మెయిన్ ఫీచర్

హీరో ఒక్కడు చాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**తెలుగు సినిమా 1932లో ‘్భక్తప్రహ్లాద’తో మొదలైనా 1938 నుంచే తెలుగు సినిమా స్వర్ణయుగం ప్రారంభమైంది. ఈ స్వర్ణయుగం 1970వరకు కొనసాగిందని సినీ పెద్దలు నిర్ణయించారు.
=====================================
అప్పటి సినిమాలు ఇప్పటి నిర్మాత దర్శకులకు టెక్స్ట్‌బుక్స్ వంటివి అనడంలో అతిశయోక్తి ఏమీలేదు. సి.పుల్లయ్య, గూడవల్లి రామబ్రహ్మం, హెచ్.ఎం.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, పి.పుల్లయ్య, ఘంటసాల బలరామయ్య, రామకృష్ణ, కె.ఎస్.ప్రకాశరావు, బి.ఏ.సుబ్బారావు, వేదాంతం రాఘవయ్య, కె.బి.నాగభూషణం, కె.బి.తిలక్, చాణక్య, ఆదుర్తి సుబ్బారావు, యోగానంద్, ప్రత్యగాత్మ, సి.ఎస్.రావు, బాపు, కె.విశ్వనాథ్ వంటి దర్శకులు తెలుగు సినిమాలను కళాఖండాలుగా మలిచారు. వారు వేసిన తారురోడ్లు, సిమెంట్ రోడ్లమీద నడవడం కూడా చాతకానివారు తెలుగు సినిమాలను డైరెక్ట్ చేయడం విచిత్రం. సినిమా కళాత్మక వ్యాపారం అనే విషయం ఎప్పుడో మరుగునపడింది. సినిమా అంటే కేవలం డబ్బు. కేవలం డబ్బు తప్ప సినిమా గురించి అవగాహన, అభిరుచి లేని నిర్మాతలు పుట్టుకురావడం నడమంత్రపు సిరి ఫలితం.
సినిమా నిర్మాణం అనే ప్రయాణం కనీసం సంవత్సరం పాటు జరుగుతుంది. సముద్రంలో ఓడ ప్రయాణం లాంటిది. ఇంధనం నిర్మాత. కెప్టెన్ దర్శకుడు. ఒడ్డుకు చేరడానికి నటీనటులు, 24 శాఖల వారి సహకారంతో జరిగే యజ్ఞం. వందల మంది శ్రమిస్తారు, చెమటోడుస్తారు. దీనికి ముడిసరుకు కథ కదా? ఇక్కడే తెలుగు సినిమా పక్కదారి పడుతోంది. హీరోపాత్ర స్వభావం గురించి చెప్పి ఒప్పించి రంగంలోకి దిగుతున్నారు దర్శకులు. సపోర్టింగ్ కేరెక్టర్ల గురించి పట్టించుకోవడంలేదు. లోగడ కథానాయిక అనేవారు. ఈ నాయికకు కథలో ప్రమేయం ఏముంది ఇప్పుడు?
హీరోతో డ్యూయెట్లు పాడడానికి, అందాలు ప్రదర్శించడానికే పరిమితం. అందం, చందం, వంపుసొంపులున్న వారికే అవకాశం. అభినయం శూన్యం. స్వర్ణయుగంలో ముందుగా కథ ఎన్నుకుని, పాత్రలకు న్యాయం చేయగల నటీనటులు ఎవరు? అని ఆలోచించేవారు. హీరోతోనే మూడొంతుల సినిమా వుండదు. పాత సినిమాలు చూస్తే కథానాయకుడిని నడిపించడానికి అనేక పాత్రల సృష్టి జరిగేది. కథ జనరంజకంగా తయారుచేసేవారు. ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు సాంఘిక చిత్రాలు గమనిస్తే ఆ సంగతి తెలుస్తుంది. యస్.వి.రంగారావు, గుమ్మడి, జగ్గయ్య, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం, ఛాయాదేవి, కన్నాంబ, హేమలత వంటి నటనలో మహారథులు, అతిరథులు సహాయ పాత్రలు పోషించేవారు. కథ నడిపించేవారు. కాబట్టే శత దినోత్సవాలు, రజతోత్సవాలు చేసుకుని ప్రేక్షకులను మెప్పించేవి. ఆ సినిమాలు చూస్తుంటే ప్రేక్షకులకు గొప్ప అనుభూతి కలిగేది. ఆ పాత్రలు మన ఇంట్లో తాత, మా వయ్య, అన్నతమ్ముడు, అక్కచెల్లెలు అనుకుని కథలో లీనమయ్యేవారు. నవ్వేవారు, ఏడ్చేవారు, తిట్టేవారు ఆ పాత్రల ప్రభావంతో. సూర్యకాంతం గయ్యాళిగా ముద్రపడిపోయింది. అంత మంచి పేరును తమ పిల్లలకు ఎవరూ పెట్టుకోరు. తాగుబోతును దేవదాసు అనడం పరిపాటి. ఆ పేరు తమ పిల్లలకు ఎవరూ నిర్ణయించరు.
అదంతా గతమెంతో ఘనకీర్తి. సినిమాలలోకి రచయితలుగా ప్రవేశించినవారు తొందరలోనే కెరీర్ మార్చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కువమంది నటులుగా మారుతున్నారు. కొందరు డైరెక్టర్లు అవుతున్నారు. ఐతే రచయితలు డైరెక్టర్లయి విజయవంతం అయినవాళ్లు అరుదు. లోగడ, ఆత్రేయ, సముద్రాల, నరసరాజు, పినిశెట్టి దర్శకులుగా మారి సక్సెస్ కాలేకపోయారు. దర్శకరత్న దాసరి నారాయణరావుకి మాత్రమే మినహాయింపు. రచయిత నుంచి దర్శకుడిగా మారి 150 చిత్రాలు చేసి చరిత్ర సృష్టించారు. ఈ కంఠసోష ఎందుకంటే కోట్లు కాదు కథ ముఖ్యం అని దర్శకులు తెలుసుకుంటారనే. కథకు ఎనలేని ప్రాధాన్యం వుంది ఇప్పుడు. పాత రోజుల్లో కథలకు కొరత లేదు. ఎన్.టి.రామారావుకి పౌరాణికాలు, జానపదాలకు కాంతారావు, యాక్షన్ సినిమాలకు కృష్ణ, కుటుంబ కథలకు అక్కినేని, శోభన్‌బాబు సరిపోయేవారు.
ఇప్పుడు అంతా యాక్షనే. హీరోనే సర్వాంతర్యామి. కథంతా హీరోతోనే జరగాలి. హీరోయిన్ డ్యూయట్లకు, విలన్ తన్నులుతినడానికి, కమెడియన్స్ నవ్వించడానికి కావాలి. కథలు ఎక్కడ్నుంచి పుట్టుకొస్తాయి? నిర్మాత డబ్బు సూట్‌కేసులు మోసే బ్యాంకరు. కథేంటో తెలియదు పాపం. డైరెక్టరే సూత్రధారి. హీరో కేరెక్టర్ చెప్పి ఒప్పిస్తే చాలు. హీరోకి ప్రేక్షకులలో వుండే క్రేజునిబట్టి, డిస్ట్రిబ్యూటర్ల వసూళ్ళ అంచనాలుబట్టి బిజినెస్ జరుగుతుంది. సినిమావాళ్ళు నమ్ముకునే టీజర్ రిలీజ్, ఆడియో ఫంక్షన్లకు ఎటూ అభిమాన సమూహాలు వచ్చి ఈలలు, చప్పట్లతో అదరగొడతారు కాబట్టి సినిమా సక్సెసే. వేల స్క్రీన్లతో రిలీజ్ కాబట్టి ఓపెనింగ్ అదుర్స్. సినిమాకి టాక్‌వస్తే బయ్యర్స్ సేఫ్. లేకపోతే నెత్తిన గుడ్డే. నిర్మాత హేపీనే. టేబుల్ ప్రాఫిట్ వస్తే. డైరెక్టర్‌కి సంతోషమే. రెమ్యూనరేషన్ వసూలు చేసేసుకుంటాడు రిలీజ్‌కిముందే కాబట్టి. సినిమా హిట్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్.
సూపర్ డూపర్ స్టార్స్‌కైనా సక్సెస్‌లు వుంటేనే మనుగడ. వరుస హిట్స్ తలైవా రజనీకాంత్‌కే లేవు. సినిమా ఆకట్టుకోకపోతే బాబా బాబా బ్యాక్‌టు పెవిలియన్. కథ లేని సినిమాలు ఫ్లాఫ్ అయితే బయ్యర్స్ గగ్గోలు. గ్రాఫ్ పడిపోతుంది. ఈ లోపల ఏ విజయ్, సూర్యల సినిమాలో సక్సెస్ అయి దూసుకెళ్తుంటారు.
కథ లేకపోతే మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్ సినిమాలైనా తిరగ్గొడతారు ప్రేక్షకులు. ఫ్యాన్స్ ఓపెనింగ్‌లకే ఉపయోగపడతారు. ఆ తర్వాత మెచ్చాల్సింది సామాన్య ఆడియన్స్ మాత్రమే.
ప్రిన్స్ మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ సూపర్ హిట్. ఆ తర్వాత రిలీజైన బ్రహ్మోత్సవం, స్పైడర్ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పవర్ ‘అత్తారింటికి దారేది?’ తర్వాత ఏది సక్సెస్ దారి?
కాబట్టి హీరోతోనే సినిమా నడిపిస్తామంటే కుదరదు. సపోర్టింగ్ పాత్రల సహకారంతో నవరస భరితంగా తయారైన రంగస్థలం ఎంతగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నదో చూస్తున్నాం. జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయలు రామ్‌చరణ్‌కి ఎంతగానో సహకరించిన పాత్రలు. లెక్కల మాష్టర్ సుకుమార్ లెక్కలు ఎక్కడా తప్పలేదు. నూటికి నూరు మార్కులు వేశారు ప్రేక్షకులు.
హీరో కేరెక్టరే చాలు గట్టెక్కేస్తాం అనుకుని అర్జున్ భుజాలమీద నెట్టేసిన సినిమా ‘నా పేరు సూర్య’ నా ఇల్లు ఇండియా అనేది ఉప శీర్షిక. కోపం ఎక్కువున్న ఆవేశపరుడైన కుర్రాడికి దేశసేవ చేయాలనే తపన. విపరీతమైన కోపం, ముందువెనుక చూడని దుందుడుకు స్వభావం కారణంగా తండ్రికి దూరమవుతాడు. దేశసేవకోసం మిలట్రీలో చేరాడు. ఇక్కడే లెక్క తప్పింది. లక్షల మంది మిలట్రీలో చేరతారు. అందులో మన హీరో ఒకడు. ప్రత్యేకంగా ఒక సిపాయి దేశ సేవ చేసేదేంటి?
ఇప్పటి పరిస్థితుల్లో దేశ సేవ, ప్రజాసేవ అనే మాటలకే అర్ధాలు వెతుక్కోవలసి వస్తుంది. దేశసేవ చేస్తాం అని ప్రమాణాలుచేసే నాయకులకే దేశభక్తి ఏ కోశానాలేదు. పార్లమెంట్‌లో, అసెంబ్లీలలో క్రిమినల్స్ ఎందరో? ఖజానాను కొల్లగొట్టి, తమ కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా కోట్లు దోచుకుంటున్న కుంభకోణాలు ఎన్నో? దేశ సంపద నూటికి పది మందికే చేరుతున్నాయనీ, తొంభై శాతం ప్రజలకు అన్యాయం జరుగుతున్నదని లెక్కలు వస్తున్నాయి కదా?
దేశసేవ ధ్యేయంగాగల యువకుడు ఎదుర్కొని హీరోయిజం చూపించాల్సింది దోపిడీదారులను కదా? మిలట్రీలో చేరి ఏం దేశ సేవ చేస్తాడు? మహా అయితే పాకిస్థాన్ బోర్డర్‌లో కాపలాకాస్తాడు. ప్రాణం తీస్తాడు. ప్రాణం ఇస్తాడు. అంతవరకే సిపాయి పాత్ర పరిమితం.
రాజ్యాంగం మీద ప్రమాణాలుచేసి దేశాన్ని దోచుకుంటున్న ప్రజా నాయకులే కదా అసలైన విలన్లు? అక్రమార్జన చేశారనీ, ఖజానా దోచుకున్నారనీ జైలుకివెళ్తున్న ముఖ్యమంత్రులనే చూస్తున్నాం ఈ దేశంలో. ఆవేశపరుడైన యువకుడుకి దేశ సేవ చేయాలని వుంటే బొబ్బిలిపులిలా మారాలి. లేదా అధికారం చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలి. లేదా తనలో కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవడానికైతే పోలీస్ అయితే చాలు. ముద్దాయిలను చావబాదవచ్చు. లాకప్ డెత్‌లు ఎన్ని లేవు? ఇది మిలటరీలో ఎలా కుదురుతుంది?
అధికారం వుంటేనే వ్యవస్థను మార్చే అవకాశం వుంటుంది కనుకనే ‘్భరత్ అను నేను’ విజయుడయ్యాడు.
కొత్తగా దర్శకత్వం చేపట్టిన రచయిత వక్కంతం వంశీ హీరో కేరెక్టర్ క్రియేట్ చేసేటప్పుడు లాజిక్ గురించికూడా ఆలోచించాలి. లాజిక్ మిస్సయినప్పుడు హీరో ఎంత నటన ప్రదర్శించినా ఆకట్టుకోలేడు. కొత్త గెటప్, కొత్తలుక్ వుంటే ఫ్యాన్స్ చూస్తారు. సామాన్య ప్రేక్షకుడికి కావలసింది వినోదం. హీరో ఒక్కడే సినిమా మోస్తాడా? సపోర్టింగ్ కేరెక్టర్లు, ఆకట్టుకునే మలుపులు, లాజిక్‌కి దగ్గరగా వుండే కథ తప్పకుండా వుండాలి. భవిష్యత్తులో వంశీనుంచి ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు వస్తాయని ఆశిద్దాం.

-- వాణిశ్రీ