సబ్ ఫీచర్

తెలుగును పాలనాభాషను చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష అజంత భాష. అజంత భాష అంటే అచ్చులతో అంతమయ్యే భాష అని అర్థం. రామయ్య, సీతమ్మ, సుబ్బమ్మ ఇవన్నీ అజంత పదాలు. భాష కూడా ముత్యాల్లా గుండ్రంగా ఎవరినైనా ఆకర్షిస్తుంది. తెలుగు సాహిత్య పరిణామక్రమాన్ని నన్నయ యుగంతో మొదలుపెడ్తే అప్పటి నుంచి ఇప్పటివరకు భాష అనేక మార్పులు చెంది కాలానుగుణంగా ఆధునిక భాషగా పరివర్తన చెందింది. నన్నయకు ముందున్న కాలాన్ని ప్రాఙ్నన్నయ యుగమంటారు. నన్నయకు పూర్వం భాషకి, నన్నయ నాటి భాషకు ఎంతో తేడా ఉంది. ప్రాచీన కాలంలో దొరికిన శాసనాలను పరిశీలిస్తే ఆ భాషా భేదం మనకు తెలుస్తుంది. నన్నయ భారతం రాసేటప్పుడు ఆనాటి భాష ‘గాసట బీసటగా’ వుందని అంటాడు. ఆదికవి నన్నయ గొప్ప సంస్కృత భాషాభిమాని. ఆదిపర్వంలో ఆయన రాసిన పద్యాలన్నీ సంస్కృత పద భూయిష్టాలే. ఇప్పటి మన తెలుగువాళ్లకు ఆంగ్ల భాషా వ్యామోహంలా ఆనాటి కవులకు సంస్కృత భాషాభిమానం విపరీతం. విద్వత్కవుల మెప్పు పొందాలంటే భాష ప్రౌఢంగా ఉండాలి. సంస్కృత పదాలు ఎక్కువగా వుండాలి. అప్పుడే పండితులు మెచ్చుకుంటారని భావించేవాళ్లు.
కవిత్రయంలో తిక్కన మాత్రం దానికి భిన్నంగా తెలుగుభాషకే అమిత ప్రాధాన్యమిచ్చాడు ‘దివమకాని భువనంబు నందిట వట్ట రాత్రి లేని యట్టు గాక చేసెనొక్కొ కానేడ దివముగా సాగి నిలచె నొక్కొ’ అని తేటతేనెల మాటలతో మనకు వీనులవిందు చేస్తాడు. ఇక మూడో కవి ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు. వర్ణనా నిపుణుడు. ప్రబంధ కవుల అష్టాదశ వర్ణనకు ఆయనే దారి చూపించాడు. అందుకే పెద్దన, భట్టుమూర్తి, ధూర్జటి మొదలైన కవులు కూడా ఆ సంస్కృత పదాడంబర శైలిని అనుకరించారు.
ఒకప్పుడు జ్యోతిషం, గణితం, వాస్తు మొదలైన శాస్త్రాలు కూడా పద్యగ్రంథాలే. అవి కూడా సామాన్యులకు అర్థంకాని గ్రాంథిక భాషలోనే వుండేవి. 19వ శతాబ్దం వరకు రచనలన్నీ ఇంచుమించు ఈ పాషాణ పాక శైలిలోనే వుండేవి. చిన్నయసూరి నీతిచంద్రిక గ్రాంథిక భాషలోనే వుంటుంది. అప్పటి రచయితలందరూ గ్రాంథికంలోనే రచించేవారు. కొక్కొండ వెంకటరత్నం పంతులుగారి లాంటి వీర గ్రాంథికవాదులు భిక్షగాళ్లతో కూడా సంస్కృతంలోనే మాట్లాడేవారట.
ఆ సమయంలో గిడుగు రామమూర్తిగారు వ్యావహారిక భాషోద్యమం లేవనెత్తారు. నిత్యజీవితంలో సామాన్యులు మాటాడుకునే భాషలోనే పుస్తకాలు రాయాలని, విద్యార్థులు విశ్వవిద్యాలయ పరీక్షల్లో కూడా వ్యావహారిక భాషలోనే జవాబులు రాయాలని ఉద్యమించారు. ఆ తర్వాత గురజాడ ఆ మార్గాన్ని అందిపుచ్చుకున్నారు. ‘ఆకులందున అణగిమణగి కవిత కోకల పలకవలెనోయ్’ అంటూ కొత్త రచనలకు శ్రీకారం చుట్టాడు. ‘మేలిమి కన్నుల మెలతర్లారా! కలువల కన్నుల కనె్నల్లారా! తల్లులగన్న పిల్లల్లారా! విన్నారమ్మా ఈ కథను’ అని అందరికీ అర్థమయ్యేలా పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథను చెప్పాడు. ‘దేశమును ప్రేమించుమన్నా! మంచియన్నది పెంచుమన్నా’ అని ముద్దులు మూటగట్టే తెలుగు పదాలతో ఎప్పటికీ నిలచిపోయే దేశ భక్తి గీతం రచించాడు.
భావకవి కృష్ణశాస్ర్తీ కూడా సంస్కృత వాసన సోకని తెలుగు మాటలతో హృద్యమైన పద్యాలు రచించాడు. ‘ప్రాణ సఖుడె నా కోసమె పంపినాడు పల్లకీ యన హృదయమ్ము జల్లుమనియె - అని అంటూ ‘పూలపల్లకిలో పూలమాల నేను’ అని అంటాడు. అందమైన ప్రకృతిని వర్ణించిన కలంతోనే మహాత్ముణ్ణి వర్ణిస్తాడు. ‘సగము బట్ట లేని సామాన్యుడు ఫకీరు! తాత యొక్కడు లోక ధాతయయ్యె! ఏ మహత్తులోన నిమిడించుకొన్నాడో! ఈ యుగాన చిత్రమీ జగాన’ అని కళ్ల ఎదుట ఫొటో తీసినట్లు కొల్లాయి గట్టిన గాంధీని మన ముందు నిలుపుతాడు.
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కొనియాడబడిన తెలుగు మాట్లాడేవారు భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలోనే కాకుండా అమెరికా, లండన్‌లలో తెలుగు మాట్లాడేవారు కోట్లాది మంది వున్నారు. ఇంతమంది ప్రవాసాంధ్రులు తెలుగు మాట్లాడుతున్నా, మన రాష్ట్రంలో మాత్రం తెలుగువారికి తెలుగంటే చిన్నచూపు. తెలుగులో మాట్లాడడం నామోషీ, ఎంత పేదవాళ్ళయినా పిల్లల్ని ఇంగ్లీషు మీడియం బళ్లల్లో చేర్పిస్తారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా షాపుల పేర్లు, హోటళ్ల పేర్లు అన్నీ ఇంగ్లీషులోనే వుంటాయి. ‘నెక్ట్స్, మోర్, వుడ్‌వరల్డ్...’’ ఇలా పేర్లు పెట్టి మురిసిపోతుంటారు. ఏనాడో సాక్షి వ్యాసాల్లో జంఘాల శాస్ర్తీ చెప్పినట్లు తెలుగువారి ఆంగ్ల భాషా దురభిమానం శతాబ్దాలు గడచినా ఇంకా అలాగే వుంది. ఇప్పటి పిల్లలకు తెలుగులో ఏది చెప్పినా అర్థం కాదు. ఆరు అంటే తెలీదు. ‘సిక్స్’ అంటే తెలుస్తుంది. తమిళులు, కన్నడిగులు ఎక్కడికి వెళ్లినా వాళ్ల భాషే మాట్లాడతారు. వాళ్ల సంప్రదాయ వస్త్రాలే ధరిస్తారు. ఇక్కడ మాత్రం తద్విరుద్ధం. ఎక్కడ వున్నా మిగిలిన వాళ్లు వాళ్ల భాషనే నేర్చుకుంటారు. కానీ మనం మాత్రం మన రాష్ట్రంలోనే తెలుగుకు ప్రాధాన్యమివ్వం. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు మీడియం తరగతులు నిర్వహిస్తున్నారంటే మన పాలకుల్లో మాతృభాషాభిమానం ఏ మేరకు వుందో అర్థవౌతుంది. ఇప్పుడు తమ పిల్లల విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చేర్పిస్తున్నారు. కానీ ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు ఒకప్పుడు తెలుగు మీడియంలో చదివినవారే. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తే మిగిలిన భాషల మీద పట్టు లభిస్తుంది. అది గమనించకుండా ఇంగ్లీషు మీడియమే పరమార్థమని అనుకుంటే పిల్లలకు అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు రెండూ రాకుండాపోతాయి.
ప్రభుత్వం తెలుగును పాలనా భాషగా అమలు చేయాలి. జీవోలను తెలుగులో విడుదల చేయాలి. తెలుగు మీడియంలో చదివిన వారికి అదనపు మార్కుల సౌకర్యం కల్పించాలి. వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలి. అప్పుడు అందరూ తెలుగులోనే చదువుతారు. ప్రభుత్వం చట్టాలు చేస్తేనే చాలదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. తల్లిదండ్రులు తెలుగులో మట్లాడాలి. పిల్లలతో తెలుగు మాట్లాడించాలి. అప్పుడే తెలుగు భాష పూర్వవైభవ దశ పొందుతుంది. జై తెలుగు తల్లి! జై తెలుగు భాష!!

-మందరపు హైమవతి చరవాణి: 9441062732