మెయిన్ ఫీచర్

గొంతెత్తిన పాకుడురాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీరా’ అంది హీరోయిన్ సోఫాలో ఓ పక్కకు సర్దుకుంటూ.
‘వొంట్లో బావుండలేదని, పడుకున్నావని చెప్పింది నీ అసిస్టెంట్’ అన్నాడు ప్రొడ్యూసర్.
‘నిజంగానే బావుండలేదు. అయినా, మీరీ రాత్రి నన్ను ఒంటరిగా వొదిలి వెళ్తారా? వెళ్లరని నాకూ తెలుసు. అయినప్పుడు నా బాగోగులు మీకెందుకు?’ నవ్వింది హీరోయిన్.
ఆ నవ్వు సమ్మోహనాస్త్రంలా పని చేసింది. ఆ వాఖ్యలు ప్రొడ్యూసర్‌లోని పురుషత్వాన్ని రేక్కొలిపాయి.
‘నేను వెళ్లడం కోసం రాలేదు’ అన్నాడు.
‘వెళతారని నేనూ అనుకోవడం లేదు’ అంది ఫకఫకా నవ్వుతూ.
‘మీ సంగతి నాకు తెలీదు కనుకనా, మోసపోవడానికి. ఏం చేశారో చెప్పడం లేదుకానీ, నన్ను మాత్రం పూర్తిగా మైకంలో ముంచేశారు’.
‘అయితే నాకేం బహుమతి ఇస్తావ్?’ అడిగాడు ప్రొడ్యూసర్.
‘బహుమతా? ఇవ్వడానికి నా దగ్గరేముంది? ఉన్నదేదో మీకెప్పుడో అర్పించాను. భగవంతుడు నాకేదన్నా గొప్పవరం ప్రసాదిస్తే దాన్ని మీకోసం ఇస్తాను.
అంతకన్నా నేనేమివ్వగలను’.
ప్రొడ్యూసర్ రెండు చేతులూ చాపాడు. హీరోయిన్‌ను తనమీదకు లాక్కున్నాడు...
****
ఏ సినిమా పరిశ్రమలోనైనా తెరవెనుక సాగే బాగోతంలోని అతి గొప్ప సన్నివేశం ఇదే. నిజానికి -ఇప్పటిది కాదు, ఏళ్లక్రితం రావూరి భరద్వాజ రాసిన ప్రఖ్యాత ‘పాకుడురాళ్లు’ నవలలోది. తెర వెనుక చరిత్రను ఎప్పుడో రాశాడు. జరిగిన, జరుగుతున్న, జరగడానికి అవకాశమున్న సంఘటనలనూ ఏకరవు పెట్టాడు. వేలాదిమందిని తనవైపు ఆకర్షించుకునే ‘మెరుపుల ప్రపంచం’లో తిష్టవేసిన మృగాల ప్రవర్తనను అక్షర దృశ్యం చేశాడు. చిరునవ్వుల వెనుక మణిగిపోయే ఆత్మఘోష, తళుకు చూపుల చాటున దాగిన కన్నీరు, తియ్యటి మాటల మాటున పొంచివున్న విషజ్వాలలు... ఇవన్నీ ‘పాకుడురాళ్ల’ స్పర్శ. ఆ నవలలోని అభాగ్య మహిళలు ఇంతకాలానికి నోరు తెరిచారు. తమకు ఎదురవుతున్న లైంగిక వేధింపులపై -గొంతు విప్పారు. జాతీయ పరిశ్రమ నుంచే ఆ గొంతు బలంగా వినిపిస్తున్నా, క్రమంగా ఇది ప్రాంతీయ పరిశ్రమకూ విస్తరించకపోదు. తమను లొంగదీసుకోడానికి ప్రయత్నించే పురుష పెత్తనాన్ని నిలదీయకపోదు.
***
ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది వర్తమాన సమాచార సాగరంలో నిర్థారించడం కష్టసాధ్యం. ఏ దేశంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా బాధితులూ ఉంటారు. వారిపై పెత్తనం చేసేవారూ ఉంటారు. కాని, బాధితులకు అన్ని వేళలా హక్కులను చాటుకునే, జరిగిన అన్యాయాన్ని వినిపించే, ఆర్తనాదాలను జగతిని నినదించే అవకాశం ఉండదు. కానీ, కొన్ని సందర్భాల్లో ధైర్యం ముందుకు నడుపుతుంది. సాహసం పాఠాలు నేర్పుతుంది. అదే వర్తమాన బాధిత వర్గాలకు ఆశాదీపమవుతుంది. అలాంటిదే భారత్ సహా అనేక దేశాలను కదిలించి అభాగ్య మహిళకు ధైర్యాన్నిస్తూ ముందుకు నడిపిస్తున్న ‘మీ టూ’. ఇప్పుడు ‘బీ (బాలీవుడ్) టూ’.. రేపు టీ-టూ.. ఎం-టూ.. కో-టూ.. ఏదైనా కావొచ్చు.
మొదటినుంచీ సినిమా పరిశ్రమ అనేకరకాల అవలక్షణాల కూడలి. అవకాశాల కోసమో లేదా అవసరాల కోసమో వ్యక్తిత్వాలను ఫణంగాపెట్టేవారూ ఇక్కడ అత్యంత సహజం. కాని, ‘మీ టూ’ పుణ్యమా అని తన వ్యక్తిత్వాన్ని నలిపేస్తోన్న పురుషత్వంపై గొంతు విప్పింది బాలీవుడ్ మహిళ. వేధించినవాడే నివ్వెరపొయేలా వీధికెక్కింది. అలా తనుశ్రీ దత్తా ఆక్రోశం అనేకమంది అభాగ్య మహిళలను కదిలించింది. సృజనాత్మక పరిశ్రమలో క్రియేటర్లుగా చెలామణీ అవుతోన్న వంకరగాళ్ల గుట్టు రట్టుచేసింది. ఎప్పుడో జరిగింది కదా అని ఊరుకోవడం లేదు. దశాబ్దాల క్రితంనుంచీ పురుషత్వ పశుబలం కింద ఎలా నలిగిపోతున్నామో విడమర్చి మరీ చెబుతోంది. ఏళ్ల క్రితంనాటి వంకర చేష్టలే పీడకలలై వెంటాడుతున్న వైనాన్ని చూసి ‘పరిశ్రమ పెద్దలు’ బెంబేలెత్తుతున్నారు. దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు.
ఇప్పుడు బాలీవుడ్‌ను ప్రకంపనలకు గురి చేస్తోన్న రసవత్తర సన్నివేశం -లైంగిక వేధింపులు. నటులు, దర్శకులు, ప్రొడ్యూసర్లు, కాస్టింగ్ డైరెక్టర్లు, డాన్స్ డైరెక్టర్లు, మేకప్‌మెన్లు.. చివరకు లైట్ బాయ్స్ వరకూ.. ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్‌లోనూ కొంతమంది మృగాళ్లు -తన వంకర బుద్ధిని ఏదోక మహిళపై ప్రయోగిస్తున్నారన్న నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి అభియోగాలే కావొచ్చు. కానీ, అభియోగాలు నిజాలు కాజాలవని గట్టిగా చెప్పగలిగే వాడు ఎవ్వడూ లేడు. కారణం -పరిశ్రమ ఎప్పుడో ఆ స్థితికి దిగజారింది. తెరవెనుక వ్యవహారం ‘ట్రిపుల్ ఎం (మద్యం, మనీ, మగువ)’ అని పరిశ్రమవాళ్లే కామెంట్లు చేయడం వింటూనే ఉన్నాం. ఇండస్డ్రీ మొత్తం ఇంతేనా? అన్న ప్రశ్నకు సమాధానం ఉండకపోవచ్చు. కానీ, బయటికొస్తున్న వ్యవహారాలు, బాధితుల ఆత్మఘోషలు వింటే మాత్రం తెరవెనుక ప్రపంచం ‘సెక్స్ రొంపి’లో కూరుకుపోయినట్టే కనిపిస్తుంది. నిన్నటి దొరలే నేటి దోషిగా అభియోగాలు బయటపడుతున్న తరుణంలో, రోజుకొకటిగా పెద్దల భాగోతం బయటపడటం చూస్తుంటే.. ఇది అనుమానం అనుకోలేం. నిజమని నమ్మక తప్పని పరిస్థితి.
పదేళ్ల క్రితం -ఓ షూటింగ్ స్పాట్‌లో నటుడు నానా పటేకర్ లైంగిక వేధింపులకు గురిచేశాడన్నది తనూశ్రీ దత్తా అభియోగం. నిజానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇదే మొదలు కాదు. ఇప్పుడే బయటపడిన బాగోతమూ కాదు. ఎందరో మహిళలు ఇప్పటికే గొంతువిప్పారు. తమకు ఎదురైన, ఎదురవుతున్న చేదు అనుభవాలను పూసగుచ్చి మరీ చెప్పారు. ఎయే సందర్భాల్లో ఎలా నలిగిపోవాల్సి వస్తుంది? ఎలాంటిచోట్ల భయానక వాతావరణం గూడుకట్టుకుంటుంది? ఎంతమంది మగాడి క్రూర ప్రవర్తనకు బలైపోతున్నారో చెప్పుకుని ఏడుస్తూనే ఉన్నారు. సో, ఇండస్ట్రీలో ఇలాంటి అభియోగాలు కొత్తకాదు. కాకపోతే, తనూశ్రీకి సపోర్ట్ దొరికింది. ‘బీ-టూ’ ఉద్యమం బలపడింది. ఒక్కొక్కరుగా ఆమెకు మద్దతిస్తూనే, తామూ ఎదుర్కొన్న భయానక పరిస్తితిపై గొంతు విప్పుతున్నారు. అలా రాజుకున్న అగ్గికి ‘క్వీన్’ నటీమణి కంగన ఆజ్యం పోసింది. క్వీన్ ప్రాజెక్టు టైంలో దర్శకుడు వికాశ్ భల్ ‘మృగ ప్రవర్తన’ తనను తీవ్రంగా కలచివేసిందంటూ వేదన వ్యక్తం చేసింది. క్వీన్‌లో కంగన స్నేహితురాలి పాత్ర పోషించిన నాయినీ దీక్సిత్ సైతం షూటింగ్ టైంలో దర్శకుడి అనుచిత ప్రవర్తనను పూసగుచ్చింది. ఈ కోణంలోనే తమకూ ఎదురైన లైంగిక వేధింపుల ఘటనలను సైనీ, గాయని చిన్మయి, అమైరా, సలోని చోప్రా.. ఇలా ఒక్కరేమిటి? ఎందరో ధైర్యం చేశారు. స్క్రీన్ వెనుకే కాదు, కెమెరా ముందు సైతం ఒక్కోసారి ఎలాంటి భయానక పరిస్థితిని ఎదురున్నారో విడమర్చి మరీ చెప్పారు. రాయడానికి సిగ్గుపడాల్సిన విషయాలను సైతం పబ్లిక్‌గా ప్రశ్నించడం, శారీరక దోపిడీకి వీలుగా ఒప్పందాలపై సంతకాలు చేయించుకోవడం వరకూ పరిస్థితి వెళ్లిందని బాధిత మహిళలే ధైర్యంగా చెప్తుండటాన్ని చూస్తుంటే పైనవన్నీ అభియోగాలేనని ఎవరు మాత్రం కొట్టిపడేయగలరు. పరిశ్రమలో చీకటి ప్రవర్తనపై రోజుకొక్కరుగా గొంతు విప్పుతూనే ఉన్నారు. -స్క్రీన్ వెనుక చీకటి ప్రవర్తనలు కోకొల్లలు అవుతున్నాయి.
‘ఏ భారతీయ మహిళా తట్టుకోలేని కష్టమిది. లైంగిక వేధింపులపై బహిరంగంగా గొంతు విప్పుతోన్న మహిళ తెగవను సమర్థించాలి. ఏ ఒక్కసారో కాదు, నిత్యం అనేక ప్రాంతాల్లో అనేకమంది మహిళలు ఎదుర్కొంటున్న కష్టమిది. దారుణాల గుట్టువిప్పుతున్న ధైర్యవంతులకు మద్దతివ్వాలి’
‘నటిగా కాదు, మహిళగా లైంగిక వేధింపుల కథనాలు వింటుంటే కడుపు రగులుతోంది. బాధిత మహిళ తనకెదురైన చేదు అనుభవానే్న చెబుతుంది, కట్టుకథ కాదు’
‘పదేళ్ల క్రితం ఏదో జరిగితే ఇప్పుడెందుకన్న ప్రశ్నలూ ఉద్భవిస్తున్నాయి. కష్టాన్ని తెగవతో చెబుతున్న మహిళను పట్టించుకోకుండా, ఇప్పుడెందుకని ప్రశ్నించే వాళ్లు సిగ్గుపడాలి. ఇలాంటి విషయాలను ఏ యువతీ పబ్లిసిటీ కోసం చెప్పుకోదు’
‘ఇప్పటికే ఆలస్యమైంది. మహిళ స్వాభిమానాన్ని ప్రదర్శించడాన్ని ఆహ్వానించాలి. ఈ ధైర్యాన్ని ముందుకు సాగించాలి. ఇది సరైన సమయమా? కాదా? అన్న సంకోచాలు వద్దు. మాట్లాడటం మొదలుపెట్టాం. సావధానం కనిపిస్తోంది. ఈ క్షణాలను వదిలేయొద్దు, ముందుకు తీసుకెళ్లాలి. లింగభేదం, అసమానత్వం, లైంగిక వేధింపుల వ్యవహారాలపై భవిష్యత్‌లోనూ ఇదో ధోరణి ప్రదర్శించాలి’
‘తప్పుడు ప్రమాణాలతో మోసం చేయడమూ లైంగిక వేధింపే. బాధిత మహిళ గొంతువిప్పే దశలోనే ఉంది. ఇంకా ప్రయాణించాల్సిన మార్గం పెద్దదే ఉంది. పరిశ్రమకు వస్తున్న మహిళ ఏ విభాగంలోనైనా ధైర్యంగా, హాయిగా తన పని చేసుకుపోయే ప్రపంచాన్ని ఆవిష్కరించే వరకూ మీటూ ముందుకు సాగాలి. పెళ్లి పేరుతో కుర్ర పిల్లల్ని తిప్పుకుంటూ, పెళ్లాలను ట్రోఫీల్లా ఇంట్లో పెట్టుకునే విలన్లకు బుద్ధి చెప్పాలి’.
ఇదీ -లైంగిక వేధింపులకు గురైన బాధితులకు పరిశ్రమ నుంచి దక్కిన మద్దతు. ఇక్కడ ఎవరెవరు ఎలాంటి మద్దతు పలికారన్న పేర్లు పక్కనపెడితే, పరిశ్రమ మొత్తం ఒకతాటిపైకి వచ్చినట్టయ్యింది. ఉద్యమానికి బలం చేకూరింది.
మహిళల గొంతు బలపడటంతో అభియోగాలు ఎదుర్కొన్న వ్యక్తులు కొందరు క్షమాపణలు చెప్పారు. కొందరు సిగ్గుతో ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నారు. ఇంకొందరు బలవంతంగా గెంటివేతకు గురయ్యారు. అలా లైంగిక వేధింపుల అభియోగాలు ఎదుర్కొన్న క్వాంటమ్ ఫిల్మ్స్ భాగస్వామి, సహ నిర్మాత వికాశ్ భల్ ఇరుకున పడటం తెలిసిందే. ప్రాజెక్టులు చేజారి తలెత్తుకోలేని స్థితికి చేరాడు. పెద్ద ప్రాజెక్టులు చేస్తున్న హీరోలు బాధిత మహిళకు మద్దతుగా నిలవడంతో -అభియోగాలు ఎదుర్కొంటున్న దర్శకుల హవాకు బ్రేక్‌పడింది. నటుడు నానాపటేకర్ వద్ద మొదలైన లైంగిక వేధింపుల కథ దర్శకుడు వికాశ్ భల్, ఫిల్మ్‌మేకర్, నటుడు రోహిత్ కఫూర్, పాటల రచయిత వైరముత్తు, నటుడు అలోక్‌నాథ్, గాయకుడు అభిజీత్ భట్టాచార్య, కాస్టింగ్ దర్శకులు ముఖేష్ చబ్ర, విక్కీ సిద్నా.. ఇలా ఒక్కరేమిటి? లైంగిక వేధింపుల కథలు రీళ్లురీళ్లుగా బహిర్గతమవుతున్నాయి.
బాలీవుడ్ పరిస్థితిపై కేంద్రం దృష్టిపెట్టక తప్పలేదు. ఘరానా వ్యక్తులపైనా భయానక అభియోగాలు తలెత్తుతుండటంతో -్ఫల్‌స్టాప్ పెట్టేందుకు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కదిలింది. వేధింపులకు గురవుతున్న మహిళల బాధ నిజమేనని నమ్ముతున్నట్టు మంత్రి మేనకా గాంధీ ప్రకటిస్తూనే, తతంగాన్ని తెమిల్చేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరమైన సంస్థాగత కార్యాచరణల కమిటీ దృష్టి సారిస్తుందని ప్రకటించారు. అయితే, ఆరోపణలను ఎలా రుజువు చేయాలన్నదే అసలు ప్రశ్నగా పేర్కొన్నారు.
***
ఇక్కడితో సమస్య తీరిపోయినట్టేనా? ఇదీ తాజా ప్రశ్న. లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ ధైర్యంగా చెప్పగలిగే వాళ్లకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయన్నది మరో భయం. గతంలో ఎన్నో కేసుల ఫలితాలు అనుభవంలోకి వచ్చిన తరువాత -ఈ కేసుల్లో బాధిత వర్గానికి ఎలాంటి న్యాయం దొరుకుతుందన్నది మరో అనుమానం. ‘నేమ్ అండ్ షేమ్’గా సాగిన ఉద్యమం -కమిటీ ఏర్పాటుతో ఎలాంటి మలుపు తీసుకుంటుంది, ఎంతమంది బాధితులకు న్యాయం జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే. ‘గాడ్‌ఫాదర్’ లేకుండా సినిమా పరిశ్రమలో రాణించలేని పరిస్తితులు ఉన్నపుడు -టాప్ పొజిషన్‌లోవున్న మృగాళ్లపై ఎంతమంది అభియోగాలు చేస్తారు? భవిష్యత్‌లో లైంగిక వేధింపులు అనేవి తలెత్తకుండా చట్టం ఎలాంటి చట్రాన్ని బిగించబోతుంది? లాంటివన్నీ ప్రశ్నలే. వీటికి సమాధానాలే దొరుకుతాయో? ప్రశ్నలుగానే మిగిలిపోతాయో వేచి చూడాలి.
*

--మహాదేవ