మెయిన్ ఫీచర్

శాసనాల్లో బ్రహ్మోత్సవ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధికెక్కింది. దాదాపు రెండువేల సంవత్సరాల నుండి సాహిత్యంలో, శాసనాల్లో తిరుమల క్షేత్ర వైభవం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో సంవత్సరం పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, పండుగలు భక్తులను నిరంతరం తన్మయత్వం చేస్తూనే ఉంటాయి. అక్కడ జరిగే అన్ని వేడుకల్లో ప్రధానమైనవి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల సమయంలో ప్రపంచం నలుమూలలనుండి లక్షలాది భక్తులు తిరుమలకు వచ్చి, కనులారా స్వామిని చూసి తరిస్తారు. అనేక ప్రాంతాలనుండి వచ్చే భక్తబృందాలు ఆ సమయంలో భజనలు, కోలాటాలు, కీర్తనలు, నాట్యాలు ఇంకా అనేక కళాప్రదర్శనలతో స్వామిని సేవించి, భక్తులకు కనువిందు చేస్తారు. అతి ప్రాచీన కాలానికి చెందిన ఈ బ్రహ్మోత్సవ విశేషాలు వరాహ, పద్మ, బ్రహ్మాండ, భవిష్యోత్తర పురాణాల్లో, భారత, భాగవతాల్లో, ఆగమ శాస్త్రాల్లో, శ్రీ వేంకటాచల మహాత్మ్యంలో, శ్రీ వేంకటాచల ఇతిహాస మాలలో వివరంగా ఉన్నాయి. మొదటిసారిగా సాక్షాత్తూ బ్రహ్మదేవుడే శ్రీ వేంకటేశ్వరునికి ఈ ఉత్సవాలు నిర్వహించాడని, అందుకే వీటిని బ్రహ్మోత్సవాలంటారని పండితులు భావించారు.
తిరుమల, తిరుపతి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంలలో మొత్తం 1252 శాసనాలు లభించాయి. వీటినే తితిదే శాసనాలంటారు. వీటన్నింటినీ ఆరు సంపుటాల్లో తితిదే ముద్రించింది. ఇందులో తిరుమలలో లభించిన శాసనాలే దాదాపు 800పైగా ఉన్నాయి. ఈ శాసనాలను పల్లవులు, చోళులు, యాదవ రాయ వంశస్థులు, విజయనగర చక్రవర్తులు వేయించారు. ఈ శాసనాలను సమగ్రంగా అధ్యయనం చేస్తే, విభిన్న కాలాల్లో తితిదే వైభవం ఎలా ఉండేదో తెలుస్తుంది. ఈ శాసనాల్లో దాదాపు 70 శాసనాల్లో బ్రహ్మోత్సవ విశేషాలు ఉన్నాయి. దేవస్థాన పరిపాలనా నిర్వహణ ఎక్కువగా తమిళ అధికారుల ప్రాబల్యంలో ఉండడంవలన ఈ శాసనాల్లో ఎక్కువ భాగం తమిళ భాషలో ఉన్నాయి. సాహిత్యంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ఉంటే, శాసనాల్లో ఆయా కాలాల్లో బ్రహ్మోత్సవాల నిర్వహణకోసం చేసిన దానాలు, సమర్పించిన నైవేద్యాలు మొదలైన అనేక వివరాలున్నాయి. వీటి అధ్యయనం వలన స్వామి వైభవం కళ్ళకుకట్టినట్టు కనిపిస్తుంది. ఉత్సవాల సమయంలో దాతలు కట్టించిన మండపాల్లో దేవుని నిలిపి దాతల పేర్లమీద నైవేద్యాలు సమర్పించేవారు. తిరుమల తిరుపతుల్లో ఇటువంటి మండపాలు దాదాపు 200పైగా ఉన్నట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. కొన్ని మండపాలు పూల తోటల్లో ఉండేవి. చాలావరకు ఉత్సవమూర్తి ఊరేగింపు మార్గంలోనే ఇవి ఉండేవి.
సాహిత్యపరంగా బ్రహ్మోత్సవాలు వేల సంవత్సరాలనుండి జరుగుతున్నప్పటికీ, శాసనాల ప్రకారం మొదటి ఆధార క్రీ.శ.966నాటి శాసనంలో ఉంది. పల్లవరాణి సామవై క్రీ.శ.966లో శ్రీనివాసునికి ఒక వెండి ఉత్సవమూర్తిని చేయించినట్లు, బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఉత్సవమూర్తిని ఊరేగించే ఏర్పాటుచేసినట్లు ఈ శాసనంద్వారా తెలుస్తున్నది. ఈ ఉత్సవం అప్పుడు పురట్టాశి మాసంలో, చిత్తా నక్షత్రంలో ప్రారంభమై, అంకురార్పణతో కలిపి పది రోజులపాటు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అప్పటినుండి అనేకమంది రాజులు, రాణులు, రాజోద్యోగులు, మత గురువులు, దేవాలయ అధికారులు, సామలు, సామాన్య భక్తులు బ్రహ్మోత్సవాలు నిరంతరం నిర్విఘ్నంగా జరగడంలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా విజయనగర యుగంలో అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేవారు.

బ్రహ్మోత్సవాల నిర్వహణకోసం చేసిన దానాలు
పాలకులు మొదలుకొని సామాన్య ప్రజలవరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకోసం అనేక దానాలుచేశారు. అనేకమంది గ్రామాలను, భూములను, ధనాన్ని దానంగా ఇచ్చి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగడానికి తోడ్పడ్డారు. దేవాలయ అధికారులు ఆ దానాల్ని స్వీకరించి దాతలు కోరినట్లుగా ఉత్సవ రోజుల్లో వాహనాల అలంకరణకోసం, ధూప దీప నైవేద్యాలకు, అంగరంగ భోగాలకు ఏర్పాట్లుచేసేవారు. కొందరు బ్రహ్మోత్సవాల్లో ఒక్కోరోజు జరిగే రథోత్సవం, గరుడోత్సవం లాంటి ఉత్సవాలు జరగడానికి ఏర్పాటుచేశారు. కొందరు పూజలకు, నైవేద్యాలకు దానాలుచేశారు. నైవేద్యానికి పెట్టే పదార్థం, దాని తయారీకి వాడాల్సిన వస్తువులు, వాటి పరిమాణంకూడా నిర్ణయించిన వివరాలు శాసనాల్లో అనేకం ఉన్నాయి. నైవేద్యం పెట్టిన తరువాత దాత భాగానికి వచ్చే ప్రసాదాన్ని కొందరు దాతలు అన్నసత్రాలకు, మఠాలకు సంక్రమింపజేసేవారు. అప్పపడి, సుగియన్ పడి, అతిరసప్పడి, తిరుక్కణామడై, శ్రీడైప్పడి, ఇద్దిలిపడి, తిరుప్పోనాకాం, దద్యోదనం మొదలైన నైవేద్యాల వివరాలు శాసనాల్లో తరచుగ కనిపిస్తాయి. ఏ మండపంలో ఏ నైవేద్యం సమర్దించాలో కొందరు దాతలు సూచించారు. కొందరు ఒక రోజు ఉత్సవానికి అవసరమయ్యే నైవేద్యంకోసం దానం చేస్తే, కొందరు సంవత్సరం పొడవునా జరిగే అన్ని బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లుచేశారు. కొందరు బంగారు నాణేలను సమర్పించారు. శాసనాల్లో కళంజు, చక్రపొన్, రేఖైపొన్, వరాహేలు, గట్టవరహాలు, పొన్, మాడ, పణం, నర్పణం మొదలైన నాణేల వివరాలు అనేక శాసనాల్లో కనిపిస్తాయి. మామూలు రోజుల్లోకంటే బ్రహ్మోత్సవ సమయాల్లో భక్తులు అధికంగా ఉంటారు కాబట్టి ప్రసాదాలు కూడా ఎక్కువగా తయారుచేసేవారు. అందుకే ఇటువంటి ఉత్సవాల సమయంలో దాతల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దాతలు నిర్దేశించినట్లుగా నైవేద్యాలు, ఇతర సేవలకు వినియోగించి మిగిలిన ధనంతో చెరువుల్ని తవ్వించడం, మరమ్మత్తులు చేయించడంలాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు వినియోగించేవారు. అప్పటి సమర్ధవంతమైన దేవాలయ పరిపాలనా వ్యవస్థకు ఇదొక మంచి ఉదాహరణగా భావించవచ్చు.

బ్రహ్మోత్సవాల సంఖ్య
ఇప్పుడు తిరుమలలో సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం మొదటిరోజు ప్రారంభమై, విజయదశమి పూర్తయిన రెండు రోజుల తరువాత ముగుస్తాయి. సంవత్సరంలో ఎప్పుడైనా అధిక మాసం వస్తే (ఆశ్వయుజ, నిజ ఆశ్వయుజ మాసాలు) అప్పుడు రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రెండో బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణ, రథోత్సవం, ధ్వజావరోహణం ఉండవు. కొన్ని దశాబ్దాలముందు వరకు తిరుమలలో సంవత్సరానికి నాలుగు బ్రహ్మోత్సవాలు జరిగేవి. మధ్యయుగంలో సంవత్సరంలో పది బ్రహ్మోత్సవాలు జరిగేవని శాసనాలు పేర్కొంటున్నాయి. వైకాశి, ఆని నెలల్లో తప్ప మిగతా అన్ని మాసాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు శాసనాల్లో ఉంది.
క్రీ.శ.966కు ముందు ఒకే బ్రహ్మోత్సవం జరిగేది. క్రీ.శ.966 నాటి శాసనం ద్వారా పల్లవరాణి సామవై రెండో బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటుచేసినట్లు తెలుస్తున్నది. ఒకటి పురాట్టాశి మాసంలో, రెండోది ముక్కోటి ద్వాదశి రోజున జరిగేది. క్రీ.శ.14వ శతాబ్దిలో వీర నరసింహ యాదవరాయల రాణి ఇంకో బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటుచేసింది. ప్రతి ఉత్సవంలో రెండోరోజు ఉత్సవమూర్తి, దేవేరులు, వరాహస్వామి గుడిలోని తిరుచ్చి మండపంలో ఆసీనులైనప్పుడు నైవేద్యం పెట్టేవారని క్రీ.శ.1380నాటి శాసనంలో ఉంది. క్రీ.శ.1388నాటి శాసనంలో విజయనగర రెండో హరిహరరాయలు పూంగోడు గ్రామ ఆదాయంతో బ్రహ్మోత్సవాన్ని నిర్వహించే ఏర్పాటుచేసి, దాని నిర్వహణ బాధ్యతను ముల్లై వేంకట జీయర్‌కు అప్పగించినట్లుంది. ఇతనే తిరిగి క్రీ.శ.1429లో ఆశ్వయుజ మాసంలో జరిగే బ్రహ్మోత్సవంకోసం, నైవేద్యాలకోసం మూడు గ్రామాలను, 2200 బంగారు నాణేలను సమర్పించినట్లు మరో శాసనంలో ఉంది. క్రీ.శ.1445నాటి ఒక శాసనం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇవి పురాట్టాశి, ఆని, మాసి, పంగుణి, చిత్తిర, ఆణి మాసాల్లో జరుగుతుండేవి. వీటిలో మొదటి నాలుగు బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన వారి వివరాలు ఉన్నాయి. పంగుణి బ్రహ్మోత్సవ ప్రస్తావన క్రీ.శ.1446 ఫిబ్రవరి నాటి శాసనంలో, చిత్తిరై బ్రహ్మోత్సవ ప్రసక్తే అదే సంవత్సరం నవంబర్‌నాటి శాసనంలో ఉంది. క్రీ.శ.1551నాటి రాయసం వెంకటాద్రి వేయించిన శాసనం బ్రహ్మోత్సవాలకు సంబంధించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నది. ఈ శాసనంలో అతడు పది బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసునకు నైవేద్య సమర్పణకు ఏర్పాట్లుచేసిన వివరాలున్నాయి. ఆ సందర్భంలో ఎవరెవరు ఏయే సందర్భాల్లో ఏ బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటుచేశారో వివరంగా చెప్పాడు. క్రీ.శ.1551లో చిత్తిరై బ్రహ్మోత్సవాన్ని మేలుడైయార్ అనే అధికారి ఏర్పాటుచేసినట్లు తెలుస్తున్నది. క్రీ.శ.1516నాటి ఒక శాసనంలో తై బ్రహ్మోత్సవ ప్రసక్తి ఉంది. దీన్ని శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటుచేశాడు. 1530లో ఆవణి బ్రహ్మోత్సవాన్ని తిరునిన్ర దెడైయాన్ (గుడి అధికారి) ఏర్పాటుచేశాడు. అంతకుముందు క్రీ.శ.1530నాటి ఒక శాసనంలో తొమ్మిది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు ఉంది. తాళ్ళపాక పెద తిరుమలయ్య క్రీ.శ.1539లో 2000 వరహాలు సమర్పించి ఆణి బ్రహ్మోత్సవాన్ని ప్రారంభించినట్లు, ఈ ఉత్సవం 13 రోజులపాటు జరుగుతున్నట్లు ఈ శాసనంలో ఉంది.

బ్రహ్మోత్సవాలు జరిగే రోజులు
ఇప్పుడు తిరుమలలో ధ్వజారోహణంతో మొదలై, చక్రస్నానంతో ముగిసే బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతున్నాయి. అయితే శాసనాల్లో ఉత్సవాలు జరిగే రోజుల్లో అనేక మార్పులున్నాయి. వివిధ కాలాల్లో 9నుండి 14 రోజులవరకు బ్రహ్మోత్సవాలు జరిగేవి. బ్రహ్మోత్సవ ప్రసక్తిఉన్న క్రీ.శ.966నాటి మొదటి శాసనంలో 10 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతున్నట్లు ఉంది. 16వ శతాబ్దిలో అవి పధ్నాలుగు రోజులకు పెరిగాయి. క్రీ.శ.1551, క్రీ.శ.1594నాటి రెండు శాసనాల్లో బ్రహ్మోత్సవాలు 11 రోజులు జరిగేవని తెలుస్తున్నది. క్రీ.శ.1504నాటి తిరుప్పణి పిళ్ళై ఎంపెరుమానార్ శాసనం, క్రీ.శ.1511నాటి అప్పపిళ్ళే శాసనం, క్రీ.శ.1528నాటి కుప్పయ్యన్ శాసనం, క్రీ.శ.1539నాటి నాగర్ పండితర్ శాసనం, క్రీ.శ.1545నాటి తాళ్ళపాక పెద తిరుమలయ్య శాసనం, క్రీ.శ.1583నాటి ఎట్టూరు తిరుమలై కుమార తాతాచార్యర్ శాసనం, 12రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. అలాగే ఇంకా ఏడు శాసనాలు 13 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలను పేర్కొంటున్నాయి. చివరిగా క్రీ.శ.1561నాటి తిరుమలయ్య రాజశాసనం, బ్రహ్మోత్సవాలు 14 రోజులు జరుగుతున్నట్లు పేర్కొంది. కాలం గడిచేకొద్దీ బ్రహ్మోత్సవాల సంఖ్య పెరగడం. వాటితోపాటు ఉత్సవం జరిగే రోజులు పెరగడం గమనిస్తే వాటికున్న ఆదరణ ఎటువంటిదో గమనించవచ్చు.

స్వామివారి వాహనాల సంఖ్య:
బ్రహ్మోత్సవాలు జరిగే రోజులు పెరిగేకొద్దీ స్వామివారు ఊరేగే వాహనాల సంఖ్య కూడా పెరగడాన్ని మనం శాసనాల్లో చూడవచ్చు. శ్రీ వేంకటేశ్వరుడు తన దేవేరులైన శ్రీదేవి, భూదేవిలతో కలిసి, బ్రహ్మోత్సవాల సమయంలో ఏరోజు ఏ వాహనంలో దర్శనమిస్తారో సాహిత్యంలో, శాసనాల్లో ఉంది. బ్రహ్మోత్సవం ఎన్నిరోజులు జరిగినా ధ్వజారోహణంతో ప్రారంభమై, ధ్వజావరోహణంతో ముగుస్తుంది. మధ్యలో ఒక్కోరోజు ఒక్కోవాహనంలో స్వామి కనిపిస్తారు. ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో వాహనక్రమం ఇట్లా ఉంది.
===================================
రోజు ఉదయం రాత్రి
----------------------------------------------------------------------
మొదటి రోజు ధ్వజారోహణం పెద్ద శేషవాహనం
రెండోరోజు చిన్న శేష వాహనం హంస వాహనం
మూడో రోజు సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
నాలుగోరోజు కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
అయిదో రోజు మోహినీ అవతారం గరుడ వాహనం
ఆరో రోజు హనుమంత వాహనం గజ వాహనం
(సాయంత్రం స్వర్ణరథోత్సవం)
ఏడో రోజు సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
ఎనిమిదో రోజు రథోత్సవం అశ్వవాహనం
తొమ్మిదో రోజు చక్రస్నానం ధ్వజావరోహణం
======================================

ధ్వజారోహణానికి ముందురోజు సాయంకాలం స్వామి సేనాధిపతి విష్వక్సేనునికి తిరువీధుల ఉత్సవం నిర్వహించి, దేవాలయానికి తిరిగి వచ్చిన తరువాత యాగశాలలో అంకురార్పణ చేస్తారు. శాసనాల్లో ధ్వజారోహణాన్ని తిరుక్కోడి తిరునాళ్ అని పేర్కొన్నారు. క్రీ.శ.1446 ఫిబ్రవరినాటి శాసనంలో మొదటిసారిగా ధ్వజారోహణం అనే పేరు కనిపిస్తుంది. సాహిత్యంలో, శాసనాల్లో, అన్నమయ్య కీర్తనల్లో ఈ వాహనాల పేర్లలో, తిరిగే రోజుల్లో మార్పులున్నాయి. మొదటిసారిగా శేష వాహన ప్రశంస క్రీ.శ.1508నాటి శాసనంలో ఉంది. తరువాత క్రీ.శ.1614వరకు మొత్తం 8 శాసనాల్లో ఉంది. అయితే శాసనాల్లో శేషవాహనోత్సవాన్ని తొమ్మిదో రోజు నిర్వహిస్తున్నట్లు ఉంది. క్రీ.శ.1614నాటి నోట్టకార్ కోనప్పయ్న్ కొడుకు నోట్టకార్ వేంకటయ్యన్ వేయించిన శాసనంలో వెండి శేషవాహన ప్రశంసతోపాటు ఇప్పటిలాగే మొదటిరోజు రాత్రి ఊరేగించేవారని ఉంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రసిద్ధమైన గరుడ వాహన ప్రశంస రెండు శాసనాల్లో ఉంది. అందులో ఒకటి క్రీ.శ.1530నాటి తాళ్ళపాక పెద తిరుమలయ్య శాసనం. ఇప్పటిలాగే అయిదోరోజు గరుడోత్సవం జరిగేదని ఈ శాసనం పేర్కొంటున్నది. రెండో శాసనం క్రీ.శ.1583నాటి తాతాచార్యుల శాసనం.
గజవాహన అలంకరణ నిమిత్తం చేసిన దానాలను గురించి క్రీ.శ.1583నాటి ఒక శాసనం పేర్కొంటున్నది. క్రీ.శ.1628నాటి మట్ల కుమార అనంతరాజు తెలుగులో వేయించిన శాసనంలో ఒక వెండి గజవాహనాన్ని బహూకరించినట్లున్నది. అన్నమయ్య చెప్పినట్లు ‘ఎక్కెను ఆరవనాడు యేనుగు మీదను’అని ఆరో రోజు గజవాహన సేవ ఉండేది. క్రీ.శ.1564 తరువాతే సూర్యప్రభ వాహన ప్రసక్తి శాసనాల్లో కనిపిస్తుంది. చంద్రప్రభ వాహన ప్రసక్తి అసలు ఏ శాసనంలోనూ లేదు. క్రీ.శ.1491, 1536, 1628నాటి మూడు శాసనాల్లో అశ్వవాహన ప్రశంస ఉంది. దీనే్న తురగోత్సవం అంటారు.
‘నీవు తురగము మీద నేర్పుమెరయ
వేవేలు రూపములు వెదజల్లితపుడు’ అని అన్నమయ్య
తిరుమల తురగోత్సవ వైభవాన్ని కీర్తించాడు. క్రీ.శ.1544, 1545, 1614, 1627నాటి నాలుగు శాసనాల్లో పల్లకీ వాహన విశేషాలు ఉన్నాయి. అయితే శాసనాల్లో ఏ వాహనం ఏరోజు అనే వివరాలు లేవు. అన్నమయ్య తన కీర్తనలలో చాలా వాహనాలు ఎన్నో రోజు ఊరేగుతాయో పేర్కొన్నారు. దాన్నిబట్టి ఏరోజు ఏ వాహనసేవ ఉండేదో నిర్ధారించవచ్చు.
ఈ విధంగా శాసనాలు తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అత్యంత విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇంతవరకూ తితిదే శాసనాల్లోని అనేక అంశాలపైన సమగ్రమైన అధ్యయనం జరగలేదు. ఈ శాసనాల్లో నిక్షిప్తమైన అంశాలను వెలుగులోకి తెస్తే తితిదేకు సంబంధించిన అనేక సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, మత విశేషాలు అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. అందుకోసం ఇప్పటికైనా పరిశోధకులు పూనుకోవాలి.

--నాగోలు కృష్ణారెడ్డి