మెయిన్ ఫీచర్

శబ్దార్థ వివేచనే కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన వ్రాయు గంటంబు మొనవాడి విశ్వంభరా ప్రజల ప్రాణ రక్షగాగ....’’ అని అంటాడొకచోట తెనాలి రామకృష్ణుడు. ఒక క్షణం ఆ చెప్పిన వాక్య విన్యాస తాత్పర్యంలోకి అడుగుపెడితే నంది తిమ్మన చెప్పినట్లు ‘మృదు గీతికా పరిణత ధ్వని వైఖరి’ కనిపిస్తుంది మనకు. అచ్చ కవిత్వపు మేలు వెనె్నల వెల్లపచ్చడం విచ్చిన అంబర శయ్యమీద ఉన్నామా... అని కూడా అనిపిస్తుంది. ఇది కవిత్వం గురించి మనం మాట్లాడుకోవలసి వస్తే ఇలానే ఈ విధంగానే మాట్లాడుకోవాలి. కారణం కవితా సంబంధి అయిన భాష ఇలానే వుంటుంది కనుక. నిజానికి భాషకు దాని నాగరికత ఒకటి వుంటుంది. భాష అనే సమాజంలో సంతోష పూర్వకమైన ఆమోదం పొందే హృదయ చుంబక శాబ్దికత ఒక గంభీర గమనము ఒక ఉదాత్త కంఠము రచనకుండాలి. శబ్ద చయనము వాక్య నిర్మాణము రచనాశైలి వంటి సూక్ష్మాలన్నీ ఈ పరిశీలనా పరిధిల్లోకి వస్తాయి. ఈ పరిశీలన తొలుత కంటిని శాసిస్తుంది. మరింత పరిశీలనగా గమనిస్తే ఆ శాసనం వెనకాల లేక అడుగున కర్ణమాధుర్యం రాజ్యమేలుతుంది. ఇదే అంతిమ నిర్ణయం చేసే శక్తి అనికూడా తెలుస్తుంది. అనుభూతిని శ్రోతకు (పఠితకు) అందజేస్తున్న ‘‘కవి’’కి భాషా సమాజంలో శ్రవణేంద్రియానికున్న ఈ కీలకమైన పాత్రను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇది కుదరకపోతే వాడు రాజకీయ కరపత్రం వ్రాసుకునే నిష్ఠలో పడి వుండాలి. అభివ్యక్తి క్రియచేత ‘‘కవి’’ కలిగించాలనుకున్న ప్రభావం కవి తన ‘‘ఉక్తి’’లో చేసే శబ్ద స్వీకార కళమీద, శబ్దానికిచ్చే స్థానం మీద ఆధారపడి వుంటుంది. అభివ్యక్తిలో విజయం సాధించదలచుకున్న కవి భాషావ్యవహారంలో వున్న మర్మాల్ని- శబ్దజగత్తులో ఉన్న నాగరకతను గుర్తించాలి. కవిత్వం అనాగరక శబ్దాల్ని, అభివ్యక్తుల్ని తనలో లీనం చేసుకోలేదన్న సూక్ష్మం ‘‘కవి’’ గ్రహించాలి. కనుకనే సర్వజనామోదమైన ఒక లక్షణాన్ని (కవిత్వానికి) శిష్టులేర్పరిచారు. తద్విపరీతం కవిత్వం కాదన్నమాట. సర్వకాలీనమైన ఈ సత్యాన్ని ముందుగా, కావ్యలక్షణంగా ‘‘అగ్నిపురాణం’’ ఆవిష్కరించింది. ఆ పరిష్కర పాఠాన్ని ఉదాత్త- అనుదాత్తంగా పఠిస్తూ ఇలా అంటారు.
‘‘సంక్షేపాద్వాక్య మిష్టార్థ వ్యవచ్ఛిన్నా పదావళీ
కావ్యం స్ఫుటదలంకారం గుణవద్దోషవర్జితం.’’ - అ.పు.337-6
గుణాలంకారయుక్తమై దోషవర్జితమైన ఇష్టార్థ ప్రతిపాదక పదావళి (వాక్యం) కావ్యమని అర్థము. దండి మహాకవియు ‘‘కావ్య దర్శనము’’న ‘‘ఇష్టార్థ వ్యవచ్ఛినా పదావళీ కావ్యం’’ అనుచు అగ్ని పురాణానే్న అనుసరించాడు. తరువాత భామహునితో శబ్దార్థములు కావ్యమను వాదము బయలుదేరినది. ఆ వాదాన్ననుసరిస్తూ రుద్రటుడు, వామనుడు, ఆనందవర్థనుడు, ముమ్మటుడును శబ్దార్థముల రెంటినీ కావ్యశరీరంగా గ్రహించారు. తరువాత పీయూషవర్షుడు (జయదేవుడు) అట్లుగాక ‘‘గుణాలంకారాది విశిష్ట నిర్దోషవాక్యం’’ కావ్యమన్నాడు. ఐతే సాహిత్య దర్పణకారుడు (విశ్వనాథ కవిరాజు) శబ్దార్థములను కాదని ‘‘వాక్యం రసాత్మకం కావ్యం’’ అని రసాత్మక వాక్యమునే కావ్యమని చెప్పుచూ తన ప్రాచీనులకంటే విలక్షణమైన కావ్యలక్షణము చెప్పి క్రొత్త మార్గము త్రొక్కినాడు. కావ్య ప్రకాశకారుడగు గోవింద ఠక్కరుపై లక్షణమును ‘‘రసాది మద్వాక్యం కావ్యం’’ అని సంస్కరించాడు. అటు తరువాత జగన్నాథ పండితరాయలు శబ్దార్ధములు కావ్యమనెడి వాదమును ఖండించి ‘‘రమణీయార్థ ప్రాతిపదిక శబ్దఃకావ్యమ్’’ అని కావ్యలక్షణాన్ని పరిష్కరించాడు. ఇప్పటికిదే పండితామోదమును పొంది నిలచిన కావ్య లక్షణము. ఐతే మనం గమనించాల్సిన ముఖ్యాంశం ఏమిటంటే -
అగ్నిపురాణమునందలి ‘‘ఇష్టార్థ వ్యవచ్ఛిన్నా పదావళీ కావ్యం’’ అను ఆర్ష లక్షణమే తుదకు ‘‘రమణీయార్థ ప్రతిపాదక శబ్దఃకావ్యమ్’’ అనే జగన్నాథ పండితరాయలు కావ్యలక్షణంగా రూపాంతరం చెందింది. ఆర్ష లక్షణంలోని ‘‘ఇష్టార్థము’’ ఇచట ‘‘రమణీయార్థ’’మైనది. రెండింటి లక్ష్యమొకటే. తన కావ్యలక్షణాన్ని జగన్నాథుడిట్లా పరిష్కరించుకున్నాడు. ‘‘చమత్కార జనక భావనా విషయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యమ్’’. ఇందలి భావనా పదమునకు కావ్యార్థమును పునఃపునరనుసంధానము చేయుట అనియే అర్థం. ఏ అర్థమును పునఃపునరనుసంధానము చేయుటచే లోకోత్తరాహ్లాదము (చమత్కారము) కలుగుతుందో అట్టి భావనాగోచరమగు అర్థము. ఇట్టి రమణీయార్థమును ప్రతిపాదించు శబ్దమే కావ్యమని అర్థము. శబ్దాన్ని గురించి - తదార్థాన్ని గురించి ఎందరెందరో (పండితులు) గొంతు చించుకుంటుంటే తెలుగుదేశపు కవులు మానవీయ జీవన మూల్యాన్ని విధ్వంసం చేయటానికే ‘‘కలం’’ కట్టుకున్నారు. ఇతను (కవి అని పిలిపించుకునేవాడు) వాస్తవానుభూతుల్ని దాచిపెట్టి తన అనుభూతులు కాని కృత్రిమ ఆలోచనలకి తన అక్షర శిశువుల్ని బలిపెట్టే విద్యకు అభ్యుదయమని నామకరణం చేసుకున్నాడు. దీనికి తనకునచ్చిన- మరో ముద్దు పేరు ‘‘సామాజిక చైతన్యం (స్పృహ).’’ ఈ ముసుగు క్రింద వీర విహారం చేస్తున్న శిల్పరహిత అకవిత్వ మలినాన్ని క్షాళనం చెయ్యాల్సిన బాధ్యత మనకుంది. ఈ సామాజిక చైతన్యం ప్రవాహ మొత్తంలో ఒక భాగం మాత్రమే. సహజంగా కలిసిపోయే వుంటుంది. కవికి కావల్సిన మహా చైతన్యంలో ఈ సామాజిక చైతన్యం నూరోవంతు కూడా ఉండదు. దీన్ని పట్టుకు వేళ్ళాడేవాడు గబ్బిలం అవుతాడు కానీ- కవి మాత్రం చస్తే కాడు. కవి సమస్త మానవ జాతికి బాధ్యుడు. జంతు జాలానిక్కూడా. ఇదే కదా కాళిదాసు రఘువంశంలో కంఠోక్తిగా చెప్పిన విషయం ‘‘సేకాంతే ముని కన్యాభిః తక్షణోజ్ఘాత వృక్షకం విస్రంభాయ విహంగానాం ఆలవాలాంబు పాయినాం...’’ జీవితం అందరి మీద లాగే కవి మీద కూడా సామాజిక స్పృహని విధిస్తుంది. ఎవర్నీ ఆ స్పృహ విడిచిపెట్టదు. విడిచిపెట్టినవాడు పరమచోరుడు. ఒక సంపూర్ణమైన చైతన్యాగ్ని జ్వాలల్లో నిత్యము దగ్ధవౌతున్న కవికి సామాజిక చైతన్యము- వస్తువు అనేవి అసలు సమస్యేకాదు. అతని కవిత్వంలో వస్తువుకి- శిల్పానికి ద్వైతభావం ఉండదు. సామాజిక స్పృహకు ప్రత్యేక స్థితి ఉండదు. ఉందని వాదిస్తే అతడ్ని ముందు సమాజంనుంచి వెలివెయ్యండి.
ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ అసాహిత్య జాతులన్నీ సాహిత్యంలోకి చొరబడ్డాయి. డబ్బాలో రాళ్ళువేసి మ్రోగించే జాతి అన్నమాట. వీళ్ళెవరికీ కవిత్వంతో గానీ- సాహిత్యంతో కానీ ఏవిధమైన సంబంధం లేదు. వీరంతా వారివారి కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో సాహిత్యంమీద పడ్డవాళ్ళే. అప్పటివారి స్థితి గోచరమే వారి సాహిత్యం. ఇటువంటి వారి చరిత్ర పరిశీలిస్తేగానీ ఆ కవిత్వపు జన్మస్థానం గురించి తెలియదు. మంచి కవిత్వం చదివి అర్థం చేసుకునే శక్తి వీరికుండదు. ఇది వారి తాతల కాలంనుండే సంక్రమించిన జేరస సంపద. తన అక్షరాలు మహాకవిత్వయోగ్యతలున్న శిల్పాలుగా అనిపిస్తాయి. ఇక ఆ కవిత్వానికి అతడే ప్రమాణము. అతడే శాస్తమ్రు. అతడే దిక్కు-దిక్సూచి. అతడి జీవితంలో మంచి కవిత్వంవైపు కనె్నత్తి చూచిన సందర్భమూ వుండదు.
ఈరోజు భారతదేశంలో మనుష్యులు ఒక సామాజిక జీవనం చేస్తున్నారంటే- ఆరణ్యక జంతుజీవనం చేయటం లేదంటే - దానికి కారణం వ్యాస వాల్మీకులే. రామాయణ, భారతాలనే పేరుతో వారుపెట్టిన భిక్షే ఇంకా మనిషిని రెండుకాళ్ళమీద నడిపిస్తోంది. ఏ యుగపు ప్రజలు ఆ యుగంకోసం వాళ్ళ విలువల్ని- ఆశల్ని- భావనల్ని- ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. అది కాలధర్మం. ఈ సత్యాన్ని ఎప్పటి వాల్మీకి...? అప్పుడే అన్నాడు ‘‘ప్రాప్తకాల ముపస్యతాం’’ అని- మీకు తెలియని ఒక రహస్యం చెబుతా వినండి. ఇలా నడిచిన - నడుస్తున్న - నడచే చరిత్రగా మానవ పురోగమన యానమంతా వలయాకారంగానే వుంది కాని, శిఖరారోహణంగా మాత్రం లేదు. ఏమంటారు...? ఇట్లా ఒక సంస్కృతిని విస్మరించి-తాడు బొంగరంలేని వ్యవస్థనొకదాన్ని కవిత్వంలోకి ఎక్కించే వారంతా పరస్పర సంఘాల చోరచోదకులు. వీరినుంచి మీరు జాగ్రత్త.
‘‘శ్రేయోదాయకమైన మానవ జీవనానికి మాతృస్థానంలో వున్న సాహిత్యాన్ని’’ (ఈ మాట మార్సిమ్ గోర్కి అన్న గుర్తు) వ్యభిచార కూపంలోకి పడద్రోస్తున్న వారిప్పుడు మహాకవులుగా చెలామణి అవుతున్నారు. వీరందరికి వారివారి సైద్ధాంతిక తర్కాలున్నాయి. కాబట్టే వాడి కాలకృత్యం కవిత్వమై అచ్చుపోసుకున్నది. ఇంత హేయమైన స్థితిలో వాడుచేస్తున్న క్రియాకలాపానికి ‘‘కవిత్వమ’’ని పేరుపెట్టుకోవటం తెలుగువారు చేసుకున్న దౌర్భాగ్యం.
దండి (7వ శతాబ్దం) తన కావ్యాదర్శంలో కావ్యసర్వస్వము అంటే కవికర్మ అంతా సమాధి అని; కవులంతా సమాధి మార్గానే్న అనుసరించాలని నెత్తీనోరూ బాదుకొని మరీ చెప్పారు. ‘‘తదేతత్ కావ్య సర్వస్వం సమాధిర్నామయో గుణఃకవి సార్థః సమగ్రోపితమేనమనుగచ్ఛతి’’. కానీ ప్రతిభా పాండిత్య అభ్యాసాలు మూడూ కలసి ఒకే కారణంగా కార్యానికని కూడా అంటారు. ‘‘నైసర్గికీచ ప్రతిభా శ్రుతంచ బహునిర్మలం అమంద శ్చా యోగోస్యాః కారణం కావ్య సంపదః’’ అయితే కావ్యానికి మార్గం సమాధా-లేక ప్రతిభా శ్రుతాభియోగ త్రితైక రూపకారణమా? మార్గం అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయి వుంటుంది. జన్మసిద్ధమైన ప్రతిభ ఒకవేళ లేకపోయినప్పటికి వ్యుత్పత్త్యభ్యాసాదులచేత కూడా కవిత్వం సాధించవచ్చని దండి మహాశయుడే మళ్ళీ చెప్పాడు. కాబట్టి ప్రతిభ- వ్యుత్పత్తి (పాండిత్యం) అభ్యాసాలు అన్నీ కలిపి కవిత్వసాధన కారకాలన్నమాట. ఇంత ప్రయాసపడి పురుడుపోసుకున్న కవిత్వాన్ని-ఒక్క ‘‘అపాన వాయువుతో త్రేన్చిపారేసే అలగా కవుల అల్లరితో ఈ తెలుగు నేలలు తల్లడిల్లిపోతున్నాయి. ఇక మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది కేవలం రంగు చొక్కాల మెరుపెరుపులు కాదు. మనిషిని చమత్కారం వైపు నిలబెట్టి ధ్వనితో మెదడును చైతన్యవంతం చేసిందా లేదా అన్నది బిగ్గరగా ఆలోచించాల్సిన అంశం. కవిత్వాన్ని పోల్చుకోవటానికిది ఒక కొండగుర్తు. ఎందుకంటే శక్తిరహితమైన సామాన్యశబ్దం మనిషిని ఏమీచెయ్యలేదు. గ్రీకులు కవిత్వాన్ని ‘ఆ యచి -ళూఒఖ్ఘఆజ్యశ’’ అన్నారు. ఈ శక్తి వక్రోక్తి- ధ్వని అలంకారము ఇత్యాది బహువిధ చమత్కారప్రయోగం చేత శబ్దానికి లభింపజేస్తున్న ఒక విశిష్ట సిద్ధి. ఈ శక్తి మనిషి మీద పడాలంటే తదుత్పాదక హేతువులైన చమత్కార విశేషాలు మనిషికి సాక్షాత్కరించాలి. ఈ లక్షణమేమిటో విజ్ఞాన తృష్ణ ఉన్న ప్రతివాడు తెలుసుకోవాలి. మరి పుస్తకాల దొంతర్లని రాసే వాళ్ళకు ఈ తెలుసుకోవలసిన బాధ్యత ఇంకా ఎంత వుందో ఆలోచించండి. కానీ తెలుగు కచ్చాల కవులు ఇది ‘‘శోష’’లిస్టు యుగమనో- అభ్యుదయవాదమనో సామాజిక స్పృహ అనో కేకలు వెయ్యటంలోనే విప్లవ కవిగా తమని గుర్తించాలని తహతహతో తగలబడిపోతున్నారు. మీరు వారికి దూరంగా వుండండి. ఆ నల్లమందుని మీకు అలవాటుచేయగల నేర్పరులు- వీరంతా యూనిఫారం మార్చుకున్న ఒకే రకం చోరాగ్రేసరులు.
వ్యుత్పత్తిని కలిగించే ‘‘సచేతన అంతర్ముఖత్వం’’ మనిషి మీద పుస్తకం కలిగించాలి. అది మహత్తరమైన అవగాహనకు అంకురార్పణగా మనిషి గ్రహించాలి. ఒక గొప్ప వైజ్ఞానిక తటిల్లత కాంతిలో మునిగిపోయో- ఒక కళాత్మకక్రియ ఆవిష్కరించిన మహాసౌందర్య ప్రపంచానికి వశీభూతడైపోయో- ఈ పాఠకుడు (సామాజికుడో) తన ఊహల్లో ఎన్ని నందాదేవి గిరి శిఖరాలెక్కాడో. ఎన్ని గంగా స్నానాలు చేశారో ఎన్ని సాగర యానాలు చేశారో. ఎన్ని సామ్రాజ్యాలు ఏలారో ఎన్ని పొహళింపుల్లో తనను తాను ఆవిష్కరించుకున్నారో ఆ స్పృహే వేరు. అది కవిత్వం. ఎమర్సన్ అంటాడు"The youth asks for a poem. The very dances with to go to the theatre, what private heavens can we not open, by yielding to all the suggessions of rich music! Some swing and verge for the creative power lying coiled and cramped here.'' ఇక్కఢ Coiled అనే పదాన్ని గమనించాలి. ప్రతిభకుండలినిలా మనిషిలో చుట్టలు చుట్టుకొని పడుకుని వుంటుందట. దాన్ని పుస్తకం విడదీస్తుందట. పుస్తకం కాటువేసిన మనిషి తత్పూర్వపు మనిషిలా వుండడు. వాడు పుస్తక గర్భంలోంచి పుట్టిన నూతన మనిషి. అసలైన కవిత్వం చదివిన మీరంతా మీ మనసులో ఒక ‘‘చాక్షు సక్రతువును’’ లోపలి చూపుతో దర్శిస్తున్నారన్నమాట.
అధ్యయనం మీద వీరి చింతన ఇంకా దరిద్రంగా వుంటుంది. నాలుగైదు దశాబ్దాలనుంచీ కవులుగా నటిస్తున్న వచన చోరుల నిజ స్వరూపం తెలుగు ప్రజలకు తెలిసిపోయినా వారి ఆగడాలు ఆగలేదు. అకటా వికటపు దుంప పిలకలు వేస్తునే వుంది. ప్రతి కవీ ఏదో గొప్ప సందేశం యిస్తున్నానని, దాన్ని లోకం ప్రత్యేకశ్రద్ధతో వినాలనీ, విని ఆ సందేశాన్ని శిరసావహించాలని ఒక వీరభంగిమ పెట్టి మాతృగర్భంలోంచి- ఈ భూమండలం మీదికి (తెలుగునేల మీదికి) దూకుతాడు. ఇది ముఖ్యంగా వచన కవితా డింభకుడాడే వచన కవితాక్రీడ. వారు చెప్పేదేమిటో వారికే తెలియదు ఐనా మనం వినాలి. అనుభూతిననుభవించే వయసుకూడా వుండదు ఐనా మనం వినాలి. అతగాడి వమన విద్యా పాండిత్యాన్ని మనం చప్పట్లతో సత్కరించాలి. చిత్రమేమిటంటే కవిత్వ విద్యలో ఒక శూన్యాన్ని మనకు అక్షరాలుకట్టి చూపువాడు. కనుక పాఠక మహాశయులారా ఇటువంటి కాలకృత్యాల్ని కవిత్వం పేరుతో మన ముఖానికద్దేవాడ్ని క్షమించటమంటే అది ప్రజాస్వామ్యపు హద్దు. If one wants to educate others the educationist should be educated.

- సాంధ్యశ్రీ, 8106897404