మెయిన్ ఫీచర్

...లోకమ్మువీడి రసమ్ము లేదు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పాము కోర డేగ రెక్క ఈ కాలానికి చిహ్నం-
పూల తేనె నెమలి రెక్క ఒక మిథ్యా ప్రమాణం’’

- ఈ మాటలు నేనన్నవి కావు. ఎప్పుడో 74 ఏళ్ళ క్రిందటే ప్రముఖ కవి ‘‘బాలగంగాధర తిలక్’’ అన్న మాటలు. ఎప్పటికప్పుడు అన్వయించుకోతగిన మాటలే. వర్తమాన కవి పండిత బ్రువులు పై పాదాలకు సంబంధించిన చర్చ సాగిస్తే తొలుదొల్త ‘‘సామాజిక స్పృహ’’ లేదని నిర్ద్వంద్వంగా తేల్చేస్తారు. ఇది ఇప్పటి(కీ) ఫ్యాషన్.
తెలుగు భాషలో కావ్యకళ అత్యంత ప్రధాన సమస్యగా మారి సాహిత్య క్షేత్రంలో దృష్టి అంతా అటువైపే ఖర్చుకావటం, చర్చల తుఫానులు చెలరేగటం ఒక శోచనీయ పరిస్థితి. వేళ్ళమీద లెక్కించ తగిన ఏ కొద్దిమందో తప్ప కుప్పతిప్పలుగా పుట్టుకొచ్చిన చాలామంది కవులకి- విమర్శకులకి కావ్యచేతన లేకపోవటమే దీనికి కారణం. సాధారణంగా కావ్యశిల్పాన్ని గురించి ఆత్మగతానుశీలనం వుండాలి. కవికైనా-పాఠకునికైనా. కావ్యశిల్పి అయిన కవి తన శిల్ప సాధనాల గురించి కూలంకషంగా తెలిసినవాడై వుండాలి. శిల్పం వరకు అతడు నిర్వికార, నిర్వికల్ప చాతురీ విలసత్సంపన్నుడు కనుక అయి వుంటే, అతడు తప్పకుండా నైపుణ్యం కలవాడనే భావించాలి. ఈ నిపుణత్వం లేనివారు ఇప్పుడు మహాకవులుగా చెలామణీ అవుతున్నారు.
కవి నిజంగా కవిగా భావించబడినప్పుడు సమాజం - అతనిలో యావత్తు సమాజపు అనుభవానికి అభివ్యక్తి వుందా లేదా అనేది చూస్తుంది. ఇక్కడ సమాజమంటే కవితానుశీలనాది యోగ్యతలున్నదనే అర్థం. ప్రస్తుతం ‘‘సమాజము’’నకు దీర్ఘం లేదు. కవిలో తన అనుభూతిని చూసుకునే సమాజం సాఫల్యం చెందుతుంది. ఇక్కడే కవి తన సంపూర్ణ ఔన్నత్యానికి దిగినట్లు దర్శనమిస్తాడు. వర్తమానమున ఈ ఔన్నత్యం కుల రుజా చక్రవర్తిత్వంగానే నిర్ధారింపబడుతోంది. ఈ ప్రారబ్ధకర్మకు పంచాయతీ అక్కరలేదు. కవి చేసే కళాత్మక అంతరిక్ష యానంలో కవి తన శిల్పకళా సూత్రాలను ఎంత బాగా అమలుజరిపాడన్నది అసలు విషయం కాదు; యావత్తు మానవజీవన వైశాల్యాన్ని అంతర్భూతం చేసుకున్న ఒక మానవజాతి అభివ్యక్తిగా కవి ఎంతవరకు రూపొందాడు అనేది ముఖ్యం; అదే విలువకట్టబడుతుంది. న్యాయంగా ఆలోచిస్తే కవి సాధారణంగా పాఠకుల స్థాయికంటే ఉన్నత స్థాయిలో వుంటాడు (ఉన్నతస్థాయి అవగాహన; ఉన్నతాభిరుచి వున్న అత్యల్ప సంఖ్యాకులైన పాఠకుల్ని గురించి నేను యిక్కడ ప్రస్తావించటం లేదు) కవి తన లక్షణంగా రూపొందిన నిరంతర జిజ్ఞాసచేత, సునిశితమైన లోక పరిశీలన చేత, అభ్యాసంచేత వృద్ధిపొందిన సతర్క మానసిక ప్రక్రియచేత వీటి అన్నిటి సమగ్రమైన, సలక్షణమైన సముదాయక రూప వ్యక్తిత్వంచేత అతడు జ్ఞానప్రవాహం అవుతాడు. తద్వినాపరమ అప్రయోజకుడు. అపశదుడు అవుతాడు.
జ్ఞాన ప్రవాహంలో మునుకలువేసిన కవి పాఠక లోక క్షేత్రాల్లోకి ప్రవహిస్తాడు. పాఠకుల్ని జ్ఞానవంతులుగా చేస్తాడు. ఇలాంటి పాత్ర నిర్వహించటం చేత కవి లోకాన్ని గురించి ఒక బాధ్యత తన మీద వేసుకుంటాడు. పాఠకుడిలో లేని కొత్త జ్ఞానం కవి తన రచన ద్వారా అందించాలి. భావాత్మక సంస్కారం కూడా కలిగించాలి. కవి/ రచయిత తానే సోపాన పంక్తిగా పాఠకుడ్ని పైకి తీసుకుపోవాలి. ఇంత బాధ్యతను వహించగలిగి; పాఠకుడిని ఆ స్థాయికి చేర్చగలిగినవాడే కవి/రచయిత. ఇక్కడ పాఠకుని స్థాయికూడా తదనుగుణంగానే పెరుగుతూ వుండాలి. కానీ ప్రస్తుతం పాఠకుడి శ్రేయస్సుకొరకు బ్రతుకు అంకితం చేయాల్సిన కవి తన శ్రేయస్సు కొరకు అంకితం ఐపోవటం గర్హనీయం. దానికనుగుణంగానే పాఠకుడు పాతాళంలో పడిపోతున్నాడు. ఈ వైపరీత్యం జరగటానికి కారణం కవిత్వంతో ఎటువంటి సంబంధంలేని వాళ్ళు కవిత్వాన్ని ఆశ్రయించారు. ఇక్కడే ‘‘సామాజిక స్పృహ’’ అనే వితండవాదం మొదలయింది. మానవుడి కన్నీళ్ళను ‘‘మార్క్సిస్టు కన్నీళ్ళు- మామూలు కన్నీళ్ళు’’ అని విభజించి ఈ స్పృహను లేవగొట్టారు. నినాదాలు, కరపత్రాలు కవిత్వానికి ఊత కోలలయ్యాయి. ఇదే ప్రజాకవిత్వమని గడ్డాలు పెంచుకున్నారు- గుడ్డలు చింపుకున్నారు. ఈ తీరుతో కవిత్వానికి ఆయువు దించారు. ఫలితంగా గుర్తుంచుకోవల్సిన విషయం అతి విశాలమైన అధ్యయనం కవికి ఎంత అవసరమో గుర్తించటం. కవి పుస్తకం చదవాలి. మరో పుస్తకం ముందు నుంచునే వరకు ఎవరికీ తామెంత అల్పులమో తెలియదు. కనీసం ఈ అల్పత్వం తెలుసుకునేందుకైనా పుస్తకాలు చదవాలి. ఈ చదువు వ్యుత్పన్నతను పెంచుతుంది. అనాదినుంచీ సాహిత్య చరిత్ర పరిశీలిస్తే అగ్రగణ్యులైన కవులందరు లోకంలో అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వ్యుత్పన్నత కలిగినవారే. వ్యుత్పన్నత నూటికి నూరు శాతం కాకపోయినా కనీసం శాస్త్ధ్య్రాయన రూపక పాండిత్యం మాత్రం వున్నవారే. ఈ వ్యుత్పన్నతను భరించే (వినడానికి కూడా) శక్తిలేని అల్పిష్టులిపుడు ఆంధ్ర దేశంలో కుల కవులుగా దూలరేగి దుఃఖిస్తున్నవారే. చెప్పాలంటే వీరెవ్వరూ కవులు కారు. కుల మతాల గీతల్లో పడిపోయి బల్లుల్లా వెల్లకిలా- బోర్లాపడటం తప్ప వీరు సాధించింది సాధించగలిగేది శూన్యం. కనుక ఒకడు కవిత్వ విషయంలో ప్రతిబద్ధుడ్ని అని ఆర్భాటంగా ప్రకటించుకున్నంత మాత్రాన లాభం లేదు. దానికోసం పరితపించాలి. ఆ దశ చేరగలగాలి. దశ చేరటం అని ఎందుకు అనవలసి వస్తోందంటే కవిత్వం అనుభూతి మూలకం కనుక.
కవిత్వం ఒక సంవేదన. అంటే ఒక ‘‘్ఫలింగ్’’ అంటే అనుభూతి. కవిత్వం తన కళాత్మక (ఒఠి అరుపులో- నినాదంలో- నికృష్ట వచనాలో నీరస పదాలో కాదు) శాబ్దిక స్పర్శతో మర్మమయ నిర్మాణ వస్తువుతో, నిపుణ భంగిమతో, అయస్కాంత శక్తితో మానవుడి హృదయ తంత్రుల్ని మీటుతుంది. అశ్రుపూరిత నేత్రాలు నేత్రాల వెనుక అణగారిపోతున్న కాంతిరేఖలు కలిగిన ఒక మనిషిని చూచినప్పుడు ఎలా మన సంవేదనాత్మక స్థితి గాఢంగా పరిణమిస్తుందో అలాగే కవిత్వం శ్రోతని- లేదా పఠితుడ్ని తన ఉపరితలం చేతనే ప్రభావితం చేస్తుంది. పూర్వ వర్ణిత శోకగ్రస్త మానవుడు విషాదగాథ యేమిటో తెలియకుండానే అతడ్ని చూచినంతనే మనం ఎలా కరుణాతప్త హృదయంతో వేదనననుభవిస్తామో అలాగే కవిత్వం శ్రోతని/ పాఠకుడ్ని ప్రభావితం చేసినప్పుడు శ్రోతకు కవితార్థం సాకల్యంగా బోధపడదు. తరువాతనే కవిత తన హృదయాన్ని శ్రోతముందు విప్పుతుంది. ఇదే కవిత్వంలో వున్న లీల-హేల-మర్మం-్ధర్మం. కనుకనే కవిత్వం ఒక విశిష్ట ప్రక్రియ. కవియున్నూ విశిష్ట వ్యక్తే. ఇంత ప్రధాన విషయానికి దూరంగా వుండి- ఒక పొలకేక పెడితే పెట్టినవాడు కవీకాడు- కేక కవిత్వమూ కాదు. ‘్ళ్యౄౄఖశజష్ఘఆజశ ఇళఛ్యిళ ఇళజశ శ్రీశజూళూఒఆ్య్యజూ’’ అన్న .ఢ.ఉజ్యఆ భావం ఇదే. కళలో వున్న ఈ సద్య్భాఃవానే్న చిత్రకారుడు పట్టుకుంటాడు. ఇదంతా తపసు చేసిన ఒక కవియొక్క అంతశే్చతన. ఇది లేకుండానే తమదొక అనితర సాధ్యమైన కవితాశిల్పం అనుకునే ఆధునికుల వాదమంతా మృగమరీచి. వారి పట్ల శ్రోతలు జాగరూకులై వుండాలి.
ఇప్పుడు సాయంత్రాలను గ్లాసుల్లోకి వొంచుకునే కవుల రచయితల పలవరింతగా ప్రసిద్ధిచెందిన ఈ సామాజిక స్పృహను గురించి మాట్లాడుకుంటే- వ్యక్తి జన్మతో వెంట తెచ్చుకునేదే ‘‘సామాజిక స్పృహ’’. మనిషి (కవి/రచయిత) సహజంగానే సామాజికుడు. ఇది జన్మ సంబంధం. విడదీయలేని విధి. జనన మరణాలనే రెండు దళసరి అట్టల మధ్య సాగే జీవనయానమంతా సామాజికాంశమే. అందులో దొర్లే వాక్యాల వంటి మనుషులు, కొండలు, నదులు, చెట్లు, పూలు, రంగులు, పరిమళాలు, వేళ్ళు, నెమళ్ళు, పులులు, కుక్కలు ఇత్యాది వస్తు సముదాయమంతా, ఒకదానితో మరొకటి ప్రత్యక్షంగానో- పరోక్షంగానో సంబంధించే వుంటాయి. ఉండదనుకునేవాడు తప్పకుండా మానవేతరుడై వుండాలి. ఎప్పుడైతే మనిషిని సమాజేతరుడుగా భావిస్తాడో వాడు పరేత భూవాసి. దినచర్యల్ని కాలకృత్య స్థాయికి దింపిన ఔదార్యమూర్తి. ఈ మూర్తిమంతము అరుస్తుంది. ఆరాటపడుతుంది. అలజడిని రేకెత్తిస్తుంది. ఎఱ్ఱ చప్పుళ్ళతో ఏటవాలుగా జీవిస్తుంది. అంటువ్యాధి రూపంగా అందరిలో కొందరికి ముఖ్యోపన్యాస వస్తువై పళ్లికిలిస్తుంది. కనుకనే వీరిపట్ల సామాజికులందరు అప్రమత్తులై వుండాలన్నది. ఈ సామాజిక స్పృహ పేరుతో సాహిత్య స్పృహ చాలావరకు నిహితమైంది. సాహిత్యం సామాజికాంశం కాదన్నంతవరకు తీసుకుపోబడింది. సాహిత్య స్పృహలేని కొందరి కారణంగా ఈ వైపరీత్యం యేర్పడి అక్షరాలు ఒణికిపోతున్నాయ్. ఈ దరిద్రాన్ని బలవంతంగా భరించే స్థితిని కల్పించారు. ఈ అరాచకాన్ని ఆత్మరక్షణకోసం కవితా పదబంధంగా మార్చేసి సమాజంమీద విసిరేస్తారు. ‘‘సామాజిక స్పృహ’’ అనే ఈ మృత నినాదాన్ని రొచ్చుగుంటలో చేపని చేసి వదులుతారు. ఈ విపరీత చర్యకి అధములు ఆనందపడిపోతారు. అన్యులు బాధపడతారు. ఇక్కడ అన్యులు ఎవరన్న ప్రశ్న. సాహిత్యపు ఉత్తమ ప్రయోజనాన్ని మానవీయ దృక్పథంగా మలచగలవారన్నది సమాధానం.
ఎంత పెద్ద భవనమైనా- ఎంత గొప్ప నాగరికత అయినా ఓ భూకంపానికి మట్టి కొట్టుకుపోతుంది. అయినా వసంతం వస్తుంది. శిథిలాల మీదే చైత్ర శోభల్ని చిగురిస్తుంది. అక్కడే మళ్లీ గుప్పెడు పూలు చల్లుతుంది. గాలిని గందవొడి చేస్తుంది. ఆకాశంలో హరివిల్లును విరియిస్తుంది. గుర్తును మధురమైన అనుభూతిగా మలచి నూతనాభివ్యక్తిని అందిస్తుంది. కవి అయినా రచయిత అయినా అంతే. అక్షరం ప్రసూతమవటానికి ఒక ప్రేరణ భూకంపానంతర వసంతంలా సాధిష్టయోగాన్ని సంతరించుకోవాలి. వ్యక్తికి సమాజానికి మధ్య వుండవలసిన న్యాయ సంగత సమన్వయం సాధించటానికి జరగవలసిన కృషిని అన్యధా భావించుకుంటున్న వారు తమ జీవన వ్యవసాయంలో పంటను కోల్పోయి కలుపును దక్కించుకున్న వారుగానే మిగిలిపోతారు. ఆలోచనాపరులు వ్యక్తి సమాజాల సమన్వయ ప్రక్రియలోంచి పుట్టినవారే. ఉపాధి సంస్కారాన్ని అనుసరించి భేదాభేదాలుంటాయి. ఎవరి ఔన్నత్యంలోంచి అక్షరాలు శీల సమన్వితాలౌతాయో వారి ఔన్నత్యమే మానవజాతికి ఆచరణాభిధేయవౌతుంది. ఇంతకన్న సామాజిక స్పృహ మరొకటి వుంటుందా. ఇక్కడే తత్సంబంధితమైన రసమూ ప్లావితవౌతుంది. కనుకనే ‘‘.... లోకమ్ము వీడి రసమ్ము లేద’’నుట.
మనిషికో గొంతెలా కావాలో యుగానికో కవి అలా కావాలి. ఈ కవి మళ్ళీమళ్లీ పుడుతూ వుంటాడు. కొత్త ఉడుపులతో కొత్త ఉపదలతో. కాళిదాసు పాతవాడంటే ఎంత బాధ. అన్నవాడ్ని ఏమనాలో తెలియని బాధ.
ఒకనాటి త్యాగాలు, ఒకనాటి యోగ్యతలు ఈనాడు కథలయ్యాయి. ఉత్తమ లక్ష్యాల మీద అభిలాష అడుగంటింది. ఏదో తాత్కాలిక సంసార సుఖాలకోసం వెంపర్లాడటమే కనిపిస్తోంది. అర్ధము అధికారము పరమార్థాలుగా పరిగణించి అంతకంటె మనం సాధించవలసిందేమీ లేదనుకొంటూ వాటికోసమే జీవితాన్ని ఖర్చుచేస్తూ అవి లభించగానే పరమార్థం ఫలించినట్లు భావిస్తూ ఒక సంకుచిత మార్గంలో పడిపోతున్నాం...
కవిత్వం కావాలిప్పుడు. ఏ శబ్దం దాని అర్థాన్ని మనచేత మాటిమాటికి ఆలోచింపచేసి అట్టి ఆలోచనా పౌనఃపున్యం చేత ఒక చమత్కారాన్ని ఉత్పన్నం చేస్తుందో అట్టి ఏ చమత్కారం చేత లోకోత్తర ఆహ్లాదం కలుగుతుందో ఆ శబ్దమే కావ్యం. అందులోనే మీరు చెప్పే ‘‘సామాజిక స్పృహ’’ వుంది. అక్కడ సామాజిక స్పృహ కనిపించకపోతే విద్యావిహీనులన్న మాటే.

- సాంధ్యశ్రీ, 8106897404