మెయిన్ ఫీచర్

ట్రెండ్ మారుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**సినిమా అంటేనే న్యూ లుక్! సినిమా అంటేనే న్యూ థాట్! సినిమా అంటేనే న్యూ వేవ్! సినిమా అంటేనే క్రియేషన్! అలా ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా మారుతూ మార్చేసుకుంటూ అప్‌డేట్ అవుతూ కొంగ్రొత్త పోకడలతో ముందుకు సాగిపోవడం సినిమా రంగం (వాళ్ళ) నేచర్!!
నిన్న మొన్నటివరకు ఒక హీరో ప్రీరిలీజ్ ఈవెంట్‌కి మరొక హీరో వెళ్ళడం, అహా..ఒహో.. అంటూ ఏకబిగిన అప్రిసియేట్ చేయడం లాంటివి చేయడంతో.. ఆ సినిమాకి ఓ క్రౌడ్‌ని, హైప్‌ని తీసుకురావడం మొదలైంది. నిజంగానే ఇదొక హ్యాపీ సినిమా వాతావరణం. స్టార్స్ తమ తమ ఇగోల్ని వదలి ఇష్టపూర్వకంగా మరొక స్టార్‌ని, ఆ కోస్టార్ ఇమేజ్‌ని పొగడ్తల్తో ముంచేయడం.. ఒక శుభ పరిణామం!
ఇట్సోకే! ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టుకుంది. సినిమా విడుదలయ్యాక.. సినిమా సక్సెస్‌టాక్ బయటకు వచ్చాక... సినీ ప్రముఖులు ఆ సినిమా కథ కథనాల గురించో, నటీనటుల నటన గురించో, డైరెక్టర్ టాలెంట్ గురించో ఆ సినిమా యావత్ టీమ్ గురించో.. పాజిటివ్‌గా స్పందిస్తూ, అభినందిస్తూ ట్వీట్ చేయడం... నేడిపుడు ట్రెండ్‌గా మారబోతోందనిపిస్తుంది. కొన్ని నిజ సన్నివేశాల్ని పరికిస్తుంటే! దీంతో ఆటోమేటిగ్గా ఆ సినిమాపై హైరేంజ్‌లో హైప్ క్రియేటవుతుంది. కలెక్షన్స్‌పై ప్రభావం పడి బాక్సాఫీసు ఊపందుకుంటుందనేది నిర్వివాదాంశం.**
=========================================

గతంలో అడపాదడపా రాజవౌళి లాంటి దర్శక దిగ్గజంతోపాటు కొందరు సినీ ప్రముఖులు.. బాగున్న సినిమాలపై స్పందిస్తూ అభినందన పూర్వక ప్రశంసలు కురిపిస్తూ, ట్విట్టర్‌లో పోస్ట్‌చేయడం జరిగినా.. ‘మహానటి’ సినిమాతో మరొక అడుగు ముందుకుపడినట్టు.. ఏకంగా మరొక వినూత్న పంథాకి తెర లేచింది.
ఏకంగా మెగాస్టార్ చిరంజీవి అంతటివాడు ‘మహానటి’ సినిమా యూనిట్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించి, ప్రేమ పూర్వకంగా అభినందించి, గౌరవ మర్యాదలతో సన్మానించడం.. కొంగ్రొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టుకున్నట్లయ్యింది.. ‘మహానటి’ సినిమా టీమ్‌లో ఉత్సాహం పెల్లుబికింది. చిరంజీవి స్వయంగా మెచ్చుకోవడం ఆ యూనిట్‌తో వెయ్యేనుగుల బలాన్ని రెట్టింపుతో ఇచ్చినట్లయ్యింది. ప్రేక్షక లోకంలో ఇదొక చర్చగామారి సినిమావైపు మరికొంత మంది ప్రేక్షకుల చూపుపడేలా చేసింది. సక్సెస్‌కి మరింత సక్సెస్ తోడయినట్లయ్యింది. ఇచ్చూసి అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లు కూడా ‘మహానటి’, దర్శక నిర్మాతల్ని పిలిచి శభాష్ అంటూ వెన్నుతట్టారు. సాదర పూర్వక సత్కారం అందించారు. ఆటోమాటిగ్గా వాళ్ళ గుండెల్లో ఆనందం వెల్లివిరిసింది. ఓవైపు సినిమా విజయం తెచ్చిన సంతోషం. ఈ రకమైన ఇండస్ట్రీ పెద్దలు అందించిన ప్రశంసల బూస్ట్.. ‘మహానటి’ని మరొక మంచి సినిమాగా తెలుగు సినిమాల లిస్ట్‌లో నమోదవ్వడానికి కారణమైందని చెప్పొచ్చు. పైగా ‘మహానటి’ సినిమా సక్సెస్‌మీట్‌కి నిర్మాత అశ్వనీదత్ నాగ్ అండ్ జూనియర్ యన్టీఆర్‌లని పిలిచి.. వాళ్ళచేత సినిమా గురించి గొప్పగా మాట్లాడింపచేసి దానిపై ప్రేక్షకులకు మోజు కల్గించడంలో సక్సెసయ్యాడు.
అలాగే, ‘గూఢచారి’ సినిమా సక్సెస్‌మీట్‌కి నాగార్జున లాంటి స్టార్ హీరో అటెండ్ కావడం చర్చనీయాంశమైంది. అందుకు కారణం లేకపోలేదు. ఓవైపు తన మేనల్లుడి సినిమా ‘చి.ల.సౌ’ మంచి ఫీల్‌గుడ్ సినిమాగా క్రిటిక్స్‌నుంచి పాజిటివ్ టాక్ అండ్ హ్యాపీ రివ్యూస్ వచ్చినా.. పాపం ఎందుకనో ఆ సినిమా కమర్షియల్‌గా కన్నుతప్పి లొట్టలైనంత పనయ్యింది. పైగా నాగ్ ‘గూఢచారి’లాంటి సినిమా ఇంతవరకు (ఈమధ్యకాలంలో అంటే సరిపోయేది!) రాలేదంటూ ఆ టీమ్‌ని అమాంతం అంతరిక్షానికెత్తడం.. దాని బాక్సాఫీసు రేటు పెరగడానికొకింత దోహదమైందనడంలో అసంబద్ధమేమీ లేదు. అదే సినిమాలో నటించి మెప్పుపొందిన నాగ్ మేనకోడల్ని మహేష్ వెల్‌కమ్ అంటూ గుడ్ జాబ్ అంటూ ఫోన్‌చేసిమరీ చెప్పడం కూడా కొత్త పంథాకి నాంది పలికినట్లవుతోంది. అదే మహేష్, రాజవౌళి, రాంచరణ్ లాంటి ప్రముఖులంతా ‘గీత గోవిందం’సినిమాని కొనియాడారు. ఆటోమాటిగ్గా దాని కాసుల పల్స్‌రేటు పెరిగింది. అంతమంది ఆ సినిమా గురించి చర్చించినట్లు న్యూస్ రావడంతో సహజంగానే ప్రేక్షకుల ధ్యాస తప్పక అటు మరలుతుంది. అచ్చు అలాగే జరిగింది. ఇకనేం విజయ్‌దేవరకొండకి మరొక కమర్షియల్ హిట్ ఖాతాలో పడినట్లయ్యింది.
‘రంగస్థలం’ విషయంలో ఇదే జరిగింది. ప్రముఖులంతా సుకుమార్ దర్శకత్వ ప్రతిభను కొనియాడుతూనే రామ్‌చరణ్-సమంతల సహజ నటనలకి నీరాజనాలర్పించారు. నాచురల్‌గా అన్ని క్రాఫ్ట్‌లు అందంగా కుదిరి సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. మహేష్‌బాబు వంటి స్టార్‌కమ్ హీరో మరో స్టార్ రాంచరణ్ సినిమా బావుందనడంలో ఎలాంటి భేషజం చూపకపోవడంతో బాక్సాఫీస్ మోత డీజేమోతై కూర్చుంది. వసూళ్ళ సునామీ అదిరింది.
ఏదేమైనా ఒకప్పటి వేరుకుంపటి పక్కనపెట్టి, స్టారిజమ్ గట్టున విడిచి, తమ తమ వర్గపు కాంపౌండ్ సరిహద్దులు చెరిపేసి ప్రముఖ హీరోలంతా ఒకే జట్టుగా మసిలే స్నేహపూర్వక వాతావరణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేళ్ళూనుకుంటోందనడంలో వీసమెత్తు సందేహంలేదు. సమీకరణాలు మారుతున్నాయి. ‘నువ్వాదరిని నేనీ దరిని’అనే కానె్సప్ట్‌కి తిలోదకాలిస్తున్నారు. చిన్నాపెద్దా అనే తారతమ్యంవదలి బాగున్న సినిమాల్ని ప్రతి ఒక్కరి ఓపెన్‌హార్ట్‌తో బాగుందంటూ పెదవి విప్పేస్తున్నారు. రియల్లీ ఇటీజ్ ఎ గుడ్ ఛేంజ్! మరి వీళ్ళ వౌత్‌టాక్ సపోర్ట్‌తో ఆయా సినిమాలు హిట్టవుతున్నాయా అంటే చాలా అనేంకాదు. ప్రముఖులు ప్రశంసించేసరికి సహజంగానే బూస్టింగ్‌లా ఉంటుంది. స్కూల్లో పిల్లాడికి దండన ఇచ్చే బదులు, బహుమతి అందజేస్తేనే.. ఆ బహుమతి వస్తు రూపేణా అయి ఉండక్కర్లేదు. ఒక అభినందన, ఒక ప్రశంస, ఒక మెచ్చుకోలు లేదా వెరీగుడ్ వంటి హ్యాపీవర్డ్స్ చాలు. ఆ పిల్లాడు తనని తాను మారిపోయి చదువు లేదా నైపుణ్యాలవైపు సంసిద్ధుడవుతాడని, మరింత మెరుగ్గా కౌశలాలు సాధిస్తాడని సైకలాజిస్ట్‌లు ఆల్రెడీ సెలవిచ్చేసారు. అలాగే ఇదీనూ! ప్రముఖుల వెల్‌విషింగ్ తప్పక ఆయా సినిమా టీమ్‌లో పునరుత్సాహాన్ని నింపుతుంది. బాధ్యత పెంచుకునే దిశలా ఆలోచింపజేస్తుంది.
అలాఅని కొన్ని సినిమాలు బాగుంటున్నా.. ఫరెగ్జాంపుల్ ‘చి.ల.సౌ’ సినిమా.. వంటివి ఎందుకనో బాక్సాఫీసు సంచుల్ని కాసులతో నింపలేక చతికిలపడుతున్నాయి. సినీ క్రిటిక్స్ సైతం గుడ్ కాండక్ట్ సర్ట్ఫికెటిచ్చి ముందుకుతోస్తున్నా ఎందుకనో ప్రేక్షకులు ఇలాంటి సినిమాల్ని గుండెలకి సారీ జేబులకి హత్తుకోవడం లేదు. ‘శ్రీనివాస కళ్యాణం’ది కూడా ఇదే పరిస్థితి. సేమ్ సిచ్యుయేషన్! 3/5 రేటింగ్స్ కూడా ఇచ్చేసారు. కొంత ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో కళ్యాణ వేడుక ఘట్టాల్ని సాగతీతగా చూపిస్తూ బోర్ ఫీల్ తెప్పించారని టాక్ నడిచింది. కానీ ‘చి.ల.సౌ’ క్లీన్ చిట్ వచ్చింది. అయినా, ప్రేక్షకులు నడుము బిగించలేదు. థియేటర్ల వైపే రా(వడం) లేదు. మీ డౌట్ కరెక్ట్! అప్పట్నుండి తొలుస్తోంది కదా మిమ్మల్ని. అక్కడికే వచ్చేస్తున్నా ఆగండాగండి.. ఎందుకని ఇలాంటి సినిమాల్ని సినిమా పెద్దలు భుజాలమీదికి ఎత్తుకొని బాగుందని అనడం లేదో.. ప్రేక్షకులకు మెసేజ్ పాస్‌చేయడం లేదో.. పాఠకులుగా మీకే కాదండోయ్! నాకు, సినీ అభిమానులకు కాస్తంత కొరుకుడు పడని కన్‌ఫ్యూజన్‌గానే ఉంది.
ముమ్మాటికీ మీ రీజనింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫెంటాస్టిక్ అండీ! ఎందుకంటే ఇప్పటివరకు ప్రముఖ దర్శకులు, స్టార్ హీరోలు మెచ్చుకున్నవన్నీ హిట్‌టాక్ సొంతం చేసుకున్నాకా.. వీళ్ళ మెసేజ్‌లు బయటకు వచ్చాయి. మీరంటున్నట్టుగానే ప్రేక్షకుల అండదండలున్న సినిమాలని వీళ్ళు ‘వహ్వా’ అనడంకాకుండా.. సినిమాలు బావుండి కమర్షియల్‌గా వీక్ టాక్ ఉన్న సినిమాల్ని పైకిలేపేసి, ప్రేక్షకుల్ని థియేటర్లవైపు మళ్ళించొచ్చుకదా! నిజమే కావొచ్చు. కానీ తను నిర్మాణ భాగస్వామ్యమైన ఓ మంచి సినిమా ‘చి.ల.సౌ’కి జనం రాలేకపోతున్నా దాని ప్రమోషన్స్ పక్కనపెట్టి.. ఆ సినిమాతోపాటు రిలీజైన ‘గూఢచారి’ సక్సెస్ పక్కన పెట్టి.. ఆ సినిమాతోపాటు రిలీజైన ‘గూఢచారి’ సక్సెస్ మీట్‌లోనా పాల్గొని మరీ ఆ సినిమాని ‘అద్భుతం’అంటూ ప్రకటించడమంటే ఎంత ఔచిత్యం, గొప్ప మనసు ఉండాలి. దీనిపై విమర్శలు వచ్చి చర్చ జరిగినా.. జనం అండ ఉన్న సినిమా ‘గూఢచారి’తోపాటు ‘చి.ల.సౌ’కి కూడా నాగ్ ప్రశంసల వర్షం కురిపిస్తే బాగుండేదని సినీ మేథావుల సూచన.
ఇక్కడో చిన్న విషయం ప్రస్తావిస్తాను, పిజి ఎగ్జామ్స్ రాయడానికి వరంగల్ వెళ్ళిన సమయంలో.. ‘అన్నమయ్య’ సినిమా రిలీజ్‌నాటి తొలి మార్నింగ్‌షోకి వెళ్ళాను. థియేటర్లో జనం నిండలేదు. ఆశ్చర్యపోయా! సినిమా మొదలైంది. ఓ సాహితీవేత్తగా, విమర్శకుడిగా, సాధారణ ప్రేక్షకుడిగా అన్ని కోణాల్లోనూ సినిమా మస్తుగుందనిపిస్తోంది. ఇంటర్వెల్ అవకముందే కొంతమంది కాలేజీ గర్ల్స్ థియేటర్లోంచి వెళ్ళిపోయారు. విస్తుపోయా! సినిమా ఆసాంతం పూర్తయ్యాక హాల్‌నుండి బయటకొస్తుంటే నాకు కన్పించింది ‘ఇంత మంచి సినిమా వాళ్ళెందుకు మిస్సయ్యారా అని! అలాంటిది అదే థియేటర్లో వారాంతమయ్యేసరికి పుంజుకొని (కావాలని థియేటర్‌కువెళ్ళి చూసా!) అదే యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ క్యూకట్టారు. టికెట్స్ దొరకని పరిస్థితి. చూసారా, ఆ సినిమా ఫీట్ మారింది. ఎలా జరిగిందిది? నాకు తెలిసి అప్పటికే సినీ ప్రముఖులంతా ఆ సినిమాపై ప్రశంసల వర్షం కాదు కాదు తుఫాను కురిపించారు. రొమాంటిక్ హీరో ఏంటీ అన్నమయ్య పాత్ర పోషించడమేంటి? అనే నెగెటివ్ టాక్ సినిమా రిలీజ్‌కి ముందు ఉంది. అది కాస్తా తుడిచిపెట్టుకుపోయింది. సైమల్టేనియస్‌లీ ఫిదా అయిన ప్రేక్షకుడు మరొక పది మంది చెవిలో ఊదాడు. అలా వౌత్ టాక్ ఊతమైంది. ఇకనేం ‘అన్నమయ్య’లాంటి అద్భుత సినిమా నాగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బెస్ట్‌వన్‌గా నిలిచింది.
‘సేమ్ టు సేమ్’, ‘అతడు’ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. సినిమా రిలీజైన ఫస్ట్‌రోజు ఫస్ట్‌షో (ఈవెనింగ్ 6కి) థియేటర్‌కి వెళ్ళా! థియేటర్లో సగమే జనం. అవాక్కయ్యా! స్టార్ మహేష్ ప్లస్ ట్రమెండస్ త్రివిక్రమ్ కలయికలో అంటే ఏ రేంజ్‌లోఉండాలి జనం. అలాంటిది ఆ సినిమా టుడేస్ అయ్యాక జనాలతో జాతరయ్యింది. అతడు సినిమా ఇటు మహేష్‌కి, అటు త్రివిక్రమ్‌కి ఓ మైలురాయి అయ్యింది. టోటల్‌గా బంపర్ హిట్టయ్యింది.
ఇలా సోమెనీ ప్రత్యక్ష ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటన్నింటిని ఈ వ్యాసంలోకి తేలేం గానీ... ఫైనల్ టచ్ ఏంటంటే తెలుగు సినిమావాళ్ళు మారుతున్నారోచ్! ఒకప్పుడు తమ కాంపౌండ్ వాళ్ళ సినిమాల్ని ఆకాశానికెత్తే (సినిమా ఎంత వీక్‌గాఉన్నా) రొడ్డకొట్టుడుకి తిలోదకాలిచ్చేసి.. ఒకడుగు ముందుకేసి.. బాగున్న ఇతరుల సినీ మేకింగ్ ఐటమ్‌ని హృదయ పూర్వకంగా హార్టీవిషెస్ తెలపడం మంచి పరిణామమే! ఇందుకు కొందరే నడుం బిగించినట్లు కనిపిస్తోంది. తరతమ, చిన్నాపెద్దా హీరో భేదంలేకుండా... బాగున్న సినిమానోమారు బాగుందంటూ అందరూ మోసేస్తే హ్యాపీ మూవ్‌మెంట్ అవుతుంది సినిమా రంగానికి. ఈ ఫెంటాస్టిక్ ఛేంజ్ మరింతగా విస్తరించాలని అందరమూ కోరుకుందాం! *

--ఎనుగంటి వేణుగోపాల్