మెయిన్ ఫీచర్

తొలి తెలుగు విజ్ఞాన దార్శనికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరివారు సైన్స్ కూడా రాశారా? - అనే ప్రశ్న ఎదురుకావచ్చు. అది ప్రశ్నించినవారి పొరపాటు కాదు. వీరేశలింగంగారు విజ్ఞాన సంబంధమైన రచనలు కూడా చేశారని పెద్దగా ప్రచారం లేదు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రహసనాలు రాశారు కనుక సైన్స్ రచయితగా పరిగణించి ఉండవచ్చు అని కూడా ఉజ్జాయింపులు వేసి ఉండవచ్చు. నిజానికి వారు తొలి తెలుగు సైన్స్ రచయిత కూడా! అందులో సందేహం లేదు.
‘తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే వ్రాసితిని; మొదటి నాటకమును తెనిగించితిని; మొదటి ప్రకృతి శాస్తమ్రును నేనే వ్రాసితిని; మొదటి ప్రహసనమును నేనే వ్రాసితిని; మొదటి చరిత్రమును నేనే విరచించితిని; స్ర్తిలకై మొదటి వచన పుస్తకమును నేనే విరచించితిని; అయినను ప్రథమ ప్రయత్నములెప్పుడును ప్రథమ ప్రయత్నములే!’ - అని కందుకూరి వీరేశలింగం తన ‘స్వీయ చరిత్రము’లో స్పష్టంగా చెప్పుకున్నారు. నవల, నాటకం, సైన్స్, ప్రహసనం, చరిత్ర, స్ర్తిల రచన - తనే మొదట తెలుగులో చేశానని చెబుతూ, అదే సమయంలో తొలి రచన తొలి రచనే అని వినయంగా ప్రకటించుకున్నారు. ఆయన పేర్కొన్న క్రమం కూడా పేర్కొనదగ్గది. ప్రకృతిశాస్త్రంగా సైన్స్ మూడవ స్థానంలో పేర్కొనడాన్ని బట్టి వారు దానికెంతో ప్రాధాన్యమిచ్చారని గమనించాలి.
1982లో స్వీయచరిత్రము విశాలాంధ్ర ప్రచురణగా వెలువరిస్తూ, కందుకూరి మీద ఎంతో పరిశోధన చేసిన డా. అక్కిరాజు రమాపతిరావుగారు ‘సంస్మరణ’ పేరున ఆ పుస్తకానికి ముందుమాటలో ఇలా శ్లాఘిస్తారు. ‘... పూర్తిగా భూలోకానికి మాత్రమే పరిమితమైన ఇతివృత్తం అంతవరకు ఏ తెలుగు రచయితా స్వీకరించిన దాఖలా కనబడదు’. ఇది చాలా విలువైన పరిశీలన. కందుకూరి సాహిత్యం వాస్తవికమైన ప్రపంచానికి చెందినవని పేర్కొనడమే కాదు - ‘దివ్య, దివ్యాదివ్య, అతిమానుష, అద్భుతేతివృత్తాలే ఇతిహాసాలు, కావ్యాలు, పురాణాలు, ప్రబంధాలుగా, పాటలుగా, ద్విపదలుగా, యక్షగానాలుగా - వీరేశలింగం సాహిత్యంలో కొత్త దారులు వేసినవరకూ రచితమవుతూ వచ్చాయి’. అని కూడా పేర్కొన్నారు.
‘లౌకిక సాహిత్యం వీరేశలింగంతోనే తెలుగులో ప్రారంభమైందని చెప్పాలి’ అంటూ రమాపతిరావుగారు వీరేశలింగం నవల, నాటకం, ప్రహసనం, విమర్శ, వ్యాసం, జీవితచరిత్ర, కవుల చరిత్ర, స్వీయచరిత్ర మొదలైన ఎన్నో నూతన ప్రక్రియలకు శ్రీకారం చుట్టారని కొనియాడతారు. ఇన్ని చెప్పిన రమాపతిరావుగారు ఎందులకో వారి విజ్ఞాన రచన గురించి చెప్పడం మరిచిపోయారు.
1971లో వెలువడిన స్వీయచరిత్ర సంగ్రహ ముద్రణకు రాసిన పీఠికలో ప్రసిద్ధ కథకులూ, సంపాదకులు, సైన్స్ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కూడా వీరేశలింగంగారి సైన్స్ రచనలను పరోక్షంగా కూడా ప్రస్తావించలేదు.
పిమ్మట ఎవరూ వీరేశలింగంగారిని సైన్స్ రచయితగా చెప్పిన, చర్చించిన దాఖలాలు తెలుగులో పెద్దగా కనబడలేదు. వీరేశలింగం కొటేషన్ పేర్కొంటూ ‘తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే వ్రాసితిని; మొదటి నాటకమును తెనిగించితిని...’ అని మాత్రమే రాసిన సందర్భాలు ఎన్నో వున్నాయి. కనుక కందుకూరివారు సైన్స్ రచనలు కూడా చేశారా? అని ఎవరైనా అడిగితే వారి దోషం ఏమీ లేదు. అది మన పరిశీలకుల పరిమితి మాత్రమే! అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. 1977లో సాహిత్య అకాడమీ కోసం ‘మేకర్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్’ సీరీస్‌లో నార్ల వెంకటేశ్వరరావుగారు ఆంగ్లంలో రాసిన మోనోగ్రాఫ్ వీరేశలింగం గురించి విడుదలైంది. అందులో ‘అదర్ పయొనీరింగ్ వర్క్స్’ అనే అధ్యాయంలో ఇలా పేర్కొంటారు -
"He published, after years of study, two basic books on physiology and astronomy. For illustrating them, he ordered blocks, at heavy expense from Calcutta and London. If the fact is kept in mind that his science books were the first of their kind in Telugu, they are excellent'
నిర్ద్వంధ్వంగా వీరేశలింగం తొలి తెలుగు సైన్స్ పుస్తకాలు చక్కగా రాశారని నార్ల వెంకటేశ్వరరావు అతి స్పష్టంగా చెప్పారు. అయినా, తర్వాతివారు గమనించలేదు.
కందుకూరి సైన్స్ రచనలు ఎప్పుడు చేశారు. ఏమి చేశారు అనే విషయాలు చెప్పుకునేముందు ప్రాథమికమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. వీరేశలింగం నాస్తికులా? చిలకమర్తి నరసింహం 1937లో స్వీయచరిత్రము ముందుమాట రాస్తూ... ‘మహావీరుడు, కార్యశూరుడు, ఆస్తిక మతావలంబకుడు, సంఘసంస్కర్త...’ అంటూ ప్రస్తుతించాడు. స్వీయచరిత్రము ప్రారంభంలో శ్రీ పరబ్రహ్మణేనమః అంటూ ఈశ్వర ప్రార్థనము కందుకూరి రాసుకున్నారు. ‘ఓ పరమేశ్వరా! ఓ దయాసత్యధర్మ స్వరూప! ఓ సుజన సహృదయ ప్రమోద సంధాయకా!’ అంటూ అది ఒక కనె్ఫషన్ లా సాగుతుంది. స్వీయచరిత్రము తన భార్య రాజ్యలక్ష్మమ్మకు అంకితమిస్తూ వివరమైన ఒక వాక్యం రాశారు వీరేశలింగం. అది కూడా ‘ఓమ్’ అని మొదలవుతుంది. కనుక వారు నాస్తికులు కారు అని స్పష్టంగా చెప్పవచ్చు.
1848 ఏప్రిల్ 16న జన్మించిన కందుకూరి తన ఇరవయ్యేళ్ల వయసులో వెలువరించిన మార్కండేయ, గోపాల శతకాలు వెలుగు చూసిన తొలి రచనలు కాగా, 1874 అక్టోబరులో ‘వివేకవర్థిని’ మాసపత్రిక ప్రారంభించే కాలానికి వారి వయసు 26 సంవత్సరాలు. అలాగే తొలి విజ్ఞాన సంబంధమైన రచన ‘పదార్థ వివేచన శాస్తమ్రు’ - రసాయన శాస్త్ర ప్రశ్నోత్తర గ్రంథం 1877-78లో వెలువడింది. అప్పటికి వారు రసిక జన మనోరంజనము (1870-71), శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధము (1871), శుద్ధాంధ్ర ఉత్తర రామాయణం (1872)తో పాటు నీతిచంద్రిక విగ్రహము సంస్కృత అనువాదం (1874), సంగ్రహ వ్యాకరణము (1875), షేక్స్‌పియర్ ఆంగ్లనాటకం ‘కామెడి ఆఫ్ ఎర్రర్స్’ తెలుగు అనువాదం (1875), అధిక్షేప పద్యరచన అభాగ్యోపాఖ్యానము (1876) రాశారు. ‘పదార్థ వివేచక శాస్తమ్రు’ తర్వాత సుమారు పది సంవత్సరాలకు అంటే 1886లో ‘శరీరశాస్త్ర సంగ్రహము’ అనే రెండవ విజ్ఞాన సంబంధమైన పుస్తకం వెలువడింది. 1889లో ‘దేహ ఆరోగ్య ధర్మబోధిని’, 1895లో ‘జ్యోతిషశాస్త్ర సంగ్రహము’, 1896లో ‘జంతుస్వభావ చరిత్రము’ వెలువరించారు. అంటే రెండు దశాబ్దాల కాల వ్యవధిలో ఐదు విజ్ఞాన సంబంధమైన రచనలు చేశారు కందుకూరి. ఈ ఐదు పుస్తకాలలో ఏ ఒక్కటీ భవదీయ విశే్లషకులు ఇంతవరకు నేరుగా పరిశీలించలేదు. కనుక వాటి గురించి ఇతరులు చెప్పిన విషయాలతోపాటు, వారు ఏ నేపథ్యంలో సైన్స్ రచనలు కొనసాగించారో మాత్రమే ఇక్కడ చర్చించుకుందాం. ఆ పుస్తకాలు లభ్యమైన తర్వాత వాటిని విడిగా విశే్లషించుకునే ప్రయత్నం చేద్దాం. వీరేశలింగం దృష్టి తార్కిక దృష్టి, సమాజహితమైన ధోరణి. ‘తెలుగు భాషలోనున్న ప్రబంధము - అన్నియు కామినీ కచకుచ సంభోగాది వర్ణనలతో నిండియుండి యేక రీతివిగా నుండుట చేతను, అట్టి ప్రబంధములను రచించిన వారిలో నేనొక్కడైనను నాకు వెనుకటి యభిప్రాయములు మారి శృంగార ప్రబంధములు చేయు మేలుకంటే కీడెక్కువగా నుండునన్న సిద్ధాంతమునకు వచ్చినవాడగుట చేతను, ప్రబంధ ప్రణీకృత పథమును బరిహసింపవలెనన్న యుద్దేశ్యముతో నాభాగోపాఖ్యానము చేసితిని’ అని స్పష్టముగా చెప్పుకున్నారు. ఈ తొలి తెలుగు వ్యంగ్య రచన 1876లో రాగా మరుసటి సంవత్సరమే వారి తొలి తెలుగు విజ్ఞాన సంబంధమైన రచన ‘పదార్థ వివేచక శాస్తమ్రు’ వెలువడింది. సాహిత్య ప్రయోజనం స్పష్టంగా బోధపడిన తర్వాతనే వారు సైన్స్‌వైపు చెప్పారు!
స్వీయచరిత్రము తొలి అధ్యాయం మూడవ పేరాలో తన జాతకచక్ర వివరాలు ఇస్తూ వీరేశలింగం ‘నాకెంతమాత్రమును విశ్వాసము లేకపోయినను సత్యానే్వషుల విమర్శకయి యుపయోగపడవచ్చునని నా జాతకచక్రమునిందు బొందుపరుచుచున్నాను’ అని అంటారు. ఇందులో వారికున్న ‘పరీక్షకు నిలిపే ధోరణి’ ప్రస్ఫుటం అవుతుంది. ఇంకా చూడండి - ‘... నేనారంభదశలో జ్యోతిశ్శాస్తమ్రునందత్యంత విశ్వాసము కలవాడనేయైనను జన్మపత్రికలలో దీర్ఘాయుష్మంతులగుదురని చెప్పబడిన వారనేకులల్పాయుష్కులగుచుండుటయు, ...చూచుచు వచ్చిన కొలదిని నాకీ జ్యోతిష్య విషయమయి యంతకంతకు నమ్మకము తగ్గి లోకానుభవమధికమయినది. తరువాత పూర్ణముగా నాశించెను...’ అని నిజాయితీగా వివరిస్తారు. ‘...సుముహూర్తములను బెట్టుకుని జన్మపత్రములను బట్టి దీర్ఘాయుష్మంతులయిన వరుల నేర్పరచుకుని వివాహ కార్యములు నడుపునపుడు వివాహితులలో లక్షల కొలది బాల వితంతువులేల కావలెను? అట్టిచోట్ల నెల్లజాతకబలమేమగును? ముహూర్తబలమేమగును? జన్మపత్రములలో వ్రాయబడిన ఫలములలో గొన్ని కాకతాళీయములుగా గలుగుట తటస్థించినను గొన్ని యైనను దప్పిపోవుచుండుట చేత నట్టి శాస్తమ్రు విశ్వాసయోగ్యమైనది కాదని నా దృఢ నిశ్చయము...’ అని కూడా వివరిస్తారు.
ఇటువంటి సమాజహితమైన దృష్టీ, రాగద్వేషాలు లేని దృష్టీ విజ్ఞాన సంబంధమైన రచనకు, వివేచనకు అవసరం. ఆ ధోరణిలో సైన్స్ రచనలు చేసిన తొలి తెలుగు రచయితగా కందుకూరిని ప్రస్తుతించాలి. అమావాస్య రోజున ఉద్యోగంలో చేరడం; ఇంటిలోని తేనెపట్టు తీయకుండా, ఆగి తేనెపట్టిన తర్వాత భుజించడం - వంటి సంఘటనలను వీరేశలింగం యువకుడిగా చూపిన తార్కిక దృష్టికి, తెగువకు తార్కాణాలు. తన తల్లి అర్థంలేని వాత్సల్యంతో అతిగా భోజనం పెట్టడం గురించి కూడా వీరేశలింగం వివరిస్తారు స్వీయచరిత్రలో. ఈ దిశలో స్ర్తిల ఆరోగ్యం, ప్రజల మూఢ విశ్వాసాల గురించి చాలా రచనలు మనకు వారివి కనబడతాయి. హాస్యం, వ్యంగ్యం మేళవించి ప్రహసనాలు వెలువరించారు. ప్రహసనాలలో కందుకూరి వారి అభిప్రాయాలు కొన్ని పరిశీలిద్దాం.
‘సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డం వస్తే సూర్యగ్రహణం పడుతుందంటారు. సూర్యుడికీ, చంద్రుడికీ మధ్య భూమి ఉండి భూమి నీడ చంద్రుని మీద పడితే చంద్రగ్రహణం అంటారు’. (గ్రహణములు)
‘సూర్య కిరణాలు వేడిమి చేత సముద్రములోను, నదులలోనూ, మడుగులలోనూ వుండే నీరు ఆవిరి రూపంగా పైకి లేచి ఒకచోట చూడుకుని పైన గాలిలో మేఘంగా ఏర్పడి బరువు ఎక్కువయినపుడు నీరు కిందపడుతుంది. దీనే్న వర్షమంటారు’ (వర్షము)
‘జాతకాలు, గ్రహాలు జ్యోతిష్యుల చేతులలో వున్నవి. జ్యోతిష్యులు మీ చేతిలో వున్నారు. ఒక్క కళ్యాణం కాదు, చేసుకునేవారు వెర్రివారైతే ఎన్ని కళ్యాణాలైనా అవుతవి’ (బహుభార్యాత్వము)
స్ర్తిల కష్టాలకు సానుభూతితో, పురుష ప్రపంచం దౌష్ట్యం పట్ల విమర్శతో ప్రహసనాలు రచించిన కందుకూరివారు అప్పటికి తెలిసిన పరిజ్ఞానాన్ని స్పష్టంగానే వివరించారు. చరకుడు, సుశ్రుతుడు, భావమిశ్ర, శాలిహోత్ర, గార్గి ఆర్యభట్ట, వరాహమిహిరుడు మొదలైన భారతీయ విజ్ఞాన ఖనులను వివరంగా అధ్యయనం చేశారు వీరేశలింగం. ఖగోళం గురించి తెలుసుకోవాలని చెన్నపురిలో అబ్జర్వేటరీ సందర్శించేవారు. ఊపిరితిత్తులు, గుండె ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి వధ్యశాలకు పోయి మేకలను చంపడం, మాంసం తీయడం పరిశీలించాడు. ఆనాటి సమాజంలో ఒక బ్రాహ్మణ యువకుడు ఇలా చేయడం సాహసమే. మనిషి అంతర్గత నిర్మాణం చూడాలని ఆస్పత్రికి వెళ్లి శవాన్ని కోయడం కొంతవరకు చూడగానే స్పృహతప్పి పడిపోయారు. ఆధునిక విజ్ఞానం అలవరుచుకోవాలని నిజాయితీగా ప్రయత్నం చేశారు. గతానికి ఉండే చాదస్తాన్ని, మూర్ఖత్వాన్ని ఈ విజ్ఞానంతో తొలగించుకోవాలని భావించారు.
పాశ్చాత్య ప్రపంచపు విజ్ఞానాన్ని, ఆవిష్కరణలను బలంగా పట్టుకుంటే గానీ మన దేశం ఆధునికంగా, ప్రగతిశీలకంగా, బలంగా కాదని వీరేశలింగం వాంఛించాడని నార్ల వెంకటేశ్వరరావు మోనోగ్రాఫులో అభిప్రాయపడతారు. వీరేశలింగానికి ఖగోళశాస్త్రం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఈ విజ్ఞాన శాఖను ఆయన తలమానికంగా పరిగణించారు. అయితే అది జ్యోతిష్య శాస్త్రాన్ని ఖచ్చితంగా వదిలించుకోవాలని స్పష్టంగా అభిప్రాయపడతారు.
శరీరశాస్త్ర సంగ్రహము (1886), జ్యోతిశ్శాస్త్ర సంగ్రహము (1895) - ఈ రెండు రచనలు చక్కగా అధ్యయనం చేసి వెలువరించినవి. ఈ పుస్తకాలలో చిత్రాల కోసం లండన్, కోల్‌కతా నుంచి బ్లాకులు తెప్పించడం గమనార్హం. ఇందులో తొలి పుస్తకం పాఠ్యగ్రంథంగా నాలుగైదు ముద్రణలు పొందింది. ప్రతి ఎడిషన్ మెరుగుబడుతూ వచ్చింది. జంతు స్వభావ చరిత్రము (1896) సుమారు 60 పాలిచ్చే జంతువుల లక్షణాలు, ధర్మాలు గురించి వివరిస్తుంది. భౌతిక శాస్త్రం, భూగోళ శాస్త్రం గురించి పుస్తకాలు రాయాలని తలచారు. కానీ, పూర్తిచేయలేకపోయారు. ప్రాచీన గ్రంథాలు పరిశీలించి పదజాలం తను ఎంపిక చేసుకున్నారని నార్ల వెంకటేశ్వరరావు వీరేశలింగానికి కితాడు ఇస్తాడు.
సమాజానికి అవసరమైన అన్ని అంశాలనూ, బలమైన వ్యక్తీకరణకు దోహదపడే అన్ని సాహితీ ప్రక్రియలనూ స్పృశించిన ప్రతిభాశాలి కందుకూరి వీరేశలింగం. అటు సంస్కృతం, ఇటు ఇంగ్లీషు నుంచి ఎంచుకుని అనువాదాలు చేసిన మహామహుడు. ఆయన విజ్ఞానాన్ని తెలుగు సమాజానికి వ్యాసాలుగా ప్రహసనాలుగా అందించారు. ఆయన వాడిన తెలుగు కొంత జటిలంగా ఉండవచ్చు కానీ, అధ్యయనం చేసి వ్యక్తీకరించిన విజ్ఞాన విషయాలు సవ్యంగానే వున్నాయి. సుమారు ఒకటిన్నర శతాబ్దం క్రితమే తెలుగు సమాజానికి సైన్స్ సుగంధాలను పంచిన దార్శనికుడు కందుకూరి వీరేశలింగం. ఆయన నిస్సందేహంగా తొలి తెలుగు సైన్స్ రచయిత!

- డా. నాగసూరి వేణుగోపాల్, 9440732392