మెయిన్ ఫీచర్

ముద్దుకృష్ణ ‘నై’తాళికుల బండారమిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో పలువురి కవితల సంకలనంగా వచ్చి ఎక్కువ ముద్రణలు పొందిన కవిత్వ సంకలనం, బహుశా ముద్దుకృష్ణ 1935లో ప్రచురించిన వైతాళికులు. 1899 ఫిబ్రవరి 7న జన్మించిన ఆయనకు ఇది నూట ఇరవయ్యో జయంతి సందర్భం కూడా. తన కాలానికి ప్రతిబింబంగా, ప్రాతినిధ్య స్వరంగా ఒక సంకలనం ఉన్నప్పుడే, దాని చారిత్రక విలువ పది కాలాలు నిలబడుతుంది. 1875లో ఫ్రాన్సిస్ టి.పాల్ గ్రేవ్ సంకలనం చేసిన ‘గోల్డెన్ ట్రెజరీ’ పద్ధతిలో తాను ‘వైతాళికులు’ తెచ్చానని ముద్దుకృష్ణ చెప్పేవారని వరద రాజేశ్వరరావు నమోదుచేశారు. కానీ, ఆ ఆంగ్ల కవిత్వ సంకలనం, తనకంటూ ఒక పరిధి పెట్టుకున్నది. ‘ది గోల్డెన్ ట్రెజరీ ఆఫ్ బెస్ట్ సాంగ్స్ అండ్ లిరికల్ పోయెమ్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్’ అని దండ గుచ్చుతూ, షేక్స్‌పియర్ కాలంనుంచీ కూడా రచనలను నాలుగువందల తొంభై పేజీల బృహత్సంకలనంగా ఒకచోట చేర్చింది. పోనీ అలా, తెలుగు కవిత్వంలో పూర్వ శతాబ్దాల మేలు రచనలను ఏమైనా ‘వైతాళికులు’లో చేర్చారా అంటే అదీ లేదు. ఆమేరకు ‘గోల్డెన్ ట్రెజరీ’ పుస్తకంతో పోలిక కుదరదు.
ఇక ‘వైతాళికులు’ సంకలనం జరిగిన కాలం గురించి. తెలుగు ప్రాంతాల కవిత్వమే అయినా, ఇది స్వాతంత్య్ర పోరాట కాలం. 1920ల తరువాత, జాతీయ చైతన్యం, స్వాతంత్య్ర సిద్ధికై కార్యాచరణ, గాంధీజీ ప్రభావం, ఇతర జాతీయ స్వాతంత్య్రోద్యమ సంఘటనల ప్రస్తావన (జలియన్‌వాలా బాగ్, భగత్‌సింగ్ ప్రభృతుల ఉరితీత, సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్త్ర దహనాలు, ఉప్పు సత్యాగ్రహం). ఇందులో భాగంగా తెలుగు కవుల శక్తివంతమైన స్పందనలు నమోదుఅవుతున్న కాలం. ముద్దుకృష్ణ ‘వైతాళికులు’లో, సామాజిక, రాజకీయ వైతాళికుల ప్రసక్తిలేదు. గాంధీజీ గురించి, తన ముందుమాటలో ఒక పేరుగా మాత్రమే ప్రస్తావన చేశారు. ఇక ఇందులోని కవుల రచనలు చూస్తే- కవిత్వ వైతాళికులా వీరు? అన్న ప్రశ్న కలుగుతుంది. ఇందులో తమ కవితలు సంకలితం చేయబడిన ఇరవై తొమ్మిది మంది కవుల (అందులో ముగ్గురు కవయిత్రులు) నూట తొంభై ఒక్క కవితలు చూస్తే మనకి నిరాశ కలుగుతుంది. ఈ పుస్తకానికి ఇన్ని దశాబ్దాలుగా ఇంత పేరు, ఆదరణ అవసరమా అనిపిస్తుంది. 1935లో తొలి ముద్రణ జరిగి, 2002కల్లా పనె్నండో ముద్రణగా ప్రచురణ జరిగిన సంకలనం ఇది.
దీనికి పేరులేని ఒక ముందుమాట రాస్తూ, ముందరి పేరాలలో పురాణ యుగం, ప్రబంధయుగం, అంధయుగం అంటూ తంజావూరు సాహిత్య దశ దాకా లఘుమాత్రంగా వివరించి, తరువాత ‘నవయుగం’ అంటూ చివరి పేరాల్లో వీరేశలింగం, గురజాడ, గిడుగులను, ‘్భవ సంచలనం తీవ్రంగా కలిగించి, సంఘానికి నూతన సంచలనం కలిగించి, సంఘానికి నూతన లక్ష్యాలు నిర్దేశించిన వారిగా పేర్కొంటూ ఇలా చెప్తారు ముద్దుకృష్ణ. ‘దేశ కాల పరిస్థితుల్లో ఇంకొక మార్పువచ్చింది. వెనుకటి ఏ యుగంలోనూ లేని కొత్త సమస్యలు అనేకం ప్రతి దేశంలోనూ ఈనాటి కవులను కలవరపెడుతూ ఉన్నవి. ఆర్థికంగా, రాజకీయంగా, నైతికంగా, సాంఘికంగా, వ్యుత్పన్నతాపరంగా తీవ్రమైన మార్పులు ప్రపంచమంతటా జరుగుతూ ఉన్నవి’. ఇంతలా ముందుమాటలోనే చెప్పిన సంకలన కర్త. ‘ఆర్థికంగా, రాజకీయంగా, నైతికంగా, సాంఘికంగా, వ్యుత్పన్నతాపరంగా’ ఎటువంటి తీవ్రమైన మార్పులకు స్వరాలైన కవితలను తన సంకలనంలోనికి ఎంచారో అని చూస్తే, అక్కడే మొదలవుతుంది ఆశాభంగం,. ఈ చైతన్యపు మెలకువ ఇంతటితోసరి.
దేశకాల పరిస్థితులు, స్వాతంత్య్ర పోరాటం చుట్టూ తిరుగుతూ ఉండగా, ఆ ప్రస్తావన లేకుండా కవితలను పేర్చారు. మొదట్లోనే ఎవరినుంచి మొదలై ఎవరిదాకా వెళ్లింది అనిచూస్తే అది గురజాడతో మొదలుకావడం ఒక సమంజసమైన ఆరంభం. కానీ ఆయనకన్నా ఒక తరం తరువాతివాడు, ముప్ఫై ఏళ్లు చిన్నవాడు, తొలి కవితల వయసువాడు, కేవల జాతీయావేశి అయిన రాయప్రోలు సుబ్బారావుగారి గీతం ‘ఏ దేశమేగినా- ఎందుకాలిడినా’ (ఇది ఆంధ్రావళి సంపుటిలోని రచన)తో ఈ ‘వైతాళికులు’ మొదలు. 1913లోనే వెలువడ్డ ‘దేశమును ప్రేమించుమన్నా’ గురజాడ గీతం తరువాత స్థానంలోనే. ఇక్కడే, సంకలనకర్తగా ముద్దుకృష్ణ ఇష్టాయిష్టాలు, అభిరుచులు అంచనా అందుతుంది. కవితల కూర్పులో కాలక్రమాన్ని పాటించారు అనడానికి, సంకలనంలో అటువంటి పద్ధతి ఏదీలేదు. పుస్తకంలో విషయ సూచిక లేదు, కవితలకు ముద్రణ వివరాలు, రచనాకాలం వంటివేవీ లేవు.
భావ కవిత్వ ఫక్కీ రచనల ప్రతిబింబంగా మిగిలిపోయే సంకలనం ఇది. స్వాతంత్య్ర విషయమై ఏదీ స్పష్టంచేయని గీతం ఒకటి (స్వాతంత్య్ర రథము) దువ్వూరి రామిరెడ్డిగారి రచన తప్పిస్తే, నలుదిక్కులా పుష్కలంగా, మిక్కుటంగా వినిపిస్తున్న స్వాతంత్య్ర పోరాట భావనల తెలుగు కవిత్వ శంఖారావాలు ఇందులో ఒక్కటి కూడా లేవు. 1927 ప్రాంతంలో దువ్వూరి రాసిన ‘జాతీయత’ గీతంలోగల (ఓసి జాతీయతా! నీ బలోజక్జ్వలత్వ మెంత నీ శక్తిసామర్థ్యమెంత! నీదు శంఖరవమునగల ఇంద్రజాలమెంత! అస్థిపంజరములు సైతము నాడునౌర!) ఈ శక్తికోసమన్నా ఈ రచనను చేర్చవలసి ఉండగా- అలా జరుగలేదు. 1920 తరువాత గాంధీజీ తానే అంతటాఅయి నడుస్తున్న భారత స్వాతంత్య్ర పోరాటాన్ని తెలుగు కవులెలా చెప్పారో ఆ ప్రసక్తే ఉండదు.
1920-21 సహాయ నిరాకరణోద్యమం, 1930 ఉప్పు సత్యాగ్రహం, ఏవీ ఈ గీతాల్లో కనిపించవు. ప్రేమలు, ఆరాధనలు, విరహాలు, ఋతువులు, మూగ బాధలు, ప్రణయ మూర్ఛనలు, నేలా, నింగీ తప్ప, ‘దేశమంటే మట్టికాని మనుషుల’ సంగతులు ఈ వైతాళిక గీతాల్లో లేవు. ఈ సంకలనం తీరు ఇలాగే ఉండబోతున్నదని, దీనికి తమ కవితలు ఇవ్వనివారు చాసో (అప్పటికీ ఆయనకూడా కొన్ని కవితలు రాశారు). శ్రీరంగం నారాయణబాబు, కాగా, తొలుత ఇవ్వను అన్న శ్రీశ్రీ, ఏకంగా తన కవితలు ఎనిమిది ఈ సంకలనానికి ఇచ్చారు. (1935కి పదేళ్ళవాడైన ఆరుద్ర, ఈ విషయం పురిపండా అప్పలస్వామి చెప్పినట్టుగా సమగ్రాంధ్ర సాహిత్యం 13వ సంపుటి, 145వ పేజీలో ఉంది). జాషువా కవిత్వం చేర్చలేదు అన్నది నిత్యం ముద్దుకృష్ణ ధోరణికి అపఖ్యాతి తెస్తూనే ఉంటుంది. అయితే ఈ వివక్ష ఇంకా విస్తృతమైనది.
ఈ ముద్దుకృష్ణగారి వైతాళికులులోని కవితల ప్రకారమే అయితే, తెలుగునాట గురజాడ- రాయప్రోలుతో 1910 ప్రాంతంలో మొదలై, 1934లో శ్రీశ్రీ గీతం ‘మహాప్రస్థానం’తో ముగిసే నూట తొంభై ఒక్క కవితల్లో తెలుగునాట స్వాతంత్య్ర పోరాటమే లేదు. గీతాలు వేస్తున్నప్పుడు కూడా తను ప్రచురించిన కవులవి, ఏ గీతాలు ఎంపిక చేశారన్నది ఇంకా బలంగా సంకలనకర్తగా ముద్దుకృష్ణ ధోరణిని పట్టి ఇస్తుంది. వర్తమాన కాల ప్రతిబింబం కాని తెలుగు కవిత్వ సంకలనంగా ఇలా ఏర్పు, కూర్పు జరగడంలో ఉన్న పాక్షిక ధోరణి, తెలుగునాట స్వాతంత్య్ర పోరాటానే్న పక్కకుపెట్టి, ఆ కవితలను, అంటరానితనం పోవాలని బలంగా రాస్తున్న కవితలను మొత్తంగా విస్మరించే సాహసం చేసింది.
గాంధీజీ నూటయాభై వత్సరాల ప్రస్తుత సందర్భంలో, అప్పట్లో తెలుగు సమాజంలో స్వాతంత్య్ర పోరాటాన్ని నమోదుచేయకుండా ఈ సంకలనం చేసిన నష్టం దృష్ట్యాకూడా ఈ పరిశీలన అవసరం. దీనివెనుక ఉన్నది ఒక్క ముద్దుకృష్ణ మాత్రమేకాదు, తమ తండ్రి ఇంద్రగంటి హనుమచ్చాస్ర్తీగారు ఇలా చెప్పారని, శ్రీకాంతశర్మ నమోదుచేశారు. దీని వెనుక ఉన్నది ఒక్క ముద్దుకృష్ణ మాత్రమే కాదు, తమ తండ్రి ఇంద్రగంటి హనుమచ్చాస్ర్తిగారు ఇలా చెప్పారని, శ్రీకాంతశర్మ నమోదు చేశారు. నా తండ్రి ఇంద్రగంటి హనుమచ్చాస్ర్తి నవ్య సాహిత్య పరిషత్తు సభ్యులు, నవ్య సాహిత్య వ్యాపకులలో, ప్రచారకులలో ఒకరు. ఆయన నా చిన్నతనాన ‘వైతాళికులు’ సంకలనం ప్రస్తావన వచ్చిన సందర్భాలలో ‘‘సంకలనం ముద్దుకృష్ణ చేశాడు కాని, రచనల ఎంపికలో సాహితీ సమితి వాళ్లందరి చేతులూ వున్నాయ’’ అనడం నాకు గుర్తుంది. సాహితీ సమితి అంటే 1919లో తల్లావఝుల శివశంకరశాస్ర్తిగారు సభాపతిగా ఏర్పడినది.
ఇంకా కొట్టొచ్చే వాస్తవం ఏమిటి అంటే, తీవ్ర సామాజిక ఉష్ణోగ్రత స్వాతంత్య్ర పోరాట కవిత్వం, 1935నాటి తెలుగు సీమలో అప్పటికే గత రెండు దశాబ్దాలుగా ఉండగా, తాము ఎంపిక చేసుకున్న కవుల సృజనలో కూడా భాగమై ఉన్న తీక్షణ రచనలను, కనీసం కవిత్వ సమగ్రతకోసమై కూడా సంకలనంలో చేర్చని పాక్షిక దృష్టితో ఈ ఏర్పు, కూర్పు జరగడం. 1920లనాటికే గరిమెళ్ళ సత్యనారాయణ రాసిన సామాజిక గీతం ‘మాకొద్దీ తెల్లదొరతనము’ ఈ సంకలనంలోనికి చేరకపోవడం, ఒక కాల దర్పణం కావల్సిన సంకలన ధర్మానికి తీరని మచ్చ.
సామాజిక అంశని పరిహరించి, వైయక్తిక పరవకాశాలు, ధార్మిక ఆవేశాలు, గత వైభవాల పులకరింతలతో నిండిన ఈ కవితలకు 1930-40ల కాలానికి ప్రాతినిధ్య హోదాలేదు. బసవరాజు అప్పారావు గీతాలుగా, గాంధీజీ గురించిన ‘కొల్లాయి గట్టితేనేమి మా గాంధి’ (గాంధీజీ కొల్లాయి గట్టడం ఆరంభించిన సెప్టెంబర్ 1921 తరువాత కవి రాసినది). అలాగే ఉప్పు సత్యాగ్రహం 1930 తరువాత తనే రాసిన కవిత, ‘ఉప్పే తలంబ్రాలు’ అని పోల్చిన గొప్ప కవితను పక్కన పెట్టి, భారతీయ స్వాతంత్య్రోద్యమ కవిత్వంలోనే విలక్షణమైన అభివ్యక్తిగల కవితలకు, ఆ కాలానికి చోటుఇవ్వని, సమకాలీన సమదర్శనం లేని సంకలనానికి వైతాళిక స్థాయి ఉంటుందా? గురజాడ తరువాత శ్రీశ్రీ అని సాహిత్య చరిత్రను అతి సరళీకరణ చేయడం మనకి ఒక అలవాటుగా ముందరితరాలవారు పాటించి ఉండవచ్చు. కానీ, గురజాడ తరువాతి మంగిపూడి వెంకటశర్మ, గరిమెళ్ళ సత్యనారాయణ (1921) రచనల సామాజిక చైతన్య అంశను, పూర్తిగా విస్మరించి, బసవరాజు అప్పారావుగారిని (అటు స్వాతంత్య్రోద్యమ కవిత్వంలోనూ, ఇటు హిందూ ముస్లిం చైతన్యప్రేరకంగానూ, వివక్షకి గురయ్యే సామాజిక వర్గాల అభ్యున్నతి పరంగానూ రాసిన కవి, 1933లోనే చనిపోయారు) కేవలం భావ కవిత్వ శబలుడిగా చూపే కవితలు వేయడం ముద్దుకృష్ణ విపరీత ధోరణి.
ఇంకా అంతుపట్టని విషయం- ఒకటి 1935లో అచ్చుఅయిన చరిత్రగల ఈ సంకలనంలోనికి, శ్రీశ్రీ 1935 తరువాత రాసిన కవితలు ఎలా వచ్చాయి అన్నది? 1936(?)లో రాసిన అద్వైతం, 1940లో రాసిన ‘జగన్నాధ రథచక్రాలు’, 1941లో రాసిన ‘నిజంగానే’, కవితలు 1935కే ఎలా వచ్చి చేరాయో ఊహించలేము. మహాప్రస్థానం సంపుటిగా 1950లో అచ్చు అయినప్పుడు శ్రీశ్రీ స్వయానా ఉంచిన సంవత్సరాలు/ తేదీలు ఇవి. పై మూడు కవితలు 1936, 1940, 1941లో రాసినట్టు మహాప్రస్థానం సంపుటి చెప్తున్నది. కానీ ఇవి, 1935 ముద్దుకృష్ణ సంకలనంలో శ్రీశ్రీ రాసిన మరో అయిదు కవితలతో బాటుగా కనిపిస్తున్నాయి.
ఎంత ఇతరుల ప్రమేయం ఉన్నప్పటికీ, సంకలనకర్తగా ముద్దుకృష్ణకి ఈ క్రెడిట్ ఉన్నది. ఇందులోకి రాని ఆ కాలపు స్వాతంత్య్ర పోరాట సామాజిక అంశగల కవితల తీవ్రతను, అసలు సంకలనంలో కనిపించకుండా ఉన్న కవులకు సమాజంలోగల విస్తార ప్రభావశీలతను చూస్తే, ఎందుకీ సంకలనాన్ని ఇంత ఎక్కువగా పరిగణిస్తున్నామన్నది ప్రశ్న. అత్యధికంగా కృష్ణశాస్ర్తీవి ఇరవై కవితలుండగా, శ్రీశ్రీ కవితలు ఎనిమిది ఉన్నప్పటికీ, అందులో రెండోమూడో మినహాయిస్తే, మొత్తం కవితలన్నీ భావ కవిత్వ పలవరింతలు తప్ప, ఎవరివి ఇందులో వైతాళిక రచనలు అన్న ప్రశ్న కూడా వస్తుంది.
ఈ సంకలనం ఆఖరున, బసవరాజు అప్పారావుగారి సామాజిక అంశగల గీతాలు స్వీకరించకుండా తన స్వీయాభీష్ట ధోరణికి మారుపేరుగా నిలిచిన ముద్దుకృష్ణ వేసిన బసవరాజుగారి గీతం ఒకటున్నది. ‘ఒంటిగా ఉయ్యాలలూగితివా నా ముద్దుకృష్ణా’ అని సాగుతుంది. దీని పేరు ‘వటపత్రశాయి’. కొంచెం తీరుమారి, మనకి, ఈ సంకలనకర్త ఒక ‘హఠపత్రశాయి’గానూ, ఈ సంకలనం ఆయన ఒంటరిగా ఊగిన ఉయ్యాలల ఊహావైనంగానూ తెలుస్తుంది. ఎలాచూసినా, ముద్దుకృష్ణ బండారంగా మనం గుర్తించవలసిన ‘నైతాళిక’ కవిత్వ రచనలే అతి మిక్కుటంగా ఈ సంకలనంలో ఉన్నాయి. ఆయన ముందుమాటలో సూచించిన సామాజిక అంశ, లోపలి కవిత్వంలో ప్రతిఫలించకుండా ఎవరెంత శాయశక్తులా సహకరించినా ఆయనే అడ్డుపడ్డాడు. 1910-35 మధ్య తెలుగు కవిత్వ ఝంఝ భావ కవులదికాదు. వారిదొక పాయ మాత్రమే. సమాజ చైతన్య పతాకలుగా, స్వాతంత్య్రాకాంక్షలుగా ఎరిగిన తెలుగుజాతి గుండె చప్పుళ్ళ సమష్టి ప్రేరేపక కవిత్వనాదమే నిజమైన ఘోష. ఆ గుండెలను, ఆ చప్పుళ్ళను, కావాలని గుర్తించని వక్రదృష్టి ముద్దుకృష్ణది. అలా నవయుగ ప్రస్తావనలు, ముందుమాటకే పరిమితం చేసిన ఈ సంకలనం, వైతాళికులు కాదు ‘వైయక్తికులు’!

- రామతీర్థ, 9849200385