సంపాదకీయం

పుతిన్ వైచిత్రి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్లాదిమిర్ పుతిన్ విచిత్ర స్వభావానికి సజీవ విగ్రహం. ఆయన రష్యా అధ్యక్షుడిగా మొదటిసారి 2000వ సంవత్సరం మే నెలలో ఎన్నికయ్యే నాటికి రష్యా ఆర్థిక, రాజకీయ సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకుని ఉంది. ఈ సంక్షోభాలు 1991లో అంతరించిన ఏకపక్ష కమ్యూనిస్టు నాయకత్వం ప్రసాదించినవి! పుతిన్ ప్రజాస్వామ్య రష్యాకు రెండవ అధ్యక్షుడు. రష్యాను, మరో పదునాలుగు దేశాలను కమ్యూనిస్టు కబంధ బంధం నుంచి విడిపించ గలిగిన బోరిస్ యెల్టిసిన్ ప్రజాస్వామ్య రష్యా మొదటి అధ్యక్షుడు. పుతిన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత భారత,రష్యా సంబంధాలు పూర్వపు మైత్రీ స్ఫూర్తిని సంతరించుకొన్నాయన్న ప్రచారం జరిగింది. కానీ, ఉభయ దేశాల మైత్రి అడుగంటిపోవడానికి సైతం వ్లాదిమిర్ పుతిన్ విధానాలు కారణం! ఆయన చైనాను గట్టిగా కౌగిలించుకున్నాడు. అమెరికాను తీవ్రంగా ద్వేషిస్తున్నాడు. వీటితో మన దేశానికి సంబంధం లేకపోవచ్చు. కానీ, ఉందని పుతిన్ పరోక్షంగా, ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాడు. పుతిన్ 2000 నుంచి రష్యాలో తిరుగులేని నాయకుడు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. ఇది విశ్వనిహిత వాస్తవం. కానీ, తన అనుమతి లేనిదే రష్యాలో ‘వోడ్కా’ చుక్క కూడా దుకాణాలలో ఎవరికీ అమ్మరాదన్నది పుతిన్ ఆధిపత్య స్వభావం. అందువల్లనే భారత, రష్యా సంబంధాలలో కొనసాగుతున్న ఆటుపోట్లు పుతిన్ వ్యక్తిగత ఇష్టాయిష్టాలన్నది ధ్రువపడిన వాస్తవం! శనివారం గోవాలో మొదలవుతున్న భారత-రష్యా పదిహేడవ ప్రభుత్వాధినేతల సమావేశానికి ఈ ‘ఆటుపోట్లు’ నేపథ్యం! ఈ శిఖర సమావేశం సందర్భంగా ఉభయ దేశాల మధ్య పద్దెనిమిది ఒప్పందాలు కుదరనున్నాయట! 39 వేల కోట్ల రూపాయల విలువైన గగన పరిరక్షక క్షిపణులను రష్యా నుంచి మన దేశం కొనుగోలు చేస్తుండడం ఈ ఒప్పందాలలో ప్రధానమైనది! 1947 నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన రక్షణ పదార్థ పరిజ్ఞాన పరికరాలలో అత్యధికం రష్యా నుంచి దిగుమతి అయినవే! రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1991 వరకూ అమెరికా-రష్యాల మధ్య నడచిన ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో మనకు అత్యంత విశ్వాసవంతమైన మిత్ర దేశం రష్యా. 1991 వరకూ రష్యా ‘సోవియట్ యూనియన్’లోని పదిహేను దేశాలలో ఒకటి! మిగిలిన పదునాలుగు దేశాల మొత్తం భూభాగం కంటె, జనాభా కంటె రష్యా భూభాగం, జనాభా చాలా ఎక్కువ. అందువల్ల కమ్యూనిస్టు నియంతృత్వం కొనసాగిన కాలంలో కూడా 1991 వరకూ ఈ పదిహేను దేశాల ‘సోవియట్ యూనియన్’- ‘రష్యా’గానే చెలామణి అయింది. 1991 తరువాత రష్యా నుంచి పదునాలుగు దేశాలు విడిపోయినప్పటికీ ‘సోవియట్ యూనియన్’ చారిత్రక, రాజకీయ, దౌత్య, వ్యూహాత్మక వారసత్వం ప్రజాస్వామ్య రష్యాకు సంక్రమించింది! ఈ ‘ప్రజాస్వామ్య రష్యా’ అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంతో కాక నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థ ఉన్న చైనాతో ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకుంది. ఇదీ పుతిన్ స్వభావ వైచిత్రి!!
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో మాత్రమే కాదు, 2014 వరకూ కూడా రష్యా ప్రభుత్వం పాకిస్తాన్‌ను దూరంగా ఉంచింది. జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతున్న పాకిస్తాన్ దురాక్రమణను 1948 నుంచి కూడా రష్యా తీవ్రంగా నిరసించింది! మొత్తం జమ్ము కశ్మీర్ పాకిస్తాన్ దురాక్రమిత ప్రాంతం సహా మన దేశంలో భాగమని రష్యా 1948 నుంచి అంగీకరిస్తోంది. కానీ, 2014 నవంబర్‌లో చరిత్రలో తొలిసారిగా పాకిస్తాన్‌కు రష్యా మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ఇలా కుదరడం మన దేశానికి వ్యతిరేక పరిణామం! పాకిస్తాన్‌కు ఆయుధాలను అమ్మడానికి రష్యా అంగీకరించింది. అమెరికాకు వ్యతిరేకంగా చైనాతో జట్టుకట్టి ఉన్న పుతిన్ విధాన ఫలితం ఇది! పాకిస్తాన్‌కు చైనా చంకనెక్కి ఉంది! దాదాపు ఏడు దశాబ్దుల భారత మైత్రిని, పాకిస్తాన్ వైముఖ్యాన్ని అధిగమించి పుతిన్ విధాన వైపరీత్యానికి పూనుకున్నాడు. ‘ఊరీ’ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సదాడులు, చాటుమాటు దాడి చేసి మన సైనికులను హత్య చేయడం పట్ల ఇరుగు పొరుగు దేశాలన్నీ తీవ్రంగా నిరసన తెలిపాయి. పాకిస్తాన్‌లో జరుగవలసిన ‘దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సమాఖ్య’- సార్క్- ప్రభుత్వాధినేతల సమావేశం రద్దయింది. కానీ ఇదే సమయంలో పాకిస్తాన్ దళాలతో కలిసి ఉమ్మడి విన్యాసాలను జరుపడానికి వీలుగా రష్యా సైనిక పటాలం పాకిస్తాన్‌కు తరలివచ్చింది. రష్యా, పాకిస్తాన్‌ల ఈ ఉమ్మడి సైనిక విన్యాసాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 10 వరకూ జరిగాయట.. ఇదీ అంతుపట్టని ‘వ్లాదిమిర్’ విధానం..
ఈ సైనిక విన్యాసాలు జరుగుతున్న సమయంలోనే మన దేశంలోని రష్యా రాయబారి అలెగ్జాండరు కదకూయిన్ మైత్రి గురించి స్పష్టీకరణ ఇచ్చారు. మనదేశంతో రష్యా మైత్రి అత్యంత పటిష్ఠంగా ఉందన్నది ఈ స్పష్టీకరణ! మన సైనికులు జమ్ము కశ్మీర్‌లోని ‘అధీనరేఖ’ను దాటి వెళ్లి పాకిస్తానీ జిహాదీ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడాన్ని తమ దేశం సమర్థిస్తోందని కదకూయిన్ అక్టోబర్ 3వ తేదీన దిల్లీలో ప్రకటించారు. మన సైనికులు ‘సాయుధ చికిత్స’- సర్జికల్ దాడి- జరిపిన తరువాత నాలుగు రోజులకు రష్యా రాయబారి ఈ ‘సమర్థన’ను ఆవిష్కరించడం పుతిన్ విధాన విచిత్రం! మన దేశానికి వ్యతిరేకంగా బీభత్స కలాపాలను తక్షణం మానుకోవాలన్న పాఠాన్ని పాకిస్తాన్ ప్రభుత్వానికి నేర్పించాలన్న లక్ష్యంతోనే తమ సైనికులు పాకిస్తాన్ సైనికులతో కలిసి ఉమ్మడి విన్యాసాలను నిర్వహిస్తున్నారని కదకూయిన్ స్పష్టం చేశాడు! అయితే ఆ దేశంతో కలసి ఉమ్మడి విన్యాసాలను జరుపడం ద్వారా పాకిస్తాన్‌కు ‘బీభత్స వ్యతిరేక పాఠం’- యాన్టీ ట్రెర్రర్ లెసన్- ఎలా రష్యా నేర్పిందన్నది అర్థం కాని విచిత్ర ప్రహేళిక! భారత, రష్యా సంబంధాలలో 2000 సంవత్సరం నుంచి ఇలాంటి అనేక విచిత్రాలు జరిగాయి. 2005లో ‘విక్రమాదిత్య’ విమాన వాహక యుద్ధనౌకను మనకు అమ్మిన రష్యా ప్రభుత్వం మరమ్మతుల పేరుతో తొమ్మిదేళ్లకు పైగా దానిని తమ దేశంలోనే ఉంచుకొంది! ఈలోగా అది ‘్ధర’కు రెట్టింపునకు పైగా పెరిగింది. 2014లో ‘విక్రమాదిత్య’ మన దేశానికి వచ్చింది. ‘అరిహంత’ అణుచోదిత జలాంతర్గామికి దీటైన మరో జలాంతర్గామిని సమకూర్చగలమని రష్యా ప్రభుత్వం చేసిన వాగ్దానం ఇప్పటికీ నెరవేరలేదు.
ఇలా మనదేశంతో పుతిన్ కొనసాగిస్తున్న ‘దోబూచులాట’ శనివారం నాటి శిఖర సభకు నేపథ్యం! పుతిన్ స్వభావంలోనే అనేక విచిత్రాలు నిహితమై ఉన్నాయి. 2000 జూన్ ఐదవ తేదీన పుతిన్ జపాన్‌కు వెళ్లాడు. తనతో ‘జూడో’ యుద్ధం చేయవలసిందిగా నటుసామీ గూమీ అన్న పదేళ్ల జపాన్ బాలికను పుతిన్ ఆహ్వానించాడు. ‘మీరు నాతో పోరాడలేరు..’ అని ఆ పాప హెచ్చరించింది. కానీ పుతిన్ మొండికెత్తాడు. తనకు ‘జూడో’ క్రీడలో అతి విశిష్ట నైపుణ్య పత్రం- బ్లాక్‌బెల్ట్- ఉందని కూడా ప్రకటించాడు! పాపతో పుతిన్ తలపడినాడు. ఆ పాప అతిపెద్ద, పొడుగైన పుతిన్‌ను చేతులు పట్టుకుని తన భుజాల మీదుగా విసిరి నేలకేసి కొట్టింది. పుతిన్ మైదానంలో పోర్లాడిన ‘దృశ్యం’ మాధ్యమాలలో ఆవిష్కృతమైంది. గత ఏడాది మార్చిలో పుతిన్ ‘అదృశ్యం’ అయ్యాడు! వారం రోజుల పాటు రష్యా ప్రజలకు తమ అధ్యక్షుని ఆచూకీ తెలియలేదు. 2000లో, 2002లో కూడా పుతిన్ ఇలాగే తప్పిపోయాడు! ఇలా తప్పిపోవడం, తప్పించుకోవడం- భారత, రష్యా సంబంధాలలో కూడా 2000 నుంచి జరుగుతున్న దోబూచులాటలే!