సబ్ ఫీచర్

గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి పథకం ఆనాటి ప్రధానమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు మైనార్టీ ప్రభుత్వం మనుగడకోసం అనేక చిన్న పార్టీలను కూడగట్టుకొనే విధానంలో భాగంగా ఎంపీ ల్యాడ్స్ పుట్టుకొచ్చింది. ఈ పథకాన్ని చూసి అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల అభివృద్ధికోసం తమకూ ఇలాంటి నిధి కావాలన్నారు. ఫలితంగా ఎంపీ ల్యాడ్స్ తరహా పథకం రాష్ట్రాలకు కూడా విస్తరించింది. పథకం ప్రజావసరాలకు అనుగుణంగా ఉండడంతో ఆ స్ఫూర్తితో ప్రస్తుతం 35 దేశాల్లో ఎంపీ ల్యాడ్స్ వంటి పథకాలు అమలవుతూ ఉండడం దీనికి నిదర్శనం.
మనం అనుసరించే బ్రిటీష్ పార్లమెంటరీ నమూనా ప్రకారం ప్రజాప్రతినిధులు నేరుగా పాలనావ్యవస్థలో ప్రవేశించడం నిషిద్ధమైనా, ఎంపీల, ఎమ్మెల్యేలు తదితర భారతీయ శాసనకర్తలు, తమతమ నియోజకవర్గాల అభివృద్ధిలో తమకూ ఎంతోకొంత పాత్ర ఉండాలని చాలాకాలం నుంచి వస్తున్న డిమాండ్ ననుసరించి, తొలుత ముం బయి మహానగర పాలికకు చెందిన కార్పొరేటర్లు తమతమ వార్డుల్లో మున్సిపల్ పనులు చేపట్టడంకోసం ప్రతి కార్పొరేటర్‌కు ఏడాదికి రూ. 50వేలు కేటాయించడం జరిగింది. ఈ మార్గదర్శనంతో మహారాష్ట్ర విధానసభ సభ్యు లూ తమకంటూ ఒక అభివృద్ధినిధిని సాధించుకొన్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల బాట తర్వాత ఎంపీలకూ అనుసరణీయమై వారికీ సొంత అభివృద్ధి నిధి సమకూరింది. ఎంపీ ల్యాడ్స్ కింద ప్రతి పార్లమెంటు సభ్యుడికి ఏటా ఐదు కోట్ల రూపాయల నిధి లభిస్తుంది. ఆ సొమ్మును తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వెచ్చించే అధికారం ప్రతి ఎంపీకి ఉంది. స్థానిక అభివృద్ధిలో పార్లమెంటు సభ్యులకు భాగస్వామ్యం వుండాలన్న సదుద్దేశంతో ఎంపీ ల్యాడ్ పథకాన్ని 1993లో ప్రారంభించారు. దీనికి మొదట్లో ఏడాదికి రూ.800 కోట్లు కేటాయించగా, కాలక్రమేణా వార్షిక కేటాయింపు నాలుగువేల కోట్లకు పెరిగింది. అయితే ప్రజాప్రతినిధులు ఈ పథకం నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్లు, అవినీతికి, ఆశ్రీత పక్షపాతానికి పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూశాయి. ఎంపీ ల్యాడ్స్ నిధులు భారీగా కేటాయించడంతో ఆ సొమ్మును పారదర్శకంగా సహేతుకంగా, చిత్తశుద్ధితో వినియోగించాలనే డిమాండ్ వెల్లువెత్తింది.
పార్లమెంట్ సభ్యుల నిధుల్లో దుర్వినియోగాన్ని పసికట్టిన భారత ప్రధాని నరేంద్రమోదీ సరికొత్త ఆలోచనే సన్సద్ ఆదర్శ్ గ్రామయోజనా పథకం. గతంలో కొనసాగిన ఎంపీ ల్యాడ్స్‌లోని లొసుగుల్ని పూర్తిగా తొలగించి ఈ దేశంలోని పల్లెలవైపు పార్లమెంటు సభ్యులు దృష్టిసారించి అభివృద్ధిపధంలో పయనించే వీలు సన్సద్ ఆదర్శ్ గ్రామయోజనా పథకం ద్వారా అమలుకానుంది. ప్రతి పార్లమెంట్ సభ్యుడు తాను ఎంచుకొన్న గ్రామాల్లో వౌలిక వసతుల్ని మెరుగుపరచి, జీవన నాణ్యతను సర్వతోముఖంగా అభివృద్ధిచేయడానికి నిర్దిష్ట నిధులను వెచ్చించడం జరుగుతోంది. 2016నాటికి ఎంపిక చేసుకొన్న గ్రామం ఆదర్శవంతంగా రూపుదిద్ది 2019నాటికి మరో రెండు గ్రామాలను 2024నాటికి ఇంకో ఐదు గ్రామాలను సర్వతోముఖంగా అభివృద్ధిచేయాల్సి ఉంటుంది. సన్సద్ ఆదర్శ్ గ్రామయోజనా క్రింద ఎంపికచేసే గ్రామాల్లో దేనితోను పార్లమెంటు సభ్యుడి కుటుంబానికి సంబంధం ఉండకూడదు. రోడ్లు, త్రాగునీరు, విద్య, వైద్యంవంటి గ్రామీణ వౌలిక సదుపాయాలతోపాటు, పారిశుద్ధ్యం, స్ర్తిపురుష సమానత్వం, సామాజిక న్యాయం పెంపొందించాల్సిన అవసరం ఉంది. స్థానిక స్వపరిపాలనలో పారదర్శకత, చిత్తశుద్ధితో వ్యవహారం నిర్వహించాల్సి ఉంటుంది. ఇలాంటి దృక్పథం దేశమంతా కొనసాగితే గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యాన్ని సాధించే వీలుంటుంది.
స్వచ్ఛ్భారత్, జన్‌ధన్, సన్సద్ ఆదర్శ్ గ్రామయోజన, విదేశీ బ్యాంకులలోని నల్లధనం వెలికితీత, ఉగ్రవాదాన్ని అణగార్చేందుకు పలు దేశాల్ని కూడగట్టి ఆ దిశగా పయనం సాగించేలా మోదీ ఆలోచనాసరళి నవభారత నిర్మాణానికి నాందీ పలకనుంది. సన్సద్ ఆదర్శ్ గ్రామయోజన గ్రామీణ ప్రాంతాలలో చక్కగా అమలైతే, చుట్టుపక్కల గ్రామాలవారు సైతం తమ గ్రామాల్ని దత్తత తీసుకొని, అభివృద్ధిచేయాలనే డిమాండ్ పార్లమెంటు సభ్యులపై తప్పక రావడం, అధికారులపై పని వత్తిడి పెరగడమేకాకుండా గ్రామాలకు గ్రామాలే సర్వతోముఖంగా ప్రగతిపథం వైపు పయనించడం జరుగుతోంది. దీంతో పాలక ప్రభుత్వంపైనా, పార్లమెంట్ సభ్యులపైనా గ్రామీణ ప్రాంతాలవారికి ప్రజలకు నమ్మకం కుదిరి పనిచేసే ప్రభుత్వంపై ఆసక్తి ఇనుమడిస్తుంది. గ్రామీణులే స్థానికంగా తమకు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలను ఈ పథకం ద్వారా ఎంపిక చేసుకొని ప్రజాప్రతినిధి నిధులతో అభివృద్ధిపథంవైపు కొనసాగే వీలు ఇందులో ఉంది.
ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదర్శ గ్రామ పథకం ఆచరణ సాధ్యంకావాలంటే ఎంపీల పారదర్శకత, చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. పథకాన్ని విజయవంతంగా అమలుజరిపితే గొలుసుకట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పథకంపైనా, ప్రజాప్రతినిధిపైనా ప్రజలకు నమ్మకం పెరిగి ప్రజలు ఆకర్షితులు కావడం ఖాయం. కేంద్ర ప్రభుత్వమే కాకుండా ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా ఈ దిశగా పయనించి శాసనసభ్యుల్ని కూడా ఇలాంటి పథకంవైపు మళ్లించి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గ్రామీణాభివృద్ధికి కృషిచేస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఎంపీ చిత్తశుద్ధితో పనిచేస్తే మూడేళ్ళలో దేశంలో 2,400 ఆదర్శగ్రామాలు ఏర్పడతాయి. ఇలాంటి ముందుచూపుతో రాష్ట్రాలు కూడా పథకాన్ని శాసనసభ్యుల ద్వారా పాలుపంచుకొంటే ఆరు లక్షల గ్రామాల్లో లక్ష గ్రామాలకైనా భవిష్యత్ పునాదులు పడతాయి.

- దాసరి కృష్ణారెడ్డి