మెయిన్ ఫీచర్

హాస్యానికే అందలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హాస్య నటులు ప్రేక్షకులను వారి నటనతో, డైలాగులతో, హావభావాలతో కడుపుబ్బ నవ్వించారు. మొదటి తరం నటులయిన రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, రాజబాబు, చిట్టిబాబు, సుత్తివేలు ఒక దశలో గొల్లపూడి మారుతీరావు కూడా మంచి హాస్యరసాన్ని పండించినవారే. వీరిలో అల్లు రామలింగయ్య, రావుగోపాలరావు విలన్‌గా నటించిన చిత్రాల్లో పక్కన ఉండి ప్రతీ సీన్‌ను కూడా తన హాస్యపు జల్లుల్లో ప్రేక్షకులను కొట్టుకుపోయేలా చేసేవారు.
*
నవ్వు నాలుగు రకాల మేలుచేస్తుంది. నవ్వడం, నవ్వించడం, నవ్విస్తూ బతకడం ఒక వరం. నవ్వుతూ బతకడంవల్ల ఇంకా నాల్గురోజులు ఎక్కువగా జీవించవచ్చు. ఒకప్పటి బుర్రకథలు, హరికథలు చెప్పే కాలంనుండే హాస్యం జనాల్లోకి వచ్చింది. ఎలాగంటే కథకులు చెప్పే కథల మధ్యమధ్యన పక్కనున్న సహాయకులు ఆరోజుల్లో చిన్నచిన్న జోకులు వేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు. ఇది ఐదారు దశాబ్దాల క్రితం నుండి ఉన్న ఆనవాయితీ. ఇక అవి రానురాను తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి రావడం మొదలయ్యాయి. కథ ఎంత బాగా ఉన్నప్పటికినీ, కథలో ఎమోషన్స్ ఉన్నప్పటికీ సినిమా అంతాకూడా ఒకే మోషన్‌లో నడిస్తే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు. అది ఎంత పెద్ద హీరోలు నటించిన సినిమాలు అయినప్పటికీ కామెడీ సమపాళ్లలో ఉండాల్సిందే. లేకుంటే సినిమాను ప్రేక్షకులు సరిగా గుర్తుపెట్టుకోలేరు. కామెడీ ఎంతవుంటే సినిమాను ప్రేక్షకులు అంత బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అలా కామెడీలో నడిచిన సినిమాలు, ఇప్పటికీ అలా నడుస్తున్నటువంటి చిత్రాలు ఎన్నో వున్నాయి. హాస్యరసం లేనటువంటి సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరించలేరు. కుటుంబ కథాచిత్రం కావొచ్చు, ప్రేమకథాచిత్రం కావొచ్చు, ఏదైనా కామెడీ లేని చలనచిత్రాలు ఇంతవరకు రాలేదు. అంటే సినిమాల్లో కామెడీకి అంతటి ప్రాధాన్యం ఉందన్నమాట. ఫెయిల్ అయ్యే చిత్రాలు కూడా కామెడీ టచ్ ఉండటంవల్ల సక్సెస్ అయ్యాయ. ఐసియులో ఉన్న పేషెంట్‌కు వెంటిలేటర్ పెట్టి ఎలా బతికించుకుంటామో కామెడీ ద్వారా ఫెయిలయ్యే సినిమాకు తులసి తీర్థంపోసి ఆ ఫలితాన్ని దక్కించుకుంటాం. కామెడీ స్థానం అంత గొప్పది మరి.
పౌరాణిక చిత్రాల్లోకూడా కామెడీకి అంతటి స్థానం ఉందని చెప్పవచ్చు. ఆరు దశాబ్దాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హాస్య నటులు ప్రేక్షకులను వారి నటనతో, డైలాగులతో, హావభావాలతో కడుపుబ్బ నవ్వించారు. మొదటి తరం నటులయిన రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, రాజబాబు, చిట్టిబాబు, సుత్తివేలు ఒక దశలో గొల్లపూడి మారుతీరావు కూడా మంచి హాస్యరసాన్ని పండించినవారే. వీరిలో అల్లు రామలింగయ్య, రావుగోపాలరావు విలన్‌గా నటించిన చిత్రాల్లో ప్రక్కన ఉండి ప్రతీ సీన్‌ను కూడా తన హాస్యపు జల్లుల్లో ప్రేక్షకులను కొట్టుకుపోయేలా చేసేవారు. రావుగోపాలరావు నటన కూడా చాలా గొప్పగా ఉండేది. అల్లు రామలింగయ్య, రావుగోపాలరావుల కాంబినేషన్ మహా అద్భుతంగా ఉండేది. గొల్లపూడి మారుతీరావు హాస్యం పండిస్తూనే మంచి మెసేజ్‌నిచ్చే కుటుంబ కథా చిత్రాల్లోనూ, మధ్యతరగతి కుటుంబంలో ఉండేటటువంటి బాధలను దిగమింగుతూనే హాస్యాన్ని పండించేవారు. ఇక సుత్తివేలు, పి.ఎల్.నారాయణ, తాగుబోతు పాత్రల్లో ఒదిగిపోయే ప్రేక్షక లోకాన్ని తమ హాస్యంతో కట్టిపడేసేవారు. రాజబాబు పాత్ర హీరోలకు స్నేహితులుగా, అమాయకపు భర్తలా, అమాయకపు అల్లుడిలా నటించి ప్రేక్షకుల మెప్పుపొందినవాడే. ఆ తరువాత రాళ్ళపల్లి, గిరిబాబు, మోహన్‌బాబులు కూడా రెండవ తరంలో ఒక ఊపు ఊపినవారే. మోహన్‌బాబు విలన్ క్యారెక్టర్ చేసినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినప్పటికీ చాలా గొప్ప నటనను ప్రదర్శించాడు. మోహన్‌బాబు మొదట్లో విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా, రాజకీయ నాయకుడిగా, ప్రస్తుతం హీరోకు తండ్రి క్యారెక్టర్లలో నటిస్తున్నప్పటికీ ఆయన నటన అద్భుతం. మోహన్‌బాబు ఏ పాత్రలో కనిపించినప్పటికీ ఆయనలోని ఇన్ని కోణాలను మోహన్‌బాబు అభిమానులు మరిచిపోలేరు. ఆయన డైలాగ్ డెలివరీనే వేరు. ఆ రాజసం, నటన చాలా గొప్పవి. ఇక అదే వరసలో ‘నట కిరీటి’ రాజేంద్రప్రసాద్ పిసినారిగా నటించినా, ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’లో పూటకు తినడానికి తిండిలేకున్నా ఏనుగును సాకిన తీరు అత్యద్భుతం. ఆ ఒక్కటీ అడక్కు, పెళ్ళిపుస్తకం, ఆ నలుగురు లాంటి సినిమాలను ఎప్పటికీ ప్రేక్షకులు మరిచిపోరు. ‘మేడమ్’ సినిమాలో స్ర్తిపాత్రలో కనిపించిన తీరు బాగుంది. ఇక ‘ఆ నలుగురు’లో పేదవాడి కష్టాలు కంటికి కట్టినట్లు రాజేంద్రప్రసాద్ పాత్రలో కన్పిస్తుంది. మాట పడని వ్యక్తిగా సమాజంలో పేరు సంపాదించుకున్నప్పటికీ పిల్లలు ఆయన్ని ఎలా చూస్తారో ఆ సినిమా ద్వారా అందరూ చూసి చాలా అభిమానించారు. కమెడియన్‌గా, హీరోగా, మధ్యతరగతి మనిషిగా, స్ర్తిగా ఎలా నటించినప్పటికీ రాజేంద్రప్రసాద్ నటనలో ఒక గమ్మత్తు కన్పిస్తుంది. ఇక ఆలీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేసి అంచెలంచెలుగా కమెడియన్‌గా, హీరోగా యమలీల లాంటి చిత్రాలు ఆలీకి తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసాయి. కమెడియన్‌గానే ఎక్కువ చిత్రాల్లో నటించిన ఆలీ సినిమాల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. నటుడు, నిర్మాత, దర్శకుడు అయినటువంటి డా.దాసరి నారాయణరావు కూడా మామగారు లాంటి సినిమాల్లో పేదవాడి పాత్రలో ఉండి అప్పుడప్పుడు జనాల్ని తన మాటలతో కడుపుబ్బ నవ్వించారు. దాసరి నారాయణరావు విప్లవాత్మక సినిమాల్లో కూడా నటించారు. దాసరి చాలా గొప్ప వ్యక్తిత్వం గలవాడు. మేధావి. లేకుంటే ఇన్ని రంగాల్లో ఎలా ప్రావీణ్యం ఉంటుంది? ఇక చెప్పుకోవలసింది, చెప్పుకోవలసిన గొప్ప నటుడు ‘హాస్య నటబ్రహ్మ’ అవార్డుగ్రహీత ‘బ్రహ్మానందం’. పేరులోనే ఆనందం ఉంది. కాబట్టి ఆయన మాటలతో, నటనతో, చేష్టలతో ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేసారు. చేస్తున్నారు. బ్రహ్మానందం 1100 సినిమాల్లో నటించిన గొప్ప నటుడు. ‘బాబాయ్ హోటల్’లో మధ్యతరగతివాడిగా ఎమోషన్స్ ఉన్న పాత్రలో నటించినప్పటికీ, ‘ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’లో హీరో పాత్రను ఇబ్బందులుపెట్టే పాత్రలో నటించినప్పటికీ, అర గుండు పాత్ర పోషించినప్పటికీ, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో బ్రాహ్మణుడిగా నటిస్తున్నప్పటికీ ఏ పాత్ర దానికదే సాటి. అంతటి గొప్ప నటుడు బ్రహ్మానందం. ఇక ఆ తరువాత కోట శ్రీనివాసరావువిలన్‌గా, కమెడియన్‌గా, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో వెంకటేష్ తండ్రిగా మధ్యతరగతి మనిషిగా కాస్త ఎమోషన్స్ ఉన్న పాత్ర అయినప్పటికీ, పిసినారి పాత్రలో కోడిని గుమ్మానికి వేలాడదీసి దానే్న చూస్తూ భోజనం చేయడం అయితే ప్రేక్షకులను ఎంతగా నవ్వించిన పాత్రో చెప్పలేం. ఒక దశలో ఇంత పిసినారి కూడా ఉంటారా? అని ఆలోచింపజేసే పాత్ర. ‘ఆమె’ సినిమాలో పిసినారి తనంతోపాటు హీరోయిన్‌ను ఇబ్బందిపెట్టే పాత్రలోకూడా నటించారు. పౌరాణిక పాత్రలు (కామెడీ) చిన్నచిన్న బిట్స్‌కూడా చేసి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ఇక సుధాకర్ విలన్‌గా, విలన్‌కు కొడుకుగా నటించినప్పటికీ ఆ రెండు పాత్రల్లో కూడా హాస్యమే కనిపిస్తుంది. గిరిబాబు కూడా హాస్యాన్ని పండించటంలో చాలా నేర్పరి. బాబుమోహన్ ‘బుచికి- బుచికి’అనే డైలాగుతో ప్రేక్షకులను కడుపుచెక్కలయ్యేలా నవ్విస్తాడు. అదే సినిమాలో ఆలీ ‘చాట’ అనే డైలాగ్- బాబుమోహన్ ‘బుచిక- బుచికి’ డైలాగ్‌తో భలే హాస్యాన్ని పండిస్తారు. ఇక వేణుమాధవ్ హీరో స్నేహితుడిగా నటిస్తూ మాటిమాటికి దెబ్బలు తినే క్యారెక్టర్లు ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్నిస్తాయి. ఏవీఎస్ నటన కూడా అబ్బో చెప్పలేం. గోడమీద బల్లుందా? మంచంలో నల్లుందా? అనే మాటల్తో గమ్మత్తయిన డైలాగ్ డెలివరితో, హావభావాలు పలికించిన నటుడు ఎవిఎస్. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం శోభన్‌బాబు హెయిర్ స్టయిల్‌లో లెక్చరర్‌గా నటించినా, ‘జయం’ చిత్రంలో మందు త్రాగే బావిమీద డ్యాన్స్‌చేస్తూ నటించినా ఆయన నటనలో ఒక విధమైన స్టయిల్ ఉంటుంది. ఇక బక్కగా ఉన్న పర్సనాలిటీతో రెండు కండ్లు అవి ఎటు చూస్తున్నాయో అన్నట్లుగా ఉండే హాస్య నటుడు కళ్ళు చిదంబరం. ఆయన మాట్లాడితే ఒళ్ళంతా కదిలిస్తూ డైలాగ్స్ చెప్పిన సీనే్ల ఎక్కువగా ఉంటాయి. ఆయన నటనకు నవ్వు రానివారు కూడా నవ్వి తీరాల్సిందే మరి.
ఇక ఎమ్మెస్ నారాయణ గురించి చెప్పుకున్నట్లయితే ఆయన కండ్లు ఎప్పటికీ కండ్ల క్రింద మడతలు పడి ఉంటాయి. అవి కూడా ఆయనను హైలైట్ చేసేవే. ఎమ్మెస్ నారాయణ తాగుబోతు క్యారెక్టర్ చేయడంలో దిట్ట. అసలు నిజంగా మందు తాగినవాడు కూడా అలా ఉంటాడో లేదో? తాగుబోతు పాత్రలు బాగా నప్పుతాయి. అలాంటి పాత్రల్లో ఎమ్మెస్ నారాయణ జీవిస్తారని చెప్పవచ్చు. గుండు హనుమంతరావు నాటకాల నుండి సినిమాల్లోకి వచ్చినవాడయినప్పటికీ హాస్యం పండించటంలో ఆయనది అందెవేసిన చెయ్యి. ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ చిత్రంలో హీరో రాజేంద్రప్రసాద్‌కు స్నేహితుడిగా, హీరోగా ఆకలిదప్పుల్లో కూడా వెన్నంటి ఉండే పాత్ర గుండు హనుమంతరావుది. ఆయన ఫేస్ ఫీలింగ్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇక విలక్షణమయిన నటనను ప్రదర్శించేటటువంటి నటుడు పోసాని కృష్ణమురళి. నిజ జీవితంలో ఆయన ముక్కుసూటి మనిషి. ‘బ్రతుకు జట్కాబండి’ కార్యక్రమంలో ఆయన మాటలు చూస్తే అర్ధమయిపోతుంది. ఆయన నటనను అంచనా వేయలేం. శాడిస్ట్ భర్తగా, రాజకీయ నాయకునిగా, విలన్‌గా ఏ కోణం దానిదే. ఆయన కన్పించేటటువంటి ప్రతి సీను ఒక మధుర జ్ఞాపకమే. ఇక ఆ సీన్‌ని మరచిపోయేటటువంటి అవకాశమే ఉండదు. ఇక ఎల్.బి.శ్రీరామ్ కావడిలో ఇద్దరు చంటి పిల్లలను పెట్టుకొని నటించిన సీన్ బాగా పండిందని చెప్పవచ్చు. ‘దొబ్బిచ్చుకోవడం’అనే డైలాగ్ గమ్మత్తుగా ఉంటుంది. ఆ డైలాగ్ మాట్లాడేటప్పుడు ఆయన ముఖంలో రియాక్షనే వేరు.
సీనియర్ నరేష్ నటించిన చిత్రం ‘శతమానం భవతి’లో మతిమరుపు పాత్ర ప్రేక్షకులను పొట్టపగిలేలా నవ్వించిందని చెప్పవచ్చు. నరేష్ నటించిన ‘జంబలకిడి పంబ’ చిత్రంలోని ప్రతి సీన్ కూడా ఎన్నటికీ మరిచిపోయేది కాదు. ఇక కమెడియన్‌గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సునీల్ తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడని చెప్పవచ్చు. ‘నువ్వులేక నేను లేను’ చిత్రంలో సునీల్ పాత్ర, డైలాగ్స్, సెటైర్స్ అబ్బో చాలా గొప్పవి. ఆ తరువాత సునీల్ హీరోగా మంచి రికార్డును తన వశం చేసుకున్నారు. హీరోగా ‘పూలరంగడు’.
‘్ఫష్ వెంకట్’ విలన్ దగ్గర సహాయకుడి పాత్రలలో ఒదిగిపోతాడు. సీరియస్ సీన్లోకూడా విలన్‌ను తిట్టీతిట్టనట్లు, పొగిడి పొగడనట్లు మాట్లాడే సీన్లో ఆయన హావభావాలు భలే పలికిస్తారు. ఆ తరువాత ‘అల్లరి నరేష్’. అన్నీ అల్లరి పనులు, చిల్లర పనులు, చిల్లర వేషాలే. ప్రేమించిన అమ్మయికోసం కోటీశ్వరుడయినప్పటికీ పేదవాడిగా నటించడానికి పాపం ఎన్నో ఇబ్బందులు పడతాడు. తనతోపాటు తన కుటుంబం మొత్తాన్ని రోడ్డుమీద నిలబెడతాడు. ఒక్క పలుచటి పర్సనాలిటీకి ఆయన కామెడీ అత్యద్భుతంగా ఫిక్సయిపోతుంది. నరేష్ ప్రతి సినిమా ఆయన చేసే కామెడీతోనే సక్సెస్ అవుతుంది. అంతటి గొప్ప కామెడీ హీరో అల్లరి నరేష్. కథాబలంకన్నా కామెడీనే ఎక్కువగా ఉంటుంది.
ఇక ‘మాస్ మహారాజ్’ రవితేజ. రవితేజ హీరోగా నటించిన ప్రతి సినిమాలో హీరోయిజంతోపాటు అంతకంటే ఎక్కువగా కామెడీ ఉంటుంది. అదే రవితేజ ప్రత్యేకత. ఫైట్స్ సీన్లలోకూడా నవ్విస్తూనే ఫైట్స్ చేస్తుంటాడు. హీరోగా అంతకంటే గొప్పగా నటిస్తాడు. అప్పటికప్పుడే ఒక ద్రావణాన్ని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం వస్తుందో అలాంటి నటుడు రవితేజ. రవితేజ సినిమాలో హీరోయిజంతోపాటు కామెడీ కూడా అంతే పాళ్లలో ఉంటుంది. ఇక నటుడు శ్రీనివాసరెడ్డి అయితే హీరో స్నేహితుడి క్యారెక్టర్‌లో నటించి ఆ పాత్రకు జీవంపోస్తాడు. ‘అఆ’ సినిమాలో హీరోయిన్ తల్లి నదియాకు ప్రతీ విషయంలో సపోర్టుచేస్తూ, అతి చిన్న విషయానికి కూడా పొగిడే పాత్రలో శ్రీనివాస్‌రెడ్డి జీవించారని చెప్పవచ్చు. వీరంతా కాకుండా ఈమధ్య కాలంలో బుల్లితెర (టీవీ) నటులు రచ్చ రవి, సుడిగాలి సుధీర్, శ్రీను, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర, రఘు, ధన్‌రాజ్ లాంటి వాళ్లుకూడా వెండి తెరమీద వెలిగిపోతున్నారు. జబర్దస్త్, పటాస్ లాంటి ప్రోగ్రాంలలో మొదలైన వీరి పాత్రలు వెండితెరమీద నవ్వుల్ని పూయిస్తున్నాయి. వీరు నటించిన ప్రతి స్కిట్‌లో ఒక మెసేజ్‌తోపాటు కామెడీ అంతకంటే ఎక్కువగా ఉంటుంది.
అయితే ఒక నటుడు హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా నటించడమంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి అప్పటికప్పుడే స్పాంటేనియస్‌గా పాత్రల్లోకి ఇమిడిపోవాలి. కానీ కమెడియన్స్ హీరోలుగా నటిస్తే కొంతవరకు బాగానే ఉటుంది. కానీ హీరోలు కామెడీ సీన్లలో నటించేటప్పుడు వారి ఇమేజ్‌ని కాపాడుకునే ప్రయత్నం తప్పకచేయాలి. లేకుంటే గతంలో వారికున్న ఇమేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమయినా హీరోలు తమ సినిమాల్లో కామెడీ చేస్తున్నారంటే ఆ చిత్రాల్ని వారు బతికించుకున్నట్లే. ఎందుకంటే ఆ సినిమాలో కథకు బలంలేకున్నా వారి కామెడీతోనయినా అభిమానుల్ని దూరంచేసుకోకుండా ఉంటారు. హీరోలు కామెడీ పాత్రలు చేయడం తప్పేమీకాదు. ప్రేక్షకులు ఏదో ఒక కోణంలో చూసైనా వారిని ఆశీర్వదిస్తారు, సినిమాను ఆదరిస్తారు.
కేవలం మగవాళ్లలోనే కాదు ఆడవారిలో కూడా హాస్యం పండించే గప్ప నటీమణులున్నారు. కోవై సరళ లాంటి నటికి బ్రహ్మానందంగారి నటన తోడయితే ఆ సినిమాను ప్రేక్షకులు మరిచిపోలేరు. ‘పెళ్ళాంచెప్తే వినాలి’లో గిరిబాబు సరసన నటించినా, భర్తను ఇబ్బందిపెట్టే పాత్రల్లో చంద్రముఖిలా నటించినా ఆమె నటన అజరామరం. తెలంగాణ శకుంతల నటన చాలా బాగా ఉంటుంది. రమాప్రభ, కల్పనారాయ్, ఝాన్సీ, వై.విజయల నటన గమ్మత్తుగా అనిపిస్తుంది. వై.విజయ రచయిత్రిగా నటించిన సినిమాలో తనకు ఎప్పుడు రాయడానికి మూడొస్తే అప్పుడు భర్తను రాయడానికి వాడుకుంటుంది. ఆమె రాసేటటువంటి కథల్లో అంతా ప్రకృతి విరుద్ధంగానే ఉంటాయి. ఆ భర్త పడే వేదన నరకం. వెంకటేష్, నయరతార కలిసి నటించిన చిత్రంలో ఝాన్సీ బాగా రిచ్ అని అంటుంది. ఆమె మాటలను వెంకటేష్ చాలా వ్యంగ్యంగా పలుకుతాడు. అది చూసిన ఝాన్సీ అయోమయ పరిస్థితిలో అక్కడినుంచి తిడుతున్నాడో, పొగుడుతున్నాడో తెలియక వెళ్లిపోతుంది. ఇక సీనియర్ నటి పావలా శ్యామలా నటనను ఎవరికయినా నేర్చుకోవాలనిపిస్తుంది. అంతటి నటన ఆమెది. హాస్యాన్ని పండించడంలో ఆమెకు మించిన సీనియర్ నటులు ఇంకెవరూ లేరని చెప్పవచ్చు. ఇక ‘అన్నపూర్ణమ్మ’గారు కుటుంబ కథా చిత్రాల్లో నటించినప్పటికీ ఈమధ్యన వచ్చిన ‘అఆ’ సినిమాలో ఒకే సీన్లో కన్పించినప్పటికీ ఆ పాత్ర మాట్లాడే మాటలు మదిలో హాస్యాన్ని నింపుతాయి. నటీనటులు ఎవరయినా, పెద్ద హీరోలయినా, చిన్న హీరోలయినా బడ్జెట్ ఎంతన్నది ముఖ్యంకాదు, దర్శకులు ఎవరన్నది ముఖ్యంకాదు. ఆ చిత్రంలో ఎంతమేరకు కామెడీ ఉందన్నదే ముఖ్యం. కథ బోర్‌గా ఉన్నప్పటికీ ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు కూర్చున్న చోటునుండి కదలకుండా చేయగలగాలి. అంతటి శక్తి కామెడీకే ఉంది. కామెడీని, కామెడీ నటీనటుల్ని అంత తక్కువగా తీసిపారేసినట్లు చూడకూడదు. సినిమాలంటే ఆహ్లాదంకోసం, మానసిక ప్రశాంతతకోసం చూసేవి. అవి రెండూ కామెడీ చిత్రాల్లోనే. కాబట్టి సినిమాల్లో కామెడీకి పట్టం కట్టడం, కమెడీయన్లను కాపాడుకోవడం అవసరమే.

-సుమశ్రీ