మెయిన్ ఫీచర్

కాలము ఋతువులారైన కావ్యమనగ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగా ‘‘పుణికి తెచ్చిన తావుల పూలగుత్తి’’ యన్నమాట. ఎప్పుడో కొన్ని ఏళ్ళక్రితము ఆయా ఋతువులాగమించిన యప్పుడు రంగు కుంచె విదల్పున బొమ్మ కట్టిన అక్షరాత్మలు. నాజూకు లెన్నియో పోగుపడిన సొబగు చాయల మేల్కవనంపు సొంపులు నాదామృతమయమైన తెలుగు ఋతువులై తనివి స్వరములూదిన వైశ్వనాధీయ వివరనాళిక. వనె్నదిద్దించుకున్న వార్షిక భూషలు. ఒక్కటొక్కటెగా ఋతువులు నిలద్రొక్కుకునే కాలము కేవలము రెండు నెలలు. రెండు నెలలెన్ని పద్యములను భ(ధ)రించును-? కనుక నాతి దీర్ఘములే నాడెము. ఇట్టి వొక చిన్ని పొత్తమున చిక్కుకున్న చిక్కణములు. చిత్రములై జిగిమీరినవి. ‘‘వాల్మీకి తరణి’’ ఛాయను తడిసి ప్రభావితుడైన కాళిదాసు కాలము గడిచి తెలుగు నేలమీద తిరిగి కాలూనినాడూ. అప్పటి తన పేరును మార్చుకున్నాడు. ఋతువుల శోభ అక్షరాల్లో కొదిగినంత అందంగా. చర్మచక్షుగోచరాలు కావు. అక్షరాలు నియమాల కతీతం గదా!
(మమ్మటుడు) ‘‘నియతి కృత నియమ రహితాం / హ్లాదైకమరుూ మనన్యపరతంత్రామ్ / నవ రస రుచిరాం నిర్మితి / మా దధతీ భారతీ కవేర్జయతి॥ (కావ్యప్రకాశ.)
లౌకిక కవియొక్క భారతి ప్రకృతి నియమములకతీతమైనది. బ్రహ్మ సృష్టియగు ప్రకృతియందు పద్మమునకు సౌరభము నియమితమై యుండును; పద్మమన్నచో గంధముండవలెను. ఇది నియతి కృత నియమము. కవి సృష్టియగు ముఖ పద్మమునకు లోక సిద్ధి సౌరభముతో పనిలేదు. అది కవి ప్రతిభా కల్పిత సౌరభ విశేషములే విరాజిల్లును. కవి సృష్టి ఇట్లు నియతి కృత నియమ రహితము. బ్రహ్మ సృష్టి నియతముగా సుఖ దుఃఖ మోహస్వరూపము. పరమాణ్వాది కారణ పరతంత్రము. కవి సృష్టి అట్లుకాదు. అది ఆనందైక మయము. కేవల కవి ప్రతిభా సిద్ధమగుట చేసి అనన్య పరతంత్రము. శృంగారాది రసోజ్జ్వలము. ఇట్లు బ్రహ్మసృష్టికంటె విలక్షణమై కవిసృష్టి మొప్పారును. "The most delightful and perfect form of Utterance that human words can reach'' (మాచ్యుఆర్నాల్డ్). ఇది కవికున్న ప్రతిభను ప్రపంచించుటలోని ఒక విపుల వైదుష్యం ఒక విషయ వైవిధ్యం. అక్షరముల ద్వారా ప్రతిపాదింపబడిన ఒక అలౌకికార్థ పర్యవసానంలో కవి ‘‘చాటువ’’ కనిపించుటయే ఉత్తమ కవితాలక్షణమని పెద్దల యభిప్రాయము. ఇది నిరాక్షేపణీయంగా అంగీకరించాల్సిన బుద్ధిమంతము. ఇక్కడ కవి పోడిమి పొత్తపు ‘‘అడపొడ’’ మీద ఆధారపడి యుండదు. అయితే ఇదే విషయంలో అనుస్యూతాచారం ఏమంటే గొప్పతనానికి గొప్ప పొత్తాలే ఎన్నుకోబడటం. కానీ ఇప్పుడొక ‘‘మాఱు పాఱు’’.
బహుకృతి ప్రబంధలగు కవుల కృషికి వెలగట్టునప్పుడు వారి ప్రధాన గ్రంథములను గ్రహించుట భావుక సాధారణమైన పద్ధతియని పై ప్రస్తావనాతాత్పర్యం. కారణం వాఙ్మయంలో కొందరు కవుల పేర్లతో వారి వారి ప్రసిద్ధ రచనలు మాత్రమే స్ఫురించును. కాళిదాసు అనగానే శాకుంతలం, బాణుడు అనగానే కాదంబరి, తిక్కన యనగానే భారతం, విశ్వనాథ అనగానే- వేయిపడగలో- రామాయణమో తలపు పొలముల తగులుట సాహితీ పథికులకు అనుభవ విషయము. ఇప్పుడొక ‘‘మాఱుపాఱు’’యంటిని కదా! అది యొక్క చిన్న కబ్బము. అందునా కాలమారు మార్పుల సంహారమన్నచో అందుండు ఋతువు కాలమే రెండు నెలలు. ఇట్టి కొద్దికాలము యేమంత పెద్దతనము నొనగూర్చుకొనకలదు. కనుక నాతి దీర్ఘములే నాడెమనుట. దీర్ఘమో హ్రస్వమో. కవిత ప్రతిభా సమన్వితమైనప్పుడీ పుటల లెక్క పరిగణనలోకి రాదు. ఇది యొక ప్రమాణము ననుసరించియే యుండును. ప్రమాణము శిల్పము; పోషణము. ఈ శిల్పపోషణలో వైశాల్యము వైశారద్యమునకు ‘‘గది’’కాదు. ఇప్పుడు ‘‘రమణీయార్ధ ప్రతిపాదక శబ్దం’’ ఎకరముల మేర నాక్రమించును. అట్టిదే కానిచో ‘‘నానీ’’లణాకానీలగుట కన్న మర్యాదేమున్నది..?
అరవై పద్యాల్లో ఆరు ఋతువులు; పది చొప్పున. పరిణామంలో చిన్నదయ్యూ పరిపాకంలో మిన్నదగుట గమనించతగ్గది. ఋతువుల్ని సంస్కృతాంధ్రాల్లో చాలామందే వ్రాశారు. కాళిదాసే వ్రాయగలడు కనుక వ్రాసినాడు. మరి తెలుగున ఎవరి సొమ్ము? జడాజడ వస్తు పరిశీలనము; ఆచార సంప్రదాయ పరిజ్ఞానము వాతావరణ పరివర్తన ప్రకారము ఏది యెట్లో వర్ణన యందట్లే అందగించిన ఆ తీరు మునుపెన్నడు ఎవ్వరు స్పృశించనిది. ఏ ఋతువున ఏ లత లే దారువులే పూవులే తావులెట్లుండునో- తెలుగు ఋతు సంహారకర్త యెరిగినంత మరొక తెలుగు కవి ఎఱుగరన్నది నిజం. నిష్ఠురమైనను. గ్రంథకర్త యొక్క సాహిత్యాభిరుచులకు, జీవిత దర్శన ప్రదర్శనమునకు స్వీకార్యము కాతగినది. ‘‘నిరంకుశపద ప్రజాస్వామ్య ప్రభుత్వమె’’వరిదో వారు మాత్రమే వ్రాయగలరనుట. ఇదిగాక పెక్కురు కూర్పరులలో సాధారణమైనది ఏదో ఒక కూర్పున మాత్రమే వారి శక్తులన్నిటిని ప్రోవుపెట్టగలరు; పెట్టుదురు. ఈ సూత్రము ‘‘ఋతుసంహార’’ కర్తకొప్పదు. ఆ మహాశిల్పి రచనలన్నియును దేనికదే బహుముఖీనములు. ‘‘ఋతుసంహారము- అను తెలుగు ఋతువులు’’ కబ్బమును లేదా ఖండకావ్య సంపుటిని వ్రాసిన కవి విశ్వనాథ సత్యనారాయణగారు. లక్షణముచే యిది అనిబద్ధ కావ్యము. విషయమున ప్రకృతి వర్ణనాప్రధానమైన భావకావ్యము. మహాకవి పెక్కు కృతులకంటె దీనియందు కొన్ని విశేషములున్నవి. అందు మొదటిది ఆయన కృతి ప్రదానము. ఈ కావ్యరత్నము శ్రీ కట్టమంచి వారి యశఃకౌస్త్భుము. సర్వధా దీనికి మహోజ్వల శిఖరారోపణ తుల్యమనదగినదీ కృతి సమర్పణమ. ఈ అంకిత పద్యములైదు: (ఇందులో మొదటిది శ్లోకం, మిగిలిన నాలుగు పద్యాలు) అందు పొదిగిన ప్రసంగమంతయు ఆంధ్ర వాఙ్మయ ప్రశంసారూపము. అందులోని చివరి పద్యము ‘‘నన్న భట్టులు మధు నవ ఝరీజనగిరి’’... తెలుగులకు ప్రాతఃపఠనీయము. కారణము పెద్ద పాదములన్నియు తెలుగువారేలగా ఎత్తుగీతము మాత్రము సంస్కృత కవులది. కనుక ఈ పద్యము తెలుగుల ప్రాతఃపఠనీయమనుట.
ఈ పొత్తమున కవిగారి మొదటి కారు వసంతము. ఈ ప్రథమ ఋతు పరిచయము నాగరక వాతావరణమున నుపక్రమింపబడినది. పల్లీయులకు ఆమని వచ్చినదని తెలిసికొనుటకు తీవ్ర ప్రయత్నమక్కరలేదు. ప్రకృతి సహజమగు ఋతు పరిణామ హేల పల్లెలందు ప్రామాణికముగనే యుండును. నాది యిప్పటికీ పచ్చిపల్లెటూరు కనుక- నాకీ విషయము జన్మజ్ఞానమై యున్నది. వ్యావహారిక ప్రవృత్తి పాషాణీకృతమైన పౌర జీవితమున కందువ కరస్పర్శ; అందునా సుకుమారమగు చైత్రానందము తత్త్వానే్వషణపరులకే అనిపించుట, కనిపించుట కద్దు. కనుకనే ‘‘పరిచయానుద్రిక్త పరిరంభణమున ప్రియురాలి యెద చెమరింపు’’ ‘‘శీతోదక స్నాన జాత సౌఖ్యము పైని ముకుపుటాన చెమర్పు’’ ‘‘పేరంటమునకేగు పిన్న బాలిక వాలుజడ మల్లెపూవు కానుపు’’ ‘‘వేప కొమ్మ కావి చిగురెత్త పజ్జరుూనెకు పూత’’ ఈ హేతుపరంపరను పల్లెటూరువాడు గమనించినంత వేగముగా పురీ పౌరులు గమనించలేరు. వారికేదో సంశయానుభవము కొలువు జీవితమున కొసాకులు మేయును. వారికి వసంత మాగ మించినదను విశ్వాసపు గుర్తు ఎట్టి గుబులును పుట్టించదు. కనుకనే ‘‘ఒక దినాన హఠాత్తుగా చికిలి కుహూకుహువు’’ను గుర్తించిరి. వసంతము వచ్చినది. ఇక సందేహము లేదు. ప్రవాహము వదలి వచ్చిన పరభృతము మేలుకొలిపినది. ఇది వసంత మధురిమావతారమే. దీనికింత ప్రత్యేకత ఎందుకు- అనగా అన్ని ఋతువుల ‘‘రేకులు’’ ఇచటనున్నవి. ఫలించిన తపసు యొక్క నగ్నత్వము అలంకరించుకొనును. సమయమంతయు పరిమళించును. సందర్భము సుంకు తేలును. ఈ వసంతుడు సామాన్యుడా...? మహారాజ వైభవోద్దామ సుకుమారమూర్తి. ఋతురాట్ సభానలకూబరుడు. ఈ ఔపమ్య స్ఫూర్తి మార్గదృష్టిగల మహాకవయితల పొత్తు. పొత్తము. ఇట్టిదే వసంతము నలుదెసలు ముట్టినది. సందడి యంతయు సుతర్దన కంఠ కూచితముగా దిక్కులు చుట్టినది. కొత్తగా జతకట్టిన కోకిలమ్మ తెలుగునాటి రసాల వాటికల ఎంగిలి చేయక విడిచిన చిగురు లేదు. ఆమనికి బాల్యము గడిచినట్లున్న శోభయంతయు తరు వనవైనది. పుష్పవత్యాంకురములైనవి. కామినీ కాముకులు అంగజాతంబుజాప్తారుణాంతర్బహిర్వహ్ని తప్తులు. ఇంత ఎవరికి తెలియును. ప్రకృతిననుశీలనము చేయగల పరమ ప్రతిభామూర్తులకు తప్ప. ఇదియూ పూజమే! పూజలనట్లుంచ తెలుగునాటి పూదఱికే వనె్నయువాసియు తెచ్చినది మల్లెపూవు. సాయం తనమున ముగ్ధ్భావ ప్రచాలితయై ప్రియురాలు సరము కట్టుటాది పగలు రెండుజాముల వేళ పంచపాత్ర వారిపై తేలియాడువరకు వాని దినచర్య వర్ణింపబడినది. తరువాతి పద్యములందున ఆ పూలే ప్రౌఢాంద్ర కృతుల గుణములకు పూట కాపులు. ఇందు ఆ కావ్యస్వభావములు స్థూలముగా తెలుపుచు మల్లికాపుష్ప గుణములతో వానిని శే్లషించుట సుభగము. ఇట్లీ వసంతావతార ఘట్టము ఆద్యంతము మల్లెపూలతో సవరింపబడినది. పిన్న బాలిక వాలుజడ మొగ్గగా కంటికి వ్రేగై వసంత ఋతుశోభల ప్రసవించు చూలాలుగా ఎసకమెసగి మల్లికయే మాధవోత్సవమును నిర్వహించుట ముఖ నిర్వహణముల యైక్యము సాధించిన యుదాత్త శిల్పము. ఇంతటితో వసంతము ముగిసినది. పాఠకులు చదువువచ్చిన వారు కదా, వసంత ఋతు సూక్తమున చివరగా ఎన్ని ప్రబంధ ప్రసూనములావిర్భవించినవో గదా!! ఇవి యన్నియు మల్లెలే!!! ఇంకను ఏమియో. ఎంతయో చెప్పవలసినదున్నదేమోయని యనిపించుట పాఠకుని తృప్తికి కవి పెట్టిన మర్యాద. ఋతువునకు పది పద్యములుగా చేసికొన్న నియమము నియమముగానే సాగినది. ప్రాచీన వసంత వర్ణనలలో తేనె విందున త్రేనె్చడు తేటలు, కమ్మని లతాంతములకు మ్మొనసివచ్చు మధుపమ్ముల గీత నినదమ్ములు పంచమ స్వరమున ప్రపంచమునొక డోల నూపు అనిమకములు తవిరాకులూడిచి తపసిగా మసలిన నగ్నవల్లిక పర్ణములలో దాగుటలు, ఇట్లెన్నిటినో ఊహావిహగములుచేసి ఎగిరింపవచ్చును కానీ మర్యాద మర్యాదే.
ఎండాకాలమునూహించియో- ఆ నిదాఘ మావహింపచేసుకొనియో ‘దుర్నిరీక్ష్యా ప్రభాధూర్ధరభ్భటంతో క్షేత్ర జీవనుల శిక్షించాడనో పటురోష కాషాయ కుటిలాంశు కశలతో గోగణాన్ని చావగొట్టాడనో ఖరమయూఖ క్రూర ఘనకాండ పటరితో విహంగ జాతుల క్షోభ పెట్టాడనో గ్రీష్మకాలప్రాంశు కింశుకద్యుతులతో తరువల్లి కలకగ్గిదాల్చినాడనో’’ వేసంగిని గూర్చి వేసవి వేడిని గూర్చి- వేడి హావడి గురించి - ఏవో ఎవేవో చెప్పవచ్చు. అది కవి చిత్తకోశమునందలి భావ సంపద. కర్తవ్య బాధ్యత నెరిగిన కవి కది చెల్లును. ఆ భారతి ధ్వన్యర్థ విలసితమై, ప్రతిపత్తలకు దివ్యమగునానందమును పిండును, అప్పుడా పాఠకుల ఎద నిండును. ఎలమి పండును. పాఠకుల కెదపండుట కడుప నిండుట వంటిది. కడుపెప్పుడు నిండును, తల్లి దగ్గరకు తీసుకున్నప్పుడు. తల్లి ఎవరు? పరమేశ్వరి. మరి పరమేశ్వరి? ఇదిగో అభినవ గుప్తుడీమాట అన్నాడు. చదువొచ్చుకదా. తప్పకుండా చదవండి.
‘‘యదున్మీలన యుకె్తైవ విశ్వమున్మీల తిక్షనాత్
స్వాత్మాయతన విశ్రాంతాం తాం వందే ప్రతిభాం శివాం’’
ప్రతిభను ‘‘పరమేశ్వరీ’’ రూపం చేసినాడు. ఆ ‘‘ప్రతిభా ధృతకవి’’ చెంత ఈ పాఠకుల కాకలి తీరుట. ఆ దేవి కరుణ ఎవనిపై ప్రసరించునో వానికి విశ్వోన్మీలనము కలుగును. అట్టి విశ్వోన్మీలనము కలిగిన నాడు కాని యాతడు మహాకవి కానేరడు. ఇప్పుడట్లు కాదు; కలము పట్టినాడా వాడు కాళిదాసే. అక్షరములనెఱిగినాడా ఆనందవర్ధనుడే. సందునకొక చిందబొందడు సాహిత్యమనుచున్నాడు. సామూహిక హత్యాకాండకుపక్రమించు చున్నాడు. పాపమీతరము వారిలో కొందరికేదో వ్రాయవలయునన్న ఉత్సాహమున్నది. నిజమే! వ్రాయుటకేమి కావలయును? మంచి భావములు కావలెను. మంచి భాష కావలెను, మంచి భాష ఎచట లభించును? పబ్బులందు లభించదు కదా! మంచి కావ్యములయందు లభించును. మంచి కావ్యము లెచట లభించును? చదువుట యందభినివేశమున్న చిత్త్భాజాత్యమున లభించును. అట్టిదిపుడొక శశవిషాణము గదా చదువుట లేదాయె. వీరికి చేతిలో చెప్పినట్లొదిగి- ఒదుగులు పోవు భాష లేదు కదా. నిత్య వ్యవహార భాషయే’’ అడుసు చిమ్మును. చిమ్మబడిన అడుసే అల్లిక పదములౌను. అల్లబడిన పదములు పద్యములు కానేరవు. అవునని వారందురు. అట్టిదే ‘‘సామాజిక స్పృహ’’ యని కూడా అందురు.
ఏవో కొన్ని శబ్దములు తెలియవచ్చును. కొన్ని యర్థములున్నూ తెలియవచ్చును. వ్యాకరణచ్ఛందోలంకారస్పృహ కొంత యుండవచ్చును. దాని కారణముగా కొన్ని పద్యములను గిలకవచ్చును. అట్టి వారిని గూడ కవులనవచ్చును. సర్వకాలములందు ఇట్టి వారలు కుప్పతెప్పలైయుండవచ్చును. కానీ అసలు కవియనగా నెట్టివానిననవచ్చును? ‘‘ఏనాస్మిన్ అతి విచిత్ర కవి పరంపరావాహిని సంసారే కాళిదాస ప్రభృతియో ద్విత్రాః పంచభావా మహాకవయం ఇతి గణ్యంతే॥ ఈ మహాకవుల భారతి ధ్వన్యర్థ విలసితమై ప్రతి పత్తలకు దివ్యమగు ఆనందమును కలిగించును. వారి ప్రతిభను అభివ్యక్తము చేయును. మహాకవుల ప్రతిభ సహృదయములను భ్రమర కీటక న్యాయమున సమానమగు అనుభవము కలవారినిగా జేయును. విశ్వనాథవారు గాఢ ప్రతిభులు కనుకనే అనుభూతి ప్రధానముగా కవిత్వము పలికింతురు. మిగిలిన కొందరిప్పటి కవులట్లు కాదుగదా. వీరు స్వతంత్రులైన తరువాత దేశభక్తి నశించినది. భాషాభిమానము చచ్చినది. సాహిత్యాధ్యయన శీలము చెడినది. సంస్కృతీ సంప్రదాయముల మీద ఏహ్యభావము పతాకమెక్కినది. ఈ దృశ్యమైన మనఃస్థితినుండి ఇప్పుడు సాహిత్యము సృష్టింపబడుచున్నది. పత్రికలలో చోటు మరింత అధఃశ్శిఖరము చేర్చినది.
ఈ ‘‘ఋతు సంహార’’కర్తకీ తిప్పలు లేవు. ఈయన భాషకొక ప్రత్యేకత యున్నది. ఆ ప్రత్యేకత జాతి మనుగడలోని ప్రత్యేకత. జాతి మనుగడలోని ప్రత్యేకత జాతికి ప్రాణము వంటిది. ఈ ప్రాణము భాషయందు; తద్గత సాహిత్యమునందు ప్రతిబింబించును. అప్పుడే అది ప్రాణవంతమైన రచన యగును. ఇట్టి ప్రాణవంతమైన రచన చేయుటకు వట్టి రచనా శక్తి చాలదు. అనంతమైన విమర్శనాశక్తి జీవితమును సహస్ర ముఖముల చూడగలశక్తి. ప్రతి విషయమునందు నిగూఢమైయున్న ప్రాణధాతువును గమనింపగల శక్తి. ఒక్క మాటలో సృష్టిసర్వమును వ్యాఖ్యానము చేయగల శక్తియుండవలయును. ఇంత ప్రతిభ ఋతుసంహార కర్తకున్నది. ఆయన కాలమున మనముండుటే శిశిరము గడచిన వసంతమూ. ఈ వసంత మధ్యంలో ఎన్ని ‘‘వశత’’లున్నాయో చూడండి. - ‘‘కించి దుషఃపూర్వకించి దతఃపర / ప్రాలేయ బిందు సంపాత వశత / మధ్యాహ్న వేళాక్రమాప్రాప్త తీక్ష్ణతా / కవితా తపోగ్ర సంక్రాంతి వశతి / సాయం సమాగత స్వచ్ఛ చంద్రాతప / కుల్యా ప్రసారణాకూత వశత / మధుర నిశార్ధ్భాగవధునీ విధా ప్రియా / హేలా మనోజ్ఞ సాహిత్య వశత....
ఇంకా ఏదో జరిగి, ఎంత సొగసుకాడో మాధవుడు వచ్చాట్ట ఇదీ సంగతి- ఆపై కొన్ని తెలుగు నాజూకులు- చివురు జున్నులు- ఇవన్నీ గడచి ఒక హర విలాసాన్ని. కళాపూర్ణోదయాన్ని- ఆముక్తమాల్యదని- పాండురంగ మహత్తుని- మనుచరిత్రని అందించి- కవి మల్లెల కొత్త రుచుల్ని చివరిసారిగా గుర్తుచేసిన ఈ సొబగంతా -
గగన భూమండలమ్మెల్ల కలయ తిరుగు
కాలము ఋతువులారైన కబ్బమనగ
సృష్టి లావణ్య మాధురీ వృష్టి తడిసి
పొలుపు విచ్చిన వాసంతి పూల గుత్తి....
- చేత పుచ్చుకొని కవి సమ్రాట్టు గ్రీష్మ ద్వారంలోకి అడుగుపెడతాడు. ఆ వైనం మరోసారి.

- సాంధ్యశ్రీ, 8106897404