతో సైకాలజీ గుప్పించిన ‘చెలియలికట్ట’ ఏమైనట్టు? ‘పురాణ వైర గ్రంథమాల’లో ‘‘ఎంతో పోయే...దేవాలయాలే కూలిపోయే!’’ అని కుండ బ్రద్దలుకొట్టినట్లు చెప్పినవాడు, బ్రాహ్మీమయమూర్తి. కవిసమ్రాట్ మాట్లాడే వెనె్నముక, విశ్వనాథ సత్యనారాయణ. ‘ఒక జాతి జాతీయతకు సంప్రదాయమ్ము, ప్రాణభూతిమ్మది ప్రాణశక్తి’ అని త్రికరణశుద్ధిగా నమ్మిన సంప్రదాయ భీష్ముడు విశ్వనాథ సత్యనారాయణ. సురకృతి సుకృతమైన ప్రతిభకు భారతీయ సంస్కృతి, ధర్మాన్ని ప్రతిబింబించే సాహిత్యాన్ని ఒక మార్గం తీసుకుని వర్తమాన కాలంలో ఆర్షధర్మానికి ఏకైక ప్రతినిధిగా నిలిచిన సంప్రదాయ పయోనిధి ఆయన. తన జీవితాన్ని, సాహిత్యాన్ని, భారతీయ పురావైభవ పునరుద్ధరణకు త్రికరణ శుద్ధిగా కంకణబద్ధుడైన ఋషివంటి కవి ఆయన.
పాశ్చాత్య సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా రాజకీయ స్థాయిలో దేశ స్వాతంత్య్రంకోసం తీవ్రంగా ఒక జాతీయోద్యమం సాగుతున్న కాలంలో పాశ్చాత్య సాంస్కృతిక సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా సాంస్కృతిక స్థాయిలో తన సాహిత్య శక్తులను ఎదురొడ్డి తెలుగునాట తీవ్రంగా పోరాట బాట పట్టిన సాహిత్య సమారంగణ సార్వభౌముడు విశ్వనాథ సత్యనారాయణ. మానవ జీవితంలో విశ్వనాథ స్పృశించని సమస్య లేదు. అది సామాజికమో, మానసికమో, ఆధ్యాత్మికమో, సాహిత్యమో, ఆర్థికమో, రాజకీయమో మరేదైనానో కావచ్చు. తరతరాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న భారతీయ ధర్మం ఏ కాలానికైనా మానవ జాతికంతటికి ఆదర్శం, అనుసరణీయం అనే ఆయన అచంచల విశ్వాసం ఆయన రచనలన్నింటా పూసల్లో దారంలా శోభిల్లుతుంటుంది.
భారతీయ ఆత్మను ఆధునికంగా ఆవిష్కరిస్తూ, దేశీయమైన ఉదాత్త జీవితపు విలువలను ఆత్మోత్తరణకోసం అవశ్యంగా కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తింపజేస్తూ ఇంకా ఈ జాతి చైతన్య శక్తి చావలేదని, అది సనాతనమని ఎలుగెత్తి చాటిన ఒక గొప్ప నవలేతిహాసం ‘వేయిపడగలు.’ ‘‘వేయిపడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకొన్నది కలలోన రాజును,’ అనే గణాచారి పాటతో ప్రారంభమై, చివర ‘నీవు మిగిలితివి. ఇది నా జాతి శక్తి నా అదృష్టం’అన్న ధర్మారావు మాటలతో ముగుస్తుంది ‘వేయిపడగలు’ నవల. పడగలు సహస్ర ముఖ్యమైన భారతీయ సంస్కృతికి ప్రతీకలు కాగా, చివరకు మిగిలిన ధర్మారావు, అరుంధతి దాంపత్య బంధానికి, వివాహవ్యవస్థకు ప్రతీకలు. గణాచారి, గిరిక, పసిరిక మొదలైన పాత్రలన్నీ ప్రతీకాత్మకాలే. గ్రామీణ వ్యవస్థను భూమికగా చేసుకొని తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపడుతూ మూడుతరాలకు సంబంధించిన ఈ నవల విశ్వనాథ బహుముఖ పరిజ్ఞానానికి, నిశిత పరిశీలనా ప్రతిభకు నికషోపలం.
ఏకవాక్యత సూత్రంతో ధ్వనికావ్యంగా సాగిన ‘ఏకవీర’నవలలో ప్రేమ వైఫల్యం సర్వసాధారణమే అయినప్పటికీ విచిత్రమైన మలుపులు తిరిగి రచయిత ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. ప్రాణ స్నేహితులైన కుట్టన్ సేతుపతి, వీరభూపతి తాము ప్రేమించిన మీనాక్షి, ఏకవీరలను వ్యతిక్రమంలో వివాహమాడటం, ఆ విషయం వారికి తెలియడానికి వీలులేకుండా సన్నివేశ కల్పనలో అద్భుతమైన రచనాశిల్పాన్ని విశ్వనాథ ప్రదర్శించారు. నాయిక ఏకవీరకు ప్రతీకగా చిత్రింపబడిన వైగై నది ఆటుపోట్లు ఆమె జీవన స్రవంతిలో కనిపిస్తాయి. స్పర్శ సిద్ధాంతానికి ఈ నవలలో రూపకల్పన చేసిన విశ్వనాథ ఏకవీర వ్యక్తిత్వంలో దాన్ని ప్రతిఫలింపచేశారు. భామాకలాపం మొదలైన సన్నివేశాలు కథలో కీలక స్థానం వహించి కథా సంవిధానానికి పోషకంగా నిలిచాయి.
సముద్రానికి హద్దు చెలియలికట్ట. సముద్రం చెలియలికట్ట దాటితే ప్రళయం. హైందవ సంప్రదాయానికి, వ్యవస్థకీ సముద్రం ప్రతీక. వ్యవస్థ నతిక్రమిస్తే సంక్షోభమే. ‘చెలియలికట్ట’ నవలలో రత్నావళి దాన్ని అతిక్రమిస్తే ఏం జరిగింది, ఆమె జీవితంలో చెలరేగిన సంక్షోభం, ఆమె ఎలా పశ్చాత్తాప పడింది, ఎలా పోయి ఉప్పెనలో కలిసిపోయింది ఈ నవలలో అద్భుతంగా చిత్రించారు విశ్వనాథ. వ్యవస్థా ధర్మానికి వ్యక్తిగతమైన ఐహిక సుఖాలకు కలిగే సంఘర్షణే ‘చెలియలికట్ట’ నవలలోని ఇతివృత్తం. వ్యవస్థాతిక్రమణం చేసి ధర్మబద్ధమైన శృంగారాన్ని కాదని మోహంతో పైపై మెరుగులకు భ్రమసి, మరిది రంగడితో లేచిపోయి పతనమై, తన్నుతాను విద్యావివేకంతో తెలుసుకొని పశ్చాత్తాపం చెంది, చివరికి రంగడితో ఉప్పెనలో కలిసిపోయి జీవితాన్ని ముగించింది రత్నావళి.
‘వేయిపడగలు,’ ‘మా బాబు’, ‘చెలియలికట్ట’, ‘ఏకవీర’వ్రాసి నవలాకారుణ్ణి అయినాను అన్నారు విశ్వనాథ. పురాణ వైర గ్రంథమాలలో 12 నవలలు, కాశ్మీర చరిత్ర ఆరు నవలలు, మరి ఇంకొక ఆరు నవలలు రాజచరిత్రను గూర్చి ఆయన వ్రాసారు. ఈ 24 నవలలో మన పురాణాలలో, ఆయా చరిత్రలలో ఉన్న ప్రధానాంశాలను కాలం, సందర్భాలతో సహా వివరించారు. ఈ నవలలో చరిత్రాంశాలను ప్రక్కనపెడితే, వాటిలోని కథలు, వందలాది విలక్షణమైన పాత్రలు విశ్వనాథవారి స్వకపోల కల్పితాలు. మన పురాణాలలోని మగధరాజ వంశాదులలోని యదార్థ చరిత్ర ననుసరించి విశ్వనాథ పురాణవైర గ్రంథమాల అనే 12 నవలలు వ్రాసారు. అందులో ‘చంద్రగుప్తుని స్వప్న’మనే నవల గుప్తా చంద్రగుప్త, వౌర్య చంద్రగుప్తుల భేదాన్ని చెప్తుంది.
తెలుగు సాహిత్యంలో ఉత్తమ పురుష కథనంలో ప్రసిద్ధిగాంచింది ‘మా బాబు’ నవల. తనకు బాల్యంలో ఆశ్రయమిచ్చిన ‘మా బాబు’అనే అన్య కులస్తుడు మరణించిన తర్వాత, అతని సంతానంకోసం తన యావచ్ఛక్తిని, జీవితాన్ని, చివరకు ప్రేమను కూడా త్యాగంచేసిన మహనీయుడు ఈ నవలలోని ఉత్తమ పురుష కథకుడు. కథకుని వినమ్రత వల్ల ఆత్మాశ్రయ పద్ధతిలో తనద్వారా పరిచయమైన పాత్రలను వ్యాఖ్యానించక పోవడం, అతని ఔన్నత్యాన్ని తక్కినవారి లోపాలను ఎప్పటికప్పుడు అర్థమయేలా చిత్రించడంలో విశ్వనాథ అసాధారణమైన ప్రతిభను కనబర్చారు. విశ్వనాథ కథాముద్రలు బాల్యంలో వీరి మనసుమీద ఎలా ఉన్నాయో ఆయన మాటలలోనే. ‘‘నాకు అయిదేండ్ల వయసప్పుడు మా నాయనగారు పురాణం చెబుతూ ఉండేవారు. భారత భాగవతాలల్లో ఉన్న కథలన్నీ నాకు అద్భుతంగా కనిపించేవి... ఆరోజుల్లో వీధి నాటకాలు కూచిపూడి వారివి నెలకు రెండైనా ఉండేవి. ఆ కథలన్నీ నా మనస్సుకు పరమాహ్లాదకరంగా ఉండేవి. ఊహ ఊహాంత బీజప్రాయంగా ఉన్న సర్వరసాలు హృదయంలో అంకురించాయి. మొలకవేశాయి. పసరాకులు విడిచాయి. కథలలో జీవితమంతా ఉంటుంది. అది ఒక జాగ్రతస్వప్నం.’’
తెలుగుతనానికి, తెలుగు జీవిత విధానానికి అద్దంపడతాయి విశ్వనాథవారి చిన్న కథలు. విశ్వాసానికి సాధారణంగా కుక్కను పేర్కొంటాం. ‘మాక్లీ దుర్గంలో కుక్క’కథ కేవలం కుక్క విశ్వాసాన్ని చూపడమేకాదు, మనుషులలోని స్వార్థచింతన, అహంకారం, ఆత్మవంచన ఎనె్నన్ని పక్కదారులు తొక్కాయో చూపించడమే లక్ష్యంగా సాగింది. సంప్రదాయంలోని మూఢత్వాన్ని నిరసించటం, ఆధునిక సిద్ధంతాల పట్ల రచయిత అవగాహన, మానవతావాదం ఈ కథలోని ముఖ్యమైన అంశం. ఈ కథలో కుక్కకి మనుషుల్నిచూస్తే అసహ్యమేయటం, సామాజిక వ్యవస్థపై నిశితమైన విమర్శ.
గుడ్డిపిల్ల రాధను పెళ్లిచేసుకున్న చంద్రశేఖరరావులో ఉత్తమ సంస్కారం ఉట్టిపడుతుంటుంది. ‘పరిపూర్తి’కథలో. పుట్టిన పిల్లవాడు నల్లగా ఉన్నాడా అని ఆమె అడిగితే ‘నీకు కళ్ళు వచ్ఛినట్టున్నాడు పిల్లాడు’ అంటాడు అతడు. అంధత్వం గాని, నల్లదనం గాని స్నిగ్ధ సౌందర్యానికి కళంకం కలిగించవని భర్త భార్యకు చెప్తూ ఆమెకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో ఈ కథలో మానవత్వానికి కనకాభిషేకం జరిగింది. పాలనా యంత్రాంగం తీరుతెన్నుల్ని విమర్శిస్తూ తాత్విక నేపథ్యంలో రాసిన కథ ‘ముగ్గురు బిచ్చగాళ్ళు’. అవిటివాళ్లయిన ముగ్గురు బిచ్చగాళ్ల రహస్యాలు తెలుసుకోవాలని ఒక చదువుకున్న యువకుడు చేసే ప్రయత్నమే ఈ కథ. పలు విషయాలమీద, సిద్ధాంతాల మీద, పోలీసు యంత్రాంగం మీద, ఆర్థిక వ్యవస్థమీద ఉపన్యసించే ఆ బిచ్చగాళ్ల ముందర ఆ యువకుని పాండిత్యం ఎందుకు కొరగానిదైంది. ధ్వని రూపమైన ఈ కథలో మానవ జీవితంలోని వౌలికాంశాల మీద చర్చ, పరమార్థాల విశే్లషణ చక్కగా జరిగింది. విశ్వనాథవారి నవలల్లో, కథలలో రచనాశిల్పం, విలక్షణమైన శైలి, జీవిత అవగాహన అన్నీ కనిపిస్తాయి. విశ్వనాథవారు 58 నవలలు, 30 చిన్న కథలు రాశారు. వినూత్నమైన, విశిష్టమైన పాత్ర చిత్రణకు విశ్వనాథ పెట్టిందిపేరు. ఆయా సందర్భాన్నిబట్టి, సన్నివేశాన్నిబట్టి, పాత్రల మనస్తత్వాన్ని విశే్లషించుకుంటూ స్వయం వ్యక్తిత్వంగల పాత్రల గాను, మహత్తరమైన, రమణీయమైన శిల్పాలుగాను తీర్చిదిద్దారు విశ్వనాథ. వీరి స్ర్తిపాత్రల చిత్రణ మనోజ్ఞం. మనోహరం. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి జీవిత కాలం 10-09-1895 నుండి 8-10-1976వరకు.

- మంగు శివరామప్రసాద్ 9866664964