ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ప్రతిపక్షాల ఉనికి నిలుస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బి.జె.పి ఘన విజయాలు సాధిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనటంతో ప్రతిపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. బి.జె.పికి ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలో అధికారం హస్తగతం కావటంతో ప్రతిపక్షాల అస్తిత్వం ప్రమాదంలో పడిపోయింది. తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ ప్రతిపక్షాల ఉనికిని కాపాడేందుకు పెద్ద ఎత్తున కృషి ప్రారంభించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ ఢిల్లీ కేంద్రంగా తమ ప్రయత్నాలు చేస్తుంటే మమతా బెనర్జీ క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను కూడగట్టేందుకు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. సోనియా గాంధీ ఢిల్లీలో జె.డి యు, సి.పి.ఎం, సి.పి.ఐ, ఎన్.సి.పి తదితర పార్టీల నాయకులతో ముఖాముఖి చర్చలు జరపటం ద్వారా ప్రతిపక్షాల అస్తిత్వాన్ని కాపాడేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇలాంటి ప్రయత్నం చేసి విఫలం కావటంతో సోనియా గాంధీ తన అనారోగ్యాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాలను సమైక్య పరిచేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బి.జె.పి సాధించిన ఘన విజయం ప్రతిపక్షాల పునాదులను కదిపివేసింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బి.జె.పికి పూర్తి మెజారిటీ లభించినా గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అసమర్థ రాజకీయాల మూలంగా బి.జె.పి అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ చొరవ చూపించి ఉంటే గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ సునాయాసంగా అధికారంలోకి వచ్చేది. దీనితో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో బి.జె.పి గెలిస్తే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే సందేశం ప్రజల్లోకి వెళ్లేది. అయితే రాహుల్ గాంధీ చొరవ లేని రాజకీయం మూలంగా నాలుగు రాష్ట్రాల్లో బి.జె.పి, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నాలుగు రాష్ట్రాల్లో బి.జె.పి అధికారంలోకి వచ్చిందనే సందేశం ప్రజల్లోకి వెళ్లినప్పటి నుండి ప్రతిపక్షాల్లో పూర్తి స్థాయి నైరాశ్యం నెలకొన్నది. ఈ నైరాశ్యం మూలంగా ప్రతిపక్షం మరింత కుంగిపోయే ప్రమాదం నెలకొన్నది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ అకస్మాత్తుగా ఎందుకూ కొరగాని ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ తెరమరుగవుతోందనే భయం నెలకొన్నది. సోనియా గాంధీ అనారోగ్యం మూలంగా పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. కేంద్ర స్థాయిలో బి.జె.పి మినహా మరో జాతీయ పార్టీ అనేదే లేకుండా పోయే ప్రమాదం నెలకొన్నది. కాంగ్రెస్ విముక్త దేశం అనే నినాదంతో ముందుకు సాగుతున్న బి.జె.పి ప్రాంతీయ పార్టీలను సైతం కబళించే వ్యూహంతో ముందుకు సాగటంతో ప్రతిపక్షాలతో పాటు ఎన్.డి.ఏ మిత్ర పక్షాలు సైతం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయాయనేందుకు శివసేన మంచి ఉదాహరణ. మహారాష్టల్రో ఒకప్పుడు శివసేన ప్రధాన పార్టీ, బి.జె.పి దానికి అనుబంధంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి తారుమారై బి.జె.పి ప్రధాన పార్టీగా అవతరిస్తే శివసేన దానికి అనుబంధ పార్టీగా తయారైంది. ఒడిశాలో బి.జె.డి కూడా బి.జె.పితో భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు కలిసి రాజకీయం చేసిన బి.జె.పి, బి.జె.డి లు ఇప్పుడు విడి,విడిగా పోటీ చేస్తున్నాయి. ఒడిశా శాసన సభకు 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి ఒంటరిగా పోటీ చేయనున్నది. 2017 ఆఖరున జరిగే గుజరాత్, ఆ తరువాత జరిగే కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి ఘన విజయం సాధించే అవకాశాలున్నట్లు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోదీ పటిష్టమైన నాయకత్వం మూలంగా బి.జె.పి ఉత్తరాదితోపాటు దక్షిణాదిలో కూడా తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతోంది. మొదట కేరళ, తెలంగాణా, ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తామని బి.జె.పి నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్‌ను బి.జె.పి యుక్త భారత్‌గా మార్చాలన్నది బి.జె.పి, ఆర్.ఎస్,ఎస్ అధినాయకుల కల. ఈ లక్ష్య సాధన కోసం బి.జె.పి అధినాయకత్వం ప్రతిపక్షాలతోపాటు మిత్రపక్షాలను సైతం కబళించేందుకు వెనుకాడటం లేదు. గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం త్రిపుర తదితర మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత 2019లో లోకసభ ఎన్నికలు జరుగుతాయి. దేశంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే రానున్న అన్ని అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019లో జరిగే లోకసభ, ఏ.పి, తెలంగాణా తదితర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి, రెండు మినహా మిగతా అన్నింటిని బి.జె.పి, దాని మిత్రపక్షాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేంద్రమోదీ ప్రభంజనం మొత్తం దేశాన్ని కుదిపివేస్తోంది. ఒడిశాలో బి.జె.పి గెలిస్తే దాని ప్రభావం పక్కన ఉన్న పశ్చిమ బెంగాల్‌పై పడుతుంది. పశ్చిమ బెంగాల్‌కు పైన ఉన్న అసోంలో బి.జె.పి ఇప్పటికే అధికారంలోకి వచ్చింది. బి.జె.పి విజయ పరంపర ఇలాగే కొనసాగితే 2019 లోకసభ ఎన్నికల నాటికి బి.జె.పి రాజకీయంగా అత్యంత పటిష్టమైన స్థితిలో ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు సతమతమవుతూ సమాయత్తమవుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు సమాయత్తం కాగలుగుతాయా? అనేది అసలు ప్రశ్న. ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు అవసరమైన ప్రస్తుతం సోనియా గాంధీ మినహా ప్రతిపక్షానికి మరో జాతీయ స్థాయి నాయకుడు లేడు. టి.ఎం.సి ఎం.పిలు, నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న మమతా బెనర్జీ జాతీయ స్థాయి నాయకురాలి స్థాయికి ఎదగలేకపోయింది. సీతారాం ఏచూరి తదితర వామపక్షాల నాయకులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నా అది మేధావి వర్గానికి పరిమితమైంది తప్ప జన సామాన్యలో వారికి గుర్తింపు లేదు. నితీష్‌కుమార్ బిహార్‌కు పరిమితమైపోయిన నాయకుడు. శరద్ యాదవ్, శరద్ పవార్ కూడా ప్రాంతీయ స్థాయిని వదిలించుకోలేకపోయారు. ఆర్.జె.డి అధినాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి ఆరోపణల మూలంగా ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు. నరేంద్ర మోదీతో సరితూగగల నాయకుడు లేకపోవటం ప్రతిపక్షానికి పెద్ద దెబ్బ. మోదీ వినూత్మ దృక్పథం, విధానంతో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అతని తప్పులను ఎత్తిచూపిస్తూ దేశ ప్రయోజనం కోసం పనిచేస్తున్నామనే విశ్వాసాన్ని ప్రజలకు కలిగించగలిగే నాయకుడు ప్రతిపక్షంలో లేడు. సోనియా గాంధీ, మమతా బెనర్జీ, వామపక్షాలు, జె.డి యు, సమాజ్‌వాదీ తదితర పార్టీలు ఒక వేదిక మీదికి వచ్చినంత మాత్రాన ప్రజలు విశ్వసిస్తారనే నమ్మకం కలగటం లేదు. *