సంపాదకీయం

ఎంతకాలం ఈ ఘర్షణ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త న్యాయమూర్తుల నియామకాల విషయంలో ఎన్‌డిఎ ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మొండిపట్టుదలతో వ్యవహరిస్తూ దేశంలో ఓ ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెడుతున్నట్టు వాదనలు బలం పుంజుకుంటున్నాయి. ఇరు పక్షాలు ఇలా గిరి గీసుకుని వ్యవహరించటం న్యాయ వ్యవస్థ పునాదులను కదిలించివేస్తోంది. సుప్రీం కోర్టుతో పాటు హైకోర్టుల్లో కొత్త న్యాయమూర్తులను నియమించే అంశంపై ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే న్యాయవ్యవస్థకు, దేశానికి ఎంతో మంచిది. ఇరుపక్షాలు మధ్యేమర్గాన్ని అనుసరించటం ద్వారా తాత్కాలికంగానైనా ఈ సమస్య నుండి బయటపడాలి. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ ఠాకుర్ న్యాయమూర్తుల బదిలీలు, కొత్త న్యాయమూర్తుల నియామకంలో జరుగుతున్న జాప్యంపై నిండు కోర్టులో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలతో ముంచెత్తటం అత్యంత తీవ్రమైన విషయం. న్యాయ వ్యవస్థ వద్దనుకుంటే దాన్ని మూసి వేయాలంటూ ఠాకుర్ తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థకు వాంఛనీయం కాదు. ఆయన మరో అడుగు ముందుకు వేసి- న్యాయమూర్తుల నియామకం వెంటనే జరగకపోతే ఏం చేయాలనేది తామే నిర్ణయించుకుంటామంటూ హెచ్చరించటం తీవ్ర పరిణామాలకు దారి తీయ వచ్చు. ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఇప్పటికే బాగా పెరిగిన అంతరం ఠాకుర్ హెచ్చరికల వల్ల మరింత పెరిగే అవకాశం ఉంది.
సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన ‘జాతీయ జుడీషియల్ కమిషన్’ ఏర్పాటు అంశంపై ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘జాతీయ జుడీషియల్ కమిషన్’ ఏర్పాటు చెల్లదంటూ సుప్రీం కోర్టు బెంచి తీర్పు ఇచ్చినప్పటి నుండి ఎన్‌డిఎ ప్రభుత్వం న్యాయ వ్యవస్థపై ఆగ్రహంతో ఉంది. న్యాయమూర్తుల నియామక వ్యవస్థను సంస్కరించేందుకే జాతీయ జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం వాదన. న్యాయమూర్తులు మాత్రం దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నియామకాలపై తమకున్న ఆధిపత్యాన్ని వదలుకునేందుకు ఇష్టపడని సుప్రీం కోర్టు ‘కొలీజియం వ్యవస్థ’ను యథాతథంగా కొనసాగించాలని వాదిస్తోంది.
జాతీయ జుడీషియల్ కమిషన్ ఏర్పాటు ద్వారా నియామకాలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నది న్యాయమూర్తులు వాదన. ఈ వాదనతో ప్రభుత్వం ఏకీభవించటం లేదు. ‘కొలీజియం వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైంది. ఇందులోని ఐదుగురు న్యాయమూర్తులు ఒక్కటై తమకు ఇష్టమైన వారిని న్యాయమూర్తులుగా నియమించుకుంటున్నారు, పదోన్నతులు ఇస్తున్నారు..’ అని ప్రభుత్వం విమర్శిస్తోంది. ఇలా ఇరుపక్షాలు చేస్తున్న వాదనల్లో నిజం లేకపోలేదు. నియామకాలను అదుపు చేసేందుకే ప్రభుత్వం జాతీయ జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తోందన్న న్యాయమూర్తుల ఆరోపణలో కొంత నిజం ఉంది. ఇదే విధంగా కొలీజియం వ్యవస్థ కూడా కొంత లోపభూయిష్టంగా ఉంది. ఇందులో ఆశ్రీతపక్ష పాతం చోటుచేసుకుంటోందంటూ ప్రభుత్వం చేస్తున్న వాదన కూడా వాస్తవమే. అయితే కొలీజియం వ్యవస్థలో ఉన్న లోపాలతో పోలిస్తే జాతీయ జుడీషియల్ కమిషన్‌లో ఉన్న లోపాలు చాలా తక్కువ. అందుకే కొలీజియం స్థానంలో జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తేనే బాగుంటుంది. కొలీజియం వ్యవస్థతో న్యాయ వ్యవస్థకు ఎంతో నష్టం కలుగుతోంది. ఆశ్రీతపక్ష పాతం మూలంగా న్యాయ వ్యవస్థలో అవినీతి చోటుచేసుకుంటోంది. కొందరు మాత్రమే పదవులు పొందగలుగుతున్నారు. నియామకాలపై తమకున్న పట్టును వదులు కోవటం ఇష్టం లేని న్యాయమూర్తులు జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటును దెబ్బ తీశారు. ఇది జరిగినప్పటి నుండి ఎన్‌డిఎ ప్రభుత్వం న్యాయమూర్తుల నియాకాలను జాప్యం చేస్తోంది. జాతీయ జుడీషియల్ కమిషన్ ఏర్పాటును కొట్టివేసిన సుప్రీం కోర్టుపై ప్రభుత్వం వ్యతిరేకతను బాగా పెంచుకుంది. కేంద్రం వైఖరి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఠాకుర్‌కు ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయనందున కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల సంఖ్య లక్షల్లోకి వెళ్లింది. తన హయాంలో ఇలా కేసులు పేరుకుపోయాయన్న మాట పడేందుకు ఠాకుర్ ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన పదవి చేపట్టినప్పటి నుండి ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య అంతరం నానాటికీ పెరుగుతోంది. సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో దాదాపు ఆరువందల న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో కొన్నిచోట్ల కోర్టు గదులను మూసివేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థ కుప్పకూలినా ఆశ్చర్యపోకూడదు. ‘మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్స్‌ను సుప్రీం కోర్టు ఖరారు చేయటం లేదు, అందుకే న్యాయమూర్తుల నియామకంలో జాప్యం జరుగుతోందంటూ ఎన్‌డిఎ ప్రభుత్వం మరింత మొండిగా వాదిస్తోంది. న్యాయ వ్యవస్థ మనుగడను ఆశించైనా ఇరుపక్షాలు ఇక దిగిరాక తప్పదు. న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను కాపాడుతూనే న్యాయమూర్తుల ఎంపిక, నియామకాలు పారదర్శకంగా జరిగే విధానాన్ని రూపొందించడం తక్షణ అవసరం.