సంపాదకీయం

గగనంలో దోపిడీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వేతర రంగ విమాన సంస్థలు రంగప్రవేశం చేసిన తరువాత గగన యానం కారుచౌక అయిపోయిందన్న భ్రమ కొన్నాళ్లు కొనసాగింది. ప్రభుత్వరంగ ఎయిర్ ఇండియా విమానాలలో కంటె ప్రభుత్వేతర సంస్థల విమానాలలో ప్రయాణ శుల్కం తక్కువ కాబట్టి ఎక్కువ మంది.. ప్రధానంగా మధ్యతరగతి వారు ప్రభుత్వేతర విమానాలను ఎక్కడం మొదలైంది! దీనివల్ల జరిగిన మొదటి విపరిణామం ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుని పోవడం! ప్రభుత్వేతరులతో పోటీ పడలేకపోవడం వల్ల ఎయిర్ ఇండియాకు నష్టాలు వచ్చాయి. ప్రభుత్వేతర విమాన సంస్థలు అతి తెలివిగా ఎక్కువ ప్రయాణ శుల్కాలను వసూలు చేయడం రెండవ విపరిణామం! అందువల్ల ప్రభుత్వేతర విమానయాన సంస్థల వల్ల గగన ప్రయాణం కారు చౌకగా మారిందన్న భ్రమ క్రమంగా తొలగిపోయింది, తొలగిపోతోంది! కేంద్ర ప్రభుత్వం వారి ప్రాంతీయ అనుసంధాన పథకం అమలు జరిగితే ఈ దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. కాబట్టి చిన్న నగరాలకు, పట్టణాలకు విమానయాన సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అనుసంధానం-రీజినల్ కనెక్టివిటీ-పథకం అమలు జరగకుండా ప్రభుత్వేతర సంస్థలు అడ్డుకోవడం సహజం! ప్రభుత్వరంగం మూలపడి ప్రభుత్వేతర రంగ సంస్థలు విశృంఖల వాణిజ్య కలాపాలు కొనసాగించడం ప్రపంచీకరణ వ్యవస్థ స్వభావం! అందువల్ల తక్కువ ఖర్చుతో మధ్యతరగతి ప్రజలు సైతం దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలలో పయనించడానికి వీలు కల్పించే కేంద్ర ప్రభుత్వ పథకం ప్రభుత్వేతర విమాన సంస్థలకు కడుపు మంట కలిగించడం సహజం! ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా, ప్రభుత్వేతర రంగంలోని విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న విమానాలలో పయనించే వారి నుండి అదనపు అనుసంధాన శుల్కం వసూలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన! ఇలా వసూలయ్యే సొమ్ముతో అనుసంధాన నిధి ఏర్పాటు చేస్తారట! ఈ అనుసంధాన నిధిని చిన్న నగరాలకు, పట్టణాలకు విమానాలను నడపడానికి ఉపయోగించాలన్నది కేంద్ర ప్రభుత్వం పథకం. గంట ప్రయాణ దూరానికి గరిష్ఠంగా రెండు వేల ఐదు వందల రూపాయల శుల్కాన్ని వసూలు చేయాలన్నది ప్రాంతీయ అనుసంధాన పథకంలోని ప్రధాన అంశం! కానీ ప్రస్తుతం ప్రధాన మార్గాలలోని విమానాలలో కనిష్ఠంగా వసూలు చేస్తున్న ప్రయాణ శుల్కం ఈ ప్రాంతీయ అనుసంధాన విమానాలలో ప్రభుత్వం వసూలు చేయదలచిన గరిష్ఠ శుల్కం కంటె చాలా ఎక్కువ, దాదాపు రెట్టింపు! తక్కువ శుల్కంతో విమానాలను నడపడం వల్ల వచ్చే నష్టాన్ని పూడ్చుకొనడానికి వీలుగా మాత్రమే కేంద్ర ప్రభత్వం ఈ ప్రాంతీయ అనుసంధాన నిధిని ఏర్పాటు చేస్తోంది!
ప్రధాన మార్గాలలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ విమానాలను ఎక్కేవారి వద్ద వసూలు చేసే అదనపు శుల్కం మాత్రమే అనుసంధాన నిధిగా ఏర్పడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా విరాళాలను సమ కూర్చనున్నాయి. ఋణాలను సమకూర్చుకొనడం ఈ నిధిలో భాగం! అందువల్ల ప్రస్తుతం నడుస్తున్న ప్రధాన మార్గాల విమానయాత్రికులు చెల్లించే అదనపు శుల్కం నిధిలో కొంతభాగం మాత్రమే! అయినప్పటికీ ఈ అదనపు శుల్కాన్ని విధించరాదని ప్రభుత్వేతర రంగంలోని ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్ వంటి సంస్థలు కోరుతున్నాయి! ఈ అదనపు శుల్కాన్ని నిరోధించాలని కోరుతూ న్యాయ స్థానాలను ఆశ్రయించడానికి సైతం ఈ ప్రభుత్వేతర విమాన యాన సంస్థల సమాఖ్య-ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్-ఎఫ్‌ఐఏ- సమాయత్తవౌతోందట! తాగేవాడు చెల్లిస్తాడు తాటిపన్ను- అన్న సామెతగా నిజానికి అదనపు శుల్కం పథకం అమలు జరిగితే ఈ టాక్స్‌ను వాస్తవంగా చెల్లించేది విమానమెక్కే ప్రయాణీకులు. కానీ ప్రభుత్వేతర రంగ సంస్థలు ఎందుకని ప్రభుత్వ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాయి? ప్రాంతీయ అనుసంధానం జరిగినట్టయితే ప్రధాన మార్గాలలోని విమానయాన సంస్థల వ్యాపారానికి నష్టం కూడా ఏమీలేదు! అందువల్ల ఈ సంస్థలు అదనపు శుల్కాన్ని వ్యతిరేకించడం అంతుపట్టని వ్యవహారం! చిన్న నగరాలకు, పట్టణాలకు విమానయాన సేవలు లభించడం ప్రగతి వికేంద్రీకరణకు దోహదం చేస్తుంది. మధ్యతరగతి వారికి విమానయానం తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తుంది. ఇదంతా సంక్షేమ రాజ్య వికసనంలో భాగం. కానీ సంక్షేమ పథకాలను, సబ్సిడీలను, నిరుపేదలకు మధ్యతరగతి వారికి ప్రభుత్వం అందచేసే సహాయాలను ప్రపంచీకరణ శక్తులు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు-మల్టీ నేషనల్ కంపెనీస్-వ్యతిరేకిస్తున్నాయి! ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంపన్నదేశాల దళారీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి! మంచినీరు సైతం ప్రజలకు ఉచితంగాను, తక్కువ ధరలకు లభించరాదన్నది ప్రపంచీకరణ వ్యవస్థ స్వభావం! మానవీయ మూల్యాలను మట్టుపెట్టి వాణిజ్య జీవనాన్ని ప్రతిష్ఠించడమే ప్రపంచీకరణ! అందువల్ల తక్కువ ఖర్చుతో ప్రజలకు విమాన సదుపాయం సమకూడడం ప్రభుత్వేతర సంస్థలకు నచ్చని అంశం..
ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ రెండూ నష్టాలలో నడిచాయి. దివాలా తీశాయి. ఈ రెండింటినీ కలిపి ఒకే సంస్థగా ఏర్పాటు చేసిన తరువాత కూడా నష్టాలు ఆర్జించడం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థల స్వభావమైంది. 2012లో ఎయిర్ ఇండియాను గట్టెక్కించడానికై ముప్పయి వేల కోట్ల రూపాయల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించవలసి వచ్చింది! విపరీతమైన ప్రయాణ శుల్కాలను వసూలు చేసినప్పటికీ, ప్రభుత్వేతర సంస్థల పోటీ లేనప్పటికీ ఎయిర్ ఇండియా నష్టాలను అర్జించడానికి కారణం వ్యవస్థలో నిహితమై ఉన్న నిర్లక్ష్యం, అవినీతి కారణాలు! ప్రభుత్వేతర రంగాన్ని ప్రోత్సహించడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు తక్కువ ఖర్చుతో లభిస్తాయన్నది సంప్రదాయ ఆర్థిక నీతి! కానీ ఈ ప్రభుత్వేతర సంస్థలు స్వతంత్ర దేశాల జాతీయ సార్వభౌమ అధికార నియంత్రణకు లోబడి పనిచేయగలిగినప్పుడు మాత్రమే ప్రజలకు జరగవలసిన మేలు జరుగుతుంది! కానీ ప్రపంచీకరణ ఈ నియంత్రణను తొలగించింది. ప్రభుత్వాల సార్వభౌమ అధికారాన్ని లెక్కచేయని బహుళ జాతీయ సంస్థలు బరితెగించి దోపిడీ చేస్తున్నాయి! అందువల్లనే ఎయిర్ ఇండియా విమానాలలో కంటే ప్రభుత్వేతర విమానాలలో తక్కువ చార్జీలు వసూలు చేస్తారన్నది మిధ్య అవుతోంది! ఉదాహరణకు బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానశుల్కం ఐదున్నర వేల రూపాయల స్థాయిలో ఉంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఆరున్నర వేల రూపాల స్థాయిలో ఉంది! ప్రభుత్వ సంస్థ శుల్కానికి, ప్రభుత్వేతర సంస్థల శుల్కానికి మధ్య పెద్ద తేడా లేదు...
సినిమా థియేటర్ల వద్ద గిరాకీని బట్టి టిక్కెట్లను అధిక ధరలకు అమ్మినట్టుగా అన్ని విమానయాన సంస్థల వారు గిరాకీని బట్టి విమానయాన శుల్కాన్ని రెట్టింపునకు పైగా పెంచుతున్నారు. వారాంతాలలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లే వారు ఎనిమిది నుంచి పది వేల వరకూ, ఇంకా ఎక్కువగాను ప్రయాణ శుల్కాన్ని చెల్లించవలసి వస్తోంది! నిలకడగా ప్రయాణ శుల్కం ఉండే రీతిలో విమానయానాన్ని ప్రభుత్వం నియంత్రించలేకపోవడం ప్రపంచీకరణ మాయాజాలం! ‘వాణిజ్యం’ ముందు ‘పాలన’ మోకరిల్లుతోంది!