మెయిన్ ఫీచర్

సురుచిర కవితామూర్తి తిరుమల శ్రీనివాసాచార్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన పేరు వినగానే సాహితీ లోకంలో అంతో యింతో పరిచయమున్న ప్రతివాడికీ వెంటనే ఒక నిండైన విగ్రహం, ఏమాత్రం అహంకారం గానీ, అనవసరపు అభిజాత్యం గాని లేని వ్యక్తిత్వం, నందివర్ధన పుష్పంకన్నా తెల్లనైన, అమాయకమైన నవ్వు, ‘అర, శ్రుతికన్నా పెంచకుండా మృదువుగా, మధురంగా మాట్లాడే నైజం, అన్నిటికన్నా మించి అపారమైన స్నేహ వాత్సల్యాలతో సాగించే సాధు భాషణం- యివన్నీ మన ముందు తళుక్కున ప్రత్యక్షవౌతాయి. అలా ప్రత్యక్షం కాకపోతే, డా. తిరుమల శ్రీనివాసాచార్యులును కేవలం ఒక కొత్తగా పరిచయమైన వ్యక్తిగా మాత్రమే చూచినట్లవుతుంది. చిరకాలం పద్మారావునగర్, సికింద్రాబాద్‌లోని సర్దార్ పటేల్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా పనిచేసిన డా.తిరుమల శ్రీనివాసాచార్యులవారు గొప్ప ఉపన్యాసకుడు. క్రమశిక్షణకు మారుపేరు. నేను అమెరికా 12 సార్లు పర్యటించాను. అక్కడక్కడ మహానగరాలలో ‘తెలుగు పద్యం- మాధుర్యం’ అనే అంశంమీద ఉపన్యాసాలు యిచ్చాను. సభ ముగింపు తర్వాత నాదగ్గరకు వచ్చే శ్రోతలు, ముందు నా పద్య పఠనం, నా ప్రతిభ మొదలైన విషయాలు మాట్లాడకుండా, ‘‘సర్, మీ భువన విజయాలలో పాల్గొనే ‘‘తిరుమలవారు మా గురువుగారు. నేను సర్దార్‌పటేల్ కళాశాల విద్యార్థిని’’ అని అంటున్నప్పుడు నాకు ఆనందంతోపాటు ఆశ్చర్యంకూడా కలిగేది. శ్రీనివాసాచార్యుల వారితో నా అనుబంధం దాదాపు 40 యేళ్ళని చెబితే కొంతమందికి ఆశ్చర్యం వేస్తుందేమో? కానీ, యిది నిజం. నా వివాహం అయ్యే 39 సం.లు. కావస్తున్నది. నేను ఈ మహాకవితో, నా వివాహానికి పూర్వంనుంచే అనేక సాహిత్య రూపకాలలో పాల్గొన్నవాణ్ణి- తిరుమల శ్రీనివాసాచార్యులుగారి వంటి వ్యక్తులు (అంటే ఆ ఎత్తు, ఆ రూపు, ఆ చాయ) లోకంలో కోకొల్లలు ఉండవచ్చేమో గాని, సాహితీ లోకంలో మాత్రం పొరపాటున గూడా మనం చూడం. అంతటి విశిష్టమూర్తి ఆచార్యులవారు. మా ‘్భవన విజయం’ సాహితీ రూపకంలో ఆయన తిరుగులేని ‘పింగళి’ అయితే, అంతకన్నా తిరుగులేని, నదురు బెదురులేని, కాళీ వరప్రసాదితుడైన ‘తెనాలి’ని నేను. ఈ భువన విజయం గుర్తుకువస్తే ఒక్కసారి కండ్లముందు ఎనె్నన్ని వూళ్ళు, బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, అతిథి గృహాలు, మర్యాదలు, ఉదయ వేళల్లో కవితాగోష్ఠులు, ఆలయ సందర్శనాలు యివన్నీ గుర్తుకువస్తాయి. విచిత్రమేమిటంటే, అప్పట్లో మంచి నవవ్వనంలో ఉండి, నల్లనైన వంచిశ్మశ్రుసంపదతో, అతగాడెవడో ‘చేమకూర’ వాసవ నందనుణ్ణి గురించి చెప్పినట్లు ‘‘అతని నుతింప శక్యమె జయంతుని తమ్ముడు సోయగంబునన్’’-అన్న రీతిని స్ఫురద్రూపంలో తళుక్కుమనే రీతిని ఉన్న, ఏకైక కవిని నేనే! నేను వేదికమీద లేవగానే అవధాని మాష్టారు మహాప్రేమతో సిసలైన ఆశీఃపూర్వక దృష్టితో నా తట్టు చూస్తుండేవారు. ఆ మహానీయుని ఈ సందర్భంగా తలచుకోవడం అసందర్భమేమీగాదు. ఇవాళ జ్ఞానపీఠులుగా వెలిగిన వాళ్ళందరూ ఆయన చలువే అని తెలుసుకోవాలి.
డా.తిరుమల శ్రీనివాసాచార్యుల వారు బహు గ్రంథకర్త. అటు పద్యాన్ని యెంత అందంగా నడుపగలడో, గద్యాన్ని అంతకన్నా రెట్టింపు అందంగా వ్రాయగలడు. పరమ శాంత స్వభావుడూ, ఉదార చరితుడూ నిష్కల్మషుడైన ఆచార్యులవారి సాహిత్యం మొత్తాన్నిగూర్చి వ్రాయాలంటే దాదాపు 100, 200 పుటల గ్రంథమవుతుంది. ఒక చిన్న సిద్ధాంత గ్రంథమే అవుతుంది. ఇప్పుడు నా ప్రయత్నం అదిగాదు. వారి కొన్ని రచనలలోని కొన్ని విషయాలనూ, ఆణిముత్యాల లాంటి పద్యాలనూ, వచనాలను, వాటి గొప్పదనాన్ని విశే్లషించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం. మా ‘్భవన విజయం’లోనే మరో పాత్రధారి, మహాకవి, ఉత్పల సత్యనారాయణాచార్యుల వారికీ, శ్రీనివాసాచార్యుల వారికీ 2003 సం.లో నేను ‘కవితాశరధి-దాశరథి’ అనే ఒక చిన్న పద్యకావ్యాన్ని అంకితం యిచ్చాను. ఆ పుస్తకావిష్కరణలో, తిరుమల శ్రీనివాసాచార్యుల వారిని గురించి నేను చెప్పిన పద్యం మస్తిష్కంలో మెదలుతున్నది.
వెనె్నల కన్న తెల్లనయి వెల్గెడి నవ్వు మొగంబువాడు- నే
నన్నను, నాదు పాట నిన అద్భుత రీతిని మెచ్చువాడు- ఏ
రన్న చమత్కృతుల్ విసర- ‘అస్సలు’ చప్పుడు సేయకుండగా
కన్నులు మూసి నవ్వు చెలికాని సుతించెద నిండు గుండియన్.
(నా ‘‘కవితాశరధి దాశరథి’’ పద్య కావ్యంలో 3వ పేజీ)
ఆచార్యులవారి యిటీవలి ‘‘ప్రబోధ పాఠాలూ’’, ‘‘సందేశ సౌరభాలు’’, ‘‘ప్రశంసా పారిజాతాలు’’ చదివితే ఆయన యెంతటి నిలువెత్తు కవియో అర్థం అవుతుంది. వర్తమాన సమాజంలో ఉన్న విషయాలను మరీ యింత మృదువుగా చెప్పినవాళ్ళల్లో ఆచార్యుల వారిదే అగ్రస్థానం. ‘రత్నం కోసం యత్నం’ రుబారుూల సంపుటి ప్రతి పాఠకుడూ అవశ్యం చదువ దగ్గది. ఆచార్యులవారు కేవలం కవేగాదు. గొప్ప వ్యాఖ్యాత. మేమిద్దరం కలిసి తి.తి.దేవస్థానాల ఆహ్వానాల మేరకు ఎన్నిసార్లు, ఎన్నిచోట్ల వ్యాఖ్యానాలు వెలువరించామో, ఆ విషయాలన్నీ చెప్పాలంటే గూడా పెద్ద గ్రంథమే అవుతుంది. ఆచార్యులవారి శృంగార దండకం (తాళ్ళపాక పెద తిరుమలాచార్య ప్రణీతం) సుదర్శన వ్యాఖ్యాసహితం కమనీయం, రమణీయం. 2012 సం.లో వీరు వెలువరించిన ‘‘వానమామలై వరదాచార్యులు పుస్తకం చదివిన పాఠకుడికి వరదాచార్యులగారి విశ్వరూపమేమిటో శ్రీనివాసాచార్యుల వారికి, వారిపై ఉన్న భక్తి ప్రపత్తులేమిటో తెలుస్తాయి. మహాకవి దాశరథి అంతటివాడే వరదన్నా, జుర్రుకునే వాడుండాలేగాని, నీ కవిత్వాన్ని ‘‘వరద’’న్నా అన్న మాటలు స్ఫురణకు వస్తున్నాయి. శ్రీనివాసాచార్యులవారు 2002లో ప్రకటించిన వ్యాసోల్లాసం ప్రతి తెలుగు విద్యార్థీ చదువదగ్గది. అందులో ‘దాశరథి’ నాటికలు అనే వ్యాసం కనబడుతుంది. దాశరథేమిటి? నాటిక లేమిటి? అన్న సంశయం నా మాటలకు కొంతమందికి కలుగవచ్చు. ‘రుద్రవీణ’ మ్రోగించిన ఆ మహాకవికి ‘నాటిక’లెప్పుడు వ్రాశాడా? అని అనుమానం ఉదయించవచ్చు. ఆ మహాకవికి జీవితంలో ‘నాటకాలు’ తెలియవుగాని, గొప్ప నాటకాల రచయిత అని స్పష్టమవుతుంది. శ్రీనివాసాచారిగారు ఎంతటి భ్రాతృభక్తి పరాయణులో తమ అన్నగారు ‘‘రాఘవాచారి’’ గారంటే ఆయనకు ఎంతటి భక్తి ఉందో ఆయన ఈ మాటలే తెలుపుతాయి. ‘‘ఘంటసాల ప్రణుతిమాల’’ అనే పద్య కావ్యంలో ‘‘నా సారస్వత కృషిలో అనవరతం నాకు ఉత్సాహాన్ని ఊరింపజేస్తూ తమ ఆశీరమృతాన్ని ప్రసాదిస్తున్న మా పెద్దన్న ‘వాచస్పతి’ డా.కె.వి.రాఘవాచార్యుల వారికి సాష్టాంగ దండప్రణామాలు సమర్పిస్తున్నాను’’ అన్నారు. ఈ ‘ఘంటసాల ప్రణుతిమాల’ అనే పద్య కావ్యంలో తొలిపుటలో ‘‘ఘంటసాల జీవనరేఖలు’’ అనే 11 పుటల సమగ్రమైన అంశాలతో గూడిన వ్యాసం ఒకటి కనబడుతుంది. ‘ఘంటసాల’కు బాల్యంనుంచీ పరమ భక్తుడనైన నాకు తెలియని విషయాలు ఎన్నో ‘తిరుమల’వారు చెప్పారు. అలాగే, ఈ సంవత్సరం (2019)లో ప్రకటించిన ‘ప్రశంసా పారిజాతాలు’ అనే ‘రుబారుూ కవితల సంకలనం’లో, అలాగే ‘‘అభినందనం-అభివందనం’ అనే పుస్తకాలలో నాలాంటి మిత్రులనుగూర్చి గూడా ప్రశంసావాక్యాలు పలకడం ఆచార్యులవారి సహృదయతను సూచిస్తుంది.
‘అమెరికాలో నా అనుభూతి’ అనే చిరు పద్యగ్రంథంలో గూడా ఆచార్యులవారి కవితాసౌందర్య దృష్టి, సామాజిక స్పృహ, తదితర అంశాలు కనబడతాయి. ‘‘పెంచు వికాసం- పంచు ప్రకాశం’’, ‘న్యాయం నా ధ్యేయం’ ‘మానవీయం-రాజకీయం’ మొదలైన వీరి గ్రంథాలు చదువుతున్నప్పుడు ఈయన కేవలం శాంత భూషణుడే గాదు, పరమ సౌమ్యుడే గాదు- ‘‘అలుగుటయే ఎరుంగని అంబుధులింకుగాక, విలయంభో దాంబుధారా’’ మొదలైన తి॥ పద్యాలూ లాంటివి గూడా వ్రాయగలడని నాలాంటి నటగాయకులకు అవగతవౌతుంది. ‘‘కాకతీయ వైభవం’’ వీరి యిటీవలి పద్యకావ్యం చదువుతున్నప్పుడు సీస పద్యంలో మొనగాడైన శ్రీనాథుడు గుర్తుకురాకుండా ఉండడు. అలాగే నిన్న మొన్నటివరకూ మనమధ్య నడయాడిన ‘కరుణశ్రీ’ మరీ గుర్తుకు వస్తాడు. ‘జల సంపద’ అనే శీర్షికలో-
కాకతీయ విభుల కమనీయ పాలన/ ప్రజల క్షేమమునకై పాటుబడియె
పాకాల చెరువును బ్రహ్మాండముగ త్రవ్వి / ధాన్య లక్ష్మికి స్వాగతమ్ము పలికె
రామప్ప చెరువును త్రవ్వించి క్షామ రా / క్షసి గుండె వేయి వ్రక్కలుగ జేసె...
మొదలైన పాదాలు చదువుతున్నప్పుడు అలనాటి కాకతీయ రాజుల శౌర్య ప్రతాపాలు, సమాజం, దేవతలు, రాజుల భోగాలు అన్నీ పాఠకుడికి కళ్ళముందు ప్రత్యక్షవౌతాయి. ముఖ్యంగా ఈ గ్రంథంలో ఆచార్యులవారు ‘నృత్యకళ’, ‘చిత్రకళ’, ‘చేనేత పనులు, చేతి పనులు’ మొదలైన శీర్షికలో రచించిన పద్యాలు చదివినప్పుడు నాలాంటి నట గాయకుడు ‘మాండ్’ రాగంలో పాడుకుంటూ ఆనందాన్ని అనుభవించకుండా ఉండలేడు. ‘వానమామలై శత పద్య పారిజాతాలు’ అనే ‘పరిమళ వ్యాఖ్య’ ఈనాటికీ సువాసనలు వెదజల్లుతూనే ఉన్నది. ప్రముఖ విద్యావేత్త, గొప్ప వక్త, అన్నింటినీ మించి విశాల భావ మనస్కుడూ, కొన్ని వేలమంది విద్యార్థులను అభ్యుదయ పథం వైపు నడిపించిన మహాగురువు చుక్కా రామయ్య మాష్టారికి అంకితం యిచ్చిన ‘ఎదలో విరిసిన ఇంద్ర ధనుస్సు’ రుబారుూ సంపుటిలో ప్రతి ‘రుబారుూ’ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదే!-
ఎవరి తోట అయితేనేం పూరింట్లో పడితే సరి
ఎవరి గ్రంథమైతేనేం మన గూట్లో పడితే సరి
బడి ఎవ్వడు కడితేనేం గుడి ఎవ్వడు కడితేనేం
మన బుడుతడు తెలివి పెంచి చదివి బాగుపడితే సరి
- అంటారు ఈ కవి.
అలాగే ఆచార్యులవారు ఎంతటి సౌందర్యారాధకుడో-
ముట్టుకుంటే ఏమి? ముద్దుగుంటే చాలు
అందకుంటె ఏమి? అందముంటే చాలు
చందమామ తారకలూ అందవులే
ఎక్కడుంటే ఏమి? చక్కగుంటె చాలు-
అట- ఈ మహాకవి గ్రంథాలన్నిటినీ యిలా సమీక్ష చేయాలన్నా, లేక కవిత్వ దృష్టిలో చూడాలన్నా నాలాంటి సామాన్యుడు సరిపోడు. కాకపోతే మాది ముఖ్యంగా సాహితీ రూపక ప్రదర్శనానుబంధం. అందుకని వ్రాయాలనే తపన నన్ను పురికొల్పింది. 2014 సం.లో ఆచార్యులవారు వెలువరించి, మా గురువర్యులైన ఎస్.వి.రామారావుగారికి అంకితమిచ్చిన ‘‘దాశరథి కవితా వైభవం’’ ప్రతి తెలంగాణా పౌరుడూ, ముఖ్యంగా నేటి ప్రతి ఉద్యమకారుడూ ‘‘నేనూ ఉద్యమంలో పాల్గొన్నా అని గొంతెత్తి అరిచే రాజకీయ నాయకుడూ’’ విధిగా చదవాలని కోరుకుంటున్నాను.

- డా. అక్కిరాజు సుందర రామకృష్ణ 9703553510